Dr-Serial Chittemma

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

 

డాక్టరు సీరియల్ చిట్టెమ్మ

యస్ .శ్రీహిత

తన భార్య కావేరి పురిటి నొప్పులు పడుతుంటే,దగ్గర్లో ఉన్న నాలుగైదు హాస్పటల్లకు తీసుకెళ్ళాడు గిరిశం.

ప్రతి లేడి డాక్టరు కావేరిని చెకప్ చేసి...”మీ భార్యకి మేము ట్రీట్ మెంట్ ఇవ్వలేము.మీ భార్య లాంటి కేసులను డాక్టర్ సీరియల్ చిట్టెమ్మ గారు అద్భుతంగా చూస్తారు.అక్కడికి వెళ్ళండి అని చెప్పేవారే తప్ప...మేము మీ భార్య కేసుని టేకప్ చేస్తామని చెప్పలేకపోయారు. దాంతో గిరిశం,కావేరిని డాక్టర్ సీరియల్ చిట్టెమ్మ హాస్పటల్ కు తీసుకుని వెళ్లాడు.

“డాక్టరు గారు మీరే నా భార్యని కాపాడాలి "అంటూ డాక్టరుని వేడుకున్నాడు గిరిశం. “ఏమైంది ?”నింపాదిగా అడిగింది డాక్టర్ సీరియల్ చిట్టెమ్మ.

“మా భార్యకి నొప్పులు వస్తున్నాయి డాక్టర్ "కంగారు పడుతూ చెప్పాడు గిరిశం.

“ఏ టైంలో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయే వివరంగా చెప్పండి "అన్నది డాక్టరు సీరియల్ చిట్టెమ్మ.

“సరిగ్గా మూడు రోజుల క్రితం రాత్రి టీ.వి.లో'నిధి'అనే సీరియల్ చూస్తుంటే నొప్పులు వచ్చాయి. తనేమో సీరియల్ అయితే గాని హాస్పటల్ కు రానంటుంది.నాకేమో కాళ్ళూ చేతులూ ఆడడం మానేసాయి.బలవంతంగా హాస్పటల్లో జేర్పించాము.నెప్పులు వస్తాయి ఆగిపోతాయి.

మళ్ళీ కాస్సేపటికి అందుకుంటాయి.వెంటనే అందకుండా పోతాయి.ప్రథమకాన్పు డాక్టరు. పైగా అర్భకురాలు.డాక్టర్లు సిజేరియన్ చెయ్యడానికి భయపడుతున్నారు.కేసు పూర్వాపరాలు తెసులునుకుని మీ దగ్గరికి పంపారు నన్ను.మా కంగారేకాని భగవంతుడికేం తొందరలేదు " చెప్పాడు ఆయాసపడుతూ గిరిశం.

“యురేకా యురేకా "అంటూ గట్టిగా అరిచింది డాక్టర్ సీరియల్ చిట్టెమ్మ.

“నా భార్య పేరు యు.రేఖ కాదు ఐ.రేఖ కాదు.కావేరి డాక్టరు "అన్నాడు గిరిశం.

“కంగారు పడకండి.ఏ పేరైనా ఒకటే.మా డాక్టరమ్మకు హడవిడిలో అయిడియా వస్తే అలాగే అరుస్తుంది"అంటూ లేడి కంపౌండర్ చెప్పి గిరీశాన్నిస్థిమిత పరిచింది.

“నో టైమ్..టైమ్...కమాన్ హార్రీ అప్ "అంటూ "నర్స్"అని గట్టిగా అరిచింది. ఇద్దరు నర్సులు పరుగున స్ట్రెచర్ తో ప్రత్యక్షమై కావేరి దగ్గరికి వచ్చారు.

"కమాన్ హార్రీ అప్"అందర్నీకంగారు పెట్టింది డాక్టర్ సీరియల్ చిట్టెమ్మ.

నొప్పులతో బాధపడుతున్న కావేరిని స్ట్రెచర్ మీద పడుకోపెట్టి,గబాగబా ఆపరేషన్ దియేటర్ లోనికి తీసుకెళ్ళారు నర్స్. హాస్పటల్లో వాళ్ళు చేస్తున్నకంగారు చూడగానే...సినిమా క్లైమాక్స్ లో విలన్ హాస్పిటల్ లో దాక్కుంటే పోలీసువాళ్ళు చేసే హడావుడి గుర్తొచ్చింది గిరీశానికి.

కావేరిని ఆపరేషన్ దియేటర్ లోని టేబుల్ మీద పడుకోపెట్టారు నర్స్.డాక్టర్ సీరియల్ చిట్టెమ్మ రంగానికి సిద్దమవుతున్న యుద్ద సైనికునిలా సిద్దం అయింది.

“నర్స్...మీరిద్దరు పేషెంట్ పక్కనే ఉండండి.”అని చెప్పింది. అందుకు నర్స్ సరే అన్నట్టుగా తలలు ఊపారు.

మూడు రోజుల్నించి 'నిధి'సీరియల్ లో ఏం జరిగిందో సీను ప్రకారం డైలాగ్ టు డైలాగ్...విత్ యాక్షన్ తో కళ్ళకు కట్టినట్టు చెప్పడం మొదలు పెట్టింది డాక్టర్ సీరియల్ చిట్టెమ్మ. ఆ కథ వింటున్న కావేరి ముఖంలో మార్పులు గమనించసాగారు యిద్దరు నర్సులు.

“ఆ తరువాత ఏమైంది ?”ఆతృతగా అడిగింది కావేరి.

“నిన్నరాత్రి విలను హీరోను కసకసా పొడిచాడు"అంటూ భయంకరంగా చెప్పింది డాక్టర్ సీరియల్ చిట్టెమ్మ.

అంతే!కెవ్వున కేక.తరువాత క్యార్ క్యార్ మంటూ ఏడుపు వినబడింది. 'హమ్మయ్య'అనుకుంటూ బయటికి వచ్చిన డాక్టర్ సీరియల్ చిట్టెమ్మ, తన రూములోకి వెళ్ళిపోయింది.

అంతలో గిరిశం దగ్గరికి ఒక నర్స్ వచ్చింది.

“ఏమైంది సిస్టర్ ?”అతృతగా అడిగాడు గిరిశం.

“పాప పుట్టింది.తల్లిపిల్ల ఇద్దరు క్షేమంగా ఉన్నారు.వెళ్లి చూడండి "అని చెప్పింది నర్స్. “పెద్దాపరేషన్ చేశారా ?”అడిగాడు గిరిశం.

“ఎలాంటి ఆపరేషన్ లేకుండా...అసలు ఇంజక్షన్ ఇవ్వకుండా నార్మల్ డెలివరీ అయ్యేటట్టుగా మా డాక్టర్ గారు చేశారు "అని చెప్పింది నర్స్.

“నిజమా..”ఆశ్చర్యంగా అడిగాడు గిరిశం.

“మరేమనుకున్నావు డాక్టర్ సీరియల్ చిట్టెమ్మఅంటే.పేషెంట్ యొక్క సైకాలజీని బట్టి,వారి పల్స్ ని చూడకుండా ఎలాంటి బాధ కలగకుండా సింపుల్ గా ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టరుగా ఎంతో పేరు తెచ్చుకుని...అందరి చేత డాక్టర్ సీరియల్ చిట్టెమ్మఅని పిలవబడుతున్న గొప్ప డాక్టర్ మా డాక్టరు సీరియల్ చిట్టెమ్మ."అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది నర్స్.

వెంటనే గిరిశం "డాక్టర్ సీరియల్ చిట్టెమ్మ జిందాబాద్...జిందాబాద్..”అని జేజేలు కొట్టి గబుక్కున అక్కడి నుండి భార్య దగ్గరికి వచ్చాడు.

(హాసం సౌజన్యంతో)