Bhadram Bi Care Ful

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

భద్రం...బి..కేర్ పుల్

గోళ్ళమూడి పద్మజ

(విధాత తలొంచుకుని విధి వ్రాతలు రాస్తున్నాడు.వీణాధరి టీ,పాలు,నీళ్ళు,జ్యూస్ లు,టైమ్ ప్రకారం అందిస్తోంది)

పదేళ్ళ భద్రం,బామ్మ సుభద్రతో సినిమా చూస్తున్నాడు.కుంభకర్ణుణ్ణి నిద్రలేపే సీనది.పొట్టమీద శూలాలు గుచ్చినా,చెవుల్లో ఏనుగులు ఘీంకారాలు చేసినా నిద్రలేవని కుంభకర్ణుడు,ముక్కు దగ్గర లడ్డూలు పెట్టగానే లేచాడు.

అంత మొద్దు నిద్రలోనూ పిండివంటల ఘుమఘుమలు ఎలా సోకాయి?అని సందేహం వచ్చింది భద్రానికి.అదే ప్రశ్న బామ్మని అడిగాడు.

“అదేం ప్రశ్నరా?నిద్రపోయేటప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం గాని ముక్కు మూసుకోం కదరా "అని విసుక్కుందామె.

భద్రానికి సరైన సమాధానం దొరకలేదే అని అసంతృప్తి కల్గింది.

ఇంటికి వచ్చకా బామ్మ,రోజులాగే మనవడ్ని నిద్రపుచ్చుతూ "జోఅచ్యుతానంద "అని పాడింది.

భద్రానికి నిద్ర పట్టలేదు. బామ్మ రామాలాలీ పాడింది. అయినా భద్రానికి నిద్రపట్టలేదు. భద్రం నిద్రపోవటం లేదని చూసి "అసలే రేపు తొలిఏకాదశిరా.తెల్లారగట్లే లేవాలి పడుకో "అని విసుక్కుని నల్లమందు మింగి పడుకుంది.

సుభద్రమ్మకి ఇన్సోమ్నియా అనే నిద్రపట్టని జబ్బువుంది.భద్రం తల్లి సోమ్నాంబులిజమ్... నిద్రలోనడిచే అలవాటున్న జబ్బుతో డాబా మీద నుంచి పడిపోయి కన్ను మూసింది.అప్పటి నుండి సుభద్రమ్మేభద్రానికి జోల పాటలు పాడుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.భద్రం తండ్రికి నార్కొలేప్సీ అనే ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు సడన్ గా నిద్రముంచుకొచ్చేసే జబ్బుంది.

భార్యపోయిన విచారంతో,యీ జబ్బుతో మతిపోయినవాడిలా ఒక గదిలో కూచుని మందు సేవిస్తూ వుంటాడు. మర్నాడు కోడికంటే ముందే నిద్రలేచి ఇద్దరు గుడికి వెళ్లారు.గూడ్సు బండిలా మెల్లగా కదులుతున్న క్యూలో నిలబడ్డారు ఇద్దరు.

“బామ్మా తొలి ఏకాదశి అంటే ఏమిటి ?”అడిగాడు భద్రం.

“విష్ణుమూర్తి ఈ రోజు నిద్రపోవడం మొదలు పెడ్తాడు.మళ్ళీ ఉత్తరాయణంలో లేస్తాడు.నిద్రలోనే భక్తుల్ని ఓ కంట కనిపెడుతూ ఉంటాడు.అందుకే మనం శ్రావణ,భాద్రపద,ఆశ్వయుజ,కార్తీకాల్లో బాగా పూజలూ,వ్రతాలూ చేస్తుండాలి "చెప్పింది బామ్మ.

“నిద్రపోతున్న వాడెలా చూస్తాడు బామ్మా?దొంగ నిద్రంటావా ?”అడిగాడు భద్రం.

“వేలెడు లేవు భడవా!అలా అనకూడదు.యోగ నిద్రంటారు.కళ్ళు మూసుకున్నా అంతర్నేత్రం తో చూస్తాడన్నమాట "మందలిస్తూ చెప్పింది బామ్మ.

“అంతర్నేత్రం అంటే..?” అడిగాడు భద్రం. “అంతర్నేత్రం అంటే నామం వెనకాల వుంటుందిలే.మనకి కనబడదు,అబ్బ...నీ కన్నీ సందేహాలే....పద...పద... ” అని భద్రాన్ని ముందుకు తోసింది బామ్మ.

దర్శనం చేసుకుని యింటికి వచ్చేశారు.భద్రానికి ఆ రాత్ర్రి కూడా నిద్రపట్టలేదు.అమ్మ,నాన్న, బామ్మ వీళ్ళందరికీ నిద్రకి సంబంధించిన జబ్బులున్నాయి.కుంభకర్ణుడి నిద్ర,విష్ణుమూర్తి యోగ నిద్ర చూస్తుంటే రాక్షసులకి,దేవుళ్ళకి కూడా ఈ జబ్బులున్నట్టున్నాయి.ఏమిటి ఇన్ని రకాల నిద్రలు.పెద్దయ్యాక నిద్ర గురించి రీసెర్చి చెయ్యాలి అనుకుంటూ కలత నిద్రపోయాడు.

కలత నిద్ర వల్ల నలతగా వుండి అర్నాడు సైకిల్ మీద స్కూల్ కి వెళ్తూ రోడ్డున పోయే రోశయ్య కి డాష్ కొట్టి పడిపోయాడు.వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు రోశయ్య. డాక్టర్ భద్రానికి కట్టుకడుతూ ఎవరితోనో చెప్తున్నాడు. “మీకు తెలీందేముంది.జాగ్రత్త పడాలండి.శరీరంలో ఏ సెల్స్ డిస్ట్రాయ్ అయినా వేరే సెల్స్ డివైడ్ అయ్యి వాటిని రీప్లేస్ చేస్తాయి.కాని న్యూరాన్స్ కి డివైడ్ అయ్యే గుణం వుండదు కాబట్టి కొన్ని న్యూరాన్స్ డిస్ట్రాయ్ అయినా సీనియర్ న్యూరలాజికల్ డెఫిసిట్ వస్తుంది"అని.

“నూరాన్స్ అంటే ఏమిటి డాక్టర్ ?అవేం చేస్తాయి ?”కుతుహలంగా అడిగాడు భద్రం. డాక్టర్ ఆశ్చర్యపోతూనే "న్యూరాన్స్ ఇన్ఫర్ మేషన్ ని రిసీవ్ చేసుకుని స్టోర్ చేసుకుని మళ్ళీ ట్రాన్స్ మిట్ చేస్తాయి "అని చెప్పాడు.

“న్యూరాన్స్ కి నిద్రకి ఏదైనా సంబంధం వుందా డాక్టర్ ?నేను పెద్దయ్యాక నిద్ర గురించి రీసెర్చి చెయ్యాలనుకుంటున్నాను"అని చెప్తున్నఆ పిల్లవాడి ఇంట్రెస్ట్ కి డాక్టర్ ముచ్చటపడిపోయి

"నీకు నేను సహకరిస్తానని "హామీ ఇచ్చాడు. ఆ డాక్టర్ సహకారంతో చదువు పూర్తీ చేశాడు భద్రం. ఒక రోజు ఆరింటికే ఆకులు ముడుచుకుంటున్న నిద్రగన్నేరు చెట్టు కిందా కూచుని ఏదో ఆలోచించుకుంటున్న భద్రంతో సుభద్రమ్మ"వీధిలో ముగ్గేద్డామంటే సయాటిక్కు రోగంతో కాలు వంగదు.గదుల్లో లైట్లు వేద్దామంటే స్పాండిలైటు రోగంతో స్విచ్ లు వెయ్యలేక పోతున్నారా.పెళ్లి చేసుకో.ఇంట్లో లైట్లు వెలుగుతాయి"అంది.

“లైట్లేగా నే వేస్తాలే బామ్మా "అన్నాడు పరధ్యానంగా భద్రం. “లైట్లు వేస్తావు సరే మరి ముగ్గో "అంది సుభద్రమ్మ.

వీధిలో ముగ్గులేస్తూ కూచుంటే తన రీసేర్చో?అమ్మో!కాస్త ఆలోచించి "ఊ...సరే "అన్నాడు. '

'అయితే రేపే గుదిబండల వారి పిల్లని చూడ్డాని కెళ్దాం "అంది సుభద్రమ్మ సంతోషంగా.

గుదిబండల గున్నయ్యగారి కూతురంటే గుండ్రాయిలా వుంటుందేమో అనుకున్నాడు భద్రం. కాని,పెళ్లి చూపుల్లో బాపు బొమ్మని తలదన్నెంత అందంతో,వయ్యారంగా కూచుని ఊర్మిళ 'పాల కడలిపై శేషతల్పమున'పాట అద్భుతంగా పాడింది.సుభద్రమ్మ జలజలామని ఆనంద బాష్పాలు రాల్చింది.భద్రం రెప్పవేయడమే మర్చిపోయి చూస్తున్నాడు.ఇద్దరూ ఒకేసారి ఓ.కే. అనేశారు.

వెంటనే ఊర్మిళ తండ్రి గున్నయ్య వలవలా ఏడ్చేశాడు.తల్లి గున్నమ్మ ఎక్కిళ్ళతో భర్తకి వంత పాడింది.

“చిన్న రిక్వెస్టండీ!ముహూర్తం పగలే పెట్టాలి.మా అమ్మాయి పేరులోనే కాదు.పోలికలో కూడా ఊర్మిళాదేవే.రాత్రి ఏడుగంటలకే నిద్రపోయి పొద్దున్న తొమ్మిది గంటలకి లేస్తుంది.ఎంత మంది డాక్టర్లకి చూపించినా యీ జబ్బు కింక మందేలేదన్నారు.అర్థం చేసుకోండి ప్లీజ్ "గద్గద స్వరంతో అన్నాడు గున్నయ్య. 'అంటే పద్నాలుగు గంటలా!ముందు కాస్త నిర్ఘాంతపోయినా తన రీసేర్చికి పనికొస్తుందిలే అనుకుని'”ఊ "అన్నాడు భద్రం.

మరి పొద్దున్నే ముగ్గేవరేస్తారు?రాత్రి లైట్లు ఎవరు ఆర్పుతారు?లాంటి సందేహాలతో సతమతమవుతున్నా భద్రం "ఊ "అన్నాడు కదాని ఊర్మిళలో లోపాన్ని అంగీకరించింది సుభద్రమ్మ. వారంలో పెళ్ళయి పోయింది.ఏడాది తిరక్కుండా యిద్దరాడ పిల్లలకి తండ్రయ్యాడు భద్రం.తెల్లకలువ మొగ్గల్లా వున్నకావాలా పిల్లలిద్దరికీ సుషుమ్న,జాగృతి అని పేర్లు పెట్టుకున్నాడు. కాలం బుడబుక్కలవాని చేతిలో వాయిద్యంలా గబుక్కున తిరిగిపోయింది.

పిల్లలిద్దరూ ఏడు హేపీ బర్త్ డేలు చేసుకున్నారు.భద్రం రిసెర్చ్ పూర్తయి భద్రమైన నిద్ర అనే పుస్తకం రాసి డా.నిద్రక భద్ర అనే బిరుదు సంపాదించాడు.భద్రాజోలా అనే మందు కనిపెట్టి అంతర్నేత్రం అనే క్లీనిక్ పెట్టి స్లీపింగ్ డిజార్డర్స్ వున్న వాళ్లకి ట్రీట్ మెంట్ చేస్తూ పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదన్నట్టుఊర్మిళ నిద్రని మాత్రం మాన్పించలేక పోయాడు.

(బ్లాక్ టీ తీసుకొచ్చి సిరాబుడ్డిని కాస్త పక్కకు జరిపి అక్కడ పెట్టింది వాగ్దేవి.ఇది గమనించని విరించి తలొంచుకుని రచిస్తూ కలాన్నిబ్లాక్ టీ లో ముంచి రాయడం కంటిన్యూ చేశాడు.దాని ఫలితంగా)

పుర ప్రముఖలందరూ చర్చించుకుంటున్న భద్రం ఖ్యాతి విని,అదే వూళ్ళో మాటల గారడితో గాఢ నిద్రలోకి పంపే హిప్నాటిస్ట్ అబ్రకదబ్ర గారికి అసూయతో నిద్ర దూరమైంది.భద్రం యిస్తున్న సెడేటివ్స్,హిప్నటిక్స్,హానికరమైనా సైడ్ ఎఫెక్ట్ కల మందులని,అవి వాడడం వల్ల కనురెప్పలు,పెదవులు వాస్తున్నాయని పుకారు పుట్టించాడు.దాంతో అంతర్నేత్రం క్లినిక్ కి రోగులు రావడం తగ్గించేశారు.

“పొరుగు పచ్చచూసి ఓర్వలేక పోవడం తన యింట్లో వెలుగుని నింపుకోవడం కోసం మరో యింటి దీపం ఆర్పేయడం,త్రేతా,ద్వాపర యుగాల్లోనే వున్నాయిరా.రామాయణ మహాభారతాల్లో కూడా వున్నదదేగా "అని ఓదార్చింది సుభద్రమ్మ మనవడిని.

పుకార్లు వుల్లికారంలా కాస్సేపు మంట పుట్టిస్తాయి అంతే.తరువాత మేలే చేస్తాయి. నిజాయితీకి ఎప్పటికైనా గుర్తింపు వుంటుందని సర్దిచెప్పుకున్నాడు భద్రం.

తను కనిపెట్టిన మందు భద్రాజోలా ని యింప్రూవ్ చెయ్యాలంటే ప్రపంచ పర్యటన తప్పదని భావించాడు.ఆరు నెలలు పర్యటన చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.ఆ విషయాన్ని సుభద్రమ్మకి చెప్పగానే , బాగా చదువుకున్న తన మనవడికి ఇంగ్లీష్ చెప్పితే బాగా అర్ధమౌతుందని భద్రం...బి కేర్ పుల్.అని గట్టిగా చెప్పింది.

(హాసం సౌజన్యంతో)