• Prev
  • Next
  • Aahanagar Colony 16

    ఆహా నగర్ కాలనీ

    సూరేపల్లి విజయ

    16 వ భాగం

    "ఏం చేసానంటావా? నేనేం పాపం చేసానని నాకీ శిక్ష వేసావే? ఏడుపు గొంతుతో అడిగాడు సూరిబాబు.

    "ఓస్...అవునమ్మీ....మరిచేపోయాను. రాత్రి స్టీలు సామానువాడు వచ్చాడు. వాడి దగ్గర కొత్త సినిమా టికెట్ ఒకటి వుందట.

    పాత బట్టలు వేస్తే స్టీలు బదులు ఆ టికెట్ యిస్తానన్నాడు....అందుకని సిగ్గులోలుకుతూ చెప్పింది.

    "ఛీ...ఛీ...ఈ అండర్ వేర్ కూడా ఇచ్చేయకపోయావా? దిశమొలతో వేమన కజిన్ లా వుండేవాడిని...." కోపంగా అన్నాడు సూరిబాబు.

    "ఇచ్చానండీ...వాడి సైజు కాదట....వద్దులే అమ్మా...." అన్నాడు.

    "అంటే యిది కూడా....ఛీ....ఛీ..." అని, దుప్పటిని లుంగీలా చుట్టుకొని.... "రేపట్నుంచి లుంగీకి కూడా తాళం వేసుకొని పడుకుంటాను"

    అన్నాడు సూరిబాబు.

    "అబ్బ...మీరు మరి చిలిపి ....అన్నట్టు మన కామాక్షి లేదు..."

    "మన కామాక్షి ఏంటి? బ్యాడ్ మీనింగొస్తుంది. మీ ఫ్రెండ్ కామాక్షి కదా....వుంది...అయితే ఏంటి?"

    "దానికి పట్టుచీరల పిచ్చి అని మీకు తెలుసుకదా...."

    "అయితే, ఆ విషయం నాకెందుకు చెబుతున్నట్టు? అర్ధంగాక అడిగాడు సూరిబాబు.

    "మొన్న అడిగితే,

    "ఛస్...యిప్పుడు కుదర్దు..." అన్నాడట"

    "మంచిపని చేసాడు." తృప్తిగా అన్నాడు సూరిబాబు.

    "దాంతో దానికి ఒళ్లు మండింది."

    "పోనీ బర్నాల్ రాసుకోమనలేకపోయావా?" ఏకసక్కెంగా అన్నాడు సూరిబాబు.

    "అంతకన్నా తెలివైన పనే చేసింది."

    "ఏం చేసిందేమిటి? కొంపదీసి సూసయిడతే చేసుకుంటానని బెదిరించలేదు కదా...."

    "ఊహు..."

    "మరేం చేసింది?"

    "సెట్ చంపుతాలాల్ తెలుసుగా."

    "తెలుసు...లస్కుటపా పాన్ బ్రోకర్."

    "వాడి దగ్గర కొడుకుని తాకట్టు పెట్టింది."

    "ఏంటీ కొడుకునే..."నోరు తెరిచేసాడు సూరిబాబు.

    "అవును....పొద్దున, మధ్యాహ్నం టిఫిన్, భోజనం, ఈవిడ ఇవ్వాలట. నైట్ డిన్నర్ అతనిస్తాడట....నెలకు వడ్డీ నూటికి నలబై రూపాయల వడ్డీ అట....సంవత్సరంలోగా వాడిని విడిపించుకోవాలట....చిన్న చిన్న పనులు వాడిచేత చేయిస్తాడట."

    "మరి, కామాక్షి మొగుడు ఊర్కున్నాడా?"

    "లేదు."

    "పెళ్ళాన్ని చితకతన్నాడా?"

    "అదేం కాదు...డబ్బులు కట్టి కొడుకుని విడిపించుకొచ్చాడు. తిక్కకుదిరింది" కసిగా అంది సూరిబాబు భార్య.

    "భార్య వంక భయంగా, అనుమానంగా చూసాడు.

    "అదేమిటండీ....నావైపు అలా చూస్తారు.?"

    "ఇదంతా నాకెందుకు చెబుతున్నట్టు?"

    "జస్ట్....జనరల్ నాలెడ్జ్ కోసం...." అంది కిచెన్ లోకి వెళ్తూ.

    సూరిబాబు గుండెల్లో హై - జాకయిన ఇండియన్ ఎయిర్ లైన్ విమానం వెళ్తున్న ఫీలింగ్.

    * * *

    ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది నమ్రత. ఎదురుగా తల్లి. "నువ్వా అమ్మా....నువ్వెప్పుడొచ్చావు?"

    "నా ఖర్మగాలి...నువ్వు ఐలవ్యూ జేమ్స్ బాండ్ అని నన్ను వాటేసుకున్నప్పుడు...."

    "అయినా నేను కలలు కనేప్పుడు నా గదిలోకి ఎందుకు వస్తావు? అంది నమ్రత.

    "నువ్వేటైంలో కలలు కనేప్పుడు నా గదిలోకి ఎందుకు వస్తావు? అంది నమ్రత.

    "నువ్వేటైంలో కలలు కంటావో.....ఓ టైం టేబుల్ రాసి, నీ గది ముందు అంటిచేస్కో...." అంది రుసరుసలాడుతూ చారుమతి.

    "అబ్బో....మీ మమ్మీ పెళ్ళికాక ముందు, నా ఫోటో తలదిండు కింద పెట్టుకొని నిద్రపోయేదట....." ఎప్పుడొచ్చాడోగానీ, తల్లీకూతుళ్ల మధ్యదూరి అన్నాడు సియస్సార్.

    "అవునవునని....రాత్రుళ్ళు రాక్షసుల ఫోటోలు పెట్టుకుని పడుకుంటే మరేదయ్యం కలలోకి రాదని...." రిట్టార్టి చ్చింది చారుమతి. మళ్లీ యిద్దరి మధ్య వార్ మొదలైంది. అర్దమై చెవులు మూసుకుంది నమ్రత.

    "ఛీ...." అని మొగుడి వైపు చూసి బయటకు నడిచింది చారుమతి.

    "నేను కూడా రెండు చీ - లు అని తనూ బయటకు నడిచాడు సియస్సార్.

  • Prev
  • Next