Indra

 

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

ఇంద్ర

కండ్లకుంట శరత్ చంద్ర

ట్రింగ్ ట్రింగ్...ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్...!

“ఒరేయ్...ఇక్కడ అనిల్ గాన్ని సైకిల్ కుమ్మింది త్వరగా రా " అన్నాడు భార్గవనాయుడు అవతలి నుండి.

“ఇంతకూ ఏ ఆసుపత్రిలో వేసారో చెప్పిచావు " అన్నాను.

“నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వార్డ్ నెంబర్ 15” చెప్పాడు భార్గవ.

“నిమ్స్ అని చావొచ్చుగా !అంతగా దీర్ఘం తియ్యాలా..సరే !ఇప్పుడే ఓ రెండు మూడు గంటల్లో వచ్చేస్తా " అన్నాను.

“ఇక్కడికి రావడానికి మూడు గంటలెందుకు ?” అన్నాడు భార్గవ.

“ఒరేయ్ పిచ్చిమాలోకం!నేను,మూడు బస్సులు మారి రావాలి.ఒక్కొక్కస్టాపులో అధమపక్షం అరగంటైనా...బస్సుకోసం వేచి చూడాలి.నువ్వు పెట్టేయ్యి " అని చెప్పి ఈ మూడు గంటల కాలక్షేమం కోసం'తెలుగు సాహిత్యం పై సమగ్ర పరిశీలన' అనే పుస్తకాన్ని తీసుకుని,అవతలికి నడిచాను.

***

బస్టాపులో ఇద్దరమ్మాయిలను,ఓ వయసు మళ్ళినావిడ,ఓ కుర్రాడు.బస్ కోసం వేచియున్నారు.పాపం నాలాగే అమాయకులు.

నేను వారిని పట్టించుకోకుండా నా పుస్తకాన్ని తెరిచి అందులో మునిగాను. అధమపక్షం ఓ పావుగంట గడిచుంటుంది ఆ కుర్రాడు నా వెనక వచ్చి నిలబడి,నేను చదువుతున్న పుస్తకంలోనికి తొంగిచూసాడు.

“వ్వా...ట్..!తెలుగు పుస్తకం రీడ్ చేస్తున్నారా షేమ్ షేమ్!” అన్నాడు గట్టిగా.

నేను చటుక్కున వెనక్కి తిరిగి,వాడి చెంప పగలకొట్టి ఆనందిద్దామనుకుని. “ ఏంబాబూ !తెలుగు పుస్తకం చదవకూడదని కొత్తగా ఏదైనా ఆర్డినెన్స్ వేసారా !అలాంటిదేమైనా వుంటే దినపత్రికలలో వచ్చేదిగదా !నేను ప్రతిరోజూ క్రమం తప్పకుండా దినపత్రిక చదువుతానే!అలాంటి ఆర్డినెన్సేమి రాలేదు " అన్నాను మొహం అమయాకంగా పెట్టి.

“హవ్వ...హవ్వ...హవ్వ...వెరీ వెరీ బ్యాడ్.ట్వంటీఫస్ట్ సెంచరీలో ఇంకా దినపత్రిక,దినపత్రిక. అంటూ "ఇంకా తెలుగు పేపరు చదువుతారా " అన్నాడు ఆ కుర్రాడు మహదాశ్చర్యంగా.

వాడికి సమాధానం చెప్పెలోగానే సిటీబస్ దూసుకురావడం...నేను పుస్తకాన్ని చంకలో పెట్టుకుని..పిటి ఉషలా పరుగెత్తి,జాంటీరోడ్స్ లా గెంతి,కడ్డీని దొరకబుచ్చుకుని...బల్లిలా లోపలికి పాకడం జరిగిపోయాయి.

ఆ బస్సులో నిలబడ్డాక ఏ కడ్డీని ఆధారంగా పట్టుకోవాల్సిన అవసరం లేదనిపించింది నాకు నా చుట్టూ అష్టదిగ్బంధనంలా ఉన్న మనుష్యులను చూసి. నా చుట్టే కాదు...ఆ బస్సులో ఉన్న ప్రతీ ఒక్కరి చుట్టూ అలాగే అమరి ఉన్నారు జనాలు.

నేను పుస్తకం తెరిచి మళ్ళీ అందులో మునిగాను.అందులోని భావాలను ఆస్వాదిస్తూ ఆనంద పారవశ్యంలో తేలిపోతుండగా నా చుట్టూ నిలబడి ఉన్నవారు నేను చదువుతున్న పుస్తకం లోనికి ఒకేసారి తొంగిచూడటం ఒకేసారి గతుక్కుమనడం రెండు ఒకేసారి జరిగిపోయాయి.

ఎనిమిదవ ప్రపంచ వింతను చూస్తున్నట్లు...మూడవ ప్రపంచ యుద్ధం జరిగి,బంగ్లాదేశ్ ఏకచత్రాధిపత్యం వహిస్తున్నట్లు...నా వైపు చూడడంతో..ఈసారి వాళ్ళందరి కళ్ళూ సీమరేగు పండ్లంత లావయ్యాయి.

“ ఇదేమిటండీ..వండర్ కాకపోతే ఇప్పటికి తెలుగుబుక్ రీడ్ చేస్తున్నారు "అన్నాడొకడు.

“ ఛ!ఛ! వెరీ బ్యాడ్...” అన్నాడు ఇంకొకడు.

“ఏంట్సార్...ఇలా తెలుగు సాహిత్యం గురించిన చెత్త చదువుతున్నారు.ఛ...ఛ...!” మరొకడు అన్నాడు.

వాళ్ళ నెల జీతాన్ని నేను లాక్కుపోతున్నంత ఆవేశంగా అన్నారు ముగ్గురు. “ఏం...చదవొద్దా ?” అన్నాను నేను.

“అదేంటి సార్...కావాలంటే ఇంగ్లీష్ బుక్స్ చదవండి "అన్నాడు ఒక పెద్దమనిషి.

“అది చదివినా చదవకపోయినా ఫరువాలేదు కానీ మీరు తెలుగుపుస్తకం చదవకూడదు. ఎందుకంటే ప్రపంచమంతా ఇంగ్లీష్ వైపు పరుగు తీస్తుంది.మన భారతదేశంలో..అందులో మన ఆంద్రప్రదేశ్ లో మరి ఎక్కువగా పరుగులు తీస్తుంది.ఇంగ్లీష్ వాడకంలో ముందంజలో వుంది కూడా "అన్నాడు ఆ పెద్ద మనిషి.

ఎవరో నా చేతిలోని పుస్తకాన్ని లాక్కున్నారు.ఒకరి చేతుల మీది నుండి మరొకరి చేతిలోకి వెళ్తూ...అలా బస్సంతా తిరిగితుంది నా పుస్తకం. దేవుడు నాపై జాలి చూపించి నేను దిగాల్సిన స్టాపును రప్పించడంతో"చావలేదు జీవుడా"అనుకుంటూ బస దిగాను.

ఎవరో కిటికీలో నుండి నా పుస్తకాన్ని తీసుకుని నా మొహానికేసి విసిరి"హలో మాస్టారూ...డోన్ట్ రీడ్ తెలుగు బుక్స్.నాలెడ్జ్ ఇంప్రూప్ చేసుకోవాలనుకుంటే ఎంగి లీషు రీడ్ చేయండి "అన్నాడు నవ్వుతూ.

పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాను.

బస్సు అక్కడి నుండి తుర్రు మనగానే"హమ్మో!ఇంకా నయం ఈ రోజు ఆదివారం కాబట్టి సరిపోయింది.లేకపోతే చాలామంది భావిభారత పౌరులు ఎక్కుండేవారు.నన్నొక డైనోసారాస్ లా చూస్తుండేవారు.”అనుకుంటూ నిమ్స్ దారి పట్టాను.

***

ఎలాగైతేనేం మొత్తంమీద నిమ్స్ ఆసుపత్రికి చేరాను.

“మావా...”నన్ను చూడగానే అనిల్ గాడు బావురుమన్నాడు. వాడి చుట్టూ భార్గవరాయుడు,బటాణీ గింజల ప్రసాద్,తెల్లమల్లికార్జున్,అశోక్...ఇత్యాది జీవులన్నీ కూర్చుని క్యారు క్యారు మంటున్నాయి.

నేను అనిల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు.వాడు నోరు తెరవబోతుంటే,అశోక్ వాడి నోరు చటుక్కున మూసి "కాచిగూడలో చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో వేసిన స్పెషల్ స్టెప్పపోస్టరును అతికించారు గదా.వీడు చిరంజీవి వీరాభిమాని కదా! ఆ పోస్టరును చూస్తూ రోడ్డు మధ్యలో నిల్చున్నాడు.వీది అదృష్టం బావుండి ఏ స్కూటరో,కారో వచ్చి డాష్ ఇవ్వకుండా సైకిల్ వచ్చి డొక్కలో కుమ్మింది"అన్నాడు.

“లోపల అవయవాలు స్థానభ్రంశం చెందాయట.అందుకే ఓ ఎనిమిది ఆపరేషన్లు చెయ్యాలట!వీడిని పాతిక రోజులు ఇక్కడే వుంచాలట!తెల్లగుడ్డలేసుంటాడు చూడూ ఆయన చెప్పాడు" అన్నాడు తెల్ల మల్లికార్జున్.

“ఒరేయ్..నువ్వుక్కడ వీడికి తోడుగా వుండు.మేం బయటికి వెళ్లి సాంబారు తాగివస్తాం"చెప్పాడు ప్రసాద్.

ఒక్క ఇడ్లీకి నాలుగు కప్పుల సాంబారు తెప్పించుకుతాగడం అలవాటు వాడికి.అందుకే ఇడ్లీ తినోస్తాం అనే బదులు సాంబారు తాగొస్తాం అంటుంటాడు. అందరూ కట్టగట్టుకుని అవతలికి వెళ్లారు.అనిల్ గాడు బెలచూపులు చూస్తున్నాడు.

“ఒరేయ్...నోరు మూసుకుని నిద్ర పో"అన్నాను నేను.

వాడు బుద్దిమంతుడిలా తలూపి చటుక్కున కళ్ళు మూసుకున్నాడు.నేను పుస్తకం చదువుకోసాగాను.అంతలో ఓ నర్స్ లోపలికి వచ్చి,అనిల్ వైపు మామూలుగాను,నా వైపు తెలుగు పుస్తకం చదువుతున్నందుకు అదోమాదిరిగాను చూసింది.

“వ్వాట్...తెల్గు బుక్..వాటే వండర్ ?”అంది నర్స్.

“మీరూ ఇంతకుముందు ఫలానా టీవిలో కిక్కిరి బిక్కిరి ఖై అనే ప్రోగ్రామ్ కు ఏంకర్ గా పనిచేశారు కదూ!”అన్నాను నేను ఆమె వైపు మిర్రి మిర్రి చూస్తూ.

“అది నేను కాదు మా సిస్టర్.మేము హలో సిస్టర్స్!”అంది ఆ నర్స్.

“అంటే...?”అర్థంకాక అడిగాను నేను.

“మీకు సినిమా నాలెడ్జ్ లేనట్లుందే!అంటే ట్విన్స్ అన్నమాట,అవునూ మీరు టివి బాగా చూస్తారా..”అడిగింది ఆ నర్స్.

“వార్తలు మాత్రం చూస్తాను..”

“మరి కిక్కిరి బిక్కిరిఖైలో మా చెల్లాయిని ఎలా గుర్తుంచుకున్నారు"అంది.

“వార్తల మధ్యలో ప్రకటనలు వస్తాయి కదా.అప్పుడు మీ చెల్లాయి వచ్చి తెంగ్లం మీలాగే మాట్లాడుతుంది.”అన్నాను.

“తెంగ్లం అంటే..”అడిగింది ఆ నర్స్.

“అంటే...తెలుగు+ఆంగ్లం అన్నమాట "చెప్పాను నేను.

“మీతో మాట్లాడుతుంటే నా హెడ్ తిరుగుతుంది"అంది ఆ నర్స్.

“ఏం ?”అడిగాను నేను.

“మీ ప్యూర్ తెల్గుతో నేనస్సలు ఎడ్జెస్ట్ కాలేను"అంది ఆ నర్స్.

“మీది ఆంధ్రప్రదేశ్ కాదా...?అడిగాను నేను.

“వైనాట్ అనకాపల్లి నా బర్త్ ప్లేస్.అమలాపురంలో ఎడ్యుకేషన్,హైదరాబాద్ లో జాబ్"అంది.

ఈ వాక్యంలో తెలుగు మాటలెన్ని ఇంగ్లీష్ మాటలెన్ని?అని ఆలోచిస్తూ వుంటే ఇవాళ మనం మన తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నభాషలో అధికశాతం ఇలాగే ఉంది కదూ.అని నాకు అనిపించగానే ఒక్కసారిగా ఈ భూగోళం తిరుగుతున్నట్లు అనిపించింది.

(హాసం సౌజన్యంతో)