Sundari-Subbaaravu Lechipoyaaru

" సుందరి - సుబ్బారావు లేచిపోయారు "

కన్నోజ్ లక్ష్మీ కాంతం

ఒకరిని ఒకరు ఇష్టపడుతూ, ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్న సుందరి,సుబ్బారావు... ఆరోజు ప్రేమికులరోజు కావడంతో ఇద్దరు కలిసి రాకరాక ఒక పార్కుకు వచ్చారు పాపం వాలెంటెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం కోసం.

కానీ వారి మనసులో ఎక్కడో ఒక మూలో భయం భయంగానే ఉంది. ప్రేమికులరోజు నాడు పార్కుల్లోని ప్రేమికులు వారి దృష్టికి వస్తే వెంటనే పెళ్ళి చేస్తామని కంకణం కట్టుకున్న సంస్థలకు ఎక్కడ దొరికిపోతామో అని.అందుకే కాస్త భయంగానే పార్కులోకి ప్రవేశించారు.

ఆ పార్కు చాలా విశాలంగా వుంది.అక్కడక్కడా గుబురుగా కొన్ని చెట్లు ఉన్నాయి.అవి ప్రేమికులకు అనుకూలంగా తయారు చేయబడినట్టుగా ఉన్నాయి.చుట్టూ చూశారు.ఎటు వైపు చూసిన ప్రేమికులే కనబడుతున్నారు.వాళ్ళు కూర్చోవడానికి ఎక్కడ సరైనా చోటు కనబడలేదు.

“సుందు...మనం ఏకాంతంగా కూర్చోవడానికి ఎక్కడ ప్లేసు లేదు.మనం వేరే పార్కుకు వెళ్దామా?”అన్నాడు సుబ్బారావు. మరి ప్రేమ ఎక్కువైనప్పుడు సుందరిని అలా పిలుస్తాడు సుబ్బారావు.

“ఈ రోజు ప్రేమికుల రోజు కదా సుబ్బు.ఏ పార్కుకు వెళ్ళినా ఇలాగే ఉంటుంది.అలా సరదాగా మాట్లాడుకుంటూ ఒకసారి పార్కంతా తిరిగి చూద్దాం.ఎక్కడైనా మనకు కాస్త చోటు దొరుకొచ్చు"అంటూ సుబ్బారావు భుజం మీద చేయి వేసింది సుందరి. అందుకు పొంగిపోయాడు సుబ్బారావు.

“నువ్వు చెప్పితే కాదంటానా సుందు " అన్నాడు నవ్వుతూ.

ఇద్దరు నిలబడిన చోటు నుండి ముందుకు నడుస్తూ,సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్లి,ఒక చెట్టు దగ్గర కూర్చున్నారు. అంతలోనే వారిముందు ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు.

“మీరు ప్రేమికులా...?” సూటిగా అడిగాడు.అతను చాప,దిండు,రగ్గు పట్టుకుని ఉన్నాడు. “అబ్బే... కాదండి... అదీ... అదీ... మేమిద్దరం ఫ్రెండ్స్ మండీ....చదువుకుందామని ఇలా పార్క్ కి వచ్చామండి.... ఛఛ... చదువుకోవడానికి కాదండి కాలక్షేపం కోసం ఇలా వచ్చామండి... అసలు మేము ప్రేమికులమే కాదండి....” భయంగా, కంగారుగా చెప్పాడు సుబ్బారావు.

“అబ్బా... నేను అలాంటి వాడిని కాదయ్యా బాబూ....?”అన్నాడు ఎదురైనా వ్యక్తి.

“అలాంటి వాడంటేనండి...?” అమాయకంగా అడిగాడు సుబ్బారావు.

“అబ్బా... ఈ రోజు ప్రేమ జంట కనిపిస్తే పెళ్ళిచేసే గ్యాంగ్ లోని వ్యక్తిని కాదు నేను....?” “ఓహో... అలాగా...! అయితే మీరెవరు....?” “నేను మీకు సహాయం చేద్దామని వచ్చాను.....”

“అలాగా...! అది సరే మీరేంటి ఇలా చాప, దిండు, రగ్గు పట్టుకుని తిరుగుతున్నారు...” ఏమి తెలియనట్టుగా అడిగాడు సుబ్బారావు.

“ప్రేమికుల రోజు స్పెషల్ ఇదేమరి....?”

“అంటే....?” అర్థం కాలేదు సుబ్బారావుకి.

“అబ్బా... ప్రతీదీ విడమరిచి చెప్పాలి మీకు...? ఇలా పార్కుకి రావడం ఇదే మొదటిసారా...?” విసుక్కున్నాడు ఆ వ్యక్తి.

“అవునండి...! ఇదే ఫస్టు... ఏదో సరదాగా అలా మాట్లాడుకుందామని...”

“అలా మాట్లాడుకున్న తర్వాత మీకు ఇంకోటి అనిపిస్తుంది."అన్నాడు ఆ వ్యక్తి.

ఆ ఇంకోటి ఏమిటో సుందరికి,సుబ్బారావుకి అర్థం కాలేదు.ఒకరి ముఖాన్ని ఒకరు అయోమయంగా చూసుకున్నారు.

వాళ్ళ అయోమయాన్ని పట్టించుకోకుండా ఆ వ్యక్తి "అలా అనిపించినప్పుడు ఇవి మీకు అవసరం పడుతాయి"చిలిపిగా నవ్వుతూ చెప్పాడు ఆ వ్యక్తి.

“అలా అనిపించడం ఏంటి?అప్పుడు మాకు ఇవి అవసరం పడటం ఏమిటి?మాకంతా అయోమయంగా వుంది "అన్నాడు సుబ్బారావు బుర్ర గీక్కుంటూ.

“ఇవే కాదు... ఏకాంత ప్రదేశం కూడా కావాల్సొస్తుంది. అలా కావాల్సి వచ్చినప్పుడు వాటన్నింటిని సమకూర్చి మీలాంటి ప్రేమికులకి సహాయం చేయడమే నేను చేసే పని, పైగా ఈరోజు ప్రేమికులకి ప్రత్యేకంగా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తాం... కంగారుపడకుండా నా మాట నమ్మండి.”అన్నాడు ఆ వ్యక్తి.

ఆ వ్యక్తి మాటలు అర్థం కాని సుందరి,సుబ్బారావుతో "సుబ్బు నాకేదో భయంగా వుంది. ఇక్కడి నుండి మనం పబ్బుకి వెళ్దామా?”అంది.

“సరే సుందు.నీ ఇష్టం ?”అన్నాడు సుబ్బారావు.

ఇద్దరూ అక్కని నుండి ముందుకు కదులుతుండగా,ఆ వ్యక్తి మళ్ళీ కలిపించుకుని" “డోంట్ వరీ.... అక్కడ కూడా మీకొసం సెపరేటుగా అన్నిసదుపాయాలని సమకూర్చే అవకాశం వుంది. ఈ ప్రేమికుల రోజును మీరు ఎంతో జాలీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సాయంత్రం వరకూ మీ గది తలుపుని ఎవరూ తట్టకుండా చూసే పూచీ నాది.”అన్నాడు.

మరింతగా భయపడిన సుందరి,సుబ్బారావు...ఒకరి ముఖాన్ని ఒకరు అయోమయంగా చూసుకుని“అమ్మో...అయితే పబ్బుకి కూడా వద్దు"అంది సుందరి.

మరింత ఉత్సాహంగా ఆ వ్యక్తి “అయితే హోటల్ కి వెళ్తారా... సిటీకి దూరంగా ఉండే ఏదైనా రిసార్ట్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారా....? మీరు ఎక్కడికంటే అక్కడికి.... ఎలా అంటే అలా... ఈ ప్రేమికుల రోజున మీరు ఎంతో ఆనందంగా ఉండడానికి మేము అన్ని విధాలుగా సహాయం చేస్తాం... మీకు ఏది, ఎలా కావాలంటే అలా సమకూరుస్తాం... మీ ఆనందమే మా ఆనందం...” అన్నాడు.

వాడు ఏమి చెప్తున్నాడో,ఎందుకు చెప్తున్నాడో అర్థంకాని సుందరి,సుబ్బారావు"ఇంకెప్పుడూ పార్కుకే కాదు పబ్బుకి,హోటల్ కు కూడా వెళ్లొద్దని నిర్ణయించుకుని అక్కడి నుండి లేచిపోయారు.