వదిలి ఉండలేక!

 

వదిలి ఉండలేక!

సుబ్బారావు ఆసుపత్రిలో ఒళ్లంతా కట్లతో ఉన్నాడు. అతణ్ని చూడ్డానికీ, చూసి పరామర్శించడానికీ ఒకొక్కరే వస్తున్నారు. వచ్చినవారు సుబ్బారావుని ఓదార్చి ఓ రెండు చుక్కల కన్నీరు కార్చి బయల్దేరుతున్నారు. కానీ సుబ్బారావు ప్రాణ మిత్రడు సూర్యారావు మాత్రం విడవకుండా అతని పక్కనే ఉన్నాడు. ఒక నాలుగు రోజులు గడిచిన తరువాత సుబ్బరావు ఓపిక తెచ్చుకుని తన ప్రాణమిత్రునితో ఇలా అన్నాడు..

‘ఒకే సూర్యం! మనం ఇద్దరం చిన్నప్పుడు ఒకే ఊరిలో పెరిగాము. కలిసి చదువుకున్నాం. కలసి కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లాం. కలిసి వ్యాపారం చేసి దివాళా తీశాం. అయినా నన్ను విడిచి నువ్వు ఉండనేలేదు!’ అంటూ పాత విషయాలు గుర్తుకుతెచ్చుకున్నాడు సుబ్బారావు.

‘అవునవును! మన స్నేహం అలాంటిది మిత్రమా!’ అన్నాడు సూర్యారావు ఆనందభాష్పాలు రాలుతుండగా.

‘వ్యాపారం దివాళ తీశాక కూడా మనం కలిసే ఉన్నాము. మన బాధని మర్చిపోవడానికి కలిసి తాగేవారం. కలిసి ఉద్యోగం వెతుక్కున్నాము. జీతాలు సరిగా రావడం లేదని కలిసి రాజీనామా చేశాము. జీవితంలో నువ్వు నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉన్నట్లు నాకు గుర్తుకు రావడం లేదు’ అన్నాడు సుబ్బారావు కన్నీళ్లతో.

‘అబ్బే అవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తు తెచ్చుకుంటావు మిత్రమా! నిజంగానే నిన్ను వదిలి నేను ఉండలేను తెలుసా!’ అంటూ ఓదార్చాడు సూర్యారావు.

‘అదే కదా నా బాధ! నువ్వు నన్ను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా బతకనివ్వలేదు. చదువు చెట్టెక్కించావు. వ్యాపారం దివాళా తీయించావు. ఉద్యోగంలో రాజినామా చేయించావు. ఇక చివరి క్షణాల్లో కూడా నన్ను వదిలిపెట్టేట్లు లేవు’ అంటూ మంచం దిగి పరుగులు పెట్టాడు సుబ్బారావు.