Maa Avidaku Pati Dorikaadu-2

రెండవ భాగం

"రమాపతిని ఎలా పిలివాలి, రమా అంటే వాడిక్కోపం, పతీ అంటే బాగోలేదు.మరెలా...మర... రవ...మావ...వర...మతి..” అనుకుంటూ ఎన్నో కాంబినేషన్లు ప్రయత్నించి చూశాడు.ఏదీ కుదర్లేదు.

తెల్లారాకా రమాపతిని పిలిచి "పతీ నిన్ను ముద్దుగా చిన్నా అని పిలవమంటావా ?” అని అడిగాడు ఆనందరావు.

“ఎద్దులా వున్నాను నేను చిన్నాని ఏమిటండీ "అన్నాడు పతీ.

“పోనీ...అబ్బాయ్ అని పిలవమంటావా ?”అన్నాడు ఆనందరావు.

“అబ్బాయిని కాక అమ్మాయినా?అయ్యగారూ నన్నేమైనా అనండి.నాపేరునడ్డం పెట్టుకుని ఏడిపిస్తే నేనూరుకోను.అంతగా మీ కిష్టం లేకపోతే చెప్పండి నేను పనొదిలేసి పోతాను " అన్నాడతను సీరియస్ గా.

“అమ్మమ్మ వద్దులే "అన్నాడు ఆనందరావు.

ఏదైనా ఇబ్బంది అనిపించనే కూడదు.ఒకసారి అలా అనిపించడం మొదలు పెడితే అతి చిన్న సమస్య కూడా భూతంలా కనిపిస్తుంది.ఆనందరావు పనీ అలాగే వుంది. ఎవరి ఎదటైనా అతన్ని రమ "పతీ"అన్నప్పుడల్లా ఇతని మనస్సు కలుక్కుమంటూనే వుండేది.

ఒకసారి ఆనందరావు ఆఫీసు వాళ్లందరూ పిక్నిక్ ప్రోగ్రాం వేశారు.కార్తికమాసం కూడా కలిసివచ్చింది.

“పిల్లలను చూసుకుంటాడు.వాళ్ళు నా మాట వినరు.నేను పెడితే తినరు "అంటూ రమాపతిని కూడా ప్రయాణం చేయించింది రమ.

వాడు వెంటరావడం ఇష్టంలేకపోయినా రమ వినదు కాబట్టి ఊరుకున్నాడు ఆనందరావు. అందరూ వచ్చారు.వన భోజనాల ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా వున్నాయి.పెద్దవాళ్ళూ పిల్లలైపోయారు.

ఆనందరావు పేకాడుతున్నాడు.మరోవైపు గేమ్స్ జరుగుతున్నాయి. మ్యూజికల్ చైర్స్ వగైరాలు అయ్యాయి.మరో గేమ్ ప్రారంభం అయింది.వచ్చిన వాళ్ళందరి పేర్లూ ఓ డబ్బాలో వేసి ఒక్కోటి తీసి వారిని పిలిచి ఆటలు ఆడిస్తున్నారు.ముచ్చటగా మూడో పేరు రమ చీటీ వచ్చింది.

“ మీరు మీ శ్రీవారితో కలిసి మాంచి రొమాంటిక్ డ్యూయెట్కి డ్యాన్స్ చేయాలి అని వుంది. అంతా గొల్లున నవ్వేశారు.నేను రాను నేను రాను అని మొహమాట పడుతున్న రమని ముందుకీ నెడుతున్నారు ఫ్రెండ్స్.

ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాయన "లాభం లేదు రమగారు రావాలి.రమాపతిగారు కూడా ఎక్కడున్నా స్టేజి మీదకు రావాలి "అన్నాడు మైకులో.

సిగ్గుపడుతూ వెళ్ళింది రమ.

ఆనందరావు పక్కవాళ్లకి తన ముక్కలు అప్పజెప్పి వెళ్లబోయేలోగానే "రమగారు వచ్చేశారు.ఇక రమాపతిగారు రావాలి"అనే ఎనౌన్స్ మెంట్ వినిపించడం,వెంటనే ఆదరాబాదరాగా పిల్లలకి అన్నం తినిపిస్తున్న రమాపతి స్టేజి మీదకి వెళ్లడం క్షణంలోనే జరిగిపోయాయ.

ఒక్క క్షణం అందరూ తెల్లబోయారు.మరుక్షణం అంతా ఘోల్లున నవ్వేశారు.గోలగోల చేశారు. రమ గతుక్కుమని వెంటనే సర్దుకుంది. ''పతీ పిలిచింది నిన్నుకాదు.అయ్యగారిని'' అంది నవ్వేస్తూ.

ఆనందరావు మాత్రం అంత తేలిగ్గా తీసుకోలేదు.సాయంత్రందాకా ఫ్రెండ్స్ ఏడిపిస్తూ వుంటే లోలోపలే ఉడికిపోయాడు. ఇంటికి రాగానే రమాపతి మీద వంటికాలిమీద లేచాడు.రమాపతి ఏదో చెప్పబోతుంటే కొట్టినంత పని చేశాడు. రమ అడ్డుపడి ఆపింది.

"మీరు ఆవేశంలో వున్నారు.వెళ్లి పడుక్కోండి.రేపు తెల్లారాక మాట్లాడుకుందాం " అంది. తెల్లావారేసరికి రమాపతిలేడు.వాడి మేనత్తా లేదు.రమ గుండె బోరుమంది.ఆ విషయం ఆనందరావుకి చెప్పింది.

“పోతేపోయాడు.పీడా వదిలింది.వీడి తాతలాంటివాడిని మరొకడిని తెస్తాను"అంటూ బీరాలు పోయాడు ఆనందరావు.

తాతలాంటివాడు కాదు కదా.మనవడి లాంటి వాడు కూడా దొరకలేదు.ఫలితం ఆ ఇల్లు మళ్ళీ ఒక సర్కస్ డేరాలా తయారయింది. పనివాడు వుండనీ లేకపోనీ బాబాయ్ గారికీ అత్తయ్య గారికీ వేళకి అన్నీ అమర్చాలి.ఇవి కాక భర్తపనీ పిల్లలపనీ..అన్ని పనులతో పాపం రమ హూనం హూనం అయిపోసాగింది.

భార్య అవస్థ చూడలేక ఏమీ చేయలేక అవస్థ పడిపోతున్నాడు ఆనందరావు.నాలుగు రోజులు హోటల్ నుంచి తెప్పించాడు.పిల్లలు సర్దుకుపోయినా బాబాయ్ అత్తయ్యా మాత్రం గొడవ చేసేవారు.సమస్య తీవ్రతరం అయింది.రమ శారీరకంగా కన్నా మానసికంగా కృంగిపోయింది.

"అమ్మా అమ్మా అంటూ కడుపునా పుట్టిన బిడ్డలా వుండేవాడు.అలాంటి వాడిని అన్యాయంగా వెళ్ళగొట్టారు.”అంటూ గుర్తు చేసుకుని ఏడుస్తుంటే పశ్చాత్తాపంతో బాధపడ్డాడు ఆనందరావు.

రమాపతి కోసం వెతికించడం మొదలు పెట్టాడు.ఈ ఊళ్ళో ఎవరికైన పనిచేశాడేమో వాకబు చేస్తే లేదని తెలిసింది.వాళ ఊరికి మనిషిని పంపించాడు.ఇష్టదైవాలకు దణ్ణాలు పెట్టాడు.

పిల్లలు బెంగపెట్టుకుని నాన్న పతి ఎప్పుడు వస్తాడు అని అడుగుతున్నారు.అస్తమానం పతీ అంటూ తల్చుకుని తల్చుకుని ఏడుస్తుంది రమ. అతి కష్టం మీద వారం రోజులు గడిచాయి.

ఊరికి వెళ్ళిన పెద్దమనిషి కూడా రిక్తహస్తాలతో తిరిగి వచ్చేశాడు.నిలువునా నీరయిపోయాడు ఆనందరావు.

ఓనాడు..రాత్రి పది గంటలయింది.ఫోన్ మోగింది.తీసి హలో అన్న ఆనందరావు...ఆనందంతో ఎగిరి గంతేశాడు.

“పతీ నువ్వా ?”అన్నాడు.

“అయ్యగారూ!బుద్ది గడ్డితిని మీకు చెప్పకుండా వచ్చేశాను.మిమ్ములందరినీ వదిలి ఉండలేకపోతున్నాను.మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి.మీరేం పిలిచినా పలుకుతాను. మళ్ళీ పన్లోకి రావొచ్చా ?” దీనంగా అడిగాడు.

“ మేము నిన్ను వదిలి వుండలేకపోతున్నాము.నీ ఇష్టం వచ్చిన పేరుతోనే పిలుస్తాం. వచ్చేయ్.ఇన్నాళ్ళూ రాకపోతే వేరే చోట పనికి కుదిరావనుకున్నా" అన్నాడు ఆనందరావు.

“ఒకచోట పని కుదిరిందండి.కానీ పతీ అని పిలవాలగానే ఆ ఇంటాయన తాడి యెత్తున లేచాడండి.ఆయన భార్య పేరు పతిట " చెప్పాడు పతీ.

పక్కున నవ్వాడు ఆనందరావు.

ఈ సంభాషణ వింటున్న రమ ఒక్క గెంతులో ఫోన్ దగ్గరికి వచ్చేసింది.

“ఎవరు...పతేనా "అన్నది సంభ్రమాశ్చర్యాలలో.

“అవును పతే!ఇదిగో మాట్లాడు "అంటూ ఫోన్ అందించాడు.

“పతీ ఎలా వున్నావు?ఎక్కడున్నావు ?త్వరగా ఇంటికి వచ్చేయ్.”అని రమ అంటుంటే బాధ అనిపించలేదు ఆనందరావుకి.

“అమ్మయ్య నా భార్య ఇకనైనా ఆనందంగా వుంటుంది.పతి దొరికాడుగా "అనుకున్నాడు ఆనందరావు తృప్తిగా.