Trimurtulu

" త్రిమూర్తులు "

విద్యావతి

ఒక వూళ్ళో ఒక గుడి, ఒక మసీదు, ఒక చర్చి...మూడు పక్కపక్కనే ఉన్నాయి. భక్తులు పెద్దగా లేకపోవడంతో...గుడిలోని పూజారి, మసీదు లోని ముల్లా, చర్చి లోని ఫాదరు.. ముగ్గురు కలిసి మధ్యాహ్నం పూట కబుర్లు చెప్పుకునేవారు.

అలా ప్రతిరోజూ కబుర్లు చెప్పుకుంటూ ఒక రోజున పేకాడడం మొదలుపెట్టారు.అది క్రమేపి అలవాటుగా మారింది. ముగ్గురు కలిసి పేకాట ఆడుతున్నారని ఆ ఊళ్ళో ఉన్న పోలీసు ఇన్ స్పెక్టర్ తెలిసింది.

దాంతో " పార్కులో చీట్లాట ఆడేవాళ్ళను పట్టుకున్నంత ఈజీ కాదు కదా ఈ దైవ ప్రతినిదులను పట్టుకోవడం " అనుకుని వాళ్ళ మీద నిఘా పెట్టి, సరైన సమయం కోసం ఎదురుచూస్తుండగా ఒక రోజున మధ్యాహ్నం ఆ ముగ్గురు డబ్బు పెట్టి పేకాట ఆడుతున్న సమయంలో వచ్చి ఆ ముగ్గురుని ఆరెస్ట్ చేశాడు.

ముందుగా ఫాదరును చూస్తూ " మీరు పవిత్రమూర్తులు.జూదం ఆడటం పాపం,నేరం అని మీకు తెలుసు. మీరు జూదం ఆడారా ? లేదా ? ” అని అడిగాడు.

ఫాదర్ ఏమి మాట్లాడలేదు.

“ అడుగుతుంది మిమ్ముల్నే.మీరు లేదంటే మారు మాట్లాడను.నిజం చెప్పాలో, వద్దో మీ మనసాక్షికే వదిలేస్తున్నాను " అన్నాడు చాలా మర్యాదగా.

ఫాదర్ ఒకసారి ఆకాశం కేసి చూసి " భగవంతుడా...అబద్ధం ఆడుతున్నందుకు నన్ను మన్నించు " అని ప్రార్థన చేసుకుని, ఎదురుగా నిలబడి ఉన్న ఇన్ స్పెక్టర్ ను చూస్తూ " నాయనా...నేను జూదం ఆడటం లేదు " అన్నాడు.

అది విని నిట్టూర్చి ఇన్ స్పెక్టర్ ముల్లాను అదే ప్రశ్న అడిగాడు. ముల్లా కూడా ప్రార్థన చేసుకుని ఫాదర్ లాగానే సమాధానం చెప్పాడు. ఇన్ స్పెక్టర్ మళ్ళీ నిట్టూర్చి పూజారిని అదే ప్రశ్న అడిగాడు. పూజారి ప్రార్థన చేసుకోలేదు.

ఇన్ స్పెక్టర్ కళ్ళలోకి సూటిగా చూశాడు.

“ జూదమా...! ఎవరితో ఆడుతున్నామట ? ఆడడానికి కనీసం ఇద్దరు ఉండాలని తెలీదూ ? అడిగే ముందు కాస్త ముందు వెనకా ఆలోచించుకోవద్దూ " అని ఝుమాయించి అన్నాడు.