TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఓటు బ్యాంకు...!
-పద్మశ్రీ
ఆయన వచ్చే ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా పోటీచేసే అభ్యర్థి. చాలా హడావిడిగా కనిపిస్తున్నాడు. అతని అనుచరులతో అప్పుడే ఆ ఏరియాలోకి ఎంటరయ్యాడు. వచ్చీ రావడంతోనే వారి చూపులన్నీ ఆ వీధి నలుమూలలా వ్యాపించాయి.
చుట్టూ చూసిన ఎమ్మెల్యే అభ్యర్థికి ఓ దృశ్యం కనిపించింది. అది చూసిన ఆయనకి వెయ్యేనుగుల బలం వచ్చింది.వెంటనే వచ్చిన అనుచరులకి వినిపించేలా గట్టిగా... రెండు చేతులని అటువైపు సూటిగా చూపిస్తూ “ఎటాక్..” అని గట్టిగా అరిచాడు.
అంతే మరుక్షణం అనుచరులు ఉన్నచోట మాయమై కాబోయే ఎమ్మెల్యే చూపించిన చోట ప్రత్యక్షమయ్యారు. వారు షార్ప్ గా కదులుతున్నారు. వారి చేతిలో ఉన్న పనిముట్లు వాటి పని అవి చేసుకుపోతున్నాయి.. పది నిమిషాలపాటు పదిమంది ఎమ్మెల్యే అనుచరులు ఓపికని ఒంట్లోకి తెచ్చుకుని మరీ ప్రయత్నిస్తున్నారు. వారు చేస్తున్న హడావిడికి ఆ వీధిలోని జనం బయటికి వచ్చారు.
ఎమ్మెల్యే అభ్యర్థి అనుచరులు చేస్తున్న కార్యక్రమాన్ని చూసి ఎంతో సంబరపడ్డారు. అంతేకాదు ఆ అనుచరులకి కావాల్సినంత సహాయ సహకారాలూ అందించారు. వారందిస్తున్న సహకారానికి ఎమ్మెల్యే అభ్యర్థి ముగ్డుడయ్యాడు.
ఒక్కసారిగా తాను భారీ మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యినట్టు, జనాలందరూ తన నెత్తిపై పూలు జల్లుతూ ‘జిందాబాద్’ లు కొడుతున్నట్టు ఊహించుకున్నాడు కూడా.
‘సార్... ఈ బస్తీ కంప్లీటయిపొయింది. వేరే బస్తీకి వెళ్దాం పదండి...!” అరిచాడు ఓ అనుచరుడు. అతని అరుపుకి ఈ లోకంలోకి వచ్చి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన అనుచరులతో సహా అక్కడినుండి ఠపీమని మాయమైపోయి మరో బస్తీలో ప్రత్యక్షం అయ్యాడు. అలా అయ్యారో లేదో వెంటనే రంగంలోకి దిగేశారు. అక్కడి బస్తీ వాసులు కూడా వారు చేస్తున్న పనికి ఎంతో సహకారాన్ని అందించారు.
ఆ బస్తీవాసులు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి చేస్తున్న అ కార్యక్రమాన్ని ఎంతో అభినందించారు. ఎమ్మెల్యే అభ్యర్థి మళ్ళీ డ్రీం లోకి వెళ్ళిపోయాడు. ఈసారి పశు సంహారక శాఖ’... ఛ...ఛ...కాదు.... కాదు.. ‘పశు సంవర్థక శాఖ’కి మంత్రిని అయినట్టు కనేశాడు ఓ కల.
మళ్లీ ఓ అనుచరుడు అరవడంతో ఈ లోకంలోకి వచ్చి వెంటనే ఆ బస్తీలో నుండి మాయమై మరో బస్తీలో ప్రత్యక్షం అయిపోయి కార్యరంగంలోకి దూకిపోయారు. అక్కడి జనాలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి చేస్తున్న పనికి ఎంతో సంబరపడిపోయారు.
“అబ్బబ్బ.... ఇన్నాళ్ళుగా మాకు పట్టిన ఈ శని ఈరోజుతో విరగడ అయిపొయింది...” అన్నాడు.
“అవునవును... ఎమ్మెల్యే అభ్యర్థి చేస్తున్న ఈ మంచి పనివల్ల మన కాలనీలో సగం దరిద్రం పోయినట్లే.. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో ఈయనే ఎమ్మెల్యేగా గెలుస్తాడు...” మరో వ్యక్తి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.
“అలా గెలవాలనే కదయ్యా... మేమింతలా కష్టపడుతున్నది...?” ఓ అనుచరుడు అన్నాడు. “అంతేలే... ఇప్పటినుండే ప్రజల బాగోగులని పట్టించుకుని ఇలాంటి మంచి కార్యక్రమాలని చేస్తూ పొతే గ్యారంటీగా భారీ మెజారిటీతో గెలుస్తాడు”
“అవునవును... భారీ మెజారిటీతో గెలవాలనే గత వారం రోజులుగా ఈ ఒక్క కార్యక్రమం పైనే దృష్టి పెట్టాం” గంభీరంగా అన్నాడు మరో అనుచరుడు.
“ఈ ఒక్క కార్యక్రమం చేస్తేనే సరిపోదయ్యా.. ఇంకా చాలా చేయాలి. ఇక్కడ దోమల బాధలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పిల్లులు కూడా ఎక్కువగా ఉన్నాయి. రోజూ రాత్రి వేళలో వీటి హింస భరించలేకపోతున్నాం.. వీటి నివారణకి కూడా చర్యలు తీసుకోవాలి” అన్నాడు. “ఏ....? వాటికి కూడా ఓటు హక్కు ఉంటుందా...?” ఆశగా అడిగాడు ఎమ్మెల్యే అనుచరుడు.
“పిల్లులకి, దోమలకి ఓటు హక్కు ఉండటం ఏంటయ్యా?” ఆశ్చర్యంగా అడిగాడు.
“ఏ..? ఎందుకుండకూడదు..? కుక్కలకి ఉన్న ఓటు హక్కు పిల్లులకి, దోమలకి, ఎలకలకి, పందులకి కూడా ఉండాలి.. అప్పుడే మా అన్న భారీ మెజారిటితో గెలుపొందుతాడు” ఆవేశంగా అన్నాడు ఓ అనుచరుడు.
“అంటే... బస్తీవాసుల పిక్కలని కారుస్తూ నానా హింసకు పాల్పడుతున్న ఈ కుక్కలని పట్టుకుపోతున్నది ప్రజోపయోగం కోసం కాదా...?” అనుమానంగా అడిగాడు.
“ఛ... ఛ... కనే కాదు! మీకు తెలీదేమో... మనవాళ్ళు ఈమధ్య ఓటర్ల లిస్టులో కుక్కలకి కూడా చోటిచ్చి, వాటికి కూడా ఓటు హక్కుని కల్పించారు. ఈ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లానుండి స్టార్ట్ చేసారు. రేపో మాపో ఇప్పుడు మేము పట్టుకెళ్తున్న కుక్కలని కూడా ఓటర్ల లిస్టులో చేరుస్తారు. అలా చేర్చేలోపే ఈ కుక్కలని మా వైపుకి తిప్పుకుని ఒచ్చే ఎలక్షన్లలో మాకే ఓటేసేలా చేయడానికి ఈ నియోజకవర్గంలో ఉన్న కక్కులన్నింటినీ తీసుకెళ్తున్నాం...” గర్వంగా అన్నాడు ఎమ్మెల్యే అభ్యర్థి అనుచరుడు.
ఏమిటో..! నేడు ఓటర్ల లిస్టులో కుక్కలనీ చేర్చారు... అవును మరి... కొన్ని గాడిదలూ, దున్నపోతులూ ఎలక్షన్లలో నిలబడ్తున్నప్పుడు కుక్కలు ఓటర్లుగా ఉండడంలో ఆశ్చర్యమేముందీ...?
|