TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
పేపర్...!
మల్లిక్
*******************************
“ పేపర్...”అని వీధిలోంచి గట్టిగా కేకేసిన పేపరు వాడు, న్యూస్ పేపరును గిరాటేసి వెళ్ళిపోయాడు.
రాజారావు ఇంట్లోంచి వచ్చి గేటు దగ్గర పడి వున్న న్యూస్ పేపరును తీసుకుని వరండాలోని కూర్చిలో కూర్చున్నాడు. ప్రశాంతంగా న్యూస్ పేపరును చదువుకోవచ్చని అనుకుని పేపరును సరిచేసుకుంటుండగా, అంతలోనే భార్య రమణి " ఏమండోయ్...” అంటూ భయంకరమయిన కేకేపెట్టింది వంటింట్లోంచి.
ఆ కేకకి రాజారావు ఉలిక్కిపడ్డాడు. అతని మనసు కీడుని శంకించింది.గదిలోకి వెళ్లి దుప్పటి తీసుకుని గబగబా వంటింట్లోకి పరుగెత్తాడు.
“ ఏంటా! ఏమాలోకం?” అంది రమణి ఆశ్చర్యంగా చూస్తూ.
“ నీ చీరేం అంటుకోలేదా?” ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు రాజారావు.
“ లేదే? ఎందుకలా అడుగుతున్నారు!” అంది రమణి.
“ మరి వంటింట్లోంచి అలా గావుకేకలేస్తే ఏమనుకుంటారు. చూడు నీ మీద కప్పి మంటలు ఆర్పడానికి దుప్పటి కూడా తెచ్చాను " విసుకున్నాడు రాజారావు.
“ తెచ్చార్లే పెద్ద దుప్పటి. మంటలు ఆర్పడానికి అంత చిన్నదీ, అంత పల్చని దుప్పటి తెస్తారా ఎవరైనా? బాగా దళసరిగా పెద్దగా ఉన్న దుప్పటి తెవాలిగానీ! కావాలనే మీరు ఇలాంటి దుప్పటి తెచ్చారు. నేను చస్తే వేరే దాన్ని చేసుకోవాలని గదా!” అంటూ మొటికలు విరిచింది రమణి.
“ నువ్వు కావాలనే కదా అంత గట్టిగా అరిచావ్. నేను అదిరిపడి గుండాగి చస్తే, నీకు ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని!” అంటూ రాజారావు కూడా మొటికలు విరిచి "బాబాయ్ " అంటూ చేతివేళ్ళ వంక చూసుకున్నాడు.
“ మరేం ఆడంగి అలవాట్లు కాకపొతే మిమ్ముల్ని ఎవరు మొటికలు విరవమన్నారు. వేళ్ళు ఇరిగాయా?” అన్నది రమణి.
“ నాకేం కాలేదుగా...హిహిహి...చూడు కావాలంటే మళ్ళీ విరుస్తా" అంటూ మళ్ళీ మొటికలు విరిచి "వ్యాయ్యేవ్...” అన్నాడు బాధగా మరోసారి వెళ్ళవంక చూసుకుంటూ.
“ ఇంకాపుతారా, చేతికున్న పది వేళ్ళూ విరిగిపోవాలా?”
“ ఇంతకీ నన్ను ఎందుకు పిలిచావ్ ?” చేతివేళ్ళని ఊదుకుంటూ అడిగాడు రాజారావు.
“ ఇంట్లో కూరల్లేవు. బజారుకు వెళ్లి తేవడానికి పిలిచాను " చెప్పింది రమణి.
ఆశ్చర్యంగా చూశాడు రాజారావు.
“ ఆ మాట చెప్పడానికా అంత గట్టిగా గావుకేకపెట్టి పిలిచావ్ ?” అన్నాడు కోపంగా రాజారావు.
“ నేనెప్పుడూ అలానే పిలుస్తాను...ఈ వేళ కొత్తేం ఉంది.లేకపొతే మీకు వినబడదుగా. ఆ దుక్కుమాలిన పేపర్లో మునిగిపోతారు.అంతిదిగా చదవడానికి ఆ పేపర్లో ఏముంటుందో …?”
“ వార్తలు " అని చెప్పాడు రాజారావు.
“ ఆ చదివార్లే వార్తలు. అందరూ చదవట్లేదు మీరొక్కరే చదువుతున్నారు.వేరేవాళ్ళు పేపరు చదివినా ఇంటి విషయాలు పట్టించుకుంటారు.మీరు మాత్రం దాంట్లో మునిగిపోయి ఏమీ పట్టించుకోరు. పేపర్లోని ప్రతి అక్షరం చదివి తీరాలా?” అన్నది రమణి.
“ నన్నాడి పోసుకుంటావు గానీ మీ నాన్న గురించి అనవెం? నేనే నయం ఇంట్లో కుర్చీలో కూర్చుని చదువుకుంటాను. మీ నాన్నైతే పేపర్లని లెట్రిన్ లోనికి తీసుకెళ్ళి కూర్చుంటారు. ఇవతల ఎవరికైనా అర్జంటైతే చావాల్సిందే " అన్నాడు రాజారావు.
“ ఎంతసేపూ మా పుట్టింటి వాళ్ళని ఆడిపోసుకుంటారెం?” మొటికలు విరిచింది రమణి.
“ మరి నన్నాడి పోసుకుంటే నేనాడిపోసుకోనా ?” రాజారావు కూడా మొటికలు విరిచి " హబ్బా ఉఫ్...” అన్నాడు వేళ్ళు చూసుకుంటూ.
“ ఇంతకీ కూరగాయలు తెస్తారా లేదా ?” కొంచం కోపంగా అంది రమణి.
“ తేను... నేను వార్తలు చదువుకోవాలి. ఈవాల్టికి ఏదో ఒక కూర చెయ్. తరువాత వీధిలోకి కూరగాయల బళ్ళు వస్తాయిగా అప్పుడు కొనుక్కో " అని చెప్పి వరండాలోకి వచ్చి పేపరు పట్టుకుని కూర్చున్నాడు రాజారావు. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి వచ్చాడు.
“ ఏమండీ...” అంటూ రాజారావుని పిలిచాడు అతను.
రాజారావు అప్పటికే పేపర్లో మునిగిపోయాడు.
“ ఏమండీ...” మరోసారి పిలిచాడు అతను.
రాజారావు పలకలేదు.
మరో రెండుసార్లు పిలిచాడు.
అయినా లాభం లేకపోయింది.
“ ఏమండోయ్ " గావుకేక పెట్టాడు అతను.
రాజారావు విసుగ్గా ఇంట్లోంచి చూస్తూ అన్నాడు.
“ నేను కూరగాయలు తేనని చెప్పానా? ఏంటా గావుకేకలు... అరిచి అరిచి నీ గొంతు ఎలా బొంగురు పోయిందో చూడు " నెమ్మదిగా అన్నాడు రాజారావు.
వచ్చిన వ్యక్తి ఆ మాట విని కంగారు పడిపోయాడు.
“ ఏమండీ... ఇటండీ... ఇటు " అంటూ సైగలు చేశాడు ఆ వ్యక్తి.
రాజారావు తలతిప్పి అతన్ని చూశాడు.
“ ఇప్పుడు పిలిచింది మీరా ?” అడిగాడు రాజారావు.
“ అవునండీ... నా పేరు సింగినాథం అండీ..మరేమోనండీ ఈ పక్కింట్లోకండీ కొత్తగా దిగానండీ..” అని చెప్పాడు సింగినాదం.
“ ఓహో... నా పేరేమో రాజారావు " అని తనని తాను పరిచయం చేసుకున్నాడు రాజారావు.
“ నాకు తెలుసండీ... మీ గురించి అన్నీ తెలుసుకునే వచ్చానండీ " అని అన్నాడు సింగినాదం.
“ కూర్చోండి " అన్నాడు రాజారావు.
“ అబ్బే... నాకు కూర్చోవడానికి టైం లేదండీ..బోల్దన్నీ వార్తలు చదువుకోవాలండీ..” అన్నాడు సింగినాదం.
“ మీ ఇంట్లో ఏ పేపరు తెప్పిస్తారు ?” ఆశగా అడిగాడు రాజారావు తన ''తెలుగు దిబ్బ'' చదివేసిన తరువాత ఆ పేపరు తీసుకుని చదువుదామని.
“ మా యింట్లో ఏ పేపరు తెప్పించమండీ ...”
“ మరి మీరు వార్తలు ఎలా చదువుతారు ?” ఆశ్చర్యంగా అడిగాడు రాజారావు.
“ అదేంటండీ...మీ పేపరుంది కదండీ. భలే వారండీ మీరు. భలే జోకులు వేస్తారు. ఓసారి మీ పేపరు ఇవ్వండి. చదివేసి ఇస్తాను " అన్నాడు సింగినాదం.
రాజారావు గిలగిలలాడిపోయాడు.
“ కానీ నేను చదవలేదే! ” అన్నాడు.
“ నేను చదివాక ఇస్తానుగా. అప్పుడు చదువుకుందురు గాని " నవ్వుతూ అన్నాడు సింగినాదం.
రాజారావుకి ఏమనాలో తోచలేదు. మనిషి చూస్తే కొత్తవాడు ఏమనటానికి మొహమాటం.
“ నేను మొదటి పేజీ చదివేశాను. మీరు ఇది తీసుకెళ్ళి చదివితెంది. ఈలోగా నేను వేరే పేజీలు చదివి ఇస్తాను" అంటూ మొదటి పేజీ చింపి సింగినాథానికి ఇచ్చాడు రాజారావు. సింగినాథం రాజారావుకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు.
రాజారావు రెండు నిమిషాలు పేపరు చదివాడో లేదో ఒక పాతికేళ్ళ యువకుడు వచ్చాడు.
“ ఎవరు బాబూ నువ్వు " అని అడిగాడు రాజారావు.
“ మేము ఈ పక్కనే ఉంటామండీ … సింగినాదం గారనీ మా నాన్నగారు. నా పేరు రవీంద్ర " అన్నాడు ఆ యువకుడు.
“ మీ నాన్నగారితో చెప్పు...తానింకా రెండో పేజీ చదవలేదని " అన్నాడు రాజారావు పళ్ళు నూరుతూ.
“ అబ్బే.. నేను మా నాన్నగారి గురించి రాలేదండీ... నాకు వేరే పనుంది " చెప్పాడు ఆ యువకుడు.
“ ఏంటది ?” కొంచం కంగారుగా అడిగాడు రాజారావు.
“ మీ యింట్లో తెలుగుదిబ్బ పేపరే కదా తెప్పిస్తారు ?” అడిగాడు ఆ యువకుడు.
“ అవును ఏం ?” అన్నాడు రాజారావు తెలుగు దిబ్బను వెనక్కి దాచేస్తూ.
“ మీరలా దాచెయ్యకండి ప్లీజ్... నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. మీ న్యూస్ పేపర్లో ఆఖరి పేజీ ఇవ్వండి. చదివి వెంటనే తెచ్చి ఇస్తాను " అన్నాడు రవీంద్ర.
“ ఉహు...నేను ఇవ్వను" అన్నాడు రాజారావు.
రవీంద్ర, రాజారావుని బతిమాలి ఆఖరి పేజీ లాక్కెళ్ళి పోయాడు.
మరో రెండు నిమిషాలకి ఒక ఆరేళ్ళ బాబు వచ్చాడు.
“ ఎవరు బాబూ నువ్వు ?” అడిగాడు రాజారావు.
“ సింగినాదం గారబ్బాయి నండీ.. మా అమ్మగారేమో మీ దగ్గరికి పంపారండీ " అని చెప్పాడు ఆ ఆరేళ్ళ పిల్లాడు.
“ ఎందుకు?” ఆశ్చర్యంగా అడిగాడు రాజారావు.
“ మరేమోనండీ... మా చెల్లెలికేమోనండీ రెండేళ్ళు ఉంటాయండీ. అదేమోనండీ... ఇంట్లో పాత బట్టలు లేవండీ... అందుకనండీ...మీ పేపర్లో అడ్వర్ టైజ్ మెంట్లుండే కాగితం ఉంటుంది కదండీ. అది మీకు పనికరాదు కదండీ... అదిస్తే మా అమ్మ దాంతో ఎత్తిపారేస్తుందండీ " అని చెప్పాడు ఆ ఆరేళ్ళ బాబూ ముసి ముసిగా నవ్వుతూ.
రాజారావు విసుక్కుంటూ న్యూస్ పేపర్లోంచి అడ్వర్ టైజ్ మెంట్లున్న పేపరిచ్చాడు.
ఆ బాబు వెళ్ళగానే సింగినాదం మళ్ళీ తయారయ్యాడు.
“మొదటి పేజీ చదివేశాగా... ఇంకో పేజీ ఇవ్వండి " అన్నాడు సింగినాదం.
రాజారావు తలపట్టుకున్నాడు.
ఇలా రోజూ జరగడం మొదలయింది.
ఒకరోజు పేపరు కుర్రాడు న్యూస్ పేపరు వెయ్యకుండా వెళ్లి [పోతుంటే, రాజారావు పిలిచి అడిగాడు.
“ మీకిచ్చిన వెంటనే ఎలాగూ వాళ్ళు ఒక్కో పేపరూ పట్టుకెళ్ళి పోతారు కదండీ...అందుకే ఏకంగా వాళ్ళింట్లోనే పేపరు వేశానండీ " అని ఆ పేపరు వాడు వెళ్ళిపోయాడు.
ఇలా లాభం లేదని రాజారావు పేపర్ తెప్పించడం మానేశాడు.
ఒకరోజున రాజారావు వరండాలో కూర్చుని ట్రానిస్టర్లో వార్తలు వింటున్నాడు.
అంతలో సింగినాదం వచ్చాడు.
“ నేను పేపరు తెప్పించడం మానేశాగా? అది మీకు తెలుసుగా ?” చిలిపిగా నవ్వుతూ అన్నాడు రాజారావు.
“ తెలుసు...కానీ న్యూస్ తెలుసుకోకపోతే నాకు తోచదే మరి. మరేమోనండీ..మా ఇంట్లో ట్రానిస్టర్ లేదండీ. మరి వార్తలు వినాలంటే ట్రానిస్టర్ కావాలి కదండీ. అందుకనేనండీ... మరేమోనండీ...” అని సింగినాదం చెప్పుతున్నాడు.
రాజారావు నోరు తేరుకుని వింటున్నాడు.
|