TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Antuleni Kadha
- ప్రసన్న కుమార్
సర్రాజు కాలింగ్ బెల్ నొక్కాను. తలుపులు తెరుచుకునే లోపల ఓసారి పరిసరాలు పరీక్షగా చూశాను. కాంపౌండ్ అంతా దాదాపు 600చ.గ. వుంటుంది బయట గేటులోంచి లోపలకు వస్తూంటే పక్కనే ‘విక్రమభవన్’ అని రాసున్న అక్షరాలూ కనిపించాయి.
పెద్ద ఇల్లు. ఆ వూళ్ళో కాస్త కంటికి నదురుగా కనిపించే అటువంటి ఇళ్ళను వ్రేళ్ళమీద లెక్కించవచ్చు. తలుపులు తెరుచుకున్నాయి. చేతిలో జారిపోతున్న పుస్తకాలను పైకి లాక్కుంటూ “నమస్కారం’’ అన్నాను.
“నమస్కారం’’ అన్నాడు తలుపు తీసినాయన.
ఓ నలభై ఏళ్లు ఉంటాయతనికి. “రెవెన్యూ డిపార్టుమెంటు నుంచి వచ్చాను. స్పెషల్ స్టాఫ్. మీరు కాస్త సహకరిస్తే కొన్ని వివరాలు తెలుసుకుందామని వచ్చాను’’ అన్నాను.
అతను చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించాడు. లోపల ఓ మాదిరి పెద్ద హాలుంది. మధ్యన సోఫాలున్నాయి. ఆయన నన్ను కూర్చోమని, తనూ కూర్చున్నాడు. నా పుస్తకాలు టేబిల్ మీద పెట్టి, సర్ధుకుని కూర్చున్నాను. నేనీ ఉద్యోగంలో చేరి కొద్దికాలమే అయింది. వివరాలు అడగటం విషయం ఎలావున్నా, వారిని రాబట్టుకోవటం కోసం ఒకవేళ మీరు ఆస్తిని ఎక్కువగా అంచనా వేస్తే టాక్సు ఎక్కువ కట్టుకోవాలి గదా అనో, ఇలా మీరు వేసే అంచనాలు ఆస్తి అమ్మకంలో ఏం గొడవలూ తెచ్చిపెట్టవుకదా! అనో అడిగేవాళ్ళే. ఇంకా కొందరు మా ఆస్తి వివరాలు రిజిస్ట్రారాఫీసులో వున్నాయి గదా మళ్ళీ ఎందుకడుతున్నారు? అని సందేహాలు వెలిబుచ్చేవారు. సంతృప్తికరంగా వాళ్ళందరికీ సమాధానాలిచ్చి వివరాలు రాబట్టుకునేసరికి తల ప్రాణం తోకకు వచ్చేది.
“ఎవరు వచ్చింది?’’ అంటూ హాల్లోకి వచ్చిందొకావిడ. ఓ ముప్పై ఏళ్లు ఉంటాయేమో. మనిషి అందంగా వుంది.
“రెవెన్యూ డిపార్టుమెంటు నుంచి, మా ఆవిడ రంగమణి’’ అని పరిచయం చేసి “కాఫీ తీసుకురా’’ అని చెప్పాడు భార్యతో. ఆవిడ నావంక అదోలా చూసి లోపలికి వెళ్ళిపోయింది. నేను కాఫీ వద్దని మొదట మొహమాటపడ్డా, ఈ రోజుకి నా లిస్ట్ లో ఇదే చివరి ఇల్లు గనుక. పోనీలే కాస్త విశ్రాంతిగా కూర్చుందాం అనుకుని, ప్రశ్నలడటానికి గొంతు సవరించుకున్నాను.
“ఒక్క నిమిషం’’ అంటూ ఆయన లేచి లోపలికెళ్ళాడు. ఏం ఉద్యోగం చేస్తున్నాడో అనుకుంటూ తలతిప్పి యథాలాపంగా గోడలవైపు చూశాను. పెద్ద సైజు పటాలు అరడజను ఓకే సైజులో ఉన్నవి తగిలించి వున్నాయి. ఒక దాంట్లో ఓ యువకుడు, రెండో పటంలో ఓ యువతి, ప్రక్కదాన్లో ఓ యువకుడు, ఆ ప్రక్కన ఇంకో యువతి – అలా వున్నై. ఆయన వక్కపొడి డబ్బా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు.
“నాకు ఇది నిత్యమూ వుండాలండీ, లేకపోతే తోచదు’’ అంటూ కూర్చున్నాడు.
నేను పుస్తకం తెరిచాను. కలం తీసి “ఈ ఇల్లు వైశాల్యం ఎంతండీ?’’ అని అడిగాను.
“కాంపౌండు కాక 700 చదరపు గజాలు’’ చెప్పాడు. రాసుకున్నాను.
“ఒకటే కాపురమా?’’ అడిగాను.
“అంటే మీ ఉద్దేశ్యం ఈ యింట్లో ప్రస్తుతం వేరే సంసారాలున్నయ్యా అనా?’’ నేను చిన్నగా నవ్వుకుని అవునన్నాను.
“అయితే ఒకటే’’ అన్నాడు. రాసుకున్నాను.
“ఈ ఇంటి యజమాని మీరే గదా!’’ మొదటే అడగవలసిన ప్రశ్న ఇది.
ఆయనే అని తెలిసినా ఫార్మల్ గా అడగాలి గదా! బిగ్గరగా నవ్వాడు. నవ్వి “ఆ ప్రస్తుతానికి నేనే’’ అన్నాడు. ఆయనకు కాస్త హాస్య ధోరణి ఎక్కువే అని తెలుస్తూనే వున్నా అంత నవ్వవలసిన అవసరం నాకు కనిపించలేదు. సరే ... ఇదో కొత్తరకం.
“ఇది మీ స్వార్జితమా లేక తండ్రి, తాతలదా?’’ అడిగాను.
ఈసారి మరీ పెద్ద నవ్వు, పడీ పడీ నవ్వుతున్నాడు. నాకు ఆశ్చర్యం కంటే చిరాకు ఎక్కువేసింది. అయినా, ఆయనానవ్వు ఆపేదాకా వేచి వుండాలని నిశ్చయించుకున్నాను. ఊపిరి అందనట్లుగా నవ్వి నవ్వి “రెండూ కాదు’’ అన్నాడాయన.
ఇంతలో ఆవిడ కాఫీ తీసుకొచ్చింది. టేబుల్ మీద పెట్టి సోఫా వెనకాల ఆయనకు దగ్గరగా నుంచుంది. కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు. తనదయ్యుండకపోవచ్చు. తండ్రి తాతలదీ అయ్యుండకపోవచ్చు. వాళ్ళావిడదేమో! బహుశా ఇల్లరికపుటల్లుడేమో ....తన ఇన్ఫీరియారిటీని ఇలా హాస్యదోరణిగా మార్చుకున్నాడేమో.కాఫీ త్రాగటం ముగించాను. ఆయన అప్పటికే కాఫీ తాగి, వక్కపొడి వేసుకుని నాకు ఇవ్వబోయాడు. అలవాటు లేదన్నాను. పుస్తకం తీసుకుని రాయబోయాను. ఎందుకైనా మంచిదని రాయబోయే ముందు అడిగాను
“మీ వైఫ్ దన్నమాట ఈ ఇల్లు’’ కాదన్నాడు. ఆవిడ వంక చూశాను. చిరునవ్వుతో తల తిప్పింది. మరీ తినేసేట్టు చూస్తుందేమిటి?
“ఇంతకీ ఈ ఇల్లు ఎవరిదో చెప్పక తప్పదన్నమాట’’ అన్నాడాయన నవ్వుతూ.
“చెప్పక తప్పదు’’ అన్నాను కాస్త అసహనంగా.
“అయితే వినండి. ఒక విధంగా మా ఆవిడ మొగుడిది అంటే చాలా?’’ అన్నాడు నవ్వుతూ. వాళ్ళావిడ మొగుడిదా!! అంటే ఆయనదేగా? ఈ వేళాకోళానికి చిర్రెత్తుకొచ్చింది.
“చూడండి, నేనేదో మీ పాత స్నేహితుడిలాగా వేళాకోళాలాడకుండా దయచేసి నాకు కాస్త సహకరిస్తే నేను త్వరగా నా డ్యూటీ ముగించుకొని వెళ్ళిపోతాను’’ అన్నాను.
ఆయన కాస్త నవ్వు ఆపి, నిజంగా మా ఆవిడ మొగుడిదేనండీ ... అంటే అదుగో! ఇట్నించి ఆ మొదటి ఫోటో చూశారా? ఆయనది’’ అన్నాడు. ఆశ్చర్యంగా చూశాను. ఫోటోలో వున్న మనిసి, ఈయనా ఒకరు కాదు, అయితే ఆవిడకి ఈయన రెండవ భర్తా! బాగుంది సంబరం అనుకున్నాను. “ఆయన పేరు?’’ అడిగాను.
“పరాత్పరరావు’’ అన్నాడాయన. తల వంచుకుని రాయబోతున్నాను.
“ఈయన పేరు రాయబోతున్నారా?’’ అడిగాడు.
“అవును’’ అన్నాను అనుమానంగా. ఆవిడ అంది ...
“ఈ ఆస్తి పరాత్పరరావుగరిడి కూడా కాదు. వాళ్ళావిడ – అంటే ఆ రెండో ఫోటోలో వున్నావిడది’’ నాకు తల తిరుగుతోంది. ఫోటోను చూశాను.
ఒ పాతికముప్పయ్ ఏళ్ళ యువతి ఫోటో అది. ఆవిడా, ఈవిడా ఒకరు కారు. చిరాకేసింది “పోనీ ఆవిడ పేరు చెప్పండి’’ అన్నాను కలం కాగితం మీద పెడుతూ – “ఆవిడ పేరు వాణి’’ అంది.
“వా ... ణి ...’’ రాసుకుంటున్నాను.
“ఆగండి! మీరేం అనుకోనంటే ఒక్కమాట. మీకు విషయం తెలీదు గాబట్టి మేం చెప్పాల్సోస్తుంది. ఈ ఆస్తి మీద నిజం చెప్పాలంటే వాణికి కూడా అధికారం లేదు. వాణీ వాళ్ళాయన ...’’“పరాత్పరావేనా?’’ అడిగాను.
“కాదు మాణిక్యాలరావు’’ భగవాన్! ప్రొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను? తల పట్టుకుని కూర్చుండిపోయాను. వాళ్ళకి జాలేసినట్లుంది. నా పరిస్థితి చూసి.
“మీరు కాస్త ఒపికపడితే అంతా చెబుతాను. ఈ మాణిక్యాలరావుకి ఒక భార్య ఉంది.కమలమ్మ అనీ, ఆవిడ మొదటి భర్త దయానిధి’’ ఆశ్చర్యపోవటానికి ఓపిక లేదు. వింటున్నాను.
“ఆ దయానిధి తండ్రి విక్రమరావు గారు రిటైర్డు ఆర్మీ మేజర్. ఆయనకు కొడుకు, కోడలు తప్పముందూ వెనకా ఎవ్వరూ లేరు. ఆయన తన కుమారుడు, కోడలు ఇంటి పట్టున వుండకుండా విచ్చలవిడిగా తిరుగుబోతుల్లా తయారయ్యారని, తన తర్వాత ఈ ఆస్తికి వారసులు ఈ ఇంట్లో పుట్టబోయే పిల్లలే అని గ్రామస్తులందరి ఎదుటా చెప్పి కన్ను మూశాడు.
ఆయన పోయాక కొన్నాళ్ళకి కొడుకు కూడా సంతానం లేకుండానే చనిపోయాడు. పెద్దలంతా సంతానం కోసం మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చని చెప్పగా కమలమ్మ, మాణిక్యాలరావుని పెళ్ళి చేసుకుంది. తర్వాత కొన్నాళ్ళకే పాపం కమలమ్మ చచ్చిపోయింది. ఇహ తర్వాత కథ మామూలే. సంతు కలిగితే గానీ ఆస్తి స్వాధీనమవదు.
అప్పటివరకూ హక్కుగా యీ ఇంట్లో వుండటమే గాని నిజమైన వారసత్వంగా ఆస్తి స్వాధీనమావదు గదా! వెంటనే మాణిక్యాలరావు వాణి అనే అమ్మాయిని చేసుకుని హరీ అన్నాడు. రెణ్ణేళ్ళు తిరక్కుండానే వాణి పరాత్పరరావునే ఏ బాదరబందీలేని వాణ్ణి పెళ్ళిచేసుకుంది. అదేం శాపమో మూణ్ణెల్ల కడుపుతో వుండగానే వాణి రోగంతో తీసుకుని చచ్చిపోయింది.
అప్పుడు పరాత్పరరావు వెతికి వెతికి మా ఆవిడ రంగమణిణి చేసుకున్నాడు. ఇహ పాపం పరాత్పరరావు ...’’ ఇక చెప్పోద్దన్నట్టు లేచి శెలవు తీసుకోకుండానే బయటకు నడిచాను. వెళుతూ వెళుతూ ఆగి వెనక్కి తిరిగి అడిగాను .... “రెవెన్యూ అదికారిగా కాదు, కేవలం కుతూహలంతో అడుగుతున్నాను. మీకు సంతానం కలిగిందా?’’ లేదన్నట్టు తలూపారు వాళ్ళు.
తల వంచుకుని చక చకా బయటకు నడిచాను. రిపోర్టులో ఏం వ్రాయాలో ఆలోచించుకునే ఓపిక లేదు.
*****
సంవత్సరం తర్వాత ఏదో పని మీద మళ్ళీ ఆ వూరు వెళ్ళాను. పని అయిపొయాక బస్టాండు కెళ్ళి బస్సెక్కాను, బస్సు కదలబోతుంటే కిటికీ దగ్గర ఎవరో పేరు పెట్టి పిలుస్తూంటే తల ప్రక్కకి తిప్పాను. కాలేజీలో నా క్లాస్ మేట్ రాజారావు ... “ఏరా! ఎప్పుడొచ్చావు?’’ అన్నాడు ఆనందంగా.
“నిన్ననే వచ్చాన్రా! అవునూ! నువ్వీవూళ్ళోనేనా ఉద్యోగం?’’ అడిగాను – చాలా కాలానికి వాణ్ణి చూడగాలిగానన్న సంతోషంతో.
“నా మొహం ... ఉద్యోగం రాలేదురా ... పెళ్ళి చేసుకున్నాను’’ అన్నాడు సంతోషించాను.
ఈసారొచ్చినప్పుడు తప్పక రమ్మనమని చెప్పాడు. మాటిచ్చాను. కండక్టరు రైట్ చెప్పి బెల్లు మోగించాడు. అడ్రసు చెప్తున్నాడు రాజారావు.
“... థియేటర్ దగ్గర పెద్ద బంగళా ... ముందర తోట వుంటుంది. విక్రమభావన్ అనీ’’
“మీ ఆవిడ పేరు?’’ అడిగాను. గొంతు బొంగురుగా వినిపించింది నాకే. “ఆ ... ఏదో పాత కాలప్పేరు లేరా ... రంగమణి అని ...’’ బస్సు స్పీడందుకుంది.
|