TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
"చక్రపాణి ఇంద్రలోక యాత్ర "
డా.భానుమతి రామకృష్ణ
ఇంద్రలోకం దేవేంద్రుని మందిరం.
ఇంద్రుడు కోపంతో బుసలు కొడుతూ అటూ ఇటూ పచార్లు చేస్తుంటాడు.
రంభ చెంపకు చేయి చేర్చి విచారంగా ఆసనాన్ని అనుకుని నిలబడి ఉంటుంది.
“ అసలు నిన్ను భూలోకం పంపడం నా బుద్ధి తక్కువ.ఆ నారదుడి మాట విని యింత అనర్థం తెచ్చుకున్నాను.ఎక్కడ దేవేంద్రలోకం! ఎక్కడ నీచమానవలోకం! ఛీ ఛీ... చెప్పడానికైనా నీకు సిగ్గులేదా రంభ.నీవేనా యీ విధంగా మారావు ?ఎంత అవివేకం !ఎంత అవమానం !” కోపంగా అన్నాడు ఇంద్రుడు.
“ ఇందులో అవమానం ఏమున్నది ప్రభూ ? మానవులు కూడా ఎంతటి ప్రతిభావంతులో మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు.నిజమైన కళాసేవ చేసి తరించాలంటే మానవలోకంలోనే సాధ్యమవుతుంది.
సరస్వతీ దేవి అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నది. మానవలోకంలోని సుఖదుఃఖాలూ,సౌఖ్యసంతోషాలూ మనకు లేవనిపిస్తోంది.అన్నీ వుంటేనే జీవితం అనీ,మనం అమృతం తాగి ఎప్పుడూ మత్తుగా పడివుంటామనీ, మన జీవితాలు ఎందుకు పనికిరావనీ చక్రపాణిగారు చెప్తుండేవారు " అంది రంభ.
“ బుద్ధిహీనురాలా !అతడి పేరు నా దగ్గర ఎత్తకు.నా విరోధిని మెచ్చుకుని నన్ను అవమావిస్తావా ?” మరింత కోపంగా అన్నాడు ఇంద్రుడు.
“ ఇందులో అవమానించడం ఏమున్నది ప్రభూ ? మీ విరోదుల్ని ఎంతమందిని నేను లొంగదీసి మీ పాదాల ముందు పడవేయలేదు.ఎంతమందిని తపోభ్రష్టులను చేయలేదు.కాని చక్రపాణిగారి విషయం అలా కాలేదు " అంది రంభ.
“ అంటే చక్రపాణి మానవాతీతుడంటావా ?”
“ అనుకోవాల్సిందే ! ఆయన మనిషి కాదు.అయితే నా ఓటమికి అర్థం లేదు కదా ప్రభూ !”
“ మూర్ఖురాలా ఆ సామాన్య మానవుడికి నీవు దాసోహం అన్నది చాలక నన్ను కూడా ఓటమిని ఒప్పుకోమంటావా ?”
“ అది ఓటమిగా నేను భావించడం లేదు ప్రభూ ! చక్రపాణిగారి మంచితనం చూసి నా అంతట నేను ఆయన దగ్గర వుండి కళాసేవ చేసి తరిద్దామనుకున్నాను.నిజంగా నాదీ ఓ జీవితమేనా అనిపించింది.నా మీద నాకు రోత పుట్టింది.ఎప్పుడూ మీ దర్బారులో నాట్యం తప్ప నా జీవితానికి అర్థం లేకుండా పోయింది.
అక్కడ అనేక విధాలయిన పాత్రపోషణలో నవరసాలూ నటనలూ చిందించే కళాజీవుల్ని గురించి విని మా మనసు ఉప్పొంగి పోయింది. చక్రపాణిగారిని వేషం ఇప్పించమని నేనే అడిగాను.అందులోనూ మంచి బరువైన పతివత్ర పాత్ర యిచ్చారు.
నా కోసం వ్రాయించారు పాపం.నేను ఎంత పాపిని.చిత్రం పూర్తి చేయకుండా మధ్యలోనే వచ్చేశాను.ఆయన వల్ల ఎంత యిబ్బంది పడ్డారో !మోసగత్తెనని ఎంత నిందించారో !”అంది రంభ.
“ ఛీ!జ్ఞానహీనురాలా !యింకా నీవా భూలోకం మరచిపోలేక పోతున్నావా ?పైగా యిక్కడికి వచ్చినందుకు బాధపడుతున్నావా ? నీ వల్ల నారదాదుల దగ్గర నాకెంత అవమానం !ఆ నారదుడు వూరుకోడే !ముల్లోకాలలోనూ యీ అపజయాన్ని చాటుతాడే ? యింతటైనా నీవా భూలోకం సంగతి మర్చిపోయి నీ నిత్యవిధులు నిర్వర్తించు "
“ నా వల్ల కాదు ప్రభూ !యిక నేను మీ దర్బారులో ఆడలేను.నేను భూలోకానికి పోతాను. నాకక్కడ కొత్త జీవితం కనిపించింది.నన్ను క్షమించండి.నన్ను వెళ్ళనివ్వండి.” అని అక్కడి నుండి రంభ కదులుతుంది ముందుకు.
అంతే!ఇంద్రుడు తటాలున అడ్డు నిలిచి " రంభా" అంటూ పెద్ద రంకె వేస్తాడు.
రంభ నిశ్చలంగా నిలబడి " మీరు కేకలు వేసి ప్రయోజనం లేదు ప్రభూ.నా నిశ్చయం మారదు.నేను చలనచిత్రాల్లో నటించి తీరాలి నన్నాపకండి " అని రెండు అడుగులు ముందుకు వేసింది రంభ.
|