Made Each For Other

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

 

 

 "మేడ్ ఫర్ ఈచ్ అదర్ "

రాజా

“ హలో...ఎంత సేపయిందీవచ్చి ?” అన్న పిలుపు వినిపించగానే తలెత్తి చూసిన శోభకి, ఎదురుగా శంకర్ కనిపించగానే "కూచోండి చెప్తాను " అంది తాపీగా.

ఆమెకు కోపం వచ్చిందన్న సంగతి అర్థమైపోయింది శంకర్ కు. ఓ నాలుగు జోకులు పేల్చైనా సరే.మూడ్ లోకి తెచ్చేయ్యాలనుకుని కూర్చుంటూ...అటూ ఇటూ చూశాడు. ఎక్కువ భాగం జంటలే కనిపిస్తున్నాయి.ఎవరి గొడవలో వాళ్ళున్నారు.

“ చాలా సేపయిందనుకుంటానే...” అన్నాడు ముఖానికి నవ్వు కోటింగ్ ఇచ్చేసి.

“ సిగరెట్టు కాల్చే అలవాటు నాకు లేదు " అందామె.

అర్థం కాలేదు అతనికి " ఎందుకు ?” అన్నాడు వెంటనే.

“ కాల్చి పడేసిన సిగరెట్ పీకల బట్టి యింత టైమ్ అయి ఉంటుందని మీ అంతట మీరే లెక్కేసుకోవడానికి " అందామె.

“ లాభం లేదు.ఎలాగైనా సరే నవ్వించాలి...తప్పదు " తనలో అనుకున్నాడు శంకర్.

“ ఓహో హో...అర్థం అయింది.అర్థం అయింది...” అన్నాడు కులాసా పోజిచ్చి.

“ ఏవిటయ్యింది...అర్థం ?”

“ మీ ఆడవాళ్ళుని బస్సు డ్రైవర్లుగా ఎందుకు అప్పాయింట్ చేసుకోరో అన్న విషయం ఇప్పుడు అర్థం అయింది "తమాషాగా అన్నాడు శంకర్.

ఈసారి అర్థం కాకపోవడం,ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. “ ఎందుకు ?” అంది ఉండబట్టలేక.

“ ఎప్పుడు ఏ రూట్లో వస్తారో ఊహించడం ఎవరివల్లా కాదు కనుక " అన్నాడు చిలిపిగా చూస్తూ.

“ వెల్లకిలా పడితే ఆకాశంతో ఫైట్ చేస్తున్నావని, బోర్లా పడితే బస్కీలు తీస్తున్నావని చెప్పుకుంటూ లెవెల్ మెయిన్ టెయిన్ చెయ్యడంలో మగవాళ్ళని మించిన వాళ్ళు లేరనుకుంటా " అందామె ఉక్రోషంగా.

“ కరెక్టే...అటువంటి సన్నివేశాల్లో అలాంటి డైలాగులు ఆడవాళ్ళు చెబితే బావుండదు కదా... అంచేత ఏదో పోన్లే అని ఆ అవకాశాన్ని మగవాళ్ళే తీసుకుంటూ ఉంటాటు పాపం...అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బోల్డంత రెస్పెక్టు పెరిగే ఛాన్సుంటుంది.మగవాళ్ళ మీద " అన్నాడతను స్టయిలుగా.

ఇంకేమి మాట్లాడలేదామే.కోపంగా పక్కనే ఉన్న గడ్డిని తుంచడం ప్రారంభించింది.ఓ రెండు క్షణాలు మౌనంగా దొర్లి పోయాయి.గడ్డి పీకటం మీద ఓ జోక్ వేస్తె ఎలా ఉంటుందనిపించింది అతనికి.మళ్ళీ అదెంత గ్యాప్ సృష్టిస్తుందోనని వెంటనే విరమించుకున్నాడా ప్రయత్నాన్ని. మరో రెండు క్షణాలు...

“ఓకే మేడమ్.ఒప్పేసుకుంటున్నా...నేను లేటుగా వచ్చాను.మామూలు లేటుకాదు.ఘోరాతి ఘోరమైన లేటు...భయంకరమైన లేటు...ఓకేనా !?” అన్నాడింక ఉండబట్టలేక.

“ ఆ మాటేదో రాగానే అనొచ్చుగా...!”

“ సారీ అన్నానుగా " అన్నాడతను ప్రేమ్ నగర లో నాగేశ్వరరావులా.

“ సారీ ఎక్కడున్నారు...ఓకే అన్నారు "

“హోరీ దేవుడోయ్...!వర్తమానే ప్రేయసీ...భవిష్యమానే భార్యామణీ...సారీ సారీ సారీ... ఇద్దరం దొందుకు దొందే...ఇప్పటికైనా మనం మన ఇగోలకి కాస్త గ్యాపిస్తే,కొంచం మనసులు విప్పి మాట్లాడుకోవడానికి, మరి కొంచం ప్రేమించుకోవడానికి వీలవుతుంది.ఆ పైన నీ యిష్టం "

“ సరే చెప్పండి...ఏమిటి కబుర్లు...?” “ కబుర్లా...వాటర్ టాంకు వచ్చిన హడావుడిలో వాకిట్లో వున్న మంచినీళ్ళ కుండ తన్నేసుకున్నాడని...నీ దెబ్బకి మైండ్ లో వున్నవన్నీ మటాష్ అయిపోయాయి...కాసేపు నీతో మాటాడితే కాని తిరిగి సెట్ కాదు " అన్నాడు శంకర్.

“ సరే అంత అప్ సెట్ కాకండి.నేనొక విషయం మీకు చెప్పాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను.కూల్ గా విని అర్థం చేసుకుంటానంటే ఇప్పుడే చెప్తాను లేదా ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెప్తాను "

“ ఏం పర్లేదు.ఇప్పుడు చెప్పెయ్...నీ దెబ్బకి ఇంక కూలే...ఇప్పట్లో రెయిజ్ అయ్యే సమస్యే లేదు "

“ అబ్బ...సీరియస్ గా వినండి.” అందామె.

“ సర్లే వింటా చెప్పు " అన్నాడు అతను కామ్ గా.

“ నాకు చిన్నప్పుడే పెళ్ళయి పోయింది "

“ జోకా...?”

“ కాదండీ...ఫాక్టే...నాకు ఊహ తెలియని రోజుల్లో...”

“ పిచ్చిదానా...నీకే కాదు నాక్కూడా ఊహ తెలియదు తెలుసా ?”

“ అదేంటీ ?”

“ అవును శోభా...సినిమా యాక్టర్ శ్రీకాంత్ వైప్...అదే...ఆమె సినిమా హీరోయిన్...ఊహ... ఆవిడ నాకు తెలియదని చెబుతున్నానంతే...”

“ ప్లీజండీ...సీరియస్ గా వినండి...నేను నెలన పిల్లగా ఉన్నప్పుడు..మా పెద్దవాళ్ళు ఏవో సెంటిమెంట్లు అనీ పెట్టుకుని వాకు పెళ్లి చేసేసేరట.కానీ వారం రోజుల్లోనే అది పెటాకులై పోయిందట.

పెద్దవాళ్ళ మధ్య ఆస్తి తగాదాలొచ్చాయిట.అంతే...విడిపోయారు.ఇప్పటిదాకా ముఖాలు కూడా చూసుకోలేదు.అసలు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏమిటో ఏవీ తెలీదు "

“........”

“ నేను చెప్పిందంతా అబద్డంలా ఉంది కదూ...నా గురించి మీరు చాలా ఊహించు కుంటున్నారు కదూ...?” అంది ఆదుర్దాగా.

“ అక్కడే పొరబడ్డావు.ఇది ముందే చెప్పి నాకన్నా ఒక మెట్టు ఎదిగిపోయావు.ఇందాక వాటర్ టాంక్ ఎగ్జాంపుల్ ఇచ్చాను గుర్తుందా.మైండ్ లో విషయాలు అప్పుడే మటాష్ కాకుండా ఉంటే ఇలాంటి విషయమే నీకు నేను చెప్పి నేనే ఓ మెట్టు పైనుండే వాణ్ణి "

“ అర్థం కాలేదు " అందామె సీరియస్ గా.

“ నీకు జరిగిన ఇన్సిడెంట్ లాటిది చిన్నప్పుడు నా లైఫ్ లో జరిగింది " అన్నాడు అతను రిలాక్స్ డ్ గా.

“ అంటే...మీక్కూడా...”

“ య్యస్...పెళ్లయింది.కానీ ఫెయిలయింది.నువ్వు చెప్పిన ప్రతి సంఘటనా నా లైఫ్ లో కూడా సేమ్ టు సేమ్ అనుకుంటుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది "

“ ఇలా ఎందుకు జరిగిందంటారు ?” అడిగిందామె నమ్మలేనంత ఆనందాశ్చర్యాలతో.

“ డీప్ గా ఆలోచిస్తే...మనం ఒకరి కోసం ఒకరు పుట్టబట్టే ఇలా జరిగింది.లేకపోతే ఇంత కోయిన్ఫ్ డేన్స్ అసంభవం.”అందామె.

“ అవునండీ...రియల్లీ వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్...మరి ఈ సంగతి మన పెద్దవాళ్ళకి చెప్పేద్దామా...”

“ ఖచ్చితంగా చెప్పితీరాలి.యాజిటీజ్ గానే లేట్ చేశాం.ఈ విషయం తెలిశాక ఇంక ఊరుకోకూడదు.నేనివాళ రాత్రే బయల్దేరి మావూరి చేరి మావాళ్ళకి చెప్పి యస్సనిపించుకొని రేపు రాత్రి బయల్దేరి ఎల్లుండికల్లా అక్కడుంటాను.ఎల్లుండి ఈవినింగ్ ఇక్కడే కలుద్దాం. నీకన్నముందే వస్తాను కూడా...ఓకేనా ?” అన్నాడతను ఆనందంగా.

“ ఓకే అనకుండా ఎలా ఉండగలను ? ఎల్లుండి మీరెంత లేటుగా వచ్చిన సరే...అసలు పోట్లాట పెట్టుకోను " అందామె సంతోషంగా.

***

అలా వారిద్దరి మధ్యా ముగిసిన ఆ సీన్ తిరిగి ఇలా ఓపెన్ అయింది.

“ వచ్చేరా...రండి" అందామె వ్యంగ్యంగా.

“ రాక చస్తానా " అన్నాడతను కోపంగా.

“ ఏం జరిగిందో సెలవివ్వింది " అందామె మరింత ఘాటుగా, వెటకారంగా.

“ చెప్తా...అందుకేగా వచ్చాను.నీ గురించి చెప్పి, మీ ఫ్యామిలీతో నువ్వు తీయించుకున్న ఫోటో చూపించగానే, వెంటనే గుర్తుపట్టి చెప్పారు.మావాళ్ళు చిన్నప్పుడు నాకు పెళ్లయింది నీతోనేనని.ఏం...ఆశ్చర్యంగా ఉందా !? “ అన్నాడతను కటువుగా.

“ లేదు...” అందామె ధీమాగా.

“ ఎందుకని ?”

“ అదీ సీన్ మాయింట్లో కూడా రిపీటయింది కాబట్టి.”

“ ఓహో...!సో...నేను ఆనందంతో పరిగెట్టుకుంటూ వచ్చి నిన్ను ఎత్తుకుని గిరగిరా తిప్పెస్తానని ఎక్స్ పెక్ట్ చేశావు కదూ..?” అన్నాడు అతను.

“ ఇది సినిమా కాదు "

“ ఆ సంగతి నాకూ తెలుసు...ఎక్స్ పెక్ట్ చేశావా లేదా...దానికి అన్సరివ్వు ముందు..”

“ ఏంటా దబాయింపు...?అయినా అన్సరివ్వకుండా తప్పించుకునెంత పిరికిదాన్నికాదు కాబట్టి చెబుతున్నాను.ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు.ఒకవేళ మీరెక్స్ పెక్ట్ చేసివుంటే అది నీ వల్ల కాదు కూడా "

“ ఏం...చ్యవనప్రాశ తిని నువ్వు కూడా బలిశావా !?”

“ ఆపండి...మీ కుళ్ళు జోకులకి పడిపడి నవ్వటానికి సిద్ధంగా లేను నేను.అంతటైమ్ కూడాలేదు నాకు.అసలు నేనలా ఎక్స్ పెక్ట్ చేస్తానని మీరెలా ఎక్స్ పెక్ట్ చేశారో చెప్పండి ముందు "

“ నువ్వడక్కపోయినా ఈ విషయం చెప్పటానికే నేనొచ్చాను.నిన్ను చూశాక లేడీస్ ఫస్ట్ అనే మర్యాద కూడా ఇవ్వాలనిపించటంలేదు. అందుకే నేనే ముందు చెప్తున్నాను విను.తాళికట్టిన మొగుడు ఎవడో ఎక్కడుంటాడో, వాడీ సంగతీ సమాచారం ఏమిటో కనుక్కోక్కర్లేదా...

భారత స్త్రీకి మాంగల్యం ముఖ్యం కాదా? ఆ వ్యవహారం ఏదో పైనల్ చేసుకున్నాకే మొదలు పెట్టలేకపోయినా నీ ప్రేమాయణం.”

“ నేనేదో నీతి నిజాయితీ, పవిత్ర ప్రేమలాంటిది వాటి మీద నమ్మకం వున్నా సెంటిమెంటల్ పూల్ని కాబట్టి సరిపోయింది.అదే నేను కాకపోయి ఉండివుంటే నువ్వు ఈపాటికి ఎవడతోనో నీ ప్రేమాయణం మొదలు పెట్టేదానివే కదా !

కట్టుకున్న మొగుడు ఇంకో ఆడదానితో కులుకుతున్నాడు అంటే ఎ ఆడదైనా ఎలా సహించలేదో, కట్టుకున్న పెళ్ళాం ఇంకొకణ్ణి ప్రేమిస్తుందంటే ఏ మగవెధవా సహించలేడు కూడా.

అదృష్టమో దురదృష్టమో ఆరెండూ నేనే కాబట్టి సరిపోయింది.లేకపోతే వ్యవహారం ఎక్కడిదాకా వెళ్లి ఉండేది...!?నో నీ మీద నాకు నమ్మకం పూర్తిగా పోయింది...ఐ కాంట్ మ్యారీ యూ...దట్సాల్ ...”

“ వన్ మినిట్...వన్ మినిట్...ఈ డెసిషన్ కి మీరు నిన్న వచ్చుంటారు.ఎందుకంటే మీకు తెలిసింది నిన్న కాబట్టి.కానీ నేను నా డెసిషన్ కి మొన్నరాత్రే వచ్చాను.

అంచేత మీరు ఆనందంతో పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను ఎత్తుకు తిప్పుతానన్నా నేనందుకు సిద్ధంగా లేను కాబట్టి మీ వల్ల కాదన్నాను "

“ మగాళ్ళయి, మీసాలొచ్చి, ఉద్యోగం చేసుకుంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడి కూడా తాళికట్టిన భార్య ఎక్కడుందో తెలుసుకోలేక పోయారంటే మీ గురించి నేనేమనుకోవాలి !?కనీసం ఆ ఇంట్రస్టయినా చూపించలేదంటే ఎలా అంచనా వెయ్యాలి.మిమ్ముల్ని...!?

మీరు పెళ్ళాడింది.తర్వాత ప్రేమించింది నన్నే కాబట్టి సరిపోయింది.అదే నేను కాకపోయి ఉంటే...?”

నేను కాబట్టి ఇన్నాళ్ళు మిమ్ముల్ని కంట్రోల్ లో పెట్టాను.అదే నేను కాకపోతే ఎంతకైనా వెళ్ళేవారని నేను అనుకుంటే తప్పేంటి ? అందుకే మీరంటే నాకు గౌరవం చచ్చిపోయింది. చావనైనా చస్తాను గాని మిమ్ముల్ని పెళ్లి చేసుకునే ఆలోచన రావడం లేదు నాకు.

ఇన్నాళ్ళూ మిమ్ముల్ని ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను కూడా !. రేపు నేను ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళికి శాలువా కప్పుకుని దగ్గుతూ వచ్చినా,పెళ్లి టైమ్ కి విషం మింగేసి సూపర్ హిట్ సాంగేత్తుకున్నా సరే-నేను రాను గాక రాను...రాను రాను రాను.గుడ్ బై...సారీ బ్యాడ్ బై బై...” అన్నాడు అతను.

(హాసం సౌజన్యంతో)