BellGraham

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

బెల్ గ్రహం

ఐ.ఎ.నరసింహం

శాస్త్రిగారొచ్చారు. నీలవేణి ఏకదంతం తూర్పు ముఖంగా కూర్చున్నారు.ఉత్తర ముఖంగా శాస్త్రిగారు కూర్చుని వారికి మధ్యలో ఫోన్ పెట్టి,దాని ముందు దీపం పెట్టి కొన్ని అగరొత్తులు వెలిగించి వారిద్దరి చేత సంకల్పం చేయించి విశ్నేశ్వర పూజ చేసి ఇంగ్లీష్ లో ఉన్న ఫోన్ నామధేయాన్ని సంస్కృతంలోకి తర్జమా చేసి "దూర్వాణి యంత్రపూజం కరిష్యే.”అంటూ వారిద్దరి చేత ఓ చెంబు నీళ్ళలో వెళ్ళు ముట్టించాడు.

తరువాత ఫోన్ కి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఓ పూలదండ చుట్టి ఓ కొబ్బరికాయ కొట్టి పూజ ముగింపజేశారు.ఒక్కసారి ఎడమచేతి ముందు భాగానికి కట్టుకున్న వాచీవంక చూసి "అయ్యా టైము కావస్తోంది.ఇంకా ఫోన్ ను టేబులు మీద పెట్టి కనేక్షనిచ్చి ఎవరో ఒకరికి "హలో అనండి " అన్నారు శాస్త్రిగారు.

అంతే. ఏకదంతం,నీలవేణి కలిసి జాగ్రత్తగా ఆ ఫోన్ ను మీదకేత్తుతుంటే "దూర్వాణి పేటి కాయాం ఉన్నతాసన మావావాయామి స్థాపయామి "అంటూ శాస్త్రిగారు మంత్రాలు చదివారు.

“ఏమండి !”అంది నీలవేణి.

“ఏమిటి ?”అన్నాడు ఏకదంతం.

“ఫస్ట్ ఫోన్ మా పిన్నికి చేస్తానండి !”అంది.

ఏకదంతం ఆలోచనలో పడ్డాడు.టౌన్ లో ఉన్న తన స్నేహితుడు వరదరాజుకి ఫస్ట్ ఫోన్ చేస్తానని నిన్ననే వాగ్దానం చేశాడు.ఆ మాటే చెప్పాడు భార్యతో. నీలవేణి ముఖం మాడ్చుకుంది. ఏకదంతం బాధపడ్డాడు.ఓ రెండు నిముషాలు తరువాత "సరే అలాగే చెయ్యి "అన్నాడు భార్యతో.

సరిగ్గా అప్పుడే...ఫోన్ రింగవటం ప్రారంభించింది. నీలవేణి,ఏకదంతం,శాస్త్రిగారు ఆశ్చర్యపోయారు. “అయ్యా గొప్ప శుభ శూచకం సరిగ్గా సమయానికే మీకెవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు.అలా అందుకోవడం కూడా మంచిదే.కానివ్వండి "అన్నారు శాస్త్రిగారు.

ఏకదంతం రిసీవర్ అందుకుని చెవికి మూతికి కనేక్షనిచ్చాడు. “హలో "అవతలి నుండో స్త్రీ గొంతు.

“హలో "అన్నాడు ఏకదంతం ఉత్సాహంగా.

“హలో "అందాగొంతు మళ్ళీ.

“హలో చెప్పండి!ఎవరు కావాలి ?”అన్నాడు ఏకదంత.

“హలో సార్ మీరేమీ అనుకోకపోతే ఒక్కసారి మీ యింటి ప్రక్కనున్న అచ్యుతరావుగారితో పుట్టింటి కెళ్ళిన వారి భార్య చచ్చిపోయిందని అర్జంటుగా తనను బయలుదేరి రమ్మని చెప్పగలరా...”అంది గాభరాగా.

ఏకదంతం గుండె గుభేల్ మంది.ప్రారంభంలోనే ఈ చావు వార్తేమిటిరా బాబు అనుకుంటూనే ముఖం మీద ముసురుకుంటున్న చెమట్లు తుడుచుకుంటూ "హలో యింతకీ మీరెవరు ?”అన్నాడు.

“నన్నడుగుతారేం ఇంతకూ మీరెవరు?మీ ఫోన్ నెంబరెంత ?”అవతలి గొంతు చెవిలో ఖంగ్ మంది.

“నా నెంబర్ మాటకేం గానీ మీకే నెంబర్ కావాలో చెప్పండి "మళ్ళీ అన్నాడు ఏకదంతం.

“అయ్యా ఇది త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ కాదా" అంతే...ఏకదంతం ఒకసారి తన ఫోన్ వంక చూసి "తల్లీ ఇది సిక్స్ వన్ త్రీ ఫోర్ పైవ్ "అన్నాడు.

“ఏం జరిగింది ?ఎవరు ఫోన్ చేశారు ?మనకి ఫోనోచ్చిందని అప్పుడే అందరికీ ఎలా తెలిసి పోయింది" నీలవేణీ ప్రశ్నల వర్షం కురిపించింది.

“అయ్యా శుభవార్త విన్నట్టేనా ?”శాస్త్రిగారు అడిగారు. ఆయన వేపు,భార్య వేపు జాలిగా చూసి "మొదట్లోనే చావు వార్త వినవలసి వచ్చిందండి బాబు " అన్నాడు ఏకదంతం.

“అయ్యా కంగారు పడకండి.అసలీ పెట్టెల ప్రభావమే అంత.సరే అదోష పరిహార్థం మీరే ఎవరికో పోన్ చేసి ఓ మంచిమాట చెప్పమనండి "అన్నారు శాస్త్రిగారు. ఆ ఆలోచన బాగున్నట్టే అనిపించింది ఏకదంతానికి.వెంటనే వరదరాజుకి ఫోన్ చేశాడు.

“హలో "అవతలిగొంతు.

“హలో వరదా "ఉత్సాహంగా అడిగాడు.

“కాదండి.వారబ్బాయిని మాట్లాడుతున్నాను.మా నాన్నగారి ప్రెండేవరో స్కూటరెక్సిడెంట్ లో పోయారట.ఇప్పుడే వెళ్లారు.మీరెవరు?ఎన్ చెప్పమంటారు ?”అనగానే ఫోన్ పెట్టేశాడు ఏకదంతం. విచారవదనంతో ఈ సంగతి చెప్పాడు శాస్త్రిగారికి. శాస్త్రిగారికి భయం వేసింది.పూజ అయిన తరువాత యింకా ఆ దంపతుల చేత తాంబూలం పుచ్చుకోలేదు.సాధారణంగా ఇలాంటి వాటికి ఎవరూ పూజలు చెయ్యరు.

ఏకాదంతానికి కొంచం చాదస్తం ఎక్కువ గనుక రెండు రోజుల క్రితం ముహూర్తానికి తన దగ్గరకొస్తే ఇలా ఫోన్ కి పూజ చేసి వాడమని తనే సలహా ఇచ్చాడు.ఇంతవరకూ సవ్యంగానే జరిగింది.ఎంత హీనపక్షంగానైనా ఓ నూట పదహార్లు ఇవ్వకపోతాడా అన్న ఆలోచనతో వుంటే ఈ చావు వార్తల ప్రభావంతో ఓ పావలా కాసన్నా ఇచ్చేటట్టు కనిపించలేదు.అనుకుంటూనే "అయ్యా మీరాగండి.ఓసారి మీ శ్రీమతగారిని ఫోన్ చెయ్యమనండి "అన్నారు.

వెంటనే నీలవేణి వాళ్ళ పిన్ని నెంబరుకు డయల్ చేసి "హలో"అంటూ తన పేరు చెప్పింది.

“హలో నీలూ నువ్వా!ఎక్కడి నుండి ?”అవతలి కంఠం.

“చెప్పికో చూద్దాం "అంది నీలవేణి ముసిముసిగా నవ్వుతూ.

“బట్టల షాపునుంచా ?”

“కాదు "

“ఆ..తెలిసింది.తిరుపతి నుండి కదూ...నువ్వా మధ్య వెళ్ళానన్నావ్.అక్కడి నుండేనా ?”అంది అవతలి నుండి పిన్ని.

“తిరుపతి నుండి కాదు"

“కాదా...మరెక్కడినుండబ్బా!”

“నువ్వే చెప్పు చూద్దాం "

“ఏమిటి ?...ఎవరు?ఎవరితో మాట్లాడుతున్నావ్ "ఏకదంతం అడిగాడు.

“మనింటికి ఫోనొచ్చిందని తెలీదుకదాండి.నేనెక్కడినుండి మాట్లాడుతున్నానో తెలుసుకోలేక పోతోంది. పాపం "అంది నీలవేణి.

ఏకదంతం కళ్ళు తిరిగాయి. “సరే..నువ్వే చెప్పేసెయ్.అలా ఫోన్లలో గంటల తరబడి పజిల్స్ నిర్వహిస్తే ఎలా ?”అన్నాడు చిరాగ్గా.

“అబ్బ!అలాగేనండి!మీరెవరితోనన్నా ఎంత సేపన్నా మాట్లాడొచ్చు.నేను మాత్రం వెంటనే ముగించేయాలి "రుసరుసలాడింది నీలవేణి.

ఏకదంతం మరి మాట్లాడలేదు.ఆ తరువాత మరో ఐదు నిమిషాలు నీలవేణి మాట్లాడి తనింటికి ఫోన్ పెట్టించామని చెప్పి,నెంబరిచ్చి తనింట్లో ఎక్కడెక్కడ ఏ వస్తువు లున్నాయో,తన కట్టుకున్న చీర రంగేంటో చెప్పి ఆవిడ ద్వారా నల్లేరు వడియాలు ఎలా పెట్టాలో తెలుసుకుని ఫోన్ పెట్టేసింది.

“అయ్యా !మరిక నేను వెళ్ళొస్తాను "శాస్త్రిగారు అనగానే అతనికి తాంబూలంలో ఓ నోటు పెట్టి నమస్కరించాడు ఏకదంతం.

“ఏమండి !”అంది నీలవేణి.

“ఏమిటి ?”

“అదేనండి!ఈ శుభ సందర్భంగా ముత్తయిదువులందరికీ పేరంటం ఏర్పాటు చేశాను.వారికి తాంబూలాలు ఇవ్వడం జరిగింది.వారందరూ వారి వారి బంధువులకి ఒక్కో ఫోన్ చేసి వెళ్తారు "అంది నీలవేణి.

గుండె జారిపోయింది ఏకాందంతానికి.

“నీకేం పిచ్చా?మనకోసం కొన్ని ఫ్రీ కాల్సుంటాయి.అవి ఒక్కరోజే వాడేస్తే ఎలా ?”అన్నాడు ఏకాదంతం మెల్లగా.

నీలవేణి వినలేదు.తరువాత భర్తకేదో నచ్చచెప్పి ఆ మహిళా మణులందరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే...ఊరు ఊరంతా తన ఫోన్ మీద దాడి చేసి,ఆ ఫోన్ నెంబరుకు ఏ అవసరం వచ్చిన ఫోన్ చెయ్యమని చెప్పి అందరూ నిష్కమించారు.

***

రాత్రి పదకొండు గంటలు దాటింది. ఏకదంతం నీలవేణి గాఢంగా నిద్రపోతున్నారు. ట్రింగ్..ట్రింగ్..ట్రింగ్...ట్రింగ్... ఏకదంతానికి మెలకువ వచ్చింది.భార్య వేపు చూశాడు.పగలంతా పనితో అలిసిపోయిన నీలవేణి నిద్రపోతూనే ఉంది.

మెల్లగా లేచి రిసీవరందుకుని "హలో "అన్నాడు.

“అయ్యా ఇది దంతంగారిల్లేనా ?”అడిగారెవరో. ఒళ్ళు మండిపోయింది ఏకదంతానికి.

“పగలంతా అడ్డమైన వాగుడూ వాగి అవసరమైన పేరు పెట్టి పిలవడంలో మాత్రం కొందరు పొదుపు పాటిస్తారు.దంతం ఏమిటి దంతం...”గొణుక్కున్నాడు.

“అయ్యా మీరు గొణుక్కోవటం వినిపిస్తోంది.సాధారణంగా మనిషికి ముప్ఫై రెండు దంతాలుంటాయి. మీకు మరీ ఏకదంతం అంటే బావుండదేమోనని...”

“సరే సరే విషయం చెప్పండి"

“మరేం లేదు.మీ యింటికి ఆరో యింట్లో మా మేనల్లుడు పురుషోత్తం ఉంటాడు.రాత్రి పదకొండు తరువాత ఫోన్ చేస్తే డబ్బులు తగ్గుతాయి.కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను.ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి.నేను రేపు మళ్ళీ ఇదే టైముకి ఫోన్ చేస్తాను.కాస్త ఫోన్ దగ్గరుండమని చెప్పగలరా " అంటూ కట్ అయింది.

ఏకదంతానికి తల తిరిగిపోయింది. కొన్ని అనుబంధాలకి కొన్ని అత్యవసరాలకి ఫోన్ చాలా ఉపయోగపడుతుందని భావించి ఫోన్ వేయించాడు.యింట్లో అటు చెంబు ఇటు పెట్టని మనిషి ఈ ఫోన్ల తాకిడితో ఎవరెవరికో ఏ రాత్రి వేళ సమాచారం అందించవలసి వస్తోంది.ఆఫీసు నుండి రాగానే కాసేపు విశ్రాంతి తీసుకునే వాడు ఇప్పుడు అవకాశం కూడా లేకుండా ఊరందరూ ఫోనొస్తుందని కుర్చీలు సోఫాలే కాకుండా మంచం మీద కూడా కూర్చుండి పోతున్నారు.

ఈ ఫోన్ తన కంటే ఇతరులకే ఎక్కువ ఉపయోగపడుతున్నట్టుంది అన్న ఆలోచనతో రిసీవరు తీసి బైట పెట్టి హాయిగా నిద్రపోయాడు ఏకదంతం. తెల్లవారింది. బాత్రూంలో ఉన్న ఏకదంతానికి రింగ్ వినిపించింది. ఎంగిలి బ్రష్ ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో రిసీవర్ రెత్తి "హలో " అన్నాడు.

అట్నుంచి ఏం సమాచారం వచ్చిందో మరి వెంటనే ఫోన్ కనక్షను తీసి,నూతన గృహ ప్రవేశ సమయంలో వాకిట్లో దిష్టి గుమ్మడికాయలు పగలకొట్టినట్టు నేలకేసి కొట్టాడు. సరిగ్గా అప్పుడే... “ఏమండోయ్ నిన్న సాయంత్రం మీరు లేనప్పుడు మీ ఎం.డి.గారు ఫోన్ చేశారు.ఇవాళ ఎనిమది గంటలకి ఫోన్ దగ్గరుండమన్నారు.ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడట "వంటింట్లోంచి అంది నీలవేణి.

(హాసం సౌజన్యంతో)