TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
అమాయకపు కూతురు
యస్.యస్.కిరణ్ కుమార్
ఇంటి వెనుకున్న పూలకు నీళ్ళు పోస్తున్న సావిత్రికి " అమ్మ...అమ్మ...” అరుపులు
వినిపించగానే, " ఇదేమిటి...లత పిలిచినట్టు వినిపిస్తుంది.కొంపదీసి వచ్చిందా ఏమి "
అనుకుని,చేతిలోని వాటర్ పైపుని, పక్కనే వున్న మామిడి చెట్టు మొదట్లో పెట్టి...గబగబా
ఇంట్లోకి వచ్చి తలుపు తీసి చూసింది.
ఎదురుగా కూతురు లత పెట్టేబేడా పట్టుకుని కనిపించింది.
“ ఎంటామ్మా అలా చూస్తున్నావు ? ” అంటూ లోపలికి వచ్చి హాల్లోని సోఫాలో కూర్చుంది.
ఏమి మాట్లాడకుండా సావిత్రి, తలుపు దగ్గరికి వేసి...కూతురు దగ్గరికి వచ్చింది.
“ అదేమిటమ్మా...పెళ్ళయి మూణ్ణెళ్ళు కాలేదు అప్పుడే అత్తింటినుండి పట్టేబేడా సర్దుకుని
వచ్చేశావ్ ?” కంగారుగా అడిగింది.
“ అదిసరేగాని అమ్మ...నేను టెన్త్ స్కూల్ ఫస్ట్ గా పాసయ్యానా లేదా..?'”
“ పాసయ్యావు " అంది అర్థంకాక.
“ మరి ఇంటర్ డిస్టింక్షన్...అవునా కాదా "
“ అవును " అయోమయంగా అంది సావిత్రి.
“ మరి డిగ్రీలో స్టేట్ ఫస్ట్ కదా...”
“ అదిసరేనే...నేను అడిగింది ఏమిటి ? నువ్వు నన్ను అడుగుతున్నది ఏమిటి ?”
“ ముందు నేను అడిగినదానికి సమాధానం చెప్పు "
“ అవును.నువ్వు స్టేట్ ఫస్ట్.నువ్వెప్పుడూ ఏ పరీక్ష తప్పలేదు.దానికీ నువ్విలా వచ్చెయ్య
డానికి ఏంటమ్మా సంబంధం ?” అడిగింది సావిత్రి.
“ ఉండమ్మా...నిన్న ఆయనతో హాస్పటల్ కి వెళితే...”
" వెళితే...వెళితే ఏమన్నాడే ?” కంగారుగా అడిగింది సావిత్రి.
" డాక్టరు గారు నేను నెల తప్పానని చెప్పి నవ్వాడమ్మా.దానికాయన ఆ డాక్టర్ని లాగి
ఒక్కటిచ్చుకోకపోగా...ఇంట్లో పార్టి అరేంజ్ చేయిస్తానన్నారు.రేపు వచ్చిన వారందరికీ ఈ
విషయం చెప్తారట.ఇంతకన్న అవమానం ఏ భార్య భరిస్తుంది.అందుకే వచ్చేశాను " అంటూ
చెప్పింది అమాయకంగా.
అది విని పకపక నవ్వింది తల్లి సావిత్రి.
|