• Prev
  • Next
  • Santaanam Leka

    "సంతానం లేక "

    కన్నోజు లక్ష్మీకాంతం

    కుటుంబరావుకు పిల్లలు లేరనే బెంగ తప్ప ఇంకే లోటూ లేదు.చాలా మంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్లి అన్ని టెస్టులు చేయించిన ఫలితం లేకుండా పోయింది.పత్రికల్లోని ప్రకటనలన్నీ చదివి ఎంతో మందిని కలిసినా పిసరంతా ఆశ కూడా కనిపించలేదు.పెద్ద మనుషుల సలహాలతో పాటు, మిత్రులు చెప్పిన మాటలు కూడా విన్నాడు. ఊహు...కాని ఏదీ లాభం ? ఎన్ని విధాలా ప్రయత్నించిన, పాపం కుటుంబరావుకు పిల్లలు పుట్టలేదు.

    చివరికి చుట్టుపక్కల ఉండే, తెలిసిన అమ్మలక్కల అనుభవాలన్నీ కుప్పగా పోసి అందులోంచి మేలిమి వాటిని తీసి పరిశీలించి ప్రయోగాలు చేశారు.ఒక్క ప్రయోగం కూడా సక్సెస్ కాకపోవడంతో,వాళ్ళు చెప్పిన మాటలు ఉత్తుత్తి మాటలే అయ్యాయి. పిల్లలు లేరనే బాధ మనకన్నా మందికే ఎక్కువ కాబట్టి, వారి వారి మాటలన్నీ ఓపిగ్గా విన్నారు.కనిపించిన స్వాములందరినీ కలిసి తమ కలయిక గురించి చెప్పుకున్నారు.

    ఆ స్వాములు చెప్పినట్టుగా దానాలు, ధర్మాలు చేశారు.ఉపవాసాలు ఉంటూ, మహా ప్రసాదం అని ఆ స్వాములు పెట్టినది కళ్ళకద్దుకుని తింటూ, వాళ్ళు తీర్ధమని పోసింది ఇష్టంగా తాగుతూ,చెట్టుకూ...పుట్టకూ మొక్కుకున్నారు. అయితేనేం...వారికి సంతాన యోగమే పట్టలేదు. చివరి ప్రయోగంగా తీర్ధయాత్రలన్నీ ఓపిగ్గా తిరిగారు.కానీ చమురు వదిలిందే తప్ప చంటాడు గానీ, చంటిది గానీ రాలేదు.అయినా, తమ పిచ్చిగానీ, సంతానం లేదనే మాట జ్యోతిష్యుడు ఎప్పుడో చెప్పాడు గదా ! మరి, ఈ ప్రయోగాలేందుకూ...అని వాళ్ళు వూర్కొవడం లేదు.

    ఎంతైనా, మనిషి ఆశాజీవి గదా !ప్రయత్నం చేయడంలో తప్పులేదనే భావన ఇద్దరిలో వుంది. మంత్రాలకు చింతకాయలు రాలవు...సముద్ర స్నానాలకు పిల్లలు పుట్టరు అనే 'ఫిలాసఫీ' తెలిసినా తమ వంతు కృషి చేస్తూనే వున్నారు.అయినా ఫలితం శ్యూనం.

    " పిల్లల్తో ఇల్లు నరకంగా మారి, వాళ్ళు పెరుగుతున్న కొద్దీ...చదువులకూ, సౌకర్యాలకు, పెళ్ళిళ్ళకూ, పేరంటాలకూ...ఏ లోన్ తెచ్చినా సరిపోక నానా గడ్డి కరుస్తూ ఆర్ధిక బాధలకు ఆస్తులన్నీ అమ్మేస్తూ, ఆత్మహత్యలు చేసుకుంటూ నానా హింసలు అనుభవిస్తున్న ఈ రోజుల్లో పిల్లల్లేకుండా వుండటమే హాయి...” అని భార్యమణిని బుజ్జగిస్తూ ఎన్నోసార్లు ఉపన్యాసాలు ఇచ్చాడు కుటుంబరావు.

    కానీ ఆవిడ అదేమీ ఒప్పుకోకుండానే తన 'చేతకాని తనాన్ని 'ఎద్దేవా చేస్తూ ఎన్నోసార్లు ఎగతాళి చేసింది.'పిల్లల కొరకే అప్పుల బాధ 'అనే మాటని నేను ఒప్పుకోను.అంటూ ఖచ్చితంగా చెప్పేసింది. " అయినా...తమకేమన్నాఆస్తీ,అంతస్థుల్లేవా !అంతే కాకుండా అయిదెంకల పెద్ద ఉద్యోగం... ఇంకా పై సంపాదన బోలెడంత.ఒకరిద్దరేం ఖర్మ...ఐదుసార్లు కవలలు పుట్టినా హాయిగా సాదుకునేంత సంపాదన మనకుంది గదండీ. ఇంకా ఆర్థికంగా బాధపడేవాళ్ళ సంగతి మనకెందుకండీ...” అంటూ చాలాసార్లు ఈసడించుకుంది.

    ఉద్యోగరీత్యా తను బాగా సంపాదిస్తున్న మాట నిజమే మరి. తీర్ధయాత్రలో లేక డాక్టర్ల వలనో గానీ కొంత మందికైతే పిల్లలు పుట్టారు.మరి తనకేందుకిలా విధి వక్రించిందని వాపోయాడు కుటుంబరావు. అయినా, తనకు ఈ పేరు ఎందుకు పెట్టారో అర్ధంకాక చాలాసార్లు...వెంట్రుకలు సరిగ్గాలేని బట్టతల బుర్ర గీక్కున్నాడు.

    “ బట్టతల గురించి ఎందుకు బాధపడతారు ? మా క్లినిక్కి ఒకసారి వచ్చేయండి.మీకు బట్టతల బాధే ఉండదు " అంటూ వచ్చిన చాలా ప్రకటనలు చూశాడు కుటుంబరావు.

    అసలే సంతాన సాఫల్య కేంద్రాల ప్రకటనలు చూసి చూసి విసిగేత్టిన కుటుంబరావుకూ బట్టతల ప్రకటనలు మరీ బోర్ కొట్టించాయి. 'డాక్టరు సకహాలు 'అని పత్రికల్లో కనిపించిన శీర్షికలకి సందేహ ఉత్తరాలు రాసి, తన ప్రశ్న అచ్చయిన అన్ని పత్రికలు కొని, ఆ సమాధానాలు చదివి వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఆ డాక్టర్లని పర్సనల్ గా కలుసుకున్నారు. పాత రిపోర్టులు చూసిన ప్రతి డాక్టరు, మళ్ళీ టెస్ట్ చేయించమన్నారు.ఆ టెస్ట్ లు వచ్చిన తరువాత వాటిని చూసిన కొందరు డాక్టర్లు పెదవి విరిస్తే,మరి కొందరు డాక్టర్లు ఫరువాలేదు అంటూ ధైర్యం చెప్పారు.

    ఆ డాక్టర్లని కలవడానికి మొదట్లో సిగ్గు అనిపించినా, ఇప్పుడు పూర్తిగా సిగ్గు లేకుండా తిరుగుతూ...ఆడ మగ డాక్టర్ల దగ్గరికి వెళ్లి తమ బాధలను చెప్పుకుంటూ పరీక్షలు చేయించుకుంటున్నారు. చాలాచోట్ల విడివిడిగానూ, కలిసి కూచోపెట్టి కౌన్సిలింగ్ చేశారు.వాళ్ళు అడిగే 'ఎప్పుడు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు...'అన్ని ప్రశ్నలకు సిగ్గూ బిడియం లేకుండా సమాధానం చెప్పాల్సి వచ్చింది. యిలా వెళ్లి ఆ డాక్టర్లతో అలా మాట్లాడడం, చెప్పడం కరెక్టు కాదని కుటుంబరావు ఎంత చెప్పిన, అతని భార్య వినేది కాదు.

    “ అయినా డాక్టర్ల దగ్గర సిగ్గు ఎందుకు " అని దాబయించేది.దాంతో కుటుంబరావు పరిస్థితి అయోమయంగా మారింది.

    “ ఛ...ఉద్యోగ ప్రయత్నంలో కూడా ఇన్ని ఇంటర్వ్యూలూ వెళ్ళలేదు.ఇంతమందిని కలవటం జరగలేదు.అసలు నా పెళ్లి చూపులప్పుడు కూడా నేను ఇంత మందిని చూసి ఉండను " తనలో తాను అనుకుంటుండగా,భార్య అతని దగ్గరికి వచ్చింది.

    “ ఏం మేడమ్...ఏదైనా విశేషమా ?” అంటూ క్వశ్చన్ మార్కుతో ఆవిడ వైపు చూశాడు.

    “ నా మొహానికి అంత అదృష్టమా !” దెప్పినట్టుగా అంది. తల కిందికి దించుకున్నాడు కుటుంబరావు.

    “ ఏమండీ...” గోముగా పిలిచింది.

    “ ఏమిటే ?”

    “ మన ఎదురింట్లో ఒక ఫ్యామిలీ అద్దెకు దిగారు గమనించారా ?”

    “ అవును.ఓ నెలంతా టు లేట్ బోర్డ్ కనిపించింది.ఈ మధ్య కనిపించకపోతే ఎవరో వచ్చి ఉంటారులే అనుకున్నాను.ఏమిటి విషయం ?”

    “ ఈ మధ్యనే ఆవిడకొక పాప పుట్టింది లెండి "

    “ ఈ వివరాలన్నీ ఇప్పుడు నాకెందుకు ?”

    “ అవసరం కాబట్టి చెబుతున్నాను.మొన్న మొన్నటి వరకూ వాళ్ళూ మనలాగే అన్నిచోట్లా తిరిగారట.సంతాన సాఫల్య కేంద్రాలన్నిటిలో కూడా కాలు పెట్టి వచ్చారా ! అయినా లాభం లేకపోయేసరికి...”

    “ ఆ...లేకపోయేసరికి ?”

    “ మీరు దిక్కులు చూడకుండా..నా మొహం చూడండి "

    “ పెళ్ళయినప్పటి నుండి అదే చూస్తున్నాను కదా "

    “ చాల్లెండి జోకులు.అలా మొహం చూస్తూ కూర్చున్నారు కాబట్టే పిల్లలు పుట్టలేదేమోనని నవ్వుతారు "

    “ పుట్టాలని రాసివుంటే,ఏం చేసిన పుడుతారు "

    “ అంటే...నాకు నాకా యోగం లేదనేనా "

    “ నీక్కాదు...నాకు "

    “ కాదు,నాకండి "

    “ఛఛ..బూతులు ఎందుకు గానీ విషయం చెప్పు ఏమిటో ?”

    “ నన్ను చెప్పనిస్తే గదా "

    “ నేనేమైనా నీ నోరు మూశానా "

    “ సర్లెండి. ఆ ఫీలింగేప్పుడూ వున్నదేగానీ,ఆ ఎదురింది వాళ్ళ గురించి కాస్త ఎంక్వైరీ చేయండి " బుజ్జగిస్తున్నట్టు మూతి సున్నాలా చుట్టింది ఆవిడ.

    “ఏ విషయంలో "

    “ అదేనండీ...పాప గురించి "

    “ అంటే...వాళ్ళ పాప గాదా "ఆశ్చర్యంగా నోరు తెరిచాడు.

    “ ఛీఛీ...ఎప్పుడూ నెగటివ్ థింకింగే.చెప్పేది పూర్తిగా వినరూ...!”

    “ నసగకుండా చెప్పు "

    “ అవసరం నాది కాబట్టి చెప్పక చస్తానా...”

    “ ఏదైనా అవసరం మనదని చెప్పొచ్చు కదా !”

    “ అందుకే కదండీ చెబుతున్నది.సిద్ధిపేట దగ్గర ఏదో స్వామీజీ ఆశ్రమం ఉందంటా !ఉదయం,సాయంత్రం స్వామిజీ ఉపదేశాలు వింటూ అక్కడే ఓ మండలం రోజులుంటే కొన్ని మూలికలిచ్చి వైద్యం చేస్తూ తాయత్తు కూడా కడతాడంత.” పక్కనే బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు కుటుంబరావు.

    “ నీకెవరు చెప్పారు "

    “ మన ఎదురింటావిడ "

    “ ఇదివరకే కొన్ని ఆశ్రమాలు తిరిగి పూజలవీ చేసి బొట్టూ బోనం తెచ్చుకున్నాం కదా !”

    “ కనీసం స్వామీ సేవలో ఇరవై రోజులైనా ఉండాలంటా !”

    “ ఎవడైనా గుడిచుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తారు.లేదా మూడు నిద్దర్లూ చేస్తారు.కానీ యిలా స్వామిజీ ఆశ్రమంలో కనీసం ఇరవై రోజులుంటే...ఏమిటో...నాకు మాత్రం వద్దనిపిస్తోందబ్బా...”

    “ అంటే..స్వాముల మీద అనుమానాలా...!”

    “ఛిఛిఛీ...అలాంటిదేమి లేదు.కానీ ఆశ్రమంలో అందరూ మంచివాళ్ళే వుంటారా...అని !”

    “తప్పండీ.అలా అనకూడదు.మీరు నమ్ముతారో లేదో ఆవిడ ఒక్కతే ఇరవై రోజులు ఉందంటా "

    “అహా..”

    “ లీవ్ దొరికితేనే మీరు ఉండండీ.లేకపోతే నేను ఒక్కదాన్నే ఉంటాను.”

    “ అదేం కుదరదు "

    “ అయితే మీరు కూడా నాతో రండి " అంటూ లోపలికి వెళ్ళిపోయింది.

    ఏం మాట్లాడాలో తెలియక బట్టతల మీద మిగిలిన ఆ నాలుగు వెంట్రుకలని పట్టుకుని బిగ్గరగా పీక్కున్నాడు కుటుంబరావు.

  • Prev
  • Next