Saradaga Kasepu

" సరదాగా కాసేపు "

కన్నోజు లక్ష్మీకాంతం

హాస్యరసమనేది నవరసాల్లో అద్భుత రసమని అందరూ ఒప్పుకుంటారు.కాదనడానికి వీల్లేదు.కానీ ఆ రసాన్ని పోషించడమన్నా, ఎదుటివారిని మెప్పించడమన్నా అంత తెలికైనా విషయం కాదేమోననిపిస్తుంది.

కొంత మంది ఎన్ని జోకులు పేల్చినా వారి మోహంలో నవ్వనేది కనిపించకపోతే,గుంటూరు పచ్చి మిరపకాయను కసుక్కున కొరికినంత మంట లేస్తుంది.ఐనా ఏం చేయలేము.ఆ రిసీవర్ సరిగా లేడని సర్దుకోవాలి. పరిచయస్థులతోనైతే వారికేలాంటి సంభాషణ యిష్టమో మనకు తెలుస్తుంది.కానీ,కొత్తగా పరిచయమైన వారితో కళాత్మకంగా మాట్లాడి వారిని రసకందాయంలోకి దింపామంటే మనకంత కన్నా మించిన ఆనందం మరొకటి వుండదేమోననిపిస్తుంది.

జోకులు చెప్పడం చాలామందికి చాత కాదేమోననిపిస్తుంది.ఆ మాటకొస్తే మాట్లాడటమే చాలామందికి తెలియదు మరి. ఎదుటివారితో ఏ విధంగా మాట్లాడాలనేది గొప్పకళ అంటారు పెద్దలు. నిజమే మరి.

తమకన్నీ తెలుసుననుకునే గిరీశం పాత్రధారులు సమాజంలో చాలా మంది కనిపిస్తుంటారు.

" నాకు మెగాస్టార్ చిరంజీవి బాగా తెలుసు.అతడు నటించే అన్ని సినిమాలూ చూస్తుంటాను. అతడికి చాలాసార్లు ఫోన్ కూడా చేశాను " అని చెప్పుతుంటారు కొందరు. ఓ.కే.చెప్పడం బాగానే వుంటుంది. కానీ అతడు నిన్నెంత వరకు గుర్తు పట్టగలడనేదే క్వశ్చన్.

నలుగురు కలిసిన చోట చాలామంది ఇలాంటి కోతలు కోస్తూనే వుంటారు.మనకందరూ తెలుసు.కానీ ఎంతమందికి మనం తెలుసనేదే ఆలోచించాల్సిన ప్రశ్న. ఒకసారి ఈ జోక్ చూడండి.

“ ఏరా ప్రెండూ ...రోజూ మీ ఇంటికి ఎవరెవరో వచ్చి పోతున్నారు గదా..! ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశావా...? ” అడిగాడు ప్రసాద్.

“ అదేంలేదురా ! మా నాన్న పోతూ పోతూ చెప్పి వెళ్ళాడురా...ఎప్పుడూ నలుగురు వ్యక్తులు ఇంటికొచ్చేట్టు చేసుకోవాలని.” చెప్పాడు శేఖర్.

“ ఆహా...! అలాగా...మరేం చేస్తున్నావు..? ” అడిగాడు ప్రసాద్.

“ ఆ...ఏమిలేదురా ? అందరి దగ్గర అప్పు చేశానుగానీ, రిటర్న్ యివ్వలేదు. అందుకని నాన్నగారు చెప్పినట్టు రోజూ వచ్చిపోతున్నారు.” చెప్పాడు శేఖర్.

“ ఆఁ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ప్రసాద్.

సాధారణంగా మాటల్లో చతురత కనిపించి నలుగురిని ఆకట్టుకునేలా వుండాలంటారు పెద్దలు.అందుకు చాలా సాధన చేయాలి మరి. ఓ పెద్దమనిషిని ఉపన్యాసం ఇవ్వమని మైకు ముందుకు పిలిచారు ఒక సభలో.అతడు లేచి నుంచుని గొంతు సవరించుకున్నాడు.

“ అందరికీ నమస్కారం...ఎడమ పక్కనున్న సర్పంచ్ గారు... పొతే, పార్టీ పెద్దలు పరంధామయ్య గారు...పొతే, హెడ్ మాస్టర్ గోపాలస్వామిగారు...పొతే, మేడం పార్వతమ్మ గారు...పొతే, మనూరి బ్యాంక్ మేనేజర్ శేషాద్రి గారు...పొతే....” అని మాట్లాడుతుండగా... పొతే...పొతే...పొతే...అనే పదం వినీ వినీ అసహనంగా మధ్యలోంచి లేచిన ఒకాయన.

“ అయ్యా...! పొతే... పొతే.... అంటూ అందర్నీ పంపించి,వారితో పాటు మీరు పొతే, మేం కాస్త ఊపిరి పీల్చుకుంటాము సామీ...” అంటూ అరిచాడట.

ఇలా సభావేదిక మీద ఏం మాట్లాడాలో తెలియని పెద్ద మనుషుల్ని చాలామందిని చూసి పడి పడి బాగా నవ్వుకుంటాం కదా! నవ్వేజన సుఖినోభవంతు !!