• Prev
  • Next
  • అమ్మో అమ్మాయిలు 47

    Listen Audio File :

    ముగ్గురు మరాఠీలు సినిమాకి ఒంటరిగా తాను వెళుతున్న విషయం జయచిత్ర వినేలా కాస్త గట్టిగానే చెప్పాడు వ్యాకర్ణ. నీవన్నది అర్థమైంది అన్న గుర్తుగా జయచిత్ర గాజులు గలగలా లాడించింది. ఆడవాళ్ళ చేతికి చప్పుడయ్యే గాజులు తప్పక వుండవలెను అనుకున్నాడు వ్యాకర్ణ ఆ తర్వాత బామ్మగారితో కాసేపు కబుర్లు చెప్పి వచ్చేశాడు.

    వ్యాకర్ణ తన గదిలోకి వచ్చింతర్వాతపావుగంట ఆగి ఆబ్బులు కనుబొమల మధ్య విబూది కుంకుమ బొట్లతో వచ్చాడు. “ముఖ్యమంత్రి అయినతర్వాత వేయాల్సిన వేషాలు ఈలోపలే వేస్తున్నావు. మరి యింత ఆశ పనికిరాదు అబ్బిగా" అన్నాడు వ్యాకర్ణ. “గుడికెళ్ళి వస్తున్నాను. దేవిని దర్శనం బాగా అయింది.” గుంభనంగా చెప్పాడు అబ్బులు.

    వ్యాకర్ణ నవ్వాడు.

    అబ్బులు నవ్వాడు.

    “ఏమయిందిరా?” వ్యాకర్ణ అడిగాడు.

    “భక్తగణం ఈ రోజు యింట్లోనే పూజ భజన పాటలు చేస్తున్నారు కదా! ఎప్పుడూ వాళ్లగుమ్మంలో అడుగు పెట్టని నేను అడుగు పెట్టేసరికి అందరూ ఆనందం పట్టలేక తబ్బిబ్బయి నన్ను మర్యాదగా ఆహ్వానించి చాపమీద కూలేశారు. తాళాలతో గట్టిగా భజన పాటలు మొదలుపెట్టారు. ఆడ మగ పిల్లజెల్లా కలిపి పది పదిహేను మందిదాకా వున్నారు. బిందురేఖ దరిదాపుల్లో కనపడలేదు.

    రోట్లోతల దూర్చి రోకలి పోటుకి దడవటం ఏమిటని అలా కూర్చుంది పోయాను. భక్తగణం కళ్ళు మూసుకుని పాటలు పాడుతున్నారు. నేను మాత్రం పత్తి'కాయల్లా కళ్ళు తెరుచుకుని బిందురేఖ రాకకోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని కూర్చున్నాను. మూతపెట్టిన డేకిస గిన్నెతో బిందురేఖ వచ్చింది. అవి దేవుళ్ళ ఫోటోల దగ్గర వుంచింది. అమ్మయ్య అనుకుని గబుక్కున కళ్ళుమూసుకున్నాను.

    కొద్దిసేపు ఆగి కళ్ళు తెరిచే చూద్దును కదా ఆడవాళ్ళ పక్కన కూర్చునివుండి. బిందురేఖ కళ్ళు తెరిచి చూసినప్పుడల్లా నేను అలా గుడ్లప్పజెప్పి చూడటం చూసి "తప్పు కళ్ళు పోతాయి కళ్ళు మూసుకుని కూర్చోండి.” అన్నట్లు మూతిమీద నుంచి ముక్కుమీద దాకా వేలు వేసుకుని చూపులతోనే మందలించింది.

    కళ్ళజోడు తీసి చూపించాను. ముసిముసిగా నవ్వుకుంది. అలా వాళ్ళ భజన పాటలు అయిందాకా చూపులతో మాట్లాడుకున్నాము. ఇదీ బాగానే వుండి అనుకున్నాను. ఇంటికన్నా గుడిపదిలం అన్నారు. ఇలాంటి వాటికోసమే కాబోలు. భజన పాటల కార్యక్రమం పూర్తి అయింది. వీభూది ఒకరు, బొట్టు ఒకరు, కొబ్బరిముక్కలు ఒకరు, అలా తలా ఒకటి తీసుకుని భక్తులకి యిచ్చారు. తాత్కాలికంగా నా అవసరానికే అనుకో, నేను ఓ భక్తుడిని అయా కదా! నాకు యిచ్చారు. బిందురేఖ ప్రసాదం యిస్తుంటే, “ఫస్టాటకి పరమానందయ్య శిష్యులు" అనినెమ్మదిగా చెప్పి,

    “ప్రసాదం కొద్దిగా చాలు" అన్నాను వినేలా. ఎందుకంటే అందరి కళ్ళు మా మీదనే వున్నాయి అది జరిగింది నే చెప్పింది ఏమాత్రం గ్రహించుకున్నా బిందురేఖ పరమానందయ్య శిష్యులకి వస్తుంది ఇంక నీ విషయం చెప్పు" అబ్బులు అడిగింది చెప్పి అడిగాడు. నీ రొట్టె విరిగి నేతిపాకంలో పడిందిరా నాయనా! నా విషయమే అధ్వానంగా వుంది. దేవి దర్శనం లేదు, దేవత దర్శనం లేదు" అంటూ జరిగింది వివరించాడు

    వ్యాకర్ణ. “డోంట్ వర్రీ బ్రదర్! జయచిత్ర బామ్మ చాటు పిల్ల గతంలో అయితే మనం అద్దె అబ్బాయిలం జయచిత్ర చిన్న సైజు ఒనరమ్మ. నీ ముందుకి వాళ్ళ బామ్మఎదుటే వచ్చి ధాం ధూం అనేది. ఇప్పుడు మనం పెళ్ళిదాకా పోతిమి. ముహూర్తం కుదరంగానే జయచిత్ర మెడలో తాళి కడుతుంటివి. బామ్మగారు మందలించి వుంటారు. ఓ నెలాగితే మీ పెళ్ళి అవుతుంది.

    ఈ లోపల యిద్దరూ కలిసి ఇక ఇక లాడితే లోకం నవ్వుతుంది లాంటి పెద్దవాళ్ళ మార్కు మందలింపులు మందలించి వుంటుంది. బామ్మగారు ఎంత మంచిమారైనా ఛాదస్తం అంటూ ఒకటి ఉంటుంది కదా! మనకి మన వాళ్ళని కల్సుకోవాలని ఎలా ఉబలాట పడుతున్నామో వాళ్ళు అలాగే వున్నారు. ఆ రోజు యింట్లో ఎవరూ లేరుకదా అని మన రూమ్ కి వస్తే మనమేమో సరిగా మాట్లాడకపోతిమి.

    మనం యిప్పుడు చాలా తెలివిగా ఆలోచించుకుని జనం ఎక్కువగా రాని ఓ పాత పిక్చరు ఎన్నుకుని ఆ పిక్చర్కి వెళదాం రమ్మని కోడ్ భాషలో చెప్పాము. మన కాబోయే పెళ్ళాలు మనకన్నా తెలివి కలవాళ్లే హాలు దగ్గరకు వచ్చి కలుసుకుంటారు. ఓ రూపాయి వేరుశనగ కాయలు కొనుక్కుని జనంలేని హాలులో ఓ మూలగా ఇరువురు ఒదిగి కూర్చుని సినిమా పూర్తి అయిందాకా తెగ కబుర్లు చెప్పుకుంటూ పల్లీలు ఖర్చుచేసి రావచ్చు" వివరించాడు అబ్బులు.

    “అయితే వాళ్ళ పిక్చర్ కి వస్తారంటావ్?” వ్యాకర్ణ ఆశగా అడిగాడు.

    “తప్పక వస్తారు, వాళ్ళ కోసమైనా వాళ్ళు రావాల్సిందే. మన కెంత యిదిగా వుందో వాళ్ళకి అంత అడిగానే వుంటుంది. ఈ చాన్స్ పోనిచ్చుకోరు" గట్టిగా చెప్పాడు అబ్బులు.

    “నీ మాటలు విశ్వసించితిని బిడ్డా!” అన్నాడు వ్యాకర్ణ. “సంతసించితిని” అన్నాడు అబ్బులు.

  • Prev
  • Next