Assistant Sundaram

అసిస్టెంట్ సుందరం

యస్.యస్.కృష్ణ

ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ గా పేరు పొందిన గుర్నాధంకు ఏదో గబుక్కున గుర్తుకు రావడంతో అటెండర్ ను గట్టిగా పిలిచాడు. ఆ అటెండర్ అదిరిపడి గబగబా పరుగులాంటి నడకతో గుర్నాధం దగ్గరికి వచ్చాడు.

“నేను పిలవకుండా నా రూములోకి ఎందుకు వచ్చావు ?”అని అటెండర్ మీద సీరియస్ అయ్యాడు.

ఏమి అర్థం కాని ఆ అటెండర్ తలగీక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుండగా ...ఏదో గుర్తుకు వచ్చిన గుర్నాధం,వెళ్ళిపోతున్నా అటెండర్ ను చూసి "అటెండర్...”అన్నాడు.

అదిరిపడి గబుక్కున తిరిగి "సార్...చెప్పండి "అన్నాడు భయంతో.

“నా అసిస్టెంట్ సుందరాన్ని పిలువు "

“అలాగే సార్ "అని చెప్పి అక్కడి నుండి పరుగెత్తి అసిస్టెంట్ సుందరానికి చెప్పాడు.

అసిస్టెంట్ సుందరం కూడా మనస్సులో గుర్నాధంను తిట్టుకుంటూ,అతని దగ్గరికి వచ్చాడు.

“చూడు సుందరం!మా పాత కొలీగ్ ఒకాయన్ని రైలెక్కించాలి.ఆయనకూ నాలాగే మతిమరుపు.స్టేషన్ వెళ్ళాక కబుర్లలో పడి రైలు కదిలే ముందు ఎవరు ట్రెయిన్ ఎక్కాలో మర్చిపోయి ఖంగారు పడ్డ సందర్భాలు ఉన్నాయి.ఈ సారి నువ్వు నాతో రా.ఎవరు రైలెక్కాలో ఖచ్చితంగా విడమరిచి చెప్పు "అన్నాడు గుర్నాధం.

“అలాగే సార్ "అని కుదుట పడ్డాడు సుందరం.

అరగంట తరువాత.

రైల్వే ప్లాట్ ఫాం మీద ప్రోపెసర్లిద్దరూ కబుర్లలో పడ్డాడు.గతంలా మాత్రం జరగలేదు.రైలు వెళ్ళిపోయాకనే ప్రయాణం సంగతి గుర్తొచ్చింది ఇద్దరికీ.

“అరెరే "అన్నాడు వెళ్ళవలసినాయన.

“కంగారు పడకండి.మళ్ళీ టిక్కట్టు కొందాం.ఎవరు వెళ్ళాలో మా సుందరం కరక్టుగా చెప్తాడు "అంటూ “సుందరం...సుందరం...”అని కేక వేశాడు ప్రొఫెసర్.

“మీతో వచ్చిన అబ్బాయాండి !అదేంటోగానీ రైలు కదిలేటప్పుడు కాస్సేపు బుర్రగీక్కుని,చివరకి ఆయనే రైలెక్కేశాడండి "అని చెప్పాడు వెళ్లవలసినాయన.

“ఆఁ..”అని నోరు తెరిచాడు ఆ ప్రొఫెసర్.