• Prev
  • Next
  • Kattingu Cheyinchi Chudu

    కట్టింగ్ చేయించి చూడు

    మల్లిక్

    ***********************************************************************

    “వా...” ఇంటికప్పు లేచిపోయేలా బుజ్జిపండు ఏడవసాగాడు.

    వాడి ఏడుపుకి హాల్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్న సుందర్రావు కంగారుగా లోపలికి వచ్చాడు.

    “ఏమైందిరా …?”అని అడిగాడు బుజ్జిగాడిని.

    “కిందపడ్డాను....వా...”అంటూ మళ్ళీ ఏడ్చాడు మూడేళ్ళ బుజ్జిపండు.

    “నీ శుభ్రం మంటేట్టా.ఇంటిని సబ్బుతో కడుగుతావ్ చూశావా ఎట్టా జారిపడిపోతున్నాడో. ఎప్పుడో నేను కూడా జారిపడి నడ్దిరక్కొట్టుకుని సంసారానికి పనికిరాకుండా పోతాను.అప్పుడు తిక్కొదిలిపోతుంది.”భార్య మంగతాయారు మీద మండిపడ్డాడు సుందర్రావు.

    “ఊర్కే ఎందుకలా చిందులు తొక్కుతారు ?వాడేం కాలుజారి పడలేదు.కళ్ళు కనబడక కుర్చీని తన్నేసి పడ్డాడు " అంది మంగతాయారు చికాకుగా.

    “హయ్యే..కళ్ళు కనబడట్లేదా ?ఇంత చిన్న వయసులోనే దృష్టి లోపమా ?అయితే వెంటనే కళ్ళ డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాల్సిందే!”కంగారు పడుతూ అన్నాడు సుందర్రావు.

    “కళ్ళ డాక్టరు దగ్గరికి వాడిని కాదు.మిమ్ముల్ని తీసుకెళ్లాలి.వాడి మొహమేమైనా కనిపిస్తుందా అసలు? వాడి జుట్టు చూడండి ఎలా పెరిగిపోయిందో ?జుట్టంతా కళ్ళమీదికి వచ్చేసింది.వాడికి కటింగ్ ఎప్పుడు చేస్తారు ?”అంది మంగతాయారు.

    “ఇన్ని సంవత్సరాలు నేనే చేశాను.ఇప్పుడు కూడ చెయ్యాలంటే ఎలా ?ఇప్పటికైనా షాపులో చేయించడం అలవాటు చెయ్యకపోతే మీసాలు గడ్డాలు వచ్చేదాకా వీడికి నేనే కటింగ్ చేయాలి.అప్పుడు కటింగుతో పాటు షేవింగ్ కూడా చేయాలో ఏంటో ఖర్మ " నెత్తిన కొట్టుకున్నాడు సుందర్రావు.

    “వాడు షాపుకేలాగు రాడని మిమ్ముల్ని చెయ్యమన్నాను.వాడు మీ కూడా షాపుకొస్తానంటే నాకేంటి అభ్యంతరం "అంది మంగతాయారు.

    “ఒరే పండూ...చెప్పులేస్కో.కటింగ్ చేయించుకోవడానికి షాపుకి వెళ్దాం "అన్నాడు సుందర్రావు.

    “ఊ..నేను షాపుకి రాను.నువ్వే క్రాపు చెయ్ "మారాం చేశాడు బుజ్జిగాడు.

    “నేను ఇంక చెయ్యకూడదమ్మా.మరేమో నువ్వు పెద్దాడివైపోయావు కదా!నువ్వు షాపులోనే క్రాపు చేయించుకోవాలి.తెలిసిందా ?”అన్నాడు సుందర్రావు.

    “ఊహు...”

    “ మా బాబువుకదూ ?నువ్వు క్రాపు చేయించుకుంటే చాక్లెట్లు కొనిపెడతా "అంటూ ఆశపెట్టాడు సుందర్రావు.

    “ముందు కొనిపెట్టు.అప్పుడు చేయించుకుంటా "అన్నాడు బుజ్జిగాడు.

    “అలాగే చెప్పులు వేసుకో.వెళ్దాం "అన్నాడు సుందర్రావు.

    బుజ్జిగాడు చెప్పులు వేసుకుని బయటికి బయలుదేరాడు.

    సుందర్రావు వాడికి దార్లో ఒక షాపులో చాక్లెట్లు కొనిపెట్టాడు.మరికాస్త దూరం నడిచాక సెలూన్ వచ్చింది.దాన్ని చూస్తూనే ఠక్కున ఆగిపోయాడు బుజ్జిపండు.

    “వా..” గట్టిగా ఏడుస్తూ హటాత్తుగా రోడ్డు మీద కూర్చుండిపోయాడు బుజ్జిపండు.

    సుందర్రావు కంగారుపడిపోయి కిందికి వంగి వాడిని లేపి ఎత్తుకుని "తప్పమ్మా...అలా కింద కూర్చోరాదు "అన్నాడు తెలిసిన వాళ్ళెవరైనా చూస్తున్నారేమోనని చుట్టూ పక్కల చూస్తూ.

    “నేను... వా...క్రాపు చేయించుకోను " అంతే...ఫేడీల్మని సుందర్రావు మొహం ఒక చరుపు చరిచాడు.

    “క్రాపు చేయించుకోవాలి.లేకపోతే పిచ్చాడనుకుంటారు !” చుర్రుమన్న మొహం రుద్దుకుంటూ కోపంగా గట్టిగా అరిచాడు సుందర్రావు.

    అతని అరుపుకి దారిపోయే వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు ఎవరీ పిచ్చాడు అనుకుంటూ. సుందర్రావు తను అలా అరిచినందుకు తనే సిగ్గుపడిపోయి "తప్పమ్మా..అలా చెయ్యకూడదు.క్రాపు చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది కదా "మెల్లగా అన్నాడు బుజ్జిపండు చెవిలో.

    “షాపులో వాడు చేస్తే చెవి తెగిపోతుంది "అన్నాడు బుజ్జిపండు బుంగమూతి పెట్టి.

    “నీ చెవి తెగకుండా జాగ్రత్తగా చెయ్యమని నేను చెప్తాగా "బుజ్జగిస్తూ అన్నాడు సుందర్రావు.

    “కత్తెర మెడమీద గుచ్చుకుంటుంది "చెప్పాడు బుజ్జిపండు.

    “అలా కాకుండా చెయ్యమని నేను చెప్తాగా.వాడు నీ మెడమీద కత్తెర గుచ్చుకునేలా క్రాపు చేస్తే వాడిని పోలీసులకి పట్టించేస్తాను.అట్లాగేనా "అన్నాడు సుందర్రావు.

    బుజ్జిపండు సరే అన్నట్టు తలూపాడు.

    ఇద్దరూ సెలూన్ లోకి అడుగు పెట్టారు.

    సెలూన్ ఖాళీగా లేదు.ఉన్న మూడు కుర్చీల్లో ఒకడు షేవింగ్ చేయించుకుంటున్నాడు. ఇద్దరేమో క్రాపులు చేయించుకుంటున్నారు. బుజ్జిపండు మొహం చూడగానే షాపు ఓనర్ రాములు మొహం మాడిపోయింది.

    “ఏంది సాబ్...క్రాపు మీకు చెయ్యాలా,లేక ఈ బచ్చాగాన్కి చెయ్యాలా ?”అన్నాడు అనుమానంగా చూస్తూ.

    “నాకు మొన్ననే కదోయ్ చేశావ్ !వీడికే చెయ్యాలి !”అన్నాడు సుందర్రావు నవ్వుతూ.

    “హాయ్ రామ్...గీ పోరగాళ్ళకి కటింగ్ చేసుడు చాలా ముసిబత్ సాబ్.మీరు బెంచిమీద గూసొండ్రి " అన్నాడు బాధగా బుజ్జిపండు వంక చూస్తూ.

    సుందర్రావు, బుజ్జిపండు బెంచిమీద కూర్చున్నారు.వీళ్ళుకాక మరో ఇద్దరూ వ్యక్తులు బెంచిమీద కూర్చుని తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు.

    బుజ్జిపండు చాక్లెట్లు చప్పరిస్తూ పరిసరాల్ని శ్రద్ధగా గమనిస్తున్నాడు. కాసేపయ్యాక ఉన్నట్టుండి బుజ్జిపండు పకపక నవ్వాడు.వాడి నవ్వుని చూసి రాములు ముచ్చట పడ్డాడు.

    “ఏంది బాబూ అట్టా నవ్వావ్ ?”అని అడిగాడు.

    “మరేమో నువ్వు క్రాపు చేస్తున్నావే...ఆయనకీ అంతా బట్టతలేగా?నెత్తిన ఉన్న ఆ నాలుగు పోచల కోసం కటింగ్ రాకపోతేనేం ?హి హి హి "అన్నాడు బుజ్జిపండు.

    ఆ సమాధానికి రాములు మొహం పాలిపోయింది. కంగారుగా బట్టతలాయన వంక చూశాడు. ఆ బట్టతలాయన వెనక్కు తిరిగి గుర్రుగుర్రుమంటూ బుజ్జిపండునీ, సుందర్రావునీ మార్చి మార్చి చూశాడు.

    “తప్పమ్మా, అలా అనకూడదు "సుందర్రావు బుజ్జిపండు చెవిలో మెల్లగా అన్నాడు. కాసేపయ్యాక బుజ్జిపండు మళ్ళీ కకిలకిలా నవ్వాడు.వాడివంక రాములు భయంగా చూశాడు. ఈసారేమంటాడోనని .

    “నాన్నా...ఆ చివర్న క్రాపు చేయించుకుంటున్నాడే, అతని తల కరక్టుగా మామిడికాయలా వుంది కదూ?హి హి హి "అన్నాడు బుజ్జిపండు.

    ఆ మామిడికాయ తలున్నాయన పళ్ళు పరపరా నూరాడు. సుందర్రావుతో బాటు బెంచిమీద కూర్చున్న ఇద్దరూ చరాలున లేచి నిలబడ్డారు.

    “హర్రే...ఎండట్ల నిలబడిండ్రు ?కూర్చోండి...వీళ్ళ తరువాత మీకే జేస్త ?అన్నాడు రాములు. “వద్దులే.మేం రేపొచ్చి చేయించుకుంటాం "అని బుజ్జిపండు వంక భయం భయంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయారు ఆ ఇద్దరూ.

    రాములు నెత్తికొట్టుకున్నాడు.కాసేపయ్యాక బట్టతలాయనకీ, మామిడికాయ తలాయనకీ క్రాపులు చెయ్యడం అయిపొయింది. వాళ్ళిద్దరూ బుజ్జిపండు వంకా, సుందర్రావు వంకా కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోయారు.

    “ఆ...రా బాబూ...కూర్చో "అన్నాడు రాములు సీటు దులుపుతూ బుజ్జిపండుతో.

    “నేను రాను.నేను క్రాపు చేయించుకోను.నువ్వు వేరే ఎవరికైనా చెయ్యి.నేను చూస్తాను "అన్నాడు బుజ్జిపండు.

    “తప్పమ్మా అలా చేయకూడదు.మరి నీకు చాక్లెట్లు ఇచ్చాగా క్రాపు చేయించుకొమ్మా "అన్నాడు సుందర్రావు.

    “నువ్వు చేయించుకో "అన్నాడు బుజ్జిపండు.

    “నేను మొన్ననే కదా చేయించుకున్నాను.ప్లీజ్ రామ్మా " అన్నాడు సుందర్రావు.

    “వద్దు నా చెవి తెగిపోతుంది "

    “నేను నీ చెవి తెగకుండా చేస్తా బాబూ "అన్నాడు రాములు.

    “ఉహు..నేను రేపు చేయించుకుంటాను "అన్నాడు బుజ్జిపండు.

    “హర్రే..ఏం ముసీబత్ వచ్చింది బాయ్ " అంటూ రాములు తలకాయ పట్టుకున్నాడు.

    సుందర్రావు బుజ్జిపండుకు అవీ ఇవీ కొనిపెడ్తానని ఆశ పెట్టి బతిమిలాడి కుర్చీలో కూర్చోబెట్టాడు. రాములు కటింగ్ మొదలు పెట్టగానే బుజ్జిపండు కాళ్ళూ,చేతులూ తన్నుకుని గింజుకోవడం మొదలు పెట్టాడు.

    “హర్రే...ఇస్కీ !గిట్లయితే చెవుల్, మెడల్ తెగుతాయి సాబ్.బాబూని కదలకుండా పట్టుకోవాల!” అన్నాడు రాములు.

    సుందర్రావు బుజ్జిపండుని కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు.అయినా బుజ్జిపండు గింజుకుంటూ ' కదులుతూనే వున్నాడు. సుందర్రావు వాడిని గట్టిగా వాటేసుకుని "ఊ...నీ పని కానియ్ వోయ్ "అన్నాడు రాములుని చూస్తూ.

    “అర్రె ఎట్లాసార్...మీ తల అడ్డు తగుల్తుంది గదా మల్ల ?”అన్నాడు రాములు.

    “ఎలాగోలా సందు చూసుకుని క్రాపు చేసేయ్ "అన్నాడు సుందర్రావు.

    “వా...”గింజుకుంటూ గట్టిగా రాగం తీశాడు బుజ్జిపండు.

    ఒకపావుగంట అవస్తపడి బుజ్జిపండుకి క్రాపు చేశాడు రాములు. ఇంటికి వెళ్తున్నప్పుడు దారిపొడుగునా రాగం తీస్తూనే ఉన్నాడు బుజ్జిపండు. ఇంట్లోకి రాగానే మంగతాయారు అడిగింది.

    “అదేంటి ?అసలు వాడికి క్రాపు వేయించారా ?ఆ జుట్టంతా అలాగే వుంది ?”

    “ఇంకా నయం... ఈ మాత్రం కట్ చేయించడానికి చచ్చే చావొచ్చిపడింది.”చెప్పాడు సుందర్రావు.

    మంగతాయారు సుందర్రావు వంక చూసి మరీ ఆశ్చర్యపోయింది.

    “అదేంటి మొన్నేగా మీరు క్రాపు చేయించుకున్నారు.మళ్ళీ ఇప్పుడు మీ అంత డిప్ప కటింగ్ ఎందుకు చేయించుకున్నారు ?” చెప్పాడు సుందర్రావు.

    “నేనేం చేయించుకోలేదు.వీడిని గట్టిగా వాటేస్కుని పట్టుకుంటే తల అడ్డొచ్చి నా జుట్టు కూడా కట్ చేశాడు రాములు "ఏడుపు మొహంతో చెప్పాడు సుందర్రావు.

    “ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచింది మంగతాయారు.


  • Prev
  • Next