Mahotsa vahvaana patrika-2

“ ...మహోత్స 'వాహ్వా'న పత్రిక - 2 "

ఐ.ఎ.నరసింహం. 

సాయంత్రం ఆరు గంటలు కావస్తుంది.

నేను వీధి వరండాలో ద్వారం దగ్గర కుర్చీ వేసుకుని పుస్తకం చదువుకుంటున్నాను.

“ హాలో నమస్కారం సార్....” నేనటు వేపు చూసి " ఎవరూ " అన్నాను.

“ సార్ దయచేసి మీ పేరు చెప్తారా !” అంటున్న అతడి చేతిలో ఒక పెద్ద దొంతి తెల్లటి కవర్లున్నాయి.అందులో ఒకటి తీసి జేబులో పెన్ను కేప్ తీసి నా వేపు చూశాడు.

ఆ వ్యక్తి ఎవరో నాకింకా గుర్తుకు రాలేదు. “ జనాభా లెక్కలా ?” ఆ అవతారం అలా లేదు.

“ పోనీ తన కోసం ప్రత్యేకమైన పనిమీద వచ్చాడా ? ” ఆ శాల్తీ అలా కనిపించలేదు.

“ మరి తను ఎవరూ ?” నాలో నేను అనుకుంటూనే " ఎవరు కావాలి ?” అని అతన్ని అడిగాను.

“ మీరే కావాలి.కాస్త మీ పేరు చెప్తే కార్డు అందజేసి వెళ్ళిపోతాను " అన్నాడు ఆ వ్యక్తి.

నాకు బోధ పడలేదు. “ ఏం కార్డయ్యా ? ఎవరు మీరు " అన్నాను సన్నగా.

“ ఓహ్ అదా...నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదూ...నేనీ ఊరికి కొత్తగా వచ్చిన ఉద్యోగిని.మా అద్దెంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం.శుభలేక అందజేద్దామని...” అని చెప్పాడు నా దగ్గరికి వచ్చిన వ్యక్తి.

నా గుండె జారిపోయింది.మరో యాబై రూపాయలు శివార్పణం అనుకున్నాను మనసులో.

“ఓహో అలాగా !” అన్నట్టు అతని వైపు చూసి " చూడండి మీరెవరికి ఇద్దామని నా దగ్గరికి వచ్చారో...నన్ను సమర్పణరావు అంటారు.నాకు మీరు పరిచయస్తులు కారు "

(అలాంటప్పుడు నాకు శుభలేక అందజేయటం దేనికి బాబు అన్న మాటలు బలవంతాన దిగమింగి బయటకు గాలి వదిలాను).

“ మాకు పరిచయంతో పని లేదండి!వెయ్యి కార్డులు కొట్టించాను.ఊరందరికీ స్వయంగా వెళ్లి అందజేస్తున్నాను.అలాగే మీకు. నాదో పద్దతి ఈ కార్డులు ఒక్కటి కూడా వ్యర్థం కాకూడదని పక్కన నోట్ బుక్ పెట్టుకుని అందులో వారి పేర్లు రాద్తున్నాను.మీ పేరు చెప్పండి " అన్నాడు ఆ వ్యక్తి.

“ చాలా సంతోషం సార్.కానీ ఒక్క విషయం.మరి వీళ్ళంతా ఆ రోజు మీ యింటి మీద దండయాత్ర చేస్తే ఎలా తట్టుకుంటారు ?” నన్ను నేను తప్పించుకునే ప్రయత్నంలో ఉండబట్టలేక అన్నాను.

“ దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాను సార్.మాకు పెద్దగా శ్రమ ఉండకూడదని బఫే మీల్సు సిద్దం చేస్తున్నాను " అన్నాడు ఆ వ్యక్తి.

“ ఓహ్ బాగానే వుంది.కానీ మీరేం అనుకోనంటే ఒక్క విషయం " అంటూ కుర్చీ నుండి లేచి వచ్చిన వ్యక్తిని యింట్లోకి ఆహ్వానించడానికి బదులు రెండు అడుగులు ముందుకు నడిచి అతడి చేత మరో నాలుగడుగులు వెనక్కు నడిపించాను.

“ చెప్పండి సార్ " అన్నాడు ఆ వ్యక్తి.

“ అదేనండి !మీరింకా కొత్తవారు. వచ్చిన వెంటనే ఇల్లు పోల్లూ సర్దుకోడానికి ఓ వారం పడుతుంది.వెంటనే యింత పెద్ద ఫంక్షన్ తలపెట్టారు.మీరేం అనుకోనంటే ఒక్క విషయం...పది రూపాయలు ఒక్కోడికి.

అయితే పదివేల భోజనాల ఆర్భాటం ఎందుకు చెప్పండి ?హాయిగా మీ కుటుంబ సభ్యులు ఈశాన్యమూలలో కూర్చుని ఓ సత్యనారాయణ స్వామి పటం పెట్టుకుని ఓ టెంకాయ కొట్టి రెండరటి పళ్ళకు తొక్కలు తీసి రామా కృష్ణా అనుకోవచ్చుగా...ఇంత హైరానా దేనికీ...” అని అన్నాను నేను.

“ బలేవారే సార్...నేను మాత్రం ఊరకనే చేస్తున్నానా ?భోజనాలకు ప్లేటుకు పది రూపాయల చొప్పున నేను ఖర్చుపెడితే వచ్చిన వాళ్ళు కనీసం ఇరవై రూపాయలు పారితోషికం అందజేయకపోరు...” అన్నాడు నా దగ్గరికి వచ్చిన వ్యక్తి.

నేను ఆశ్చర్యపోయాను.

“ ఓ అదా!ఐతే ఇదో చిన్న బిజినెస్ అన్నమాట.సరే వాళ్ళంతా ఊరకనే తినేసి వెళ్ళిపోతే...” అన్నాను సందేహం వెలిబుచ్చుతూ.

“ దానికో ఏర్పాటు చేశాను సార్.భోజనం అయిన వెంటనే బహుమతిలిచ్చారా సరే లేకపోతే వారి వద్ద నుండి భోజనం ఖరీదు కక్కిస్తాం.ఆ కార్యక్రమానికో ఇద్దరు గుండాలని ద్వారం దగ్గర ఏర్పాటు చేశాను.నేను ముందే చెప్పాను. నాదో ప్రత్యేక పద్దతని " చెప్పాడు నా దగ్గరికి వచ్చిన వ్యక్తి.

ఇదంతా నిజమనుకుంటున్నారా ? నా ఊహ మాత్రమే.

మాములుగా అతడు కార్దివ్వడం... నేను అందుకోవడం అతడు మళ్ళీ పక్కింట్లో రికార్డు ప్రారంభించడం నా మౌనంలోనే జరిగిపోయాయి.

అలనాడు శివధనస్సు బరువుకి రావణాసురుడు వెనక్కు వాలిపోయినట్టు నేనూ కార్డుని మోయలేక కిందకి జారవిడిచాను.

పదిహేను రోజులు గడిచాయి.

ఇంత తక్కువ సమయంలో ఓ ఇరవై కవర్లు నా చేతిలో పడ్డాయి. ఒకటి బంధువుల పెళ్లిదైతే రెండోది ప్రెండ్ గృహ ప్రవేశం.మూడోది నూతన వ్యాపారం యిక నాలుగు నుండి ఇరవై వరకూ ఫోటో స్టూడియోలు, ఎన్.టి.డి షాపులు,బార్బరు షాపులు...సంవత్సరీకాలు, తద్దినాలు శ్రాద్దాలు వగైరా...వగైరా...