• Prev
  • Next
  • Govinda Govinda Telugu Story

    " గోవిందా...గొహోవిందా "

    వెంపరాల శారద

    రాజకీయ నాయకులు ఓటు కోసం శవాన్ని కూడా వదలరని నానుడి! పోలింగు క్షణాలు

    ముగుస్తుండగా, ఆ ఇంట్లో ఇవాళ్లో రేపో అన్నట్టుగా ఒక ప్రాణి ఉందని తెలిసి ఉరుకుల పరుగులతో

    ముగ్గురూ అభ్యర్థులు ఎలక్షన్ ఆఫీసరుని వెంటబెట్టుకొని వచ్చారు.

    ఓ పెద్దాయన మంచాన్నతుక్కుని కళ్ళు శూన్యంలోకి చూస్తుండగా ఎగశ్వాసతో క్షణాలు లెక్క

    పెడుతుంటే, మంచం ప్రక్క ఆ క్షణాల కోసం నిమిషాలు లెక్కపెడుతూ కూర్చుని ఉన్నాడు అతని

    మనవడు. ఒక్కమాటు చుట్టూ పరికించి మనవడితో నాలుగు సానుభూతి వాక్యాలు పలికి,తాము

    వచ్చిన పనిని మెల్లగా బయట పెడుతూ,'ఓటు జన్మహక్కు'అని జన్మను చాలించబోతున్న తాతగారి

    ఈ జన్మకి గల ఆ హక్కుని కాదనే హక్కు మనకు లేదని అభ్యర్థులు వివరించారు.

    “ ఓటు మాటదేముడెవరుగు, రాత్రి నుండి మాట కూడా పడిపోయింది తాతకి " అన్నాడు మనవడు

    దిగులుగా. పట్టువదలని ఆ రాజకీయ విక్రమార్కులు తమ ప్రయత్నాన్ని విరమించుకోలేదు.మొదటి

    అభ్యర్థి తాత తలవైపుకి వెళ్లి "తాతా !నీ ఓటు ఎవరికి ? తెలుగుదేశానికేగా ?” అని నారాయణ

    మంత్రం చెవిలో ఊదినట్లుగా కొంచెం గట్టిగానే అడిగాడు.శరీరంలో కదలిక లేకపోయినా తెరుచుకునే

    ఉన్న తాత నోటివెంట'ఆ' అన్న శబ్దం వచ్చింది.

    విప్పారిన ముఖంతో అభ్యర్తి "అయితే నీ ఓటు తెలుగుదేశానికేనన్నమాట " అన్నాడు చెవిలో కొంచెం

    గట్టిగా. “ఆ" మళ్ళీ అదే శబ్దం.

    మొదటి అభ్యర్థి సంతోషంగా ఎలక్షను ఆఫీసరు వైపు తిరిగి " చూశారా...ఆయన ఓటు మాకే.

    వ్రాసుకోండి " అన్నాడు.

    ఇంతలో రెండవ అభ్యర్థి అడ్డుపడుతూ "ఆగండి..ఆయన ఆ అని అవులించాడు.అంతేగాని అవునని

    కాదు.నేనడుగుతాను " అని తాత చెవి దగ్గరకు వెళ్లి " తాతా నీ ఓటు కాంగ్రెసుకేనా " అన్నాడు

    మరింత గట్టిగా.

    “ఆ " అని మళ్ళీ శబ్దం చేశాడు.

    “ చూశారా ఆయన ఓటు మా పార్టీకే,వ్రాసుకోండి " అన్నాడు రెండో అభ్యర్థి.

    మూడో అభ్యర్థి కల్పించుకుంటూ...”మీరూ కాస్త ఆగుతారా, పెద్దాయన...ఆ...అంటే ఏమిటీ అని

    అర్థం...నేను అడుగుతా చూడండి " అని మూడో అభ్యర్థి తాత చెవిలో "నీ ఓటు బిజెపి కే కదా తాతా "

    అని అరిచాడు. “.......” ఏ మాటు శబ్దం లేదు.మాటతో పాటు ఓటు ఎగిరిపోయింది.తాత గుడ్లు తేలేశాడు.

    “ ఈ ముగ్గురూ మా తాతను చంపేశారు నాయనోయ్ " అని గొల్లుమన్నాడు ఆ క్షణం ఎదురు తెన్నులు చూస్తున్న మనవడు.

    “ చంపేశారు" అన్నమాట ఒక్కటే వినబడ్డ 'అధికారి' నేర చరిత్ర గల ముగ్గురు అభ్యర్థుల గురించి

    ఇప్పుడే లోకసత్తాకు ఫిర్యాదు చేస్తానంటూ పెన్ను జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు.

    “ ఆ...” అన్నారు ముగ్గురూ అభ్యర్థులు కోరస్ గా.

  • Prev
  • Next