Kaaru Kootalu

Kaaru Kootalu

*************

-పద్మశ్రీ

“ఛస్..... ఎవ్వడా కూత కూసింది. ఎవ్వడంట..... దమ్ముంటే నా ముందు కూయమని చెప్పండి...... తస్సాదియ్యా......”

“స్సార్....స్సార్......”

“ఛస్ నువ్వు నోర్మూయ్యెహె... నాకు కిందనుండి మండిపోతాంది..... ఇంతకీ ఎవ్వడాడు..... ఎవ్వడాడాంట...”

“స్సార్.... స్సార్....”

“య్యేందయ్యా మధ్యలో నీ గోల... స్సారూ.... స్సారూ.... అంటూ అసలే నాకూ....”

“కింద నుండి మండిపోతుంది బాగానే ఉంది గానీ స్సార్..... కంట్రోల్.... కంట్రోల్....”

“ఏందయ్యా కంట్రోలూ... ఏందంట..... ఇంతకీ ఎవ్వడాడు ఆ కూత కూసింది... ఆ ఇసయం నాకు తెలియాల ఇప్పుడే...”

“స్సార్.... మీరు ఎప్పుడూ ఇలా కాలు కాలిన పిల్లిలా, బురదలో దొర్లుతున్న పందిలా, రంకేలేసే ఆంబోతులా అరవకూడదు. నా మాట వినండి....”

“ఏందేందీ.... నేను బురదలో....”

“స్సార్... ప్రాస బాగుందని అలా అన్నాను గానీ... మిమ్మల్ని అలా అంటానా... హమ్మో...”

“ఏందయ్యా నీ సంగతి... అసలే నాకు ఎక్కడో కాల్తుంటే... ఏదో సెక్రెటరీవని ఊరుకుంటున్నాను..... లేకుంటేనా... అది సరే.... అసలు ఇసయమేందో చెప్పు అసలే నాకు కింద నుండి........”

“కాల్తుంది సరేగానీ..... మీరిలా అరవొద్దు సార్... మీరిలా అడ్డగాడిదలా అరిస్తే అప్పొజిషనోడి పోజిషన్ స్ట్రాంగయిపోద్ది....”

“అదుగో..... మిమల్నే డేగకళ్ళతో గమనిస్తున్న ఆ మీడియావాళ్ళ ద్వారా.....” వీడియో వాళ్ళని చూడగానే అతనిలో ఆవేశం కాస్త చల్లారింది.

“అర్రెర్రె... కిందనుంచి కాల్తుంటే ముందున్నది మీడియోళ్ళన్న సంగతి మరిసినా... సర్లే.... అయ్యిందేదో అయ్యింది గానీ.... ఇదిగో సెక్రెట్రీ.... ఇంతకీ ఎవ్వడా కూత కూసింది.... నాకు దెల్వాలె అంతే.... అసలే కిందనుండి....”

“నీ కాలుడు మండిపోనూ..... ఇంతకీ ఎవ్వడాడు... ఏం కూసాడు... ఆ విషయం చెప్పండి మెల్లిగా....”

“అబ్బో... షానా పెద్ద కూతే కూసిండు గాడు... హన్నన్న... ఆ మాటలు నా చెవులల్ల మార్మోగుతున్నాయి గాదూ... అస్సలెవడా కూత కూసింది. నాకు తెల్వాల... అస్సలే నా కిందనుంచి.....”

“అబ్బా... అస్తమానం ఆ మాటంటే మీడియా వాళ్ళు మరోలా అర్థం జేసుకుని మిమ్మల్ని అటూ ఇటూ కాని వాళ్ళ జాబితాలో తోస్తారు... ఆ కాలుడు సంగతి పక్కనెట్టి ఇంతకీ జరిగిందేందో చెప్పు....”

“గట్లడిగినవ్ బాగుంది... సరే ఇను సెప్త... అయినా నీకు దేల్వనిదేముంది సెక్రెట్రీ... నేను రయ్యుమని తిరిగుతున్ననే కారు...”

“ఆ... బెంజి కారు.... అబ్బో... డెబ్భైలక్షల పైమాటే గదా దాని ఖరీదు.... కొంపదీసి ఆ కారు బాగాలేదని గానీ ఎవరన్నా కామెంట్ చేసారా ఏందీ...”

“అదిగాదు గానీ... ముందు నేను సెప్పేది పూర్తిగా ఇనుకో... నా పెళ్ళాం తిరుగుతోందే కారు...”

“అది కూడా ముప్ఫైలక్షలు ఖరీదు చేసే ఖరీదైన కారే గదండీ... దాని గురించి గానీ....”

“అది గాదెహె... నా కొడుకు తిరుగుతున్నాడే కారు....”

“ఆ కారు గురించేం చెబుతారు లెండి.... మీ కారు కన్నా ఖరీదెక్కువ... కుర్రాడు గదా..... ఆ మాత్రం ఖరీదైన కారుండాల్సిందే... ఇంతకీ ఈ కారు గురించి....”

“సెక్రెట్రీ... అస్తమానం నాకడ్డు రాకు... ఇంక మా అమ్మాయి వాడుతుందే కారు....”

“అబ్బో... అబ్బో... ఆ కారా.... మొన్న అమెరికా కెళ్ళినప్పుడు ఆ ఖరీదైన కారుని చూసి మోజుపడి ఇండియాలో అందరికంటే ముందు తనే అలాంటి కారులో తిరగాలని పట్టుబడితే ఆఘమేఘాల మీద అమెరికా నుండి ఇండియాకి తెప్పించారుగా... కొంపదీసి ఆ కారు గురించి ఎవరైనా కారు కూతలు కూసారా ఏందీ....”

“హబ్బా.... సెక్రెట్రీ... నీతో మహ చిక్కొచ్చి పడిందయ్యా... నేను మొత్తం చెప్పకుండానే మధ్యలో అడ్డు తగుల్తవేంది... నన్ను మాట్లాడనీ... అసలే నాకు కిందనుండి కాల్తుంటేనూ....”

“మీ కాలుడు తగలెయ్య... సరే అడ్డు రాను గానీ చెప్పండి....”

“నేను రయ్యున తిరుగుతున్న ఆ కారు... నా పెళ్ళాం కారు.. నా కొడుకు కారు, నా కూతురు కారు, మా అవ్వ అయ్య తిరిగే కారు... ఈ కార్లన్నీ నేను కొన్నవే...”

“అక్షరాలా అవన్నీ లక్షలు పోసి మీరే కదండీ.... కొన్నారు... కొంపదీసి ఎవరన్నా ఆ కార్లు మీ కార్లు కావనీ, వేరే వారి కార్లనీ... ఆ కార్లకు, మీకు ఏమీ సంబంధం లేదని గానీ ఎవరైనా అన్నారా సార్....”

“హబ్బా.... సెక్రెట్రీ.. నాకు ఇరిటేషన్ వచ్చేట్టు మాట్లాడకు.... మన ముందు మీడియా వాళ్ళున్నారు. అసలే నాకు.... అదిగాదు గానీ.. అస్సలు ఈ కార్లు నావనీ... నేనే కొన్నానని ఎవడో అన్నాడంట.... అందుకే నాకు కిందనుంచి కాల్తోంది....”

“హా... అదేంటి సార్... వాడెవడో కూసిన ఆ కూతలు నిజం కావా.....”

“హబ్బా సెక్రెట్రీ.... నీతో మహ చెడ్డ చిక్కొచ్చిపడిందయ్యా... అసలు.... నాకేంటీ... కారేంటీ.... నాకు కారెక్కడుంది సెక్రెట్రీ.... నీకు తెల్సిందే గదా... ఆ కార్లు నాయా యేంది.....”

“అంటే మీవి కావా సార్.....?” బుర్ర గోక్కున్నాడు సెక్రెట్రీ.

“ఛస్.... నాకసలు కారే లేదు... ఈ కార్లు నాయి గావు... నాయి కావు గాక కావు.... అసలు కార్ల దిరగడమంటేనే నాకు దెల్వదు... తెల్సునా....” సెక్రెట్రీకి కళ్ళు గిర్రున తిరిగినయ్... పక్కకి పడబోయి నిలదొక్కుకున్నాడు....

“ఏంటిసార్ మీరు మాట్లాడుతుంది....”

“నిజం మాట్లాడతాన్నయ్యా..... ప్రజలకు సేవ జేసెటోడిని, ప్రజల కష్టాలలో పాలు పంచుకునేటోన్ని..... ప్రజల కష్ట సుఖాలు తెల్సుకోడానికి నా నియోజకవర్గంలో పిచ్చికుక్క తిర్గినట్టు కాళ్లరిగేటట్లు తిరిగేటోన్ని... నాకు కారెక్కడిదీ.. అడేవడో నాకు కారుందనీ... దాంట్లో నేను తిర్గుతనని అంటాడా... అందుకే నాకు కిందనుండి కాల్తుంది.....”

“స్సార్.... మీకసలు కారే లేదనీ, నాక్కూడా ఇప్పుడే తెల్సింది....”

“ఇంక తెల్సినంక గీడనే నిల్చున్నవేందయ్యా... నాకు కారులేదని ఆ కాగిత ముక్కల రాయి.... తొందరగా బోయి నామినేషన్ ఏయ్యాల....”

“ఆ... ఆ... ఒకే.... సార్... అలాగే సార్....”

“హన్నా... నాకు నాలుగు కార్లున్నాయని కారు కూతలు కూసిండు ఎవడో... అందుకే నాకు కిందనుంచి కాల్తంది.... ఇదిగో మీడియా మిత్రులారా ఆ కెమెరాలిటు తిప్పండి.... నా ప్రియ ప్రజలారా... నేను మీ కోసం పుట్టినోన్ని... మీకు సేవ జేస్తందుకు పుట్టినోన్ని... ఈ మీడియా సాక్షిగా సెప్తన్న నాకు కారు లేదని.... కావున ఆడేవడో కూసిన కారు కూతల్ని నమ్మవద్దనీ... నమ్మితే నాకు కిందనుండి కాల్తదని చెప్తూ సెలవు దీస్కుంటున్న.....” అంటూ మీడియా వాళ్ళని దాటుకుంటూ బెంజి కార్లో బయలుదేరాడు సదరు అభ్యర్ధి నామినేషన్ దాఖలు చేయడానికి.... హేవిటో....??