• Prev
  • Next
  • Antera Bamardee 30

    This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

    30 వ భాగం

    వేణు ఆ వార్తలోని వివరాలు చెప్పడం ప్రారంభించాడు.

    "మొన్న మార్చి పదిహేనో తేదీన ప్రొప్రయిటర్ని కలుసుకునేందుకు పి.ఎ. వచ్చాడు!" ఇప్పుడు వేణు చెబుతున్న వార్తని తనపరంగా ఊహిస్తున్నందువల్ల బసవరాజుకి దృశ్యం కూడా కనిపిస్తోంది. అదట్టా నడుస్తోంది.

    బసవరాజు గదిలోకి పాణి వచ్చాడు. వచ్చీరాగానే తన జేబులోంచి ఎర్రటి జేబురుమాలు తీశాడు. దాంతో ఆ గదంతా సుగంధ పరిమళాల్తో నిండిపోయింది. బసవరాజు ఆ పరిమళానికి ముగ్దుడయ్యేడు. ఆ సెంటు వివరాలు అడిగాడు. పి.ఎ. తన జేబులోంచి సెంటు సీసా తీసి - ఒకసారి వాసన చూడమని బసవరాజుని కోరాడు.

    బసవరాజు ఆత్రంగా సీసా లాక్కుని బిరడా తీసి ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. అంతే బసవరాజు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ గదిలో వున్న ముఖ్యమైన డాక్యుమెంట్లుతో పాటు దొరికినంత డబ్బు కూడా తీసుకుని పారిపోయాడు పాణి. ఇప్పుడు మాస్కో పోలీసులు ఆ పి.ఎ. గురించి గాలిస్తున్నారు. నికోలోవ్ లో ప్రచురితమైన వార్తా మొక్క సారాంశం పూర్తిగా విని నిద్రావస్థ నుంచి బయటపడినట్టు అడిగాడు బసవరాజు.

    "ఆ పాణిగాడు మాస్కో పోలీసులకు ఇంకా దొరకలేదా?"

    "ఆ పి.ఎ. పేరు పాణి కాదు!"

    "అది నేను పెట్టుకున్న పేరు! ఇంతకీ ఆ హంతకుడు దొరికాడా! లేదా?"

    "ఆ వార్త రేపు వచ్చే పేపర్లో వుంటుంది. చూడాలి!"

    "అద్సరే! ప్రపంచంలో పి.ఎ.లంతా ఈ విధంగానే వుంటారా?"

    "మన పాణి పి.ఏ. కాదు గదా?"

    "ఎందుక్కాదు? అతన్నాకు అల్లాంటివాడే! మిస్టర్ వేణూ!"

    "చెప్పండి!"

    "పాణిని ఉద్యోగంలోంచి వెంటనే తీసేయ్!"

    "ఆ అధికారం నాకు లేదనుకుంటాను!"

    "నాకుంది గదా! కాగితం టైపు చేయించి తీసుకురా! సంతకం పెడతా! ఫినిష్."

    "కానీ ఉద్యోగంలోంచి తీసేస్తున్నందుకు రీజన్ కూడా రాయాలి! అది రూలు!"

    "వాడు రష్యావాడి మాదిరి ఎర్ర జేబురుమాళ్లు వాడుతుంటాడు!"

    "రీజన్ నెంబర్ వన్!"

    "వాడు నాకు అప్పుడప్పుడు సెంటు సీసాలిస్తుంటాడు."

    "పాయింట్ నెంబర్ టూ!"

    "వాడ్ని ఉద్యోగంలోంచి తీసేందుకు ఈ పాయింట్లు చాలు త్వరగా టైపు చేయించి తీసుకురా. ఈ క్షణం నుంచీ వాడి మొహం నాక్కనిపించ కూడదు."

    "ఒ.కె." అని వేణు లేచి నించున్నాడు.

    * * *

    ఆ రోడ్డు మీద రంగనాధం బఠాణీలు తింటూ నడుస్తున్నాడు. అతనికి కృష్ణమూర్తి ఎదురయ్యాడు. ఇప్పుడు కృష్ణమూర్తి చాలా ధైర్యంగా ఎంతో ధీమాగా వున్నాడు. కృష్ణమూర్తిని చూసి రంగనాధం పలకరించాడు.

    "ఎక్కడికో వెడుతున్నట్టున్నావ్?" రంగనాధాన్ని ఎగాదిగా చూసి అన్నాడు కృష్ణమూర్తి.

    "బఠాణీలు కొనుకుందామని బయలుదేరా." ఆ మాట వినగానే రంగనాధం తన దగ్గరున్న బఠాణీ పొట్లాన్ని దాచేసుకున్నాడు.

    కృష్ణమూర్తి మాటాడుతూనే వున్నాడు.

    "మమ్మల్ని చూడగానే పుట్టుకొస్తాయి మురికి డవుట్లు." రంగనాధానికి కోపమొచ్చింది.

    కోపంగానే అన్నాడు. "ఎక్కడికి వెడుతున్నావని అడిగాను అది మురికి డవుటా?"

    "పక్కవీధిలో అన్నదానం చేస్తున్నారని తెలిసి అడుక్కోడానికి వెడుతున్నా! ఇప్పుడు తృప్తిగా వుందా?" రంగనాధానికి విపరీతమైన కోపం వచ్చింది. బఠానీ పొట్లాన్ని విసిరిగొట్టి అన్నాడు.

    "అడుక్కో! బాగా అడుక్కో! ఎవడొద్దన్నాడు?

    " "అంతేమరి! మా ఇంటిల్లి పాదీ అదే పనిమీద వుంటాం. ఆరేళ్ళుగా అడుక్కుతింటూనే బతుకుతున్నాం. నేను తూర్పు దిక్కు వెళ్లి అడుక్కుంటా! మా ఆవిడ ఉత్తరం వైపు వెళ్లి అడుక్కుంటుంది. మా ఇద్దరు పిల్లలూ పడమర దక్షిణం చూసుకుంటారు. అడుక్కోవడమే మా వృత్తి. మీరంటే జమీందారులు కదా?" రంగనాధం రెచ్చిపోయి అంటున్నాడు.

    "యస్! నిజమే! ఒక్క జమిందారులమే కాదు ! మగధ మగధ దేశానికి మహారాజులం. నూటేడు ఏనుగులున్నాయి. పదివేల చెల్లర గుర్రాలున్నాయి. లెక్కకు మించి లొట్టిపిట్టలున్నాయి. ఎటొచ్చీ సిపాయిలే లేరు వాళ్ల కోసం వెతుక్కుంటూ రోడ్డెక్కాం" కృష్ణమూర్తి మరింత రెచ్చిపోయి అంటున్నాడు.

    "అంతే మరి! మిమ్మల్ని చూడగానే ఎంగిలి బీడీలు కాల్చే ఎంగిలి వెధవకూడా కింగుసైజు సిగరెట్టు లెవెల్లో చిందులు తొక్కుతాడు. గంజి తాగే సన్నాసి చికెన్ పలావు తింటున్నట్టు ఫోజు పెడతాడు. కాళ్లొత్తే నాయాలు పీకట్టుకుని మాటాడుతాడు. అంతేమరి. మా మొహాలు చూస్తే అందరికీ అలుసే మావి 'మాసు' ఫేసులు. మీవి 'క్లాసు' ఫేసులు. తళతళా మెరిసిపోయే ఫేసులు! పెట్రొమాక్సు దీపాలు మీరు! చందమామలు మీరు! అమ్మో మీ గురించి కామెంట్ చేసేదమ్ములు మాకెక్కడివి?" రంగనాధం ఓర్చుకోలేక అరిచాడు.

    "క్రిష్ణమూర్తీ!" "అంతమర్యాదగా ఎందుకూ పిలవడం? కిట్టిగా అంటే ఓయంటాం. ఎంగిలాకులు ఎత్తేయమంటే ఎగరేసుకుపోతాం! ప్రతిరోజూ మేము ఆ పనిమీదే వుంటాం! మీరంటే శ్రీ రంగనాధులు! సింగినాదాలు!" రంగనాధానికి ఓపిక నశించింది.

    చేతులు జోడించి కృష్ణమూర్తితో అంటున్నాడు "వద్దు నన్నొదిలెయ్!"

    "అమ్మో! అంత మాటనకండి! మీ మోచేతి నీళ్లు తాగి జీవిస్తున్న అల్పజీవులం మేము! మీక్కోపాలొస్తే కూరొండుకు తినేందుకు పనికొచ్చే కోడిపెట్టలం మేము! మీరు కన్నెర్ర చేస్తే మాడి మసైపోయే మట్టి పిడతలం మేము" అప్పటికే ఆ ఇద్దరి చుట్టూ అనేకమంది చేరిపోయారు. రంగనాధం కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.

    * * *

    బసవరాజు బంగళా. ఆ బంగళా ముందు కారు ఆగింది. బసవరాజు కారు దిగాడు. వేణు డ్రైవింగు సీటు నుంచి దిగాడు. ఇద్దరూ ఇంట్లోకి వస్తున్నారు. బసవరాజు అంటున్నాడు.

    "ఊ! ఇక్కడే అనుకున్నాను! రష్యాలో కూడా పెళ్లాలు చంపే మొగుళ్లున్నారన్న మాట."

    "ఆ వార్తా తాలూకు తాత్పర్యం అదే కదండీ. పైగా ఆ మొగుడికి అరవై ఏళ్లు."

    "ఇంచుమించు నా వయస్సే."

    "గుర్తుంచుకోండి."

    "గుర్తుంది లేవయ్యా! ఈ వయస్సులో పరస్త్రీ వ్యామోహం ఏమిటి నా పిండాకూడు!"

    "వ్యామోహం తప్పుకాదండీ! ఆ వ్యామోహంలో పడి కట్టుకున్న భార్యని పీక పిసికి చంపుతాడా?"

    "ఇదింకా టూమచ్! నిర్లక్ష్యం చేసేడంటే ఏమోలే అనుకుంటాం! పీక పిసికి చంపడమేమిటి దారుణంగా! ఈ పాయింట్లలో రష్యా కంటే మన ఇండియా బెటరు! ఫరెక్జాంపుల్ నన్నే తీసుకో."

    "అమ్మో! మీరు ఉత్తములండీ! పెళ్లాన్ని చంపే కిరాతకుల లిస్టులో మీరెందుకుంటారు? వుండరు!"

    ఆ మాటకి ముచ్చటపడి అంటున్నాడు బసవరాజు "నీకు చెప్పకూడదు గానీ మిస్టర్ వేణూ! నా వైఫ్ కూడా నాకు తగ్గట్టే "

    "ఉత్తమమ ఇల్లాలండి! ఆవిడ దేవత! మీరు దేవుడు."

    "అవునా? అంచేత ఇన్నేళ్ల మా సంసార జీవితంలో ఏ ఒక్కనాడూ ఆమె నన్ను అపార్థం చేసుకోలేదు! ఏ ఒక్కనాడూ ఆమెను నేను పల్లెత్తు మాట అననూలేదు! పాలూ నీళ్ల మాదిరి కలిసిపోయాం."

    అప్పటికి వాళ్లిద్దరూ హాల్లోకి వచ్చేశారు. అది గుర్తుచేయడం తన డ్యూటీగా భావించి అన్నాడు వేణు, "హాల్లోకి వచ్చేశాం! ఇక రష్యన్ పేపరు వార్త మరిచిపోవడం మంచిది."

    "అల్లాగే కానియ్!" వేణు హాల్లోనే ఆగిపోయాడు! బసవరాజు జానకీ అని పిలుచుకుంటూ ఆమె గదిలోకి నడుస్తున్నాడు. తన గదిలోకి భర్త రాగానే అతన్ని చూచి భయంతో వణికిపోతూ కెవ్వున అరిచింది జానకి. ఆ వింత చేష్టకి ఖంగుతిన్నాడు బసవరాజు.

    ఏం జరిగిందో ఊహించలేక అడిగాడు "ఏమైంది జానకీ? ఎందుకా పొలికేక?" అని ఆమె వైపు నడుస్తుంటే ఆమె గాభరాపడుతూ అంటోంది.

    "వద్దు! నా దగ్గిరికి రావద్దు! వెళ్లిపోండి!"

    "ఎందుకంత భయం? నేను జానకీ! నీ భర్తని!"

    "అందుకేనండీ! అందుకే భయపడుతున్నాను. మీకు చేతులెత్తి నమస్కరిస్తాను! నన్ను చంపకండి."

    ఆ మాట విని బసవరాజు బాగా షాకు తిన్నాడు.

    ఆశ్చర్యంగా అడుగుతున్నాడు.

    "నిన్ను నేను చంపడమా? ఎందుకు జానకీ ఎందుకు నిన్నెందుకు చంపుకుంటాను?

    "అడక్కండి! నన్నేమీ అడక్కండి. దయచేసి వెళ్లిపోండి. మీకు నచ్చిన మనిషితోనే కాపురం చేయండి. ఆమె కోసం నన్ను చంపకండి." అని గోడవారగా కూచుని మొహాన్ని చేతుల్లో దాచుకుని కుళ్లికుళ్లి ఏడుస్తోంది. బసవరాజు నిశ్చేష్టుడయ్యేడు. క్షణం గడిచినతర్వాత ఆటను అయోమయంగా హాల్లోకి వచ్చాడు. హల్లో వేణు కనిపించాడు.

    అతన్ని చూడగానే తెప్పరిల్లి అన్నాడు. "మిస్టర్ వేణూ!"

    "విన్నాను సార్! అంతా విన్నాను!"

    "నేను ఆమెను చంపుతానని ఎందుకు అనుకుంటోంది?"

    "పేపర్ వార్త సార్! రష్యన్ వార్త! ఆ వార్త యొక్క రియాక్షనిది! మనసు పాడుచేసుకున్నారు."

    "రష్యన్ వార్తా? అంటే నికొలోవ్ డెయిలీ జానకి కూడా చదివిందా? ఆమెకు రష్యన్ భాష రాదు గదా?"

    "మేడం చదవలేదు సార్! నా చేత చదివించుకుని అర్థం తెలుసుకున్నారు. మనసు పాడుచేసుకున్నారు."

    "అంటే అరవై ఏళ్ల వృద్ధుడు"

    "అక్రమ సంబంధం"

    "భార్య పీక పిసికి చంపడం ఆ వార్తేనా?"

    "అవును సార్! ఆ వార్తే!"

    "అయితే మాత్రం? ఎక్కడో రష్యాలో ఎవడో కోన్ కిస్కా గొట్టాంగాడు భార్య ప్రాణాలు తీస్తే ఇక్కడ ఇండియాలో నేను కూడా ఆ దౌర్భాగ్యుడి లాగానే అఘోరిస్తానని జానకీ ఎందుకు అనుకోవాలి? ఎందుకు వణికిపోవాలి? ఇన్నేళ్ల మా దాంపత్య జీవితంలో జానకి నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా?" బసవరాజుని బండబూతులు తిట్టే ఉద్దేశాన్ని కడుపులో దాచుకుని ప్రశాంతంగా అన్నాడు వేణు.

    "ఏం చెబ్తాం? కొందరంతే! అదోరకమైన వీక్నెస్సు మానసిక బలహీనత! చాలా దరిద్రమైన అతినీచమైన పరమ పాపిష్టి మెంటాలిటీ." బసవరాజు ఎంతో దిగులుగా అన్నాడు.

    "అంతేనంటావా?"

    "అనవలసింది ఇంకా చాలా వుంది."

    "వున్నాసరే! ఇంకేమీ అనకు!ఆ!" అని తన గదిలోకి వెళ్లబోతుండగా ఏదో నవల చదువుకుంటూ ఎదురైనా ఉమ తండ్రిని చూచి కెవ్వున అరిచి నవల పారేసి తన గదిలోకి పారిపోయి తలుపులు మూసుకుంది.

    (ఇంకావుంది)

    (హాసం వారి సౌజన్యంతో)

  • Prev
  • Next