వర్షార్పణం...

వర్షార్పణం...

పద్మశ్రీ

“ఏమయిందిరా....?”

“ఉద్యోగం పోయింది......!”

“ఎందుకురా.....?”

“వర్షం పడింది....!”

“వర్షం పడితే ఉద్యోగం పోవడమేమిట్రా.....!”

“హైదరాబాదులో అంతే....!”

“నీకేమయిందిరా...?”

“కాలు విరిగింది....”

“ఎలా విరిగింది....?”

“వర్షం పడింది....!”

“వర్షం పడితే కాలు విరగడమేమిట్రా....”

“హైదరాబాదులో అంతే....!”

అబ్బా... అసలు నాకు వివరంగా చెప్పండి...

“ఏం చెప్పమంటారండీ... మా బాధ... ఉదయం ఎనిమిదిం పావుకి ఆఫీసుకు బయలుదేరాను.... కొంచెం దూరం వెళ్ళగానే సరిగ్గా పది నిమిషాలు వర్షం కురిసింది... అంతే... ఆ పది నిమిషాల వర్షం నా జీవితాన్నే మార్చేసింది...”

“కేవలం పది నిమిషాలు కురిసిన వర్షం అంత డామేజ్ చేసిందా....? నేనొప్పుకోను...?”

“హు.... అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ బాధ....”

“వివరంగా చెప్పు....”

“వర్షంలో నిండా తడిసిపోయాను.. బట్టలన్నీ తడిసి ముద్దయిపోయాయి.. జేబులో ఉన్న సెల్ ఫోన్ తడిసిపోయింది”.

“అబ్బా... వర్షంలో తడిస్తే అన్నీ తడిసిపోతాయి.. ముందు విషయం చెప్పు”

“అసలు కథ ఇప్పుడే మొదలయింది....”

“ఏమయింది...?”

“బైకు కనిపిస్తుంది కానీ... రోడ్డు మాయమయింది....”

“అదేమిటి....?”

“అంతే.... వరదనీరు వచ్చి రోడ్డుని కప్పేసిందన్నమాట....”

“బైకే కదా... రోడ్డుపై నీళ్ళుంటే ఏంటీ....? చక్కగా వెళ్ళిపోవచ్చుగా....?”

“కొద్దిగా వుంటే ఫర్వాలేదు.... మోకాళ్ళలోతు నీటిలో బైక్ ని ఎలా ముందుకి పోనివ్వగలం....”

“ఛ... ఊరుకో... పదినిమిషాలు వర్షం పడితే రోడ్డుపైకి మోకాళ్ళలోతు నీళ్ళు వస్తాయా....?”

“ఎక్కడయినా రావేమో కానీ... హైదరాబాదులో వస్తాయి....”

“ఈ విషయం పై అధికారులకి. పొలిటికల్ లీడర్లకీ ఫిర్యాదు చేయెచ్చుగా...”

“అదీ జరిగిపోయింది... రోడ్డుపై నీళ్ళుంటే ఎలా వెళ్ళేది అని అడిగితే ఏం చెప్పారో తెలుసా...?”

“ఏం చెప్పారూ....?”

“ఆ నీరుని మళ్ళించడానికి హైదరాబాదులో ఏముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు...?”

“అంటే....?”

“విశాఖపట్నంలో ఉన్నట్లు ఇక్కడేమయినా సముద్ర ముందా... విజయవాడలో ఉన్నట్లు కృష్ణానది ఉందా, రాజమండ్రిలో ఉన్నట్లు గోదావరి నది ఉందా....? ఉన్న మూసీనది మూసుకుపోయింది.... ఇంక నీళ్ళు ఎక్కడికి పోతాయి....? నోరుమూసుకుని నీళ్ళలో పొర్లుకుంటూ వెళ్ళండేహే... అన్నారు”

“అరె.... రోడ్డుపై ఉన్న నీటిని మళ్ళించడానికి విశాఖపట్నం సముద్రం, కృష్ణా, గోదావరి నదులతో పనేముందయ్యా....?”

“అంటే అలాంటివేవైనా హైదరాబాదు పక్కనే ఉంటే రోడ్డుపై ఉండే నీటిని ఆ నదిలోకో, సముద్రంలోకో పంపించేవారట... అవేవీ ఇక్కడ లేవు కాబట్టి చచ్చినట్టు నిండా మునుగుతూ వెళ్ళిపొమ్మన్నారు.”

“తర్వాతేమయింది...?”

“తప్పదు కదాని కష్టపడి బైక్ దగ్గరికి వచ్చాను. ఎక్కడ ఆ నీటిలో కొట్టుకుపోతానో అని భయపడుతూనే బైక్ ని స్టార్ట్ చేసి మెల్లగా ముందుకి పోనిచ్చాను...”

“మరింకేంటి సమస్యా....?”

“అసలు సమస్య ఇప్పుడే మొదలయింది....? ఊ...హూ...హూ...” పాపం ఏడుస్తున్నాడు... “రోడ్డెక్కావు గదా... మళ్ళీ ఏమయిందయ్యా....”

“రోడ్డెక్కాను బాగానే ఉంది... కొంచెం దూరం వెళ్ళానోలేదో... మళ్ళీ చిక్కుకుపోయాను... ఊ...హూ... హూ...”

“అబ్బా... ఆ ఏడవడం ఆపి... విషయం చెప్పు... ఇందాక మోకాళ్ళలోతు వరదనీరు ఈసారి నడుములోతు వరకు వచ్చి అందులో చిక్కుకుపోయావా... పాపం....”

“అలా నీళ్ళలో చిక్కుకుపోయినా బాగానే ఉండేదండీ... బండిని ఒదిలేసి హాయిగా నీటిలో ఈతకొట్టుకుంటూ ఆఫీసుకి వెళ్ళేవాణ్ణి...”

“మరి దేంట్లో చిక్కుకున్నావయ్యా...”

“ట్రాఫిక్ లోనండి...”

“ట్రాఫిక్ లోనా....?”

“అవునండి... హైదరాబాదులోని ఎన్ని ప్రధాన రోడ్లున్నాయో... అన్ని ప్రధాన రోడ్లన్నీ పది నిమిషాలు కురిసిన వర్షం వల్ల వచ్చిన వర్షపు నీటిలో చిక్కుకుపోతే.... ఆ రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయన్న మాట...

ఊహు...” ఏడుపు.... “

ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు కదయ్యా....? ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికీ...”

“వాళ్ళ గురించి ఎందుకులెండి. మామూలుగా అయితే మార్నింగ్ నైన్ కల్లా ఫైన్ బుక్ చేతిలో పట్టుకుని రోడ్డెక్కేస్తారు...? ఈరోజు వర్షం వచ్చింది కదండీ... ట్రాఫిక్ లైన్ క్లియర్ చేయడం కష్టం కాబట్టి ఓ వైన్ బాటిల్ ని ముందు పట్టుకుని, న్యూస్ ఛానల్లో ట్రాఫిక్ లో ఇరుకున్న మాబోటి వెర్రి వెంగళప్ప మొహాల్లోని ఫీలింగ్స్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారన్న మాట....”

“తర్వాతేమయింది....?”

“ఏమవుద్దండీ... ట్రాఫిక్ లో ఈదుకుంటూ... సారీ... నీటిలో ఈదుతారు కదా... ట్రాఫిక్ లో బండిని నడుపుతూ, నడుపుతూ, నడుపుతూ చివరికి ఆఫీస్ చేరుకున్నానన్నమాట...” “హమ్మయ్య.. ఎలాగో ఆఫీస్ చేతుకున్నావు కదా.... మరింకేంటి నీగోల....?”

“ఇప్పుడే మొదలయిందండి... మరో సమస్య...”

“ఏమయిందయ్యా....?”

“తొమ్మిది గంటలకి ఆఫీస్ కి రావలసినవాడిని పన్నెండు గంటలకి చేరుకున్నాను కదండీ మా బాసు ఊరుకుంటాడా....?”

“ఎందుకూరుకోడయ్యా... పాపం వర్షంలో తడుస్తూ.. ట్రాఫిక్ లో ఈదుతూ అష్ట కష్టాలు పడి ఆఫీసుకి చేరుకున్నావు కదా... ఇందులో నీ తప్పేముంది... నువ్వు పడ్డ పాట్లన్ని పూసగుచ్చినట్లు మీ బాస్ కి చెబితే సరిపోతుంది....”

“అక్షరాలా నేను పడ్డ పాట్లని పూసగుచ్చినట్లు చెప్పాను కాబట్టే నన్ను ఉద్యోగంలో నుండి పీకి పారేసారు మొర్రో....!”

“అర్రె అలా ఎందుకు చేసాడు....?”

“ఎందుకా...?

వర్షంలో ఫుల్లుగా తడిసానని అంటున్నావుగా... ఏదీ ప్రూఫ్ చూపించు అన్నాడండి.. నేనేమీ చూపించలేకపోయా....?”

“ఎందుకు చూపించలేకపోయావయ్యా...  ఒంటిపై ఉన్న నీ బట్టలన్నీ ఫుల్లుగా తడిసే వున్నాయిగా... ఆ తడిసిన బట్టలని చూసి కూడా మీ బాస్ నమ్మలేదా...” 

“ఊ....హూ...హూ...”

“ముందా ఏడుపాపయ్యా... జరిగింది చెప్పు....!”

“ఎప్పుడో ఉదయం పది నిమిషాలు కురిసిన వర్షానికి నేను తడిసిన మాట వాస్తవమయ్యా... కానీ గంటల కొద్దీ ట్రాఫిక్ లో పడి పడి వచ్చాను కదండీ... ఆ సమయంలోనే నా బట్టలు తడి ఆరిపోయి పొడిగా మారిపోయాయి... వర్షంలో తడిసిన వాడి బట్టలు తడిగా ఉండాలి కాబట్టి, నా బట్టలు తడిగా లేవు కాబట్టి నేను వర్షంలో తడవలేదని నిర్ధారించుకుని, ఆఫీస్ కి లేటుగా రావడమే కాకుండా, అబద్దాలతో బాస్ ని మభ్య పెట్టాలని చూస్తున్నట్టు ఆయన ఊహించుకుని నన్ను నిర్దాక్షిణ్యంగా డిస్మిస్ చేశారు సార్.... ఊ హూ... హూ...”

“అయ్యో... పాపం..”

హైదరాబాదులో ఉద్యోగాలు చేసేవారు ఎప్పుడో ఒక్కపుడు ఖచ్చితంగా పై సంఘటనని అనుభవించి ఉంటారు. కేవలం పది నిమిషాలు పడిన వర్షానికే హైదరాబాదులోని ప్రధాన రోడ్లన్నీ నీటిలో మునిగిపోయి, తీవ్రంగా ట్రాఫిక్ జాం కావడంతో ఎందరో ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు.... ఇలాంటి ఉదంతాలు చూసి అయినా అధికారులు కళ్ళు తెలిచి తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండును...