Varsham

వర్షం నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టం. అసలా మాటకొస్తే - వర్షం అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో. తల దాచుకోవడానికి ఓ కప్పు అంటూ ఉన్న ప్రతి వాడికీ వర్షం హర్షం అనిపిస్తుంది. కానీ, కొన్ని లక్షలమంది ఫుట్ పాత్ మీద తల దాచుకునే అభాగ్య జీవులకు - వర్షం కలిగించే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఈ దురదృష్ట జాతకులకి కూడా మంచి రోజులు వచ్చి, వారందరికీ - రోటీ, కపడా, మకాన్ దొరకాలని నా ఆశ, ప్రార్ధన. దేన్నయినా ఓకే దృక్పథంతో జీవితమంతా చూడలేరు ఎవరయినా. వయసు పైబడుతున్న కొద్దీ - ఆలోచనల్లో, పరిశీలనలో అవగాహనలో మార్పులొస్తాయి. చిన్నవయస్సులో ఒక రకంగా తోచినవి, పెద్దయిన తర్వాత మరో రకంగా అనిపిస్తాయి. నా కాలేజీ రోజుల్లో, మా నాన్నని చూసి "అబ్బ తినేస్తున్నాడు రా బాబూ - నా గురించి అతిగా పట్టించుకుని - ఎందుకీయన కింత టెన్షన్" అనుకునే వాడిని. ఇపుడు, నా సుపుత్రుడు కాలేజీ కొచ్చే సరికి నేను ఎగ్జాక్ట్ గా మా నాన్న లాగానే ప్రవర్తిస్తున్నానని మా వాళ్ళంతా అంటుంటారు. సరే - ఈ సోదంతా ఎందుకంటే - వర్షం గురించి చిన్నప్పుడు ఓ రకంగా - ఇప్పుడు ఓ రకంగా అనిపిస్తుంది. చిన్నప్పుడు వర్షం వచ్చే ముందు కమ్ముకునే కారు మేఘాలని చూస్తుంటే ఎంత ఆనందమేసేదో! ఆ మేఘాలు ఏదో పనున్నట్లు అర్జెంట్ గా అటూ ఇటూ పరిగేడుతున్నట్లు అనిపించేది. ఆడుకునే వేళలో వర్షం మొదలయితే, ఆనందం ద్విగుణీకృతం. ఎందుకంటే అమ్మావాళ్ళు అరవక ముందే ఎంచక్కా తడిసే అవకాశం. వర్షం వచ్చిందంటే మా సీతారామయ్య బడి సెలవు ఆరోజు. చూరులోంచి నీళ్ళు కారేవి. చిన్నచిన్న కాలవలు చేసి వాటిల్లో పడవలు వదలడం వర్ణనాతీతమైన అనుభూతి. కత్తి పడవలు అని ఉండేవి.

అంటే పడవకి కింద భాగంలో కత్తిలాగా ఉండేది. ఆ పడవల తయారీలో కొంతమంది experts వుండేవాళ్ళు. వాళ్ళు తీసే క్లాసులు, వేసే ఫోజులు చూడాల్సిందే. వర్షంలో తడవకుండా, బుద్ధిగా ఇంట్లో కూచోడానికి మా అమ్మ లంచం పెట్టేది. బెల్లం - అటుకులో, సెనక్కాయలో. మరీ అమ్మ మూడ్ బాగుంటే అడపా దడపా బజ్జీలు, పునుగులు. మెడికల్ కాలేజీలో చదివే రోజుల్లో సైకిల్ మీద లేక స్కూటర్ మీద వెళ్తూ, వర్షంలో తడవడం ఒక మాదిరి ఇబ్బందిగానే ఉండేది. అదే వయసుతో పాటు, చిన్నచిన్న ఆనందాలని కూడా కోల్పోతాం అన్నదానికి నిదర్శనం. అపుడు ఎంచక్కా వర్షంలో తడవకుండా కారులో వెళ్ళే వాణ్ణి చూసి తెగ కుళ్ళేసేది. 'మనం కారు ఎప్పుడు కొంటామా' అనుకుంటూ, వర్షపు నీళ్ళని కసిగా మింగేసే వాడిని. ఈ సందర్భంగా కారు యజమాన్లందరికీ నాదో వినతి. వర్షంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు దయచేసి చిన్నగా చేయండి - మీకోసం కాదు - చుట్టుపక్కల జనుల మీద నీళ్ళు పడకుండా. వర్షాన్ని మన తెలుగు సిన్మాల్లో తెగ కసిగా, చాలామంది రసిక సామ్రాట్టులు వాడుకున్నారు. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. బక్కెట్ల తోటి నీళ్ళు పోసి వర్షం సృష్టిస్తారని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను ఆరోజుల్లో. వర్షం - హీరోయిన్ తెల్ల డ్రెస్ - నానా భంగిమలు - ప్రేక్షకుల మదిలో గిలిగింతలు. ప్రతి సిన్మాలో ఓ వానపాట ఉండాల్సిందే. అసలు నన్నడిగితే - 30 ఏళ్ళ క్రింద తెలుగు సిన్మా వాన పాట కంటే అభ్యంతరమటండీ - నేటి గేర్ - శిల్పాశెట్టి కిస్సు. ఈ మధ్యే వర్షాన్ని డైరెక్ట్ గా టైటిల్ లోనే బిగించేసి, 'ఎన్నాళ్ళకు గుర్తొచ్చానే వానా' అంటూ హీరోయిన్ తో పాడించేసి బ్రహ్మాండమైన హిట్ కొట్టారు మన సిన్మా నిర్మాతలు.

ఈ 'వర్షం' సిన్మాలో వర్షం గురించి సీతారామశాస్త్రి గారు వ్రాసిన పదాలు - ఆయన కవితా పటిమకు అద్దాలు. 'వలపు వాన ధారలే పంపుతున్నది ఆకాశం - చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం - తడిపీ తడిపీ, తనతో నడిపీ, హరివిల్లును వంతెన వేసిన శుభవేళ - ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం'. - శాస్త్రిగారూ మీకు మా జోహార్లు. మాలాంటి వీరాభిమానులు వేసే వీరతాళ్ళకు రెచ్చిపోయి, అదే శాస్త్రిగారు, ఈ మధ్యే ఇంకో సిన్మా, 'వాన' లో మరిన్ని ఆనందపు చినుకుల్ని చిలకరించారు. సిన్మా మంచి Hill station లో తీశారు. అద్భుతమైన ప్రకృతి అందాలు, ప్రతి ముఖ్యమైన scene కి వాన backdrop, దానికి తోడు శాస్త్రిగారి కవిత్వపు చిరుజల్లు, కార్తీక్ గాన మాధుర్యాల హరివిల్లు. మనసు గుబాళించడానికి ఇంకా ఏం కావాలండీ? Hero, Heroine ఎవరా? వాళ్ళనెవరు పట్టించకున్నారండీ బాబూ. “ఆకాశగంగా - దూకావే పెంకితనంగా - ఈ పాట కోసమన్నా ఆ సిన్మా మీరు చూసితీరాల్సిందే. అలా మనం ఫ్లాష్ బాక్ లోకి వెళ్తే 'చిటపట చినుకులు పడుతూ వుంటే - చెలికాడే సరసన ఉంటే - చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి' అని ఆత్రేయ గారు రాసిన పాట ఈ మధ్యే మళ్ళీ గుర్తొచ్చింది. హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో వర్షం మొదలవగానే చెట్టు నీడ కోసం పరిగెట్టే జంటను చూసి - ఆత్రేయగారి అద్భుతమైన కవితా శైలి మరోసారి నా మనో ఫలకంలో ఆవిష్కరించుకున్నాను. చివరగా ఓ చిన్న అబ్జర్వేషన్ మీతో పంచుకుని - ఈ నా భావాల వానజల్లుకు గొడుగు పట్టేద్దాం. ఆరోజుల్లో వాన పడ్డ తర్వాత మట్టి వాసన గురించి తెగ చెప్పేవారు - రాసేవారు. కానీ ఇపుడు వాన పడ్డ తర్వాత వచ్చే కంపు గురించి మటుకు నేను రాయను. మీ అనుభవానికే వదిలేస్తున్నాను.