• Prev
  • Next
  • Abhimana Sanghaalu Pedudaam Randi

    అభిమాన సంఘాలు పెడుదాం రండి!

    *******************************************************************

    సుదర్శనం తన స్నేహితుడు రంగారావు ఇంటికి వెళ్ళాడు.

    “రావోయ్ రా...ఏంటిలా వచ్చావు ?”అని అడిగాడు రంగారావు.

    “ఊర్కే...నిన్ను చూసి చాలా కాలం అయింది కదా!చూసి పోదామని వచ్చా"చెప్పాడు సుదర్శనం.

    “ఏంటి మీ ఆఫీసు విశేషాలు ?అంతా సవ్యంగానే ఉంది కదా?నా పేరు ప్రమోషన్ లిస్టులో ఉంది. వచ్చేవారం ఇంటార్య్వూ ఉంది.బహుశా నాకు ప్రమోషన్ రావచ్చు "చెప్పాడు సుదర్శనం గర్వంగా.

    “ఏంటి అంత ఖచ్చితంగా చెప్ప్తున్నావు ?నీకేవరైనా యమ్మెల్లే తెలుసా ?”

    “లేదే"ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు సుదర్శనం.

    “పోనీ మినిస్టర్ తెలుసా ?”

    “ఊహు...తెలియదు "

    “పోనీ ,మినిస్టర్ కి బామ్మర్దో లేదా ఆ బామ్మర్దికి బామ్మర్దో తెలుసా ?”

    సుదర్శనం గుడ్లప్పగించి చూశాడు.

    “తెలియదు...ఎందుకలా అడుగుతున్నావ్?”ఎందుకలా అడుగుతున్నాడో చెప్పకుండా

    మళ్ళీ అడిగాడు రంగారావు.

    “పోనీ నీకు రాజకీయ నాయకులో లేదా వాళ్ళ బామ్మర్డులో లేదా వాళ్లకి వేలు విడిచిన

    మేనమామలో ఎవరు తెలుసో చెప్పు "

    “నాకెవ్వరూ తెలియదే "తెల్లమొహం వేస్తూ అన్నాడు సుదర్శనం.

    “ఒరేయ్ బాబిగా...ఓ మారిలా అద్దం పట్రమ్మా "లోపలికి చూస్తూ అరిచాడు రంగారావు.

    బాబిగాడు అద్దం తెచ్చి ఇచ్చాడు.

    “ఇదిగోనోయ్...ఈ అద్దం తీసుకుని అందులో ఓసారి నీ మొహం చూసుకో "

    “ఎందుకు ?”అయోమయంగా ప్రశ్నించాడు సుదర్శనం.

    “చెప్తా...ముందుగా చూసుకో " సుదర్శనం అద్దంలో మొహం చూసుకున్నాడు.

    “ఎలా వుంది నీ మొహం ?”కళ్ళేగరేస్తూ అడిగాడు రంగారావు.

    “బాగానే ఉందే "అన్నాడు సుదర్శనం అద్దంలోని తన ప్రతిబింబం కేసి చూసుకుంటూ.

    “ఎవరు నాన్న ఈ దేభ్యం మొహం ?”అని బాబిగాడు రంగారావుని అడిగాడు.

    “విన్నావా మా అబ్బాయ్ ఏమన్నాడో "అన్నాడు రంగారావు చిలిపిగా నవ్వుతూ.

    విన్నానన్నట్టు తలూపాడు సుదర్శనం.

    “ఏమన్నాడు ?”

    “దేభ్యం మొహం అని అన్నాడు "జవాబు ఇచ్చాడు సుదర్శనం.

    “మరిప్పుడు అద్దంలో మొహం చూసుకుని చెప్పు నీ మొహం ఎలా ఉందో ?”

    “దేభ్యం మొహంలానే ఉన్నట్టుంది "అన్నాడు నీరసంగా సుదర్శనం.

    “అద్గదీ...అందుకే నీకేమి తెలియదు.ఎవరూ తెలియకుండానే నీకు ప్రమోషన్ ఎలా వస్తుందని

    అనుకుంటున్నావ్ ?”

    “హి హి...దేభ్యం మొహం హిహిహి..”అంటూ చప్పట్లు కొడుతూ నవ్వాడు బాబిగాడు.

    సుదర్శనం బాబిగాడి వంక చూసి,ఒక్క క్షణం బిక్కమొహం వేసి అన్నాడు.

    “మరి నా పర్సనల్ రికార్డు అందరికంటే బాగుంది..నా సర్వీసు కూడా అందరికంటే ఎక్కువ.

    క్వాలిఫికిషన్ కూడా ఎక్కువ మరి నాకు ప్రమోషన్ ఎందుకు రాదు ?”అన్నాడు

    అయోమయంగా.

    “అందుకే నిన్ను దేభ్యం మొహం అన్నది.అవన్నీ ఉంటే సరిపోదు.మంచి రికమండేషను

    పట్టాలి. అప్పుడు నీకు ప్రమోషన్ వస్తుంది "అన్నాడు రంగారావు.

    “మరి నాకెవరూ తెలియదే.నువ్వే ఈ విషయంలో నాకు సహాయం చేయాలి "ఫ్రాధేయ

    పడుతూ అన్నాడు సుదర్శనం.

    రంగారావు కాసేపు ఆలోచించాడు.

    “నాకెవరూ యమ్మేల్లెలూ,మినిస్టర్స్ తెలియదే.ఎలా...ఎలా..”అన్నాడు.

    “బాగా ఆలోచించు.మినిస్టర్ కాకపోయినా వాడి బామ్మర్ధయినా పరువాలేదుగా "అన్నాడు

    సుదర్శనం.

    హఠాత్తుగా కెవ్వుమని అరిచాడు రంగారావు.

    “ఏంటి ఏమైంది ?”కంగారుగా అడిగాడు సుదర్శనం.

    “నువ్వు ముందు పద "లేచి చెప్పులు తోడుక్కుంటూ అన్నాడు రంగారావు.

    “ఎక్కడికి ?”

    “పదమన్నానా ?”కసురుకున్నాడు రంగారావు.

    సుదర్శనం లేచి రంగారావుని అనుసరించాడు.

    రంగారావు ఓ కిళ్ళీ కొట్టు దగ్గర ఆగాడు.

    “మంచి కిళ్ళీ తింటే అయిడియాలు బాగా వస్తాయన ఇక్కడ ఆగావ్.హిహి "అన్నాడు

    సుదర్శనం.

    “నీ బొంద..అదేం కాదు...ఈ కిళ్ళీ కొట్టాయన చేత రికమండేషన్ చేయిస్తే నీ పని

    జరిగిపోతుంది " చెప్పాడు రంగారావు.

    ఆశ్చర్యంగా చూశాడు సుదర్శనం.

    “కిళ్ళీ కొట్టువాడు చెప్తే పని కావడం ఏమిటి ?నీకేమైనా మతిపోయిందా ?”

    “ఎదురుగుండా ఉన్న ఫాన్సీ షాపులో ఓ అద్దం కొనుక్కుందాంరా...”అన్నాడు ఫాన్సీ షాపు

    వైపు అడుగులు వేస్తూ.

    “ఎందుకూ "

    “ఎందుకేమిటి ?నీ మొహం చూసుకుందువు గాని "పళ్ళు కొరుకుతూ అన్నాడు

    రంగారావు.

    “సరే..నాది దేభ్యం మొహమని ఒప్పికుంటున్నా.పోనీ నువ్వెందుకు అతని చేత

    రికమండేషన్ చేయించాలని అనుకుంటున్నావో చెప్పొచ్చుగా ?”అన్నాడు చికాకు పడుతూ

    సుదర్శనం.

    “అలా రా దారికి..మన ముఖ్యమంత్రి ఎవరూ ?”

    “చిన్న పిల్లల్ని అడిగినట్లు అలా అడుగుతావెం ?భీమారావు "చెప్పాడు సుదర్శనం.

    “భీమారావు కొడుకెవరు ?”కళ్ళేగరేసి చిలిపిగా నవ్వుతూ అడిగాడు.

    “చిన్నికృష్ణ !అయితే ఏమిటి ?”

    చిన్నికృష్ణ ఏం చేస్తాడు "

    “సినిమా హిరో !!”అసహనంగా చూస్తూ జవాబిచ్చాడు.

    “చిన్నికృష్ణ సూపర్ స్టార్ కదా!అతనికి బోల్డన్ని అభిమాన సంఘాలున్నాయి.ఆ అభిమాన

    సంఘాలకీ సెక్రట్రీలు,ప్రెసిడెంట్లు ఉంటారు కదా?వాళ్ళు మినిస్టర్ల దగ్గరికి వెళ్లి మేం చిన్నికృష్ణ

    అభిమాన సంఘానికి ప్రెసిడెంట్లమీ,సెక్రట్రమీ అని చెప్పుకుని ఆ పనీ ఈ పనీ చేసి పెట్టమని

    అడుగుతున్నారు.ముఖ్యమంత్రి కొడుకుగారి అభిమానులు చెప్పిన పని చెయ్యకపోతే

    ముఖ్యమంత్రి కొడుక్కీ,తద్వారా ముఖ్యమంత్రికీ కోపం వచ్చి తమ పదవులకే ఎక్కడ మోసం

    వస్తుందోనని భయపడి వాళ్ళ పనులు చేసి పెడుతున్నారు "చిద్విలాసంగా నవ్వుతూ

    చెప్పాడు రంగారావు.

    “అయితే ఈ కిళ్ళీ కొట్టాయనా...”అనుమానంగా చూస్తూ ప్రశ్నించాడు సుదర్శనం.

    “చిన్నికృష్ణ ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్.పేరు యాదగిరి.రా వాడికి నమస్కారం పెడదాం "

    ఇద్దరూ యాదగిరికి నమస్కారం పెట్టారు.

    “ఏం కావాలి ?సాదా కిళ్ళీనా,జర్దా కిళ్ళీనా,కలకత్తా రాం ప్యారీనా?..ఏం గావాలి సాబ్ "

    అడిగాడు యాదగిరి.

    రంగారావు వాళ్ళు వచ్చిన పని చెప్పాడు.

    “సిఫారసు కోసం వచ్చిండ్రా!మల్ల అట్ల కడక్ నించుని సలాం కొడ్తుండెంది ?వంగి వంగి

    సలాంలు కొట్టుండ్రి "అన్నాడు యాదగిరి కాస్త గీరిగా.

    రంగారావు,సుదర్శనం..వాడికి వంగి వంగి సంస్కారాలు చేశారు.

    “ఓ అయిదువేలు ఇస్తారా మల్ల ?”అన్నాడు యాదగిరి.

    “అయిదు వేలే.ఎందుకూ అంత ?”అన్నాడు సుదర్శనం.

    “అర్రె ఇస్కీ..మల్ల ఇవ్వోద్దా.ఇస్మంటి పైసలతోనే మేం చిన్నకృష్ణ సినిమాలు రిలీజ్

    అయినప్పుడు హాల్,టౌన్ డెకరేషన్ గిట్టజేస్తం"చెప్పాడు యాదగిరి.

    “పోనీ నాలుగు వేలు తీసుకో "అన్నాడు సుదర్శనం.

    “ఛల్ నీ యవ్వ.మీరే వేరే వాళ్ళకి ఓ రిక్ మైండ్ చైనీకే పది వేలిస్తార్.మాకు అయిదివ్వదానికీ

    ఏడుస్తార్.ఇగ నావల్ల కాదు పొండ్రి "అన్నాడు యాదగిరి మొహం చిట్లిస్తూ.

    రంగారావు యాదగిరి సుదర్శనం చేత అయిదువేలు ఇప్పిస్తానని నచ్చజెప్పి బుజ్జగించారు.

    “ఓ రెండువేలు అడ్వాన్సు ఇవ్వూండ్రి .మిగతాది పనయ్యాక "అన్నాడు యాదగిరి.

    ఆ సాయంత్రం యాదగిరికి రెండువేల రూపాయలు తెచ్చిచ్చారు.అయిపోయినట్టే మాట్లాడాడు

    యాదగిరి.

    సుదర్శనం ఇంటార్య్వూ అయిపొయింది.కానీ ప్రమోషన్ రాలేదు.నాలుగు రోజుల తరువాత

    యాదగిరి మొహం వేలాడేసుకుని చెప్పాడు.

    “చమించు సాబ్...మీ పని కాలే.అభిమాన సంఘాల పేరు జెప్పి అందరూ పన్లు

    చేయించుకుంటున్నారని మంత్రులందరూ పరేషాన్ అయినారు.ఎవరికీ నిజంగా చిన్నకృష్ణ

    అభిమాన సంఘం ఉందో లేదో తెలియదు.అందుకని చిన్నకృష్ణ అభిమాన సంఘాలకీ

    గుర్తింపు కార్డులు ఇమ్మని ముఖ్యమంత్రి చెప్పిండ్రు.కొన్ని అభిమాన సంఘాలకీ గుర్తింపు

    కార్డులు ఇచ్చిండ్రు.ఆ కార్డు చూపి మంత్రులైన పన్లు చేయించుకోవచ్చు.నాకు ఆ గుర్తింపు

    కార్డు ఇవ్వలే..అందుకని మీ పని కాలే...”అన్నాడు.

    “మరి నా రెండువేలు అడ్వాన్సు మాట "అని అడిగాడు సుదర్శనం.

    “ఇంకెక్కడి అడ్వాన్సు సాబ్...అల్లకీ ఈల్లకీ పార్టీలిచ్చేటాన్కి సరిపోయింది "అన్నాడు యాదగిరి.

    సుదర్శనం నోరెళ్ళబెట్టాడు.

    సుదర్శనం సంగతి ఎలా ఉన్న గుర్తింపు కార్డులున్న అభిమాన సంఘాల ప్రెసిడెంట్లు,

    సెక్రట్రీలు మాత్రం వాళ్ళ పనులూ వీళ్ళ పనులూ చేయించి పెట్టి లక్షలు సంపాదిస్తున్నారు.


  • Prev
  • Next