Govinda gohovinda

" గోవిందా...గొహోవిందా "

వెంపరాల శారద

రాజకీయ నాయకులు ఓటు కోసం శవాన్ని కూడా వదలరని నానుడి!

పోలింగు క్షణాలు ముగుస్తుండగా, ఆ ఇంట్లో ఇవాళ్లో రేపో అన్నట్టుగా ఒక ప్రాణి ఉందని తెలిసి ఉరుకుల పరుగులతో ముగ్గురూ అభ్యర్థులు ఎలక్షన్ ఆఫీసరుని వెంటబెట్టుకొని వచ్చారు.

ఓ పెద్దాయన మంచాన్నతుక్కుని కళ్ళు శూన్యంలోకి చూస్తుండగా ఎగశ్వాసతో క్షణాలు లెక్క పెడుతుంటే, మంచం ప్రక్క ఆ క్షణాల కోసం నిమిషాలు లెక్కపెడుతూ కూర్చుని ఉన్నాడు అతని మనవడు.

ఒక్కమాటు చుట్టూ పరికించి మనవడితో నాలుగు సానుభూతి వాక్యాలు పలికి,తాము వచ్చిన పనిని మెల్లగా బయట పెడుతూ,'ఓటు జన్మహక్కు'అని జన్మను చాలించబోతున్న తాతగారి ఈ జన్మకి గల ఆ హక్కుని కాదనే హక్కు మనకు లేదని అభ్యర్థులు వివరించారు.

“ ఓటు మాటదేముడెవరుగు, రాత్రి నుండి మాట కూడా పడిపోయింది తాతకి " అన్నాడు మనవడు దిగులుగా.

పట్టువదలని ఆ రాజకీయ విక్రమార్కులు తమ ప్రయత్నాన్ని విరమించుకోలేదు.మొదటి అభ్యర్థి తాత తలవైపుకి వెళ్లి "తాతా !నీ ఓటు ఎవరికి ? తెలుగుదేశానికేగా ?” అని నారాయణ మంత్రం చెవిలో ఊదినట్లుగా కొంచెం గట్టిగానే అడిగాడు.

శరీరంలో కదలిక లేకపోయినా తెరుచుకునే ఉన్న తాత నోటివెంట'ఆ' అన్న శబ్దం వచ్చింది.

విప్పారిన ముఖంతో అభ్యర్తి "అయితే నీ ఓటు తెలుగుదేశానికేనన్నమాట " అన్నాడు చెవిలో కొంచెం గట్టిగా.

“ఆ" మళ్ళీ అదే శబ్దం. మొదటి అభ్యర్థి సంతోషంగా ఎలక్షను ఆఫీసరు వైపు తిరిగి

" చూశారా...ఆయన ఓటు మాకే. వ్రాసుకోండి " అన్నాడు.

ఇంతలో రెండవ అభ్యర్థి అడ్డుపడుతూ "ఆగండి..ఆయన ఆ అని అవులించాడు.అంతేగాని అవునని కాదు.నేనడుగుతాను " అని తాత చెవి దగ్గరకు వెళ్లి " తాతా నీ ఓటు కాంగ్రెసుకేనా " అన్నాడు మరింత గట్టిగా. “ఆ " అని మళ్ళీ శబ్దం చేశాడు.

“ చూశారా ఆయన ఓటు మా పార్టీకే,వ్రాసుకోండి " అన్నాడు రెండో అభ్యర్థి.

మూడో అభ్యర్థి కల్పించుకుంటూ...”మీరూ కాస్త ఆగుతారా, పెద్దాయన...ఆ...అంటే ఏమిటీ అని అర్థం...నేను అడుగుతా చూడండి " అని మూడో అభ్యర్థి తాత చెవిలో "నీ ఓటు బిజెపి కే కదా తాతా " అని అరిచాడు.

“.......” ఏ మాటు శబ్దం లేదు.మాటతో పాటు ఓటు ఎగిరిపోయింది.

తాత గుడ్లు తేలేశాడు.

“ ఈ ముగ్గురూ మా తాతను చంపేశారు నాయనోయ్ " అని గొల్లుమన్నాడు ఆ క్షణం ఎదురు తెన్నులు చూస్తున్న మనవడు.

“ చంపేశారు" అన్నమాట ఒక్కటే వినబడ్డ 'అధికారి' నేర చరిత్ర గల ముగ్గురు అభ్యర్థుల గురించి ఇప్పుడే లోకసత్తాకు ఫిర్యాదు చేస్తానంటూ పెన్ను జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు.

“ ఆ...” అన్నారు ముగ్గురూ అభ్యర్థులు కోరస్ గా.