TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
రెండవ భాగం
రోడ్డు హడావిడిగా వుంది.
జనం కొంపలంటుకున్నంత కంగారుగా అటూ ఇటూ పోతున్నారు.
సుందర్రావ్...షాపింగ్ కాంప్లెక్స్ పక్కగా పుట్ పాత్ మీద నుంచుని కార్లలో వెళ్ళేవాళ్ళని బైకుల మీద పోయేవాళ్ళని చూస్తూ 'ఇంతమంది వున్నారు దేశంలో...ఒక్క వెధవేనా నాకు ఒక్క వుజ్జోకం ఇచ్చి ఏడవచ్చుగా...” అనుకుంటూ తల తిప్పాడు. మూడడగుల దూరంలో...రెండడుగుల పొడవు,అడుగున్నర ఎత్తు వున్న ఓ నల్లకుక్క సుందర్రావ్ కేసి చూస్తోంది.
అతనికి గుండె ఆగినట్టుయింది.సుందర్రావుకి కుక్కలంటే చచ్చే భయం. సింహం, పులి అయితే మనిషిని తినేస్తాయి.గోడవలేదు.వాటి కడుపు నిండుతుంది.కుక్క తినదు.కరిచి రుచి చూస్తుంది.
దానివలన దానికి (కుక్కకి)కడుపు నిండదు సరిగదా మనిషికి కడుపు మీద బొడ్డు చుట్టూ ఇంజక్షన్స్.దాని కరువు బాధ ఇంజక్షన్స్ నొప్పి, వాటి ఖర్చు. అంతా ఓ నరకం.కనక కుక్కకి సాధ్యమయినంత దూరంగా వుంటే జీవితం సుఖశాంతులతో వుంటుంది అనే ఫిలాసఫీ సుందర్రావుది.
అందుకే నల్లకుక్కని చూసి రెండడుగులు దూరంగా వేశాడు సుందర్రావు. కరెక్టుగా కొలిచినట్టుగా అది కూడా రెండే అడుగులు...సుందర్రావు కేసి చూసింది. సుందర్రావుకి చెమటలు పట్టాయి. రోడ్డు మీద ఇంతమంది వుండగా అది కరవటానికి తననే సెలక్ట్ చేసుకుందనే అభిప్రాయానికి వచ్చాడు సుందర్రావు.
తను కదిలితే అది కదులుతుంది.తను పరుగెడితే అది పరుగెడుతుంది.ఏం చెయ్యాలనే ఆలోచనతో దాని వంక చూస్తూ నిలబడిపోయాడు.అది కూడా నాలికని ఓ సారి ప్రదర్శించి...ఏ రేంజ్ లో కరిస్తే తన సరదా తీరుతుందో అన్నట్టుగా అతని వంక చూస్తోంది.
ఆ క్షణంలో ప్రక్కనున్న బ్యాంకులోంచి చంద్రశేఖర్ గారు బ్రీఫ్ కేసుతో బయటికి వచ్చాడు. ఆయన పెద్ద బిజినెస్ మాన్.డ్రా చేసిన పాతిక లక్షల రూపాయలని బ్రీఫ్ కేసులో వుండటం వలన దానిని లేకలేక పుట్టిన బిడ్డలా గుండెలకి హత్తుకుని కాస్త దూరంలో వున్నా తన కారు కేసి నడుస్తున్నాడు.
సరిగ్గా అదే క్షణంలో...దొంగతనం ముఖ్యవృత్తిగా, ముష్టి అడుక్కోటం హాబీగా బతికే దుక్క ముష్టాడు...ఆ పూటకి హాబీ 'ఆపేసి ప్రొఫెషనలోకి దిగుదామని సంకల్పించుకుని... అప్రయత్నంగా చంద్రశేఖరం గారిని ఆయన చంకలోని పెట్టిని చూసాడు. భయభక్తులతో ఆయన పెట్టిని పట్టుకోవడం గమనించిన అతనికి విషయం అర్థమయి ఆయనకేసి గబగబా నడిచాడు.
'కరవటం'అనే చిన్నకాలక్షేపం కోసం కుక్క ఎంతసేపయినా వెయిట్ చెయ్యగలదని సుందర్రావుకి అర్థమయింది.
అర్జంటుగా దాని ఊహకందని రీతిలో...తను ఎటో దూకి ఏదో ఎక్కి పారిపోక తప్పదనుకుని...పక్కగా వున్నా ఆగిన కారుకేసి చూసాడు.
ఒక్క ఎగురులో కారుపైకి, అవతల జనంలోకి దూకెయ్యాలని ప్లాను సెట్ చేసుకున్నాడు.
ఆ కారు ఓనరయిన చంద్రశేఖరం గారు...డోర్ దగ్గరికి వచ్చి తెరవ బోతున్నారు.అనుకున్నది సాదించాలనే లక్ష్యంతో దొంగ ముష్టాడు లేదా ముష్టి దొంగాడు ఆయన దగ్గరికి వచ్చేశాడు.
సుందర్రావు వూపిరి బిగించి కుక్కకి అనుమానం రాకుండా బాడీని బిగించి యాక్షన్ కి సిద్దపడ్డాడు.
చంద్రశేఖరం గారు డోర్ తెరిచాడు. దొంగ ముష్టాడు ఆయన బాక్స్ లాగాడు.కారు మీదకి మెరుపులా ఎక్కేసిన సుందర్రావు అవతలకి దూకాడు.ఆయన 'దొంగ ' అని అరిచాడు.
దొంగ పెట్టెతో అడుగు ముందుకు వేశాడు. సుందర్రావు పైనుండి వచ్చి వాడి మీద లాండ్ అయ్యాడు.ఇదంతా క్షణంలో జరిగింది. పడిపోయిన దొంగని జారిపోయిన పెట్టెని దొంగ మీదకి సాహనంగా దూకిన యువకుడ్ని చూసిన చంద్రశేఖరం గారు "పోలీసు పోలీసు "అని అరుస్తూ తన పెట్టె అందుకున్నారు.
జనం చేరటం,పోలీసులు రావటం,దొంగని పోలీసులు కొట్టుకుంటూ పట్టుకుపోవటం.చిన్న దెబ్బలు తిన్న సాహస యువకుడ్ని కౌగలించుకుని దెబ్బలు డాక్టర్ కీ చూపించాలని అతన్ని చంద్రశేఖరం గారు కారు ఎక్కించుకోటం...గబగబా జరిగిపోయాయి.
కారు సీటులో వున్నా సుందర్రావు...అతని కరవటం మిస్ అయి పుట్ పాత్ మీదే వుండిపోయిన నల్ల కుక్కకేసి ధైర్యంగా చూసాడు.
కారు కదిలింది.
కొట్టటానికన్నట్టుగా...తననే చూసిన ఆ మనిషి హఠాత్తుగా ఎందుకు కారు మీదకు ఎగిరి దూకాడో అర్థం కాలేదు ఆ నల్ల కుక్కకి.
అది ఎప్పుడో విరిగిన తన కాలుని కష్టం మీద కదిపి మరో రెండడుగులు వేసి నొప్పితో మళ్ళీ ఆగింది.
to be continued...
|