Mahotsa vahvaana patrika

“ ...మహోత్స 'వాహ్వా'న పత్రిక "

ఐ.ఎ.నరసింహం.

నాకు తెలిసినంతవరకూ ఎవరికీ అపకారం చెయ్యలేదు.

నా చెంప మీద దోమకుట్టి రక్తం పీల్చి పారిపోతే ఆ చిన్నిక్రిమి తాప్రతాయానికి నవ్వుకుంటూ ఆ ప్రదేశంలో దురదకి పట్టి పట్టి గోక్కున్నానే తప్ప అందరిలా ఓ దెబ్బకొట్టి దాన్ని పచ్చడి చెయ్యలేదు.

ఒకసారి నాతొడ మీద కండచీమ కుట్టింది.ఒక నిమిషం బాధకు ఓర్చుకుని " పిచ్చిముండా నీ దాహం తీరిందా "అని దాన్ని నా చేతి వేళ్ళతో జాగ్రత్తగా తీసి అవతల పారేశాను.

మరి అంతటి సున్నితమైన మనసున్న నాకు ఇవాళ ఏం తప్పు చేశానని భగవంతుడు ఇంతటి శిక్ష విధించాడు అనుకుంటూనే క్యూలో నిలబడ్డ నేను మరో రెండడుగులు ముందుకు నడిచాను.

రెండు నిమిషాల తరువాత నా వంతు వచ్చింది. ప్లేటు ముందుకు చాచాను. ఒక పొడవాటి బెంచీమీద పాత్రల్తో కొన్ని ఆహార పదార్థాలున్నాయి.వాటి ముందు కుర్చీల్లో ఓ నలుగురు యువకులు కూర్చున్నారు.

ఒక వ్యక్తి నా ప్లేట్లో ఇంత అన్నం పెట్టాడు.ఆ ప్రక్కనే మరో వక్తి ఏదో ఉండలాంటి పదార్థం వేశాడు.మరో వ్యక్తి యింకేదో పడేశాడు.ఆ పళ్ళెం పట్టుకుని ఆకలితో ఆవురావురుమంటూ ఎక్కడో ఒక దగ్గర కూర్చుని తినాలనిపించి చుట్టూ చూశాను.

కిటికీల దగ్గర నిలబడి,మూలల్లో చతి కిలబడి హాల్లో జనాలు నిండిపోయారు.

కొందరు వరండాలో,మరి కొందరు పిట్టగోడల మీద, చివరకు చెట్టు క్రింద, ఆ పదార్థాలు ఆరగిస్తున్నారు.

నా వొళ్ళు గగుర్పొడిచింది.

ఒక్కసారి ఆ పదార్థాల వాసన చూశాను.

అంతే...! అంతవరకూ నేనో ఖైదీనని, అది నా జైలు అని, నా చేతిలో పాచి పదార్థాలని ఊహించుకున్న నేను వర్తమానంలోకొచ్చి ఆ పదార్థాలు ముక్కుకి ఆనించాను.

కమ్మటి వాసన నా నాశికా పుటాలకు తగలగానే నేనో పెళ్లి శుభలేఖ అందుకుని వచ్చానని, ఆ పెళ్ళివారు అలా బఫే మీల్సు పేరుతో సంతర్పణ చేస్తున్నారని తెలుసుకుని తృప్తిగా ఊపిరి పీల్చి నేనూ ఓ చెట్టు క్రిందకి నడిచాను.

పదిరోజుల క్రితం నా భార్య తరుపు బంధువులెవరికో పెళ్ళని శుభలేఖ వస్తే తను రాలేనని నన్ను పంపింది.నాకు చాలా పన్లున్నా తప్పనిసరై ఆఫీసుకు సెలవు పెట్టి జేబులో ఓ వెయ్యి వేసుకుని రిక్షా,ట్రైన్, బస్సు వంటి వాహనాల నధిరోహించి ఆ పెళ్ళికి హాజరయ్యాను.

నిజమే ఇందులో నా స్వార్థం కూడా వుంది.చక్కగా ఆ సందర్భంగా ఎంతోమంది బంధువుల దర్శనం అవుతుందని అందరితో పాటు నన్ను సాదరంగా ఆహ్వానించి శుభలేఖలో ఉన్నట్టు చందన తాంబూలాది సత్కారాలందజేస్తారని,సరదాగా అందరూ ఒక పంక్తిలో కూర్చుని విస్తరి ఖాళీలేనట్టు నవకాయ పిండి వంటలతో ఆవునెయ్యి,కందిపప్పు, గడ్డ పెరుగు ఆవకాయతో భోజనం పెట్టి

ఏమయ్యా మీరెవరన్నా ఈ భోజన సమయంలో చక్కగా రాగయుక్తంగా ఆ అన్నదాత పరమేశ్వరుని మీద నాలుగు పద్యాలు వదలరాదూ అంటారని కొన్నిరాగాలు,కొన్ని పద్యాలు కంఠస్థం చేసుకున్నాను.

నా పిచ్చిగాని వాళ్ళు ముందే ఆ రకమైన శుభలేఖను రద్దుచేసి " మీ రాక మా కోరిక...కల్పించుకోవాలి తీరిక "

“ చెప్పలేదనకండి ఆనక...కానుకలిచ్చి వెళ్ళండి మీరిక" ఇందులో మొదటి రెండు వాక్యాలు వారివైతే మిగతాది నేని అమర్చుకున్నాను.

ఇంక చేసేది లేక బైటకు వచ్చి ఓ కూలి పోయిన గోడ దగ్గర ప్రశాంతంగా భోజనం చేస్తూ పాత సంప్రదాయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండబట్టలేక ఆఠాణా రాగంలో ఓ శ్లోకం అందుకున్నాను.

తరువాత కాఫీ రాగంలో మరో పద్యం వదలబోతూ చుట్టూ చూశాను. నా చుట్టూ కొంతమంది మూగి నన్నో పిచ్చోడిలా చూసి నవ్వుకుంటున్నారు.

నేను సిగ్గుపడిపోయాను.గబగబా ప్లేటు వాష్ బేసిన వద్ద పడేసి చేతులు కడుక్కుంటూ వుంటే

“ ఏమండోయ్ మీకసలే నామాటంటే నిర్లక్ష్యం.పెళ్లి కూతురికి మూడువందల పదహార్లు పెళ్ళికొడుక్కి రెండువందల పదహార్లు చదివించండి!అటూ దిటూ ఇటు దటూ చెయ్యగలరు. ఎందుకైనా మంచిది.మనపేర్లు రాసిన ఈచీటి జేబులో పెట్టుకోండి " అన్న భార్య కామేశ్వరి మాటలు గుర్తుకొచ్చాయి.

చీటికోసం జేబులో చెయ్యి పెట్టాను.మళ్ళీ మరోసారెందుకని ఆ చేత్తోనే పర్సు కూడా బయటికి తీశాను. నేను నిల్చున్న దగ్గరలోనే ఒక వ్యక్తి కూర్చిలో కూర్చుని భోజనాలు చేసి వచ్చిన వారి నుండి కానుకలు స్వీకరిస్తున్నట్టు గ్రహించాను.

అటువైపు నడిచి ఆ చీటీ ప్రకారం డబ్బులు కట్టి రిక్షా ఎక్కి వెళ్ళిపోయాను. ఎందుకో నాకు ఆ స్వల్ప పదార్థాలతో ఆకలి తీరనట్టుంది.ఒకచోట భోజన హోటలు కనిపిస్తే రిక్షాను అటువైపు తిప్పమన్నాను.

“ రండి రండి !” అంటూ హోటలు ఓనరు సాదరంగా ఆహ్వానించాడు.ఆ ఆప్యాయతకు మురిసిపోయాను.

ఇరవై రూపాయల టిక్కెట్టు తీసుకుని ఫేనుకింద దర్జాగా కూర్చుని టేబులు మీద కావాల్సిన పదార్థాలన్నీ ఖచ్చితంగా వేయించుకుని తృప్తిగా భోజనం చేసి బయట పడ్డాను.