TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
చక్రపాణి ఇంద్రలోక యాత్ర - 3
డా.భానుమతి రామకృష్ణ
భూలోకంలోని చక్రపాణి గారి గది.
చక్రపాణి గారు నిద్రపోతుంటారు.నిద్దట్లో కలవరిస్తాడు.
“ ఏం కథది!ఆడి కథ యీడు కాపీ గొట్టాడు.అసలు చండాలం గుండమ్మకథ బాగలేదన్నాడు గదాడు.” అని గొణుగుతూ ఒత్తిగిలి పడుకుంటాడు. మంచం కదులుతుంది.
మరుక్షణం అదృశ్యమవుతుంది.
ఇంద్రలోకం. చక్రపాణిగారు వెళుకువ వస్తూనే కండ్లు కూడా తెరవకుండా మంచం పక్క టీపాయి వుందనుకుని సిగరెట్ డబ్బా కోసం చెయ్యిచాస్తాడు.పండ్లూ ఫలహారాలూ చేతికి తగుల్తాయి. గొణుక్కుంటూ లేచి కూర్చుంటాడు.
ఎదురుగా ఒక పెద్ద వెలుగల్లే ఇంద్రుడు కనిపిస్తాడు.అంత వెలుగు చూడలేక ఒకచేయి కండ్ల కడ్డుంచుకుని విసుగ్గా " ఎవర్నువ్వు...?” అంటాడు.
“ నేను ఇంద్రుడిని...”
“ అట్టనా!అద్సరేగానీ నా సిగరెట్ డబ్బా చూశావా?”
ఇంద్రుడు వెలవెలబోతాడు. మరుక్షణం రత్నాల పెట్టెలో బంగారు చుట్టలు తెచ్చి చక్రపాణిగారికి అందించబోతాడు సేవకుడు.
“ అబ్బే!యిదేంటి ఛండాలం!నాకు స్తేటేక్స్ ప్రెస్ కావాలి...”
ఇంద్రుడు "చిత్రం "అంటూ అర్థంకాక సేవకుడివేపు చూస్తాడు.సేవకుడు అదృశ్యమౌతాడు.
“ అదిసరే.నేనేక్కడున్నాను ఇప్పుడు ?”
“ చిత్తం.ఇంద్రలోకంలో...”
“ అట్టనా...అయినా నన్ను ఎందుకు తెచ్చావ్ ఇక్కడికి!అసలు నువ్వు ఇంద్రుడివేనా లేక వేషం వేశావా...?”
ఇంద్రుడు చిన్నబుచ్చుకుని " వేషం కాదు.నేను దేవేంద్రుణ్ణి..” వినయంగా అన్నాడు.
“ పైన ఆ దేవ ఎందుకులే...ఒట్టి ఇంద్రుడంటే చాలదూ.అదిసరే గానీ నా సిగరెట్ డబ్బా ఏదీ?”
" చిత్తం ఇదిగో " అంటూ సేవకుడు చక్రపాణికి సిగరెట్ డబ్బాఅందిస్తాడు.
“ ఆగ్గిపెట్టేదీ "
“ తమరు ధూమపానం చేయండి.నా శక్తితో దానంతట అదే వెలుగుతుంది.” అంటాడు ఇంద్రుడు.
“ దీనికి నీ బోడి శక్తి ఎందుకూ ? అగ్గిపుల్లతో పోయే దానికి.ఆగ్గిపుల్ల వెలిగించకపొతే సిగరెట్ తాగినట్టుండదు అగ్గిపెట్టె ఒకటి తెప్పించు "
“ చిత్తం " అన్నాడు ఇంద్రుడు. మరుక్షణం అగ్గిపెట్టె చక్రపాణిగారి చేతికి అందిస్తాడు సేవకుడు.
చక్రపాణిగారు సిగరెట్ వెలిగిస్తూ " అవునుగానీ నాకు కాఫీ కావాల్నే! దొరుకుద్దా?”
“ చిత్తం తెప్పిస్తాను " అంటూ ఇంద్రుడు సేవకునివైపు చూస్తాడు.
“ అదిసరేగానీ...ఇక్కడ బాత్ రూము ఎక్కడ?అసలుందా బాత్ రూము ?” అడిగాడు చక్రపాణి.
“ చిత్తం " ఇంద్రుడు తిరిగి చూస్తాడు.ఇద్దరు సేవకులు వస్తారు. చక్రపాణిగారు మంచం దిగి కాళ్ళ కింద పెడతాడు.
“ అరెరెరె నా చెప్పులేయీ..ఇదేంటి కాళ్ళకింద ఇంత మెత్తగా వుంది"
“ అది పూలరెక్కల రత్న కంబళం "
“ కాళ్ళకింద పూల రెక్కల కార్పెట్టేంటి ఛండాలం...గొర్రె బొచ్చుది దొరకదు మీకూ...” ఇంద్రుడు చక్రపాణిగారి వేపు అయోమయంగా చూస్తాడు.
“ అన్నట్లు రంభేది ?బాగుందా...” అని చక్రపాణిగారు అగుడుతుండగానే రంభ ఒక స్థంభం చాటు నుండి పరుగెత్తుకొచ్చి ఏడుస్తూ చక్రపాణిగారి పాదాలమీది పడుతుంది.
ఇంద్రుడు అవమానంతో ముఖం తిప్పుకుంటాడు.
చక్రపాణిగారు కాస్త ఇబ్బంది పడుతూ , కాళ్ళూ వెనక్కి లాక్కుని "యిదేంటి సినిమాలాగా? లేలే...బాగున్నావా ?పతివ్రతేషం కావాలని కోరికోరి ఏసిందానిని సగంలోనే మాయమైనావే.” అన్నాడు.
రంభ లేచి నిలబడి "అందుకే క్షమించమంటున్నాను.నా తప్పేం లేదు.చక్కన్నగారూ.తప్పంతా వారిది "అంటూ రంభ ఇంద్రుణ్ణి చూపిస్తుంది.
ఇంద్రుడు కోపాన్ని దిగమింగి తలవంచుకుంటాడు.
“ సరేలే.దానికి నువ్వేడవడం ఎందుకూ...ఎనకటికి ఎవతో మొగుణ్ణి కొట్టి ఏడ్చిండంట. పిచ్చెరు సగంలో నువ్వొచ్చేసినందుకు ప్రొడ్యుసర్ ఏడువాలి గానీ నువ్వేడుస్తావేం ?వుండు... బాత్ రూముకి వెళ్ళొస్తా " అంటూ సేవకుల వెంట నడుస్తాడు.
“ ఎంత విరసుడు!ఎంత అరసికుడు!ఛీ...ఛీ...ఛీ...” అంటూ తలకొట్టుకుంటాడు ఇంద్రుడు.
|