Common Man Sense of humor

కామన్ మ్యాన్ సెన్సాఫ్ హ్యూమర్

**************************

“ ఇచ్చట ఈ క్రిందివి నేర్పబడును " ఆ బోర్డు చూపిన సుబ్బారావు ఉలిక్కిపడ్డాడు.

ఇచ్చట ఈ క్రిందివి నేర్పబడును అని బోర్డు మాత్రం ఉంది కానీ, ఆ కింద ఏమీ లేదు. అలా ఏమి లేకపోవడంతో అసలేముందో తెలుసుకోవాలనే ఓ గొప్ప ఆలోచన సుబ్బారావు మనసులో కదలగానే ఏ మాత్రం ముందు వెనకా, ఈ పక్కా ఆ పక్కా ఆలోచించి చటుక్కున ఆ బోర్డు ఉన్న ఆఫీసు లోపలికి ఎంటరయ్యాడు.

అప్పటికే సుబ్బారావులా ఆలోచించి లోపలికి వచ్చిన వాళ్ళ లైను చాంతాడంతా ఉండడంతో సుబ్బారావు మళ్ళీ ఉలిక్కిపడ్డాడు. ఇదేదో ఖచ్చితంగా తెలుసుకునే యవ్వారంలాగా ఉండే అని మనసులోనే అనుకుని తాను కూడా ఆ లైనులో నిలబడ్డాడు. అసలింతకీ వాళ్ళు ఏమి నేర్పిస్తారబ్బా... అనుకుంటూ ఉండబట్టలేక తన ముందు క్యూలో నిలుచున్నా ఆయన్ని కదిపాడు సుబ్బారావు.

“ సార్...ఇంతకీ వీరు ఏం నేర్పిస్తారు సార్ " అన్నాడు ఆతృతగా.

ముందు నిలబడిన ఆయన వెనక్కి సీరియస్ గా చూసి తన చేతిలో ఉన్న పాంప్లెట్ ఒకటి సుబ్బారావు చేతిలో పెట్టాడు. అతనలా సీరియస్ గా చూస్తే చూడనీ కానీ చేతిలో మాత్రం పాంప్లెట్ పెట్టడంతో, సుబ్బారావు ఆనందంగా ఆ పాంప్లెట్ అందుకున్నాడు.

ఆ పాంప్లెట్ లో ఉన్న పదాలను కళ్ళతోనే గడా గడా చదివేస్తున్నాడు. ఇంతకీ ఆ పాంప్లెట్ లో ఏముందో అని.

“ వెల్ కం టూ ఏక్స్... పీక్స్...థూక్స్...రీసెర్చి అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కామన్ మ్యాన్ కామన్ సెన్స్ ఆఫ్ హ్యామార్ కి... స్వాగతం... సుస్వాగతం... ఈ మా ఏక్స్... పీక్స్...థూక్స్...సంస్థ ద్వారా కామన్ మ్యాన్ కి ఎన్నో విషయాలు నేర్పబడతాయి. ఆ విషయాలు కామన్ మ్యాన్ అనేవాడు ఖచ్చితంగా నేర్చుకుని తీరాలని మా ఉద్దేశం.

ఎందుకంటే నేడు సమాజంలో కామన్ మ్యాన్ జీవించేందుకు కావాల్సిన ముడు సరుకు మేము కావలసినంతగా మీకు అందిస్తాం.ముడి సరుకంటే మరీ బెదిరి పోకండి. ఓ బాగా ఎక్సర్ సైజ్ చేసేంత ముడి సరుకని భయపడకండి. జస్ట్ మీరు చూసి నేర్చుకోవడమే అంతే!

ఇంతకీ మేము మీకు నేర్పించేది ఏమిటంటే...

మీకు ఒకరిపై పీకల వరకూ కోపం ఉందనుకోండి. మీ కోపం చల్లారే దాకా వారిని ఏ విధంగా తిట్టాలి.

మీరు మీ ఎదుటివారిని తీవ్రంగా టేక్షన్ కి గురిచేసి మీలో ఉన్న షాడిజాన్నిసాటిస్ ఫాక్షన్ చేయడం ఎలా...?

అతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపించి గొడవలు సృష్టించడం ఎలా?

బుద్దిగా చదువుకునే పిల్లలకి సెక్స్ బొమ్మలు చూపిస్తూ వారిని ఉత్తేజపరిచి తప్పు దోవ పట్టించడం ఎలా?

సమాజంలో ఉన్న చీడని దులిపెస్తున్నామని చెబుతూ మరింత చీడని నెత్తిన రుద్దడం ఎలా?

టెర్రరిస్టులు, దొంగలు, రౌడీలు, రేపిస్టులకి వారి వారి యాక్టివిటీసులో మరింత యాక్టివ్ గా పాలు పంచుకునేలా చేయడం ఎలా?

ఆ లిస్టుని చూడగానే సుబ్బారావు బుర్రకాయ్ బెలూన్ లా ఉబ్బిపోయింది.అప్పటి వరకూ అసలు అలాంటి ఆలోచనలు కూడా ఉంటాయన్న ఆలోచన కూడా సుబ్బారావులో లేదు.

అందుకే అతని బుర్రకాయ్ బెలూన్ లా ఉబ్బిపోయింది. సమాజానికి మంచి చేయడం అన్నది పక్కన పెడితే ఎదుటి మనిషిని పాడు చేసి తాను మాత్రం ఎదిగిపోవాలన్న ఓ ఆలోచన ప్రతీ మనిషిలోనూ ఎక్కడో ఒక మూల ఉండే ఉంటుంది. కానీ మానవత్వం, మంచితనం ముందు అవి మరుగున పడిపోతాయి. కానీ ఆ మరుగున పడిపోయిన దాన్ని వెలికితీసి మరీ, మనిషిలోని మృగాన్ని నిద్రలేపే విద్య ఏమిటబ్బా అది. ఇలా ఆలోచించిన సుబ్బారావుకి అదేమిటో తెలుసుకోవాలన్న బలమైన కోరిక కలగడంతో ఆ క్యూ లైన్ లో స్థిరంగా నిలబడి పోయాడు.

ఆ క్యూ లైను ముందు ఓ వ్యక్తి అందరి దగ్గర డబ్బులు కలెక్టు చేస్తున్నాడు అతనికి వెనుకగా ఓ పది క్యాబిన్లు కనిపిస్తున్నాయి. డబ్బులు తీసుకున్న వారిని ఒక్కొక్కరినీ ఒక్కో క్యాబిన్ లోకి పంపిస్తున్నారు.

సుబ్బారావుకి చాలా ఆత్రంగా ఉంది. ఆ క్యాబిన్ లోకి దూరిపోయి ఇంతకీ వారు ఎలా కోచింగ్ ఇస్తున్నారో తెలుసుకోవాలనే ఆరాటం అతనిది.చివరికి ఓ రెండు గంటలు గడిచాక గానీ సుబ్బారావు వంతు రాలేదు. సుబ్బారావు డబ్బులు కలెక్టు చేస్తున్న అతని దగ్గరికి రాగానే అతను సుబ్బారావుని చూసి “ సార్... ఏది సెలెక్ట్ చేసుకున్నారు ?” అని అడిగాడు.

“ సెలెక్ట్...అంటే ?” అతను సుబ్బారావుని ఎగాదిగా చూశాడు.

“ అదేనండీ... మీ చేతిలో ఆ పాంప్లెట్ ఉంది కదా! ఆ పాంప్లెట్ లో కేటగిరీలు ఉన్నాయి కదా... ఆ కేటగిరీలో మీకు ఏ కేటగిరీ నచ్చితే ఆ కేటగిరీలోకి మిమ్ముల్ని పంపిస్తామన్నమాట. మీకు అందులో ఉన్న మొత్తం కేటగిరీలు కావాలనుకుంటే దానికి సపరేటు రేటు ఉంటుందన్నమాట.

“ సరే...అయితే నాకు చిన్న పిల్లల్ని సెక్స్ బొమ్మలు చూపిస్తూ వారిని తప్పుదోవ పట్టించడమనే కేటగిరీ ఉంది చూశారు...అది కావాలి " అని చెప్పాడు సుబ్బారావు.

“ ఓస్..అదా...అయితే ఓ అయిదు వందలివ్వండి " అన్నాడు ఆ వ్యక్తి. అతను అడిగినట్టుగానే అయిదు వందలు ఇచ్చాడు సుబ్బారావు. ఆ డబ్బులు తీసుకుని సుబ్బారావుని ఒక క్యాబిన్ లోకి పంపించేశాడు.

ఆ క్యాబిన్ లోకి వెళ్లి ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసిన సుబ్బారావు కళ్ళు గిర్రా గిర్రా తిరిగాయి. అతని ఎదురుగా ఓ టి.వి. ఉంది. ఆ టి.వి లో ఓ న్యూస్ ఛానెల్ లో వచ్చిన ప్రోగ్రాం లు వస్తున్నాయి.

సినిమా వాళ్లకి సంబంధించిన ఎఫైర్స్ గురించి, హీరోయిన్ లు నగ్నంగా నటించిన చిత్రాల గురించి (నగ్నంగా ఉన్న ఫొటోలతో సహా) ఏ హీరోయిన్ ఏ హీరోతో డైటింగ్ చేస్తోందన్న వాటి గురించి(బెడ్ రూం సీన్లతో సహా) ఓ క్యారెక్టర్ నటి మరో యువ హీరోతో దొంగచాటుగా నడుపుతున్న యవ్వారం అంటూ( వారు శృంగారంలో పాల్గొన్న సీన్లతో సహా) ఓ వ్యాంప్ ఆరిస్టు వ్యభిచారం చేస్తూ పోలీసులకి చిక్కిన యవ్వారం (ఆ ఆరిస్టు వ్యభిచారం చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలను యదాతథంగా చూపిస్తూ) సుబ్బారావుకి ఆ ప్రోగ్రాంలు వరుసగా చూసేసరికి మతి పోయింది.

ఆ మిగతా క్యాబిన్ లలో కూడా ఆయా న్యూస్ ఛానెల్స్ లలో వచ్చిన ప్రోగ్రాంల నుంచి కేటాగిరీలుగా విడగొట్టి వాటిని సేకరించి ఏక్స్... పీక్స్...థూక్స్...రీసెర్చి అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కామన్ మ్యాన్ అనే సంస్థ ఏర్పాటు చేసి కామన్ సెన్సు ఆఫ్ హ్యూమర్ ని పెంపొందిస్తున్నారన్న మాట.

అవును మరి. మెరుగైన సమాజం కోసం ఏర్పాటు కాబడిన న్యూస్ ఛానల్స్ లో వచ్చే ప్రోగ్రాం లను ముందు ముందు ఇలా కామన్ మ్యాన్ కామన్ సెన్సు ఆఫ్ హ్యూమర్ ను పెంపొందించడానికి ఇలాంటి సంస్థలు కూడా వెలువడతాతాయేమో...ఏమో.!