TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
తాతా ధిత్తై తరిగిణతోం 63
జీడిగుంట రామచంద్రమూర్తి
"సారీ రామ్...నేను నిన్ను ఎంతో గాఢంగా ప్రేమించాను నీకూ నామీద ప్రేమ వుందని గ్రహించాను కానీ మీ నాన్నగారి పట్ల భయంతోనో, భక్తితోనో ఆయనకు ఎదురు చెప్పలేక, మీ మావయ్య కూతురితో పెళ్లికి తలవంచుకున్నావని అర్థం చేసుకున్నాను...అందుకే ఆ సాహసం చేశాను...చివరకు నా ఆఖరి ప్రయత్నం అలా ఫలించింది...ఈ విషయం నీకు చెప్పి క్షమాపణ కోరుకోవాలని చాలాసార్లు అనుకున్నాను కానీ అవకాశం రాలేదు నన్ను మన్నించు రామ్."
"నేను మనించాల్సినంత తప్పు నువ్వేం చెయ్యలేదు అశ్వినీ. ఆ మాటకొస్తే నాలోని ధైర్యసాహసాలకు ఊపిరిపోసి నన్ను మగధీరుడిగా మార్చినందుకు నీకే నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి." ఆమె చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా అన్నాడు శ్రీరామ్.
"నాకు కృతజ్ఞతలు తర్వాత చెబ్దువుకాని ముందు ఆ రౌడీలకు బుద్ధిచెప్పి మా నాన్నని విడిపించు కరాటే నేర్చుకున్నదాన్ని నీవెంట నేనున్నానుగా పద!" విజయ సంకేతంగా బొటనవేలు పైకెత్తి చెప్పింది అశ్విని.
ఇద్దరూ పెరట్లోకి ప్రవేశించారు అక్కడున్న నిచ్చెన సహాయంతో బాల్కనీలో చేరుకొని చప్పుడు కాకుండా హాల్లో అడుగుపెట్టారు.
అక్కడ సోఫాలో కూర్చుని బీరుబాటిల్ ఖాళీ చేసిన గుండాకి, మరో బాటిల్ ఓపెన్ చేసి అందిస్తూ అంటున్నాడు గోపాలం.
"బాషాభయ్యా! నువ్విచ్చిన టైం దాటిపోయింది మా మావ దారికోచ్చేలాలేడు ఏం చేద్దాం! ఫినిష్ చేయకతప్పదు. మాతో తీసుకుపోతాం మధ్య దారిలో ఫినిష్ చేస్తాం అక్కడే ఏ నూతిలోనో, చెరువులోనే పారేసి మా దారిన మేం పోతాం. అంటూ బాటిల్ ఎత్తి అందులోని బీరంతా గడగడా తాగేశాడు బాషా."
సరిగ్గా అదే క్షణంలో శ్రీరామ్ ఎగిరివచ్చి అతని మీద విరుచుకుపడ్డాడు. అతని చేతిలోకి బీర్ బాటిలు కిందపడి పగిలిపోయింది...ఆ పగిలిపోయిన సీసాను చేతిలోకి తీసుకుని బాషా మీదకు వచ్చాడు శ్రీరామ్.
అతన్ని చూసిన తక్కిన రౌడీలిద్దరూ గట్టిగా అరిచారు. "బాస్ ఆ రోజు మమ్మల్ని చావగొట్టి పోలీసులకు పట్టించింది వీడే."
"అయితే చూస్తారేం?...ముందు వాణ్ణి వేసేయ్యండి." బాషా కూడా అరిచాడు.
రౌడీలు శ్రీరామ్ మీదకు వచ్చారు..తన చేతిలోని పగిలిన సీసాతో వాళ్లను గాయపరుస్తూ ఎదుర్కొంటున్నాడు శ్రీరామ్.
ఈలోగా అశ్విని వెళ్ళి విష్ణుమూర్తి కట్లు విప్పేసింది. ఈ హరాత్పరిణామాలకు ఏం చేయాలో తోచక అలాగే ఓ పక్కగా నిలబడిపోయాడు హనుమంతు. గోపాలం రౌడీలకు తోడయ్యాడు సినిమాలో హీరోలాగా శ్రీరామ్ వాళ్ళందర్నీ ఓ ఆట ఆడిస్తూంటే విష్ణుమూర్తి అశ్వినీ అతనికి అండగా నిలబడ్డారు.
అంతలో బజర్ వినిపించింది. అశ్విని వెళ్లి తలుపు తీసింది రాజేంద్ర పోలీసుల్ని వెంట బెట్టుకుని లోపలకు వచ్చాడు. వాళ్లతో బాటు వీరభద్ర, చిదంబరం కూడా వున్నారు. వాళ్ళందర్నీ చూసిన హనుమంతూ, గోపాలం కాలికి బుద్ధి చెప్పబోయారు కానీ, రౌడీలతో పాటు వాళ్లను పట్టుకుని చేతులకు బేడీలు వేసి జీపులోకి ఎక్కించి తీసుకుపోయారు పోలీసులు.
"సమయానికి ఆ రౌడీల బారినించి కాపాడేవయ్యా అల్లుడూ. డబ్బులకోసం ఇకముందు నన్నెవరూ పీక్కుతినకుండా ణా యావదాస్తినీ ఇవాళే నీ పేరు రాసేసి 'రిజిస్టర్' చేయించేస్తాను." అభినందనపూర్వకంగా శ్రీరామ్ ని చూస్తూ చెప్పాడు విష్ణుమూర్తి.
"రాసేముందు నాకు రెండు లక్షలు ఇవ్వాలి?" అంటూ ముందుకొచ్చింది అశ్విని అందరూ ఆమెవైపు చూశారు.
"మేం సమయానికి ఇక్కడ కొచ్చి మిమ్మల్ని కాపాడు కోవటంలో మంగమ్మ సహాయం ఎంతో వుంది...తను ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించి, మీ సెల్ ఫోన్ దక్కించుకుంది ఇక్కడ జరిగేది నాకు వివరించింది అందుకే సమయానికి మేం ఇక్కడకు రాగలిగాం. కాబట్టి ఓ రెండు లక్షలు మంగమ్మకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను." చెప్పిందామె.
"అది సరే ఈ లోగా మీరు మీ పుత్రికకు 'సీమంతం' జరిపే ఏర్పాట్లు చూడండి." వీరభద్రం ముందుకొచ్చి చెప్పాడు.
"సీమంతమా?" విస్తుపోతూ అడిగాడూ విష్ణుమూర్తి.
"అంత 'ఓవర్' గా విస్తుపోవాల్సిన అవసరం లేదు మీ పుత్రిక చేతా, మా పుత్రుని చేతా కథలు చెప్పించి బెజవాడలో హనీమూన్ చేసుకోమ్మని ప్రోత్సహించినది తమరేనట కదా?" గతుక్కుమన్నాడు విష్ణుమూర్తి.
"దాని ఫలితమే ఇప్పుడీ సీమంతం!"
"భేష్ అయితే త్వరలోనే మీరు తాతగారైపోతున్నారన్నమాట!" వీరభద్రం భుజం తట్టాడు విష్ణుమూర్తి.
"మీతో బాటే!" వీరభద్రం కూడా విష్ణుమూర్తి భుజం తట్టాడు.
"అయ్యా! మీ భుజాల్ని అలా బాదుకోకండి. ఇంకో అయిదారునెలల్లో మీ మనవడు ఆ భుజాల మీదనే ఎక్కికూర్చుని తాతలిద్దర్నీ 'ధిత్తై తధికిణితోం' అంటూ భరతనాట్యం ఆడిస్తాడు." గొప్పగా చెప్పాడు నారాయణ.
అందరూ హాయిగా నవ్వుకున్నారు.
అశ్వినీ...శ్రీరామ్...మాత్రం కళ్ళతోనే ఏమిటేమిటో మాట్లాడేసుకుంటున్నారు.
(సమాప్తం)