Tinu Tinipinchu Tinakapote Naalugu

తిను తినిపించు ...తిననంటే నాలుగు తగిలించు

-పద్మశ్రీ

మంగతాయారు టివీ ఆన్ చేసి సిద్దంగా వుంది. ఆమె వంటింట్లో వుంది. ఆమె ముందు టి.వి వుంది. యాక్చువల్ గా టీవీలు హాల్ లో వుంటాయి. కానీ ఈరోజు ఆ టీవీ వంటింట్లోకి మారింది. అలా మారడానికి ఓ బలమయిన కారణమే వుంది. మంగతాయారుకి ఎంతో ఇస్తామయిన ప్రోగ్రాం అందులో రాబోతుంది. ఎంత ఇష్టమయితే మాత్రం ఏకంగా టివీనే వంటింట్లోకి తెచ్చుకుని మరీ చూడాలా? అనే ప్రశ్న మీలో మెదలడంలో తప్పేమీ లేదు, అయితే ఆ టివీలో వచ్చే ప్రోగ్రాంకి, వంటింటికి చాలా సంబంధం వుంది. ఏమిటంటారా...?

అయ్యో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది... మంగతాయారు టెన్షన్ గా ఎదురు చూస్తుంది.. టీవిలో ప్రోగ్రాం స్టార్ట్ అయింది... “హ్హా....య్....” అంటూ పళ్ళన్నీ బయటికి కనిపించేలా నవ్వింది టివీలోని యాంకర్.

“తిను, తినిపించు... తిననంటే నాలుగు తగిలించు లైవ్ ప్రోగ్రాం కి స్వాగతం సుస్వాగతం....! గత వారం రోజులనుండి మా ఛానెల్ లో ఈ ప్రోగ్రాం గురించి యాడ్స్ చూసిన వారంతా ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని ఎంతో ఆసక్తిని కనబరచారని మీ ఇంట్రెస్టు ని బట్టి మాకు తెలిసిపోయింది. ఈ ప్రోగ్రాం కోసం చాలా మంది టీవీలని తమ వంటింట్లోకి కూడా మార్చుకున్నారని తెలిసి మేము చంకలు గుద్దుకుని మరీ ఆనందిస్తున్నాము...

ఇంతవరకూ ప్రపంచంలోనే ఏ ఛానెల్ వాళ్ళు చేయలేని విధంగా ఈ ప్రోగ్రాంని రూపొందించినందుకు మాకెంతో గర్వంగా కూడా ఉంది.. ఈ ప్రత్యేకమయిన కిచిడిని వండి మీ వారికి గాని పెడితే... నా సామిరంగా... మీ వంటింట్లో ఉన్న టీవీ ఏ రోజుబయటికి తీసుకువచ్చే అవకాశమే మీకు రాదు. ఎందుకంటే మీ కిచిడిని మెచ్చిన మీ వారు మిమ్మల్ని డైరెక్ట్ గా బెడ్ రూంలోకి తీసుకెళ్తాడు కాబట్టి. మరింకే ఎంజాయ్.. ఇక ఈ కిచిడి తయారు చేయడానికి కావలసిన వస్తువులన్నింటినీ మీకు ముందే చెప్పాము కాబట్టి, మీరన్నీ సిద్దం చేసుకున్నారుగా... ఇక వంట స్టార్ట్ చేద్దామా...!”

“ఒసేయ్... నీ వంట తగలెయ్య.. అదేదో కిచిడి చేసి పెడతానని చెప్పి ఆఫీసుకి వెళ్ళకుండా అడ్డుపడి కాలక్షేపం కోసం టీవీ చూద్దామంటే ఆ టీవీ కూడా వంటింట్లో పెట్టుకుని ఇంకా ఏం చేస్తున్నావే...!” వరండాలోంచి మంగతాయారు భర్త రంకేలేసాడు...

“అబ్బ... ఉండండి... ఇప్పుడే ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది... టీవీలో కిచిడి చేయడం స్టార్ట్ అయ్యింది.

“ముందుగా స్టౌ వెలిగించండి....” మంగతాయారు వెంటనే స్టౌ వెలిగించింది...

“ఆ తర్వత దానిపైన ఓ గన్నె పెట్టండి" మంగతాయారు వెంటనే ఆ పని చేసింది.

“దాంట్లో నేను పోసినంత మంచి నూనె మీరూ పోయండి...” మంగతాయారు టీవి చూస్తూ ఆ యాంకర్ నూనె తీసుకున్నాడో గమనించి అంత నూనె గిన్నెలో పోసింది.

“ఇక ఇప్పుడు ఆ నూనె ఓ రెండు నిమషాలు మరగాలి." అనగానే వెంటనే పక్కనే ఉన్న యాంకర్ పళ్ళన్నీ ఇకిలిస్తూ గిన్నెలోని నూనె మరిగెంత వరకూ చిన్న బ్రేక్” వెంటనే టీవీలో ఏవో యాడ్స్ ప్రసారమవుతున్నాయి.

ఐదు నిమిషాలయింది. అయిన ఇంకా ప్రోగ్రాం స్టార్ట్ కాలేదు కానీ మంగతాయారుకి మాత్రం టెన్షన్ స్టార్టయింది... గిన్నెలోని నూనె మాడి మాడి పొగలు బయటికి వస్తున్నాయి.

“ఒసేయ్ ఘుమ ఘుమ వాసనంటే ఇదేనానే ....!” వరండాలోకి కూడా ఆ పొగ చేరి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మంగతాయారు భర్త కేకేసాడు.

“అబ్బ... మీరు కాసేపుండండి... నేనసలే టెన్షన్ గా ఉన్నాను...” ఎట్టకేలకు పది నిమిషాల తర్వాత ప్రోగ్రాం స్టార్టయింది.. టీవీలో యాంకర్ ప్రత్యక్షమయింది...

“వెల్ కం బ్యాక్.... ఈపాటికి మీ నూనె మరిగిపోయి వుంటుంది... ఇప్పుడు మా ఛీఫ్ చెప్పే విధంగా చేయండి..” అనగానే టీవీపై చెఫ్ ప్రత్యక్షమయ్యాడు.

“ఆ మరిగిన నూనెలో తరిగిన ఉల్లిపాయలు వేయండి... ఆ తర్వాత వెంటనే కారం, వెల్లుల్లి, పసుపు లాంటివి వేయకుండా ఆ ఉల్లిపాయలు ఓ రెండు నిమిషాలు దోరగా వేగనీయండి...” మళ్ళీ “ఆ ఉల్లిపాయలు వేగేవరకు ఓ స్మాల్ బ్రేక్....” వెంటనే టీవీపై యాడ్స్ ప్రత్యక్షం... అలా చివరికి ఓ పది స్మాల్ బ్రేకుల మధ్య ఆ ప్రోగ్రాం అయిపొయింది...

వెంటనే యాంకర్ స్క్రీన్ పై ప్రత్యక్షమయ్యింది. “ వ్వావ్.. మీ వంటింట్లో మీ స్టౌ పైన ఘుమఘమలాడే వెరయిటీ కిచిడీ సిద్ధంగా వుందికదూ... మరింకే ఉదయం నుండి ఎదురుచూస్తున్న మీ మొగుళ్ళకి పెట్టండి.. ఈ రోజంతా బెడ్ రూంలో ఎంజాయ్ చేయండి... బైబై...” అంటూ ముగిసింది..

కానీ టీవీ స్క్రీన్ ముందు మంగతాయారు లేదు. ఆ యాంకర్ అన్నట్టు ఆమె బెడ్ రూంలోనే ఉంది. అప్పటికే ఆ వంటిల్లు భీకరమైన పొగలతో నిండిపోయింది. ఆ పొగల మధ్యన ఊరిరాకడ క్రింద పడిపోయిన మంగతాయారుని ఆమె భర్త బెడ్ రూంలోకి చేర్చి సపర్యలు చేస్తున్నాడు.

కాసేపయిన తర్వాత మంగతాయారు కళ్ళు తెరిచింది. తన పక్కన కూర్చుని తన కాళ్ళూ చేతులూ వత్తుతున్న భర్తని చూసి మెల్లిగా అంది... “ఆ టీవీలో యాంకర్ భర్తతో బెడ్ రూంలో ఎంజాయ్ చేయండి అంటే...

ఏదో అనుకున్నాను...కానీ ఇలా ఎంజాయ్ చేయాలని అనుకోలేదండి"అంది ఏడుపు మొహంతో.

ఏమో.. వచ్చే రోజుల్లో ఇలాంటి లైవ్ వంటకాలు కూడా టీవీలో వస్తాయేమో.. అలా వచ్చినప్పుడు మీ పరిస్థితి కూడా మంగతాయారులా కాకుండా జాగ్రత్త పడండి...