TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఆహా నగర్ కాలనీ
సూరేపల్లి విజయ
20 వ భాగం
"రివాల్వర్ రాంబో అనే ఈ నిందితుడు తన రివాల్వర్ తో ఎంతో మందిని బెదిరించి, చిన్న చితకా దోపిడీలు చేసాడు. బఠానీలు, కోసం ముద్దుల కోసం, చొక్కా గుండీ కుట్టించడం కోసం, చేసిన నేరాలను ఇండియన్ పీనల్ లో ప్రత్యేక సెక్షన్ లేనందువల్లనూ, నిందితుడు తన తప్పును ఒప్పుకోవడం వల్లనూ, ఏదో ఓ మూల నాకు భయం పీకుతుండడం మూలంగానూ, సదరు రివాల్వర్ రాంబో అనే వ్యక్తిని...నగరం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించడమైంది. ఇతనికి నగర బహిష్కారమే సరైన శిక్ష...నేను బ్రతికి వున్నంత వరకూ ఇతను ఈ నగరంలో ప్రవేశించకూడదు" తన తీర్పు చదివి వినిపించాడు. రివాల్వర్ రాంబో తన తీర్పు చదివి వినిపించాడు.
రివాల్వర్ రాంబో తన రివాల్వర్ బ్యారెల్ మొనతో జుట్టుని వెనక్కి తూసి..... "థాంక్యూ మిలార్డ్ .... నాక్కూడా ఈ నగర జీవితమ్మీద విరక్తి పుట్టింది. హాయిగా నా శేష జీవితాన్ని మరో దగ్గర ప్రారంభిస్తా....." అన్నాడు.
పోలీసులు రివాల్వర్ రాంబో కాళ్ళకూ, చేతులకూ వున్న సంకెళ్ళు విప్పదేసారు. ఓ సారి ఒళ్ళు విరుచుకొని, తన రివాల్వర్ ని ముద్దు పెట్టుకున్నాడు. "రివాల్వర్ రాంబో గారూ....మీరిప్పుడు ఎప్పటికి వెళ్దామనుకుంటున్నారు?" అడిగాడు విలేకర్లు ఆత్రుతగా.
ఆ...హా...న....గ...ర్...కా....ల...నీ...కి. చెప్పి వడివడిగా ముందుకు కదిలాడు రివాల్వర్ రాంబో.
* * *
లస్కుటపా బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలు. సెట్ చంపుతాలాల్....పాన్ బ్రోకర్....అని చిన్న చిన్న అక్షరాలు. గల్లా పెట్టి దగ్గర కూచొని డబ్బులు లెక్కపెడుతున్నాడు. గల్లా పెట్టి ఎదురుగా పెద్ద హాలు....గ్లాస్ డోర్ వుంది. హాలు మొత్తం గ్లాసులతోనే తయారయింది.
ఆ హాలులో వరుసగా ఇరవై కుర్చీలు వున్నాయి. కొన్ని కుర్చీల్లో మనుష్యులు వున్నారు. కాళ్లు బార్లా జాపుకొని కూచున్నారు. వాళ్ళమెడలో బోర్డులు వేలాడుతున్నాయి. వాటి మీద నెంబర్లు ఉన్నాయి.
విచిత్రనగర్ కాలనీలో బంగారానికి, ఇతర వస్తువులకే కాక, మనుష్యులను తాకట్టు పెట్టుకొని వజ్రాలను ఇచ్చే ఏకైక పాన్ బ్రోకర్ సేట్ చంపుతాలాల్. అర్జంటుగా డబ్బు అవసరమైన వాళ్లు, ఎవరో ఒకరిని తాకట్టు పెట్టుకొని, డబ్బు తీసుకుపోవచ్చు.
అయితే, వాళ్లకు టిఫిన్, లంచ్ మాత్రం తాకట్టు పెట్టిన వాళ్ళే అరేంజ్ చేయాలి. డిన్నర్ మాత్రం సేట్ చంపుతాలాల్ అరేంజ్ చేస్తాడు. అందుగ్గానూ, తాకట్టు పెట్టబడిన మనుష్యులతో, పనులు చేయుంచుకుంటాడు.
వడ్డీకి తీసుకున్న డబ్బులు కట్టి, మనుష్యులను విడిపించుకు వెళ్ళవచ్చు. సరిగ్గా, పదిన్నర అవుతుండగా, బాబ్లూని తీసుకొని, సుడిగాలిలా దూసుకు వచ్చింది సూరిబాబు పెళ్ళాం. "అయియేమేమే సాబ్....అయియే....కూల్ డ్రింకు తాగుతారా....కాఫీ తాగుతారా?" "కాదు....షారుఖాన్ ని తింటాను" అంది.
ముందుగా తెల్ల మొహం వేసి, వెంటనే పగలబడి నవ్వి 'క్యా మేడమ్....మీరు బహుత్ అచ్చా జోకులు వేస్తారు' అన్నాడు. 'అవును....అప్పుడప్పుడు కార్టూన్లు కూడా వేస్తాను గానీ, నాకు అర్జంటుగా ఓ అయిదొందలు కావాలి....." అంది.
'అలాగా...' అని వెంటనే ఉలిక్కిపడి, ఆమె చుబుకం వంక చూసాడు.
"లేకపోతే ఏంటి? సిటీలో స్టార్ నైట్ వుందిట. డోనర్ పాస్ కు అయిదువందలట.....నేను అర్జంటుగా వెళ్ళాలి.'
'తాకట్టుకు ఏమీ తెచ్చాను" అంది సూరిబాబు పెళ్లాం.
సేఠ్ చంపుతాలాల్ బబ్లూ వంక చూసాడు. బుద్ధిగా నోట్లో వేలు వేసుకుని ఉన్నాడు.
"బుద్ధిగా ఉంటాడా? మరీ చిన్న పిల్లకాయ కదా....నన్ను సతాయిస్తాడేమోనని....'
'అయితే వద్దులెండి.... సేఠ్ తంతాలాల్ దగ్గరికి వెళ్తాను. అతడీ మధ్య మా యింటికి వచ్చి, మాకూ బిజినెస్ యివ్వండి మేడమ్" అని బ్రతిమిలాడాడు." అంది లేవబోతూ.
"అయ్యయ్యో...అంతా గుస్సా అయితే ఎట్టా మేమ్ సాబ్...." అని బబ్లూ వైపు తిరిగి.... 'మేరా ప్యారీ బచ్చా....ఆప్ కే నామ్ క్యాహై' అడిగాడు అతని బుగ్గగిల్లి.
'నాకు సిగ్గేస్తోంది' అన్నాడు బబ్లూ.
'బహుత్ అచ్చా....' అని గల్లా పెట్టెలో నుంచి అయిదు వంద రూపాయల కాగితాలు తీసి సూరిబాబు పెళ్ళానికి ఇస్తూ...రోజుకు అయిదు రూపాయల వడ్డీ....వారం రోజ్జుల్లో మీకీ బాబుని విడిపించుకొని వెళ్ళండి' అన్నాడు.
'ఎందుకు సేఠ్ జీ....రేపు మా ఆయన జీతం రాగానే విడిపించుకొని వెళ్ళనూ...జాగ్రత్త సేఠ్ జీ... మా వాడు అసలే అమాయకుడు...." అంది.
"మీకీ బచ్చాకీ మేము బహుత్ బాగా చూసుకుంటాం. ఆప్ ఫికర్ మత్ కరో...అని బబ్లూ మెడలో పదమూడు అన్న బోర్డు వేసి, పద....' అన్నాడు.
బబ్లూ బుద్ధిగా వెళ్లి గ్లాస్ హాలులో ఉన్న పదమూడో నెంబర్ కుర్చీలో కూచున్నాడు. సూరిబాబు భార్య వెళ్తూ వెళ్తూ కొడుకు వైపు చూసింది.