Prayivetu Mastaru-1

మొదటి భాగం

సుందర్రావ్ వేటకి బయలుదేరాడు.

విల్లు అంబుల్లాటి సర్టిఫికెట్స్ తో ఆఫ్రికా అడవిలాంటి హైదరాబాద్ సిటీలో,వుజ్జోగం అనే జంతువుని...వే...టాడటానికి బయలుదేరాడు.

సర్టిఫికెట్స్ లో సుందర్రావ్ అసలు పేరు సుందర్రామయ్య పంతులు...అని వుంటుంది.అది అతని తాతగారి పేరని...నాయనమ్మ ముచ్చట పడితే...నాన్న పెట్టేశాడు. జ్ఞానం వచ్చాక సుందర్రావుకి...ఆ పేరు అటక మీద పాత సామానులా అసహ్యంగా అనిపించి, నాయనమ్మ మీద, నాన్న మీద, చచ్చిన తాతగారి మీద యథాశక్తి కోపం తెచ్చుకున్నాడు.

రెండు రోజులు కోపంగా వున్నాక...'సుందర్రావ్'అని మార్చుకున్నట్టు ఎనౌన్స్ చేసి...అలా పిలవకపోతే చచ్చిపోతానని బెదిరించి, నూతి వరకు వెళ్లి...ఇంట్లో వాళ్ళు ఏడ్చిమొత్తుకోవడంతో...వెనక్కి వచ్చేశాడు.

తర్వాత నుంచి సుందర్రావుగా సెటిల్ అయ్యాడు. రోడ్డు మీద నడుస్తున్నాడు సుందర్రావు.

“ ధర్మం చెయ్యండి... బాబూ...” వినిపించగా తలతిప్పిన సుందర్రావుకి దుక్కలా వున్నా ఓ ముష్టాడు...దీనత్వం నటించడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు.

“ నేను ధర్మం చెయ్యను" విసుగ్గా అన్నాడు సుందర్రావు.

“ పుణ్యం వస్తుంది బాబూ " ఎంకరేజ్ చేసాడు ముష్టాడు.

“ నాకు పుణ్యం వద్దు...” నిర్లక్ష్యంగా అన్నాడు సుందర్రావు.అలా అనేసి అక్కడి నుండి స్పీడు పెంచి ముందుకు నడిచాడు.

సుందర్రావుకి..దానం...ధర్మం...న్యాయం...వగైరా వాటి మీద పెద్ద నమ్మకం లేదు.అతను నమ్మింది...నమ్మకం వున్నది...'ప్రేమ' మీద.

కాలేజిలో వున్నప్పుడు అతను ఎడా పెడా చాలా మందిని ప్రేమించేసి, లవ్ లెటర్స్ రాయటం పార్ట్ టైమ్ జాబ్ గా పెట్టుకుని పరీక్షలు కూడా తప్పాడు.అయిన పెద్దగా ప్రయోజనం కనిపించలేదు.

కొందరమ్మాయిలు...సారీ చెప్పారు. కొందరు ఎడ్వాన్స్ గానే వాళ్ళ 'హార్ట్ 'లు బుక్ అయిపోయాయని చెప్పారు. కొందరు'రాఖీ'లు తెచ్చి 'వీలున్నప్పుడు'కట్టుకో అని విసిరేసి పోయారు.

అయినా సుందర్రావ్ నిరుత్సాహ పడలేదు.ఎప్పటికైనా ఎవరో ఒకమ్మాయిని ప్రేమించే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు.ప్రస్తుతం ఈ వుజ్జోగం వేట అయ్యాక...మళ్ళీ ఫ్రెష్ గా ప్రేమించే కార్యక్రమం మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు.

“ దానం బాబు...” దుక్కలాటి ముష్టాడు ఫాలో అవుతున్నాడు.

“ చెయ్యనని చెప్పానుగా...”

“ ధర్మం చెయ్యనని చెప్పారు...కనుక దానం చేస్తారేమోనని...”

“ నేను ఏదీ చెయ్యను.కనక ఇక నన్ను ఫాలో అవటం మానేయ్...” కాస్త ఖచ్చితంగా అన్నాడు సుందర్రావ్.

అలా అనేసి అక్కడి నుండి ముందుకు నడిచాడు. సుందర్రావు జాతకంలో...ప్రేమించి పెళ్లి చేసుకునే యోగం వుందని ఆ మధ్య ఓ గెడ్డం జాతకాల వాడు చెప్పాడు.నిజంగానా అని సుందర్రావు చిన్న హైజంప్ చేసి అడిగాడు.

జాతకాల కంటె సైకాలజీ ఎక్కువ తెలిసిన ఆ గెడ్డం జాతకాల వాడు సుందర్రావు 'హైజంప్'చూసి...రెచ్చిపోయి 'నా మాట అబద్ధమైతే నేను జాతకాలు చెప్పటమే మానేస్తానన్నాడు.

వాడు ఏడాది క్రితమే మానేశాడనే విషయం తెలియని సుందర్రావ్ వాడికి ఓ వందనోటిచ్చాడు.ఆ రోజు ఆ జాతకాల వాడి జాతకం బావుంది.వాడు ఆ వందతో బ్రాందీ తాగి బిరియానీ తినేసి సుఖపడ్డాడు.

“ ఓ రూపాయి ఇయ్యండి బాబూ...” దుక్కలాటి ముష్టాడు బీడి వెలిగించుకుంటూ అడిగాడు.

“ నేను ఇవ్వనని చెప్పానుగా..”

“ లేదు సార్...చెయ్యనని చెప్పారు.అది కూడా దానం,ధర్మం లాటి పనులు.అందుకే రూపాయి అడుగుతున్నా...” చిరునవ్వుతో అన్నాడు దుక్కముష్టాడు.

“ ఫాలో అవ్వద్దని చెప్పానుగా "

“ పట్టుదల గలవాణ్ణి సార్.అనుకున్నది జరిగే వరకు ప్రయత్నించాలి...” జీవిత సత్యం చెప్పిన స్వామిజీలా అన్నాడు దుక్కముష్టాడు.

“ సరే...ప్రయత్నించు...” అనేసి ముందుకు నడిచాడు సుందర్రావ్.

to be continued...