Cinema Mastugundi

సినిమా మస్తుగుంది

-పద్మశ్రీ

ఆ రోజు గురువారం. ఓ తెలుగు సినిమా ఆరోజే రిలీజు అయింది. అప్పటికే ఆ సినిమా గురించి టీవీల్లో, పేపర్లలో ఫుల్లు పబ్లిసిటీ ఇచ్చేసారు. రోడ్డు పక్కన ఉండే గోడలనిండా ఆ సినిమా తాలూకూ పోస్టర్లు అతికించారు. ఎక్కడ చూడూ ఆ సినిమాకి సంబంధించిన అడ్వర్టైజ్ మెంట్లు కనిపిస్తున్నాయి.

అయినా ఆ సినిమా ప్రొడ్యూసరుకి ఎక్కడో, ఏమూలో చిన్న అనుమానం. ఇంతచేసినా అసలు సినిమా ఆడుతుందా అని....!

పబ్లిసిటీ పరంగా నానా హంగామా చేయడం వరకూ ఓకే.కానీ సినిమా ఆడాలంటే దానిలో సరుకుఉండాలికదా.! ఎందుకో ప్రోడ్యూసర్ కి తన సినిమాలో సరుకు లేదనిపించింది.

అందుకే ఆయనకి భయం పట్టుకుంది.సినిమా ప్రారంభానికి ముందు డైరెక్టరు నోటిద్వారా కథ విన్నప్పుడు, సినిమా పూర్తయ్యాక డైరెక్టర్ తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు ప్రొడ్యూసరు పాపం మహా కన్ ఫ్యూజన్ లో పడిపోయాడు.

ఎందుకంటే డైరెక్టర్ గారు ముందు కథ చెప్పినదానికి, తెరకెక్కించిన దానికీ అసలు పోలికే లేదు.అయినా ఖర్చు మాత్రం తడిసి మోపెడయి కూర్చుంది.లాభాల సంగతి దేవుడెరుగు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం గగనమే అనిపిస్తోంది. అందుకే ఆయనకి దిగులు పట్టుకుంది.

తన డబ్బులు తిరిగి రాబట్టుకోవాలంటే ఏం చేయాలి...? అనే ఆలోచనలో తలమునకలై ఉండగానే అతని సెల్ ఫోన్ మోగింది.

చిరాగ్గా ఎత్తగానే  అవతలి నుండి ఓ మృదువైన స్త్రీ కంఠం అతని మూడ్ గురించి పట్టించుకోకుండా ఏదో చెబుతోంది.

ఆమె మాటలు విన్న ప్రొడ్యూసర్ బుర్రలో ఓ ఐడియా ప్లాష్ లా మెదిలింది.

అంతే అతని మొహం ఆనందంతో వెలిగింది. వెంటనే కార్యరంగంలోకి దిగేసాడు. పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి.

సినిమా రిలీజయ్యే థియేటర్ ముందు తాత్కాలికంగా ఓ ఆఫీస్ వెలసింది. అందులో ఓ నాలుగు టేబుళ్ళు వేసారు. వాటిపైన ఓ పది టెలిఫోన్ డబ్బాలు సిద్ధం చేసారు. ఆ వెంటనే ఓ పదుగురు అందమైన అమ్మాయిలని ఆ ఆఫీసులోకి షిఫ్ట్ చేసారు.

సినిమా మొదటిరోజు, మొదటి షోకి కూడా జనాలు పలుచగానే కనిపిస్తున్నారు. ఇక ఆఫీసులో ఉన్న అమ్మాయిలు కార్యరంగంలోకి దిగిపోయారు.

ఫోన్ అందుకుని ఓ నెంబర్ డయల్ చేసింది ఓ అమ్మాయి.

“హలో...” అంది మత్తెక్కించే కంఠంతో.

“హలో...ఎవరండీ...” అందమైన,మృదువైన, మత్తెక్కించే ఆ కంఠం వినిపించే సరికి మెలికలు తిరుగుతూ అన్నాడు ఓ వ్యక్తి.

“ఈరోజు ఫలానా సినిమా ఫలానా థియేటర్లో రిలీజయింది. సినిమా మస్తుగుంది. మాంచి రోమాన్స్ సీన్స్ ఉన్నాయి, మాంచి ఫైట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో హీరో ఫైవ్ క్యారెక్టర్ చేసాడు.చాలా బాగా చేసాడు తెలుసా..”

“అవునా... అయితే తప్పకుండా చూస్తానండీ... కానీ ఈరోజు టైం లేదు..” అంటూ ఏదో చెప్పబోయేలోపే అతని మాటలకి అడ్డుపడింది.

“అదేమీ కుదరదు... వెంటనే ఈ సినిమాని చూడాలి అంతే.. ఒక అందమైన అమ్మాయి ఇలా ఫోన్ చేసి సినిమా చూడమని చెబుతూంటే తరువాత చూస్తానని అంటారేంటీ... యూ నాటీ... వెంటనే మార్నింగ్ షో చూసెయ్....” అలా మత్తెక్కించే గొంతుతో చెబుతూంటే పాపం అతను కాదంటాడా ఏంటీ....? అదన్నమాట.

థియేటర్లలోకి జనాలని రప్పించడానికి ముందు ముందు ఇలా కాల్ సెంటర్లు ఓపెన్ చేసి అందమయిన అమ్మాయిలతో జనాలని సినిమా చూడమని చెప్పించడం కూడా జరగొచ్చు.. కాదనగలరా?!