• Prev
  • Next
  • Paruchuri Gopalakrishna Comedy Story

    Paruchuri Gopalakrishna Comedy Story

    కుక్క విశ్వాసము గల జంతువు

    పరుచూరి గోపాలకృష్ణ.

    Telugu stories, comedy stories, telugu comedy stories: ' బొబ్బిలిరాజా ' షూటింగ్ జరుగుతున్నప్పుడు తమిళనాడులో వున్నా పొల్లాచికి వెళ్లాను. అందమైన అడవి. అందమైన అమ్మాయి లేదా అబ్బాయి అని ప్రయోగించవచ్చు గాని అందమైన అడవి అనచ్చా...!? కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా పొలిటికల్ పెద్దలు నోటికొచ్చిన మాటలు మాట్లాడే హక్కు ఈ ప్రజాస్వామ్య దేశం ఇచ్చేటప్పుడు...చేతికొచ్చింది రాసే హక్కు లేదంటారా !?.

    సరే...ఆ అందమైన అడవిలో...అందమైన ఫారెస్ట్ గెస్ట్ హౌస్. అక్కడ రకరకాల జంతువుల స్పెసిమన్స్ వున్నాయి.కోతి, పాము, చిన్న మొసలి...అలా చూసుకుంటూ వెళుతుంటే... 'ఇప్పుడు మీరు అతి ప్రమాదకరమైన జంతువుని చూడబోతున్నారు.' అని రాసి వుంది. కరుస్తుందో, అరుస్తుందో అన్న కంగారుతో మెల్లగా తలుపు పైకి ఎత్తాను. ఎదురుగా అద్దం ! ఆ అద్దంలో నేను. నవ్వుతున్నారా !? ఎవరు ఆ తలుపు తీసినా వాళ్ళ ఫేసే కనబడుతుంది. అంటే, మనిషి.. ప్రపంచంలో అతి భయంకరమైన జంతువన్నమాట.

    మరి ప్రపంచంలో అతి విశ్వాసం గల జంతువేది ? కుక్క ! అవును మన పక్కనుండే కుక్క ! ఆ కుక్క మీద కథ రాస్తే ? మనసు చివాట్లు పెట్టింది...పనిలేదా కుక్కలు నక్కలు మీద కథలేంటి అని ! బుద్ధి ఠక్కున సమాధానం చెప్పింది.చిన్నయసూరి పంచతంత్రంలో కుక్కలూ, నక్కలు,కాకులూ, గద్దలూ కాక మనుషులున్నారా అని ! అవి పాత రోజులు అంది మనసు. 'కొత్త ఒరవడి దిద్దిన శ్రీశ్రీ కూడా కుక్కపిల్ల అగ్గిపుల్ల కాదేది కవితకనర్హం 'అన్నారు అంది బుద్ధి.

    మనసు ఓడిపోయి వూరుకుంది.అయితే కథ రాయాలన్న ఆలోచన అలాగే వుంది.రోజులు గడుస్తున్నాయ్. ఇతి వృత్తం దొరకలేదు.ఊరుకున్నాను.

    ******

    మా ఎదురింట్లో మహాలక్ష్మి అని చాలా అందమైన అమ్మాయి. స్త్రీ అంటే ఇలా వుండాలి అని అనిపించేంత అందగత్తె.మా ఆవిడతో ఆ మాటంటే...” ఏవిటి మీ కన్ను పడింది ఆ పిల్ల అందం మీద " అని కసురుకోలేదు.

    నిట్టూర్చింది.ఒకవేళ తనకు అంత అందం రానందుకేమో అనుకున్నా... అదికాదు. “ ఏమిటోయ్ అలా నిరుత్సాహపడుతున్నావ్ " అంటే " ఆ పిల్ల అందం అడవిగాచిన వెన్నెల లెండి " అంది.

    “అదేమిటోయ్ " అంటే "ఆ పిల్ల మొగుడు సుబ్రహ్మణ్యం పచ్చి తాగుబోతు " అంది.

    “ తాగుబోతయితే ఆ పిల్ల అందం అడవిగాచిన వెన్నెలెలా అవుతుంది ? ” అని అడిగా.

    “ మొగుడు అస్వాదించని భార్య అందం, భగవంతుడి పాదాల చెంతకు చేరని పుష్పం ఒకటేనండి " అంది ఆత్రేయగారి కజిన్ సిస్టర్లా.

    రైటింగ్ లో నాతో పైటింగ్ కి రావాలని చాలా ఏళ్లుగా ఆవిడకోరిక.ఆ ప్రోసెస్ స్టార్ట్ చేసిందన్న అనుమానం వచ్చింది.అయినా మనం ఎందుకు వదలాలి అని " అతగాడు ఆస్వాదించడం లేదని నీకెవరు చెప్పారు ? ” అన్నా.

    “ అయ్యో ఇది కూడా తెలియదా " అన్నట్టు జాలిగా నావంక చూసి..."ముఖం మనసుకి అద్దం. బింబం లోపల పడితే ప్రతిబింబం బయటకు కనబడుతుంది.” అంది.ఎక్కడో కొటేషన్లు బట్టీ పట్టినట్టుంది. ప్రస్తుతం ఆవిడతో వాదనలు అనవసరం అనుకుంటూ వుండగానే " 24గంటలూ ఆన్ లైనే " అంది.

    “ఏ లైన్ "

    “ ప్రభుత్వం వారు సారా వద్దని మరోటి తాగమని లైసెన్సు ఇచ్చారుగదా... బ్రాందీ...! ఆ లైన్ " అంది.

    “ పాపం ఒక్కసారి పలకరించి వద్దామా "

    “ పళ్ళు రాలగొడుతుంది పతివ్రత...!” అంది.

    “ నీలాగా " అన్నా. అంతే షటప్పయిపోయింది.ప్రపంచానికి ఎన్ని మాటలయినా చెప్పగలను గాని ఆ ఆవిడని మాటల్లో గెలవలేను. అందుకే ఫైనల్ టచ్ ఇస్తూ వుంటాను. ప్రతివత అన్నాక కూడా మాట్లాడితే తన పదవికి ఏదో లోపం వచ్చినట్లువుతుందని మౌనం వహిస్తుంది.అదే నా ట్రాంప్ కార్డు.

    ******

    ఆ తర్వాత వారం రోజులకి మా ఆవిడే ఒక విషయం చెప్పింది. సుబ్రహ్మణ్యం కుక్కపిల్లను తెచ్చాడు.ఆ వైనం స్క్రీన్ ప్లే సంభాషణలతో సహా మహాలక్ష్మి దగ్గర కనుక్కుని చెప్పింది. సుబ్రహ్మణ్యం ఫుల్ గా తాగి, పడుతూ లేస్తూ రోడ్డు మీద వస్తున్నాడు.అతని కళ్ళ ముందే ఒక మోటారు సైకిలిస్ట్ రోడ్డు కడ్డంగా వస్తున్న ఒక చిన్న కుక్కపిల్లను తొక్కి వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్యం రెచ్చిపోయాడు.వాడి వెంటపడి తిట్టాడు.

    “ మానవత్వం లేదురా...డోసు ఎక్కువయిందా...?” అని అరిచాడు తనూ డోసు మీద ఉన్నానన్న విషయం మరిచిపోయి. ఆ కుక్కపిల్లని మోసుకుని పశువుల డాక్టర్ ఇంటికి వెళ్లి తలుపుకోట్టాడు. అర్ధరాత్రి...విసుక్కుంటూ తలుపు తీశాడు డాక్టర్. “ ఏంటయ్యా...టైమూ పాడూ లేదూ ? ”

    “ డాక్టర్ కి టైమెంటయ్యా... కష్టాలు చెప్పి వస్తాయా ! యాక్సిడెంట్లు చెప్పి జరుగుతాయా ?ఇప్పుడు సపోజ్ నిన్ను నేను కత్తి పెట్టి పొడిచాననుకో... నువ్వెళ్ళి మనుషుల డాక్టర్ని నిద్రలేపుతావా లేదా " అన్నాడు.

    “ నువ్వు నన్ను పొడవడం దేనికిలే బాబూ...వైద్యమే చేస్తాను " అంటూ డాక్టర్ ఆ కుక్కకి వైద్యం మొదలు పెట్టాడు.దానికి జ్వరం రాకుండా, ధనుర్వాతం రాకుండా ఎన్ని రకాల ఇంజకన్లు కావాలో అన్నీ చేయించాడు సుబ్రహ్మణ్యం.విరిగిన బొమికకు కట్టు కట్టించాడు. తాగడానికి అయిపోగా జేబులో ఏం మిగిలివుంటే ఆ డబ్బులు తీసి డాక్టర్ కిచ్చి " నా బుజ్జి " అని ఆ కుక్కని ముద్దు పెట్టుకుని చేతిలోకేత్తుకొని బయలుదేరాడు.

    చేసిన పని మంచిదవడం నుంచో లేక డోసు ఎక్కువయిందో గానీ గాలిలో తేలుకుంటూ వస్తున్నాడు. ఇంటికి వచ్చి తలుపుకోట్టాడు. మహాలక్ష్మి తలుపు తీసింది. “దీన్నెవరు పెంచుతారండీ !” అంది.

    “నువ్వే " అన్నాడు.

    “ కుక్కలంటే నాకసహ్యం "

    “ నువ్వంటే నాకంతకంటె అసహ్యం " అని గొడ్డును బాదినట్టు బాదసాగాడు.

    దెబ్బలకు తట్టుకోలేక మహాలక్ష్మి ఆ కుక్కపిల్లను పెంచటానికి ఒప్పుకుంది. ఈ కథంతా మా ఆవిడ విపులంగా చెప్తే...” ఇంత వివరంగా చెప్పావేంటీ "అన్నాను.

    “ ఈ మధ్య మీరు కుక్క మీద కథ రాస్తానంటూ బుక్కులన్నీ తిరగేసారుగా... రాసుకుంటారని చెప్పా " అంది.

    “ ఇందులో ఫ్లాట్ కి సరిపోయే పాయింట్ లేదు...పనికిరాదు " అన్నాను .

    తను కష్టపడి చెప్పిన విషయం పనికిరాదనేసరికి మా ఆవిడకు కోపం వచ్చి " రాయడం చేత కాదు అని చెప్పరాదూ " అంది. “ నీలాగా " అని అనటానికి ధైర్యం చాలక ఊరుకున్నా!.

    ******

    ఒక ఏడాది గడిచిపోయింది. ఎదురింటి కుక్క బాగా పెరిగింది.కాకపొతే ఒకటే బాధ ఆ సుబ్రహ్మణ్యం కుక్కని 'బుజ్జీ" అని పిలుస్తున్నాడు.నేను మా ఆవిణ్ణి పిలుచుకునే ముద్దు పేరది. ఆ సుబ్రహ్మణ్యాన్ని కడిగేద్దాం అనుకున్నా...పొద్దున్నే పేపర్ చూసా.ఆమెరికా ప్రెసిడెంట్ బుష్ గారు తన కుక్కకి ఇండియా అని పేరు పెట్టుకున్నారని చదివాక మనస్సు ఉపశమించింది.

    మన దేశం పేరును ఓ కుక్కకు పెట్టి పిలుస్తుంటే...మనవాళ్ళే ఊరుకోగా లేనిది... మా ఆవిడ ముద్దు పేరు తను పెట్టుకుంటే నాకెందుకు కోపం అనుకున్నా... ఈ ఏడాదిగా మహాలక్ష్మి కి ఆ కుక్క మాలిమైపోయింది.దాన్ని పెంచడంలో ఒంటరితనం పోయింది.

    ప్రతోరోజూ దానికి స్నానం చేయించడం...పాలు పోయడం...అన్నం పెట్టడం...తేడా వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లడం అన్నీ తనే చేస్తోంది.సర్వం తానై చేస్తోంది. 24 గంటల్లో ఎప్పుడో ఓ నిమిషం " హాయ్ బుజ్జీ " అంటూ సుబ్రహ్మణ్యం లోపలకు వెళుతుంటే కనీసం అది తోకకూడా ఊపడం లేదు.కోపంతో అప్పుడప్పుడూ భార్యను తన్నినట్టే దాన్ని కాలితో తంతూ వుండేవాడు.అది కుయ్యో మొర్రో అని ఏడ్చేది.

    ఆరోజు శ్రావణ శుక్రవారం... మహాలక్ష్మి నోము నోచుకుంది. మా ఆవిణ్ణి కూడా ముత్తయిదువుగా పిలిచింది.వెళ్లేముందే మా ఆవిడ చెప్పింది. “ అడ్డమైనా చెత్తా తినబాకండి ...వాయనం తెస్తా " అని.

    ఆవిడ పెట్టింది తప్ప నేను ఏంతిన్నా ఆవిడ దృష్టిలో అది అడ్డమైన చెత్తే...! “ నువ్వు తిన్నాక తింటాలే " అన్నా.

    చురుగ్గా చూసి వెళ్ళిపోయింది. ఆ రాత్రి. ఈ కథ రాయడానికి కారణమైన రాత్రి !! శ్రావణ శుక్రవారం... వ్రతం చేసుకున్న సంతృప్తితో ఈరోజన్నాభర్తతో కలిసి భోజనం చేద్దామని సుబ్రహ్మణ్యం కోసం ఎదురు చూస్తోంది మహాలక్ష్మి. అతగాడు ఎంతకూ రావడం లేదు. బుజ్జి అరుస్తోంది ఆకలితో. “ ఉండవే... ఆయనొచ్చాక మేమిద్దరం తిన్నాక పెడతాం " అంటోంది.

    అది ఊరుకోవడం లేదు.గొడవ చేస్తోంది.ఇక దాని గోల భరించలేక అన్నం తీసుకువచ్చి వడ్డిస్తోంది.భర్త తూలుతూ వస్తున్నాడు. “ ఏంటే...నాకంటే ఆ కుక్క ఎక్కువై పోయిందా నీకు " అన్నాడు.

    “....ఇప్పటిదాకా చూసాను.మీరు రావటం లేదు.అది అరుస్తోంది.అందుకని....”

    “ అంటే, నేను కుక్క కంటే హీనం అన్నమాట. దీనమ్మ...అది నన్ను చూసి తోకకూడా వూపదు. దానికన్నం ఎందుకు పెట్టావే ?” అని గిన్నెని తన్నేసాడు. తినే అన్నం గిన్నె తన్నేశాడని కోపంగా చూస్తోంది బుజ్జి.

    “ అదేమిటండి...దానినోటి దగ్గర కూడు తీస్తారా...” అంది.

    “ కూడు కాదు.దాని ప్రాణాల్ని తీస్తా " అని పక్కనున్న రోకలి బండ తీసుకుని బుజ్జిని కొట్ట సాగాడు. అది ప్రాణభయంతో గిలగిల లాడిపోతోంది. అరుస్తూ ఏడుస్తూ నేలమీద పడుకుని జాలిగా మూలుగుతోంది.

    “ కావాలంటే నన్ను కొట్టండి.నన్ను చంపండి.నోరులేని దాన్నేం చెయ్యడానికి వీల్లేదు.” అని అడ్డం పడింది మహాలక్ష్మి.

    “ నీయమ్మ...నాకే ఎదురు తిరుగుతావా...ఎదవ కుక్కకోసం ఎదురు తిరుగుతావా ?” అని ఆమె నడినెత్తిన కొట్టాడు.

    తల పగిలి చివ్వున రక్తం చిందింది.కింద పడిపోయింది.రెండో దెబ్బ వెయ్యటానికి వెళుతున్నాడు. అంతే ! అప్పటిదాకా తనను చంపబోయిన సుబ్రహ్మణ్యం ఆరాచకాన్నిమూగ వేదనతో భరించిన బుజ్జి ఎగిరి సుబ్రహ్మణ్యం పీక పట్టుకుని గుంజేసింది.కంఠంవూడి పడిపోయింది. సుబ్రహ్మణ్యం గిలగిలా తన్నుకుని చచ్చిపోయాడు. మెల్లగా లేచివెళ్ళి మహాలక్ష్మి చేయి నాకుతోంది బుజ్జి. తెల్లబోయి ఈ దృశ్యం నేనూ మా ఆవిడా చూస్తున్నాం.

    “ కుక్క విశ్వాసము గల జంతువు " అన్నాను.

    “ కాదు " అంది మా ఆవిడ.

    ******

    సీరియస్ గా కథ రాస్తున్నాను. కాఫీ తెచ్చి పెట్టి " ఏదన్నా ప్లాటు దొరికిందా " అంది.

    “అవును ...ఇన్నాళ్ళుగా రాయాలని ఎదురుచూస్తున్న కుక్క కథ ఈ రోజు రాస్తున్నాను.”

    “ ఎదురింటి కుక్క కథా...ఛీ..ఛీ...దానికి విశ్వాసం లేదండీ. పాపం రోడ్డు మీద యాక్సిడెంటయితే కాలుకి కట్టు కట్టించి, ప్రాణం పోసి తెచ్చిన సుబ్రహ్మణ్యాన్ని చంపింది.దాని మీద కథ కూడానా ?” అంది కోపంగా.

    “ ప్రాణం పోసినప్పుడు అది స్పృహలో లేదు.తనను కాపాడింది ఎవరో కూడా దానికి తెలియదు.అది స్పృహలోకి వచ్చాక దాన్ని పెంచి అన్నం పాలు పెట్టిన అమ్మ మహాలక్ష్మి అయ్యింది.తనను కొడితే భరించగలిగింది. కానీ తన యజమానురాలుని చంపబోతుంటే ఊరుకోలేక చంపేసింది.కుక్క విశ్వాసం గల జంతువే " అన్నాను.

    “ నేను చచ్చినా ఒప్పుకోను " అంది మా ఆవిడ.

    “ మహాలక్ష్మి నీలాగా పతివత్ర కాబట్టి అలా ఆవిణ్ణి కాపాడిందనుకోరాదూ...?” అన్నాను.

    దెబ్బకి పూర్తిగా షటప్పయిపోయింది బుజ్జి. పతివ్రతలు భర్తల కంటే ముందు పోతారనే పాయింటు ఆ క్షణంలో మా ఆవిడకు తట్టకపోవడం నా అదృష్టం...నా ట్రంప్ కార్డు మళ్ళీ నాకు దక్కింది. ఎదురింట్లో బుజ్జి తలకు కట్టు కట్టుకుని వున్నమహాలక్ష్మిని మౌనంగా చూస్తోంది.రోజూ నిండుగా వుండే ఆమె ముఖం మీద బొట్టు లేకపోవడానికి తనే కారణం అని పాపం దానికి తెలియదు. కుక్క విశ్వాసము గల జంతువు ! అవునా ? కాదా ?.

  • Prev
  • Next