Parody pullarao-2

పేరడి పుల్లారావు - 2

ఎన్.నాగమణి

పేరడి పుల్లారావుగా అందరికి నచ్చుతూ ఫేమస్ అయ్యాను.కానీ ఏం లాభం ? నేను ఎంత ఫేమస్ అయిన నత్తి నర్సయ్యని మెప్పించలేకపోయాను.

అందుకే ఇప్పటికి నా వీపు నేనే తోముకుంటున్నాను.నా కంచం నేనే కడుక్కుంటూన్నాను. వచ్చిరాని వంట చేసుకుంటూ...అవసరమైనప్పుడు చేతులు, అవసరం లేనప్పుడు కాళ్ళు కాల్చుకుంటూ ఇలా తోడు నీడ లేని ఏకాకిలా,ఆడగాలి తగలని మగాడిలా బతుకుతున్నాను.

ఒకవేళ నేను నత్తి నర్సయ్యను నా పేరడితో ఒప్పించి వుంటే, పులుసు పుల్లమ్మతో నా పెళ్లి ఎప్పుడో అయ్యేది.

కొత్త కాపురం మీది ఉషారుతో, వేడి పుట్టించే చల్లనైన ఆడగాలి తగులుతుందన్న ఆశతో నేను,ముందుగా ఆరు మంది పిల్లల్ని కనేవాణ్ణి.

హ...హ...హ...అలా నవ్వుకండి.నేనంటే నేను కాదు. మా ఆవిడ కనేది. ఏదో మాటలో ఎక్కడ అర్థం మారకుడని అలా అన్నాను.

అంతేతప్పా..." హే...ఇది విన్నారా...ఇది విన్నారా...వింటే కడుపు చెక్కలు ముక్కలై పగిలిపోయేలా నవ్వుతారు...మన పేరడి పుల్లారావు ఆరు మంది పిల్లలను కన్నాడని" మీరేమి లోకమంతా చాటింపు వేయనక్కరలేదు.

అది నిజమని నమ్మి టీవి వాళ్ళు,పత్రికల వాళ్ళు...ఇంకా గిన్నీస్ బుక్ రికార్డ్ వాళ్ళు...ఇలా అందరు నా ఫోటోల కోసం, నా ఇంటర్వూల కోసం, నా పిల్లల్ని చూడాటానికి రానక్కరలేదు తెలుసా !

ఆ ఆరుమంది పిల్లలలో ఆరుమంది మగపిల్లలైన,ఆరుమంది ఆడపిల్లలైన,లేక ముగ్గురు ఆడపిల్లలు,ముగ్గురు మగపిల్లలైన నాకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు.

ఎందుకంటే నేను పేరడి పుల్లారావుగా ఫేమస్ అయ్యి...కారు,బంగ్లా,పెద్ద ఇల్లు,ఇంటి నిండా నౌకర్లు, చెప్పలేనంత బ్యాంక్ బ్యాలెన్స్ తో ఉంటాను కదా మరి.

ఒకవేళా అలా నేను పేరడి పుల్లారావుగా ఫేమస్ కాకపోతే...డబ్బు,కారు,బంగ్లా,పెద్ద ఇల్లు, ఇంటినిండా నౌకర్లు లేకపోయినా...నేను భయపడే వాణ్ణి కాదు.

ఎందుకంటే...నా మామకాని మేనమామ నత్తి నర్సయ్య దగ్గర బోలెడంత డబ్బుంది కాబట్టి.

ఆ ఆరుమంది పిల్లలు పుట్టిన తరువాత నాకు నా భార్యకు ఓపిక వుంటే...మరో ఆరుమంది పిల్లల్ని కనేవాళ్ళం.

వాళ్ళతో సరదాగా ఆడుతూ పాడుతూ...వాళ్ళు చెప్పే కబుర్లు వింటూ ఎంతో చెప్పలేని ఆనందం పొందే వాళ్ళం.

వాళ్ళని పెంచి పోషిస్తున్నప్పుడు...నేను నా పులుసు పుల్లమ్మ ఎన్నిసార్లు కొట్టుకునే వాళ్ళమో తిట్టుకునే వాళ్ళమో.

అయ్యయ్యో...నా పిచ్చి కథంతా చెప్తూ మీ పేరడిని మరిచిపోయాను.

మీ కోసం ఇప్పుడు ఒక అందమైన పేరడి...

ఇది "మంచి మనసులు" సినిమాలోని (శిలలపై శిల్పాలు చెక్కినారు) అనే పాటకు పేరడి.

అహో సాంద్ర భోజా

వీర తిండిపోతు రాయా

ఉడిపి హోటలు వైభవ నిర్మాణ తేజో విరాజా

ఈ కలశాలలో చిరంజీవివైనావయా

ఇడ్లిపై సాంబారు పోసినాడు

ఇడ్లిపై సాంబారు పోసినాడు

మనవాడు ప్లేటుకే అందాలు తెచ్చినాడు

ఇడ్లిపై సాంబారు పోసినాడు.

జీర్ణమ్ము కరువైన వారికైనా

జీర్ణమ్ము కరువైన వారికైనా

అరిగించి కరిగించి అలరించు రీతిగా

ఇడ్లిపై సాంబారు పోసినాడు.

ఒకవైపు ఉర్రూతలూపు వాసనలు

ఒకపక్క ఉరికించు కేకలూ అరుపులూ

ఒకవంక కనువిందు చేయు సర్వర్లు

షడ్రుచులు ఒలికించు హోటలుకే వచ్చాము

ధనము లేదని నీవు కలత పడవలదు

ధనము లేదని నీవు కలత పడవలదు.

నా పర్సు నీదిగా చేసుకుని మింగు

ఇడ్లిపై సాంబారు పోసినాడు.

సింగిలిడ్లి పైన సాంబారు పోస్తుంటే

నీరుల్లి ముక్కలు తెలియాడంగా...

సింగిలిడ్లి పైన సాంబారు పోస్తుంటే

నీరుల్లి ముక్కలు తెలియాడంగా...

దంతస్తంభాలకే కదలికల్ కలిగించి

కరకరా పరపరా శబ్దాలు చేయగా

లుంగిముడి వేసుకుని కొత్త ఖాతాలు

లుంగిముడి వేసుకుని కొత్త ఖాతాలు

అర్దరివ్వాలని అరగించాలని

ఇడ్లిపై సాంబారు పోసినాడు.

మనవాడు ప్లేటుకే అందాలు తెచ్చినాడు.

దిబ్బట్లు పోయినా పిజ్జాలు వచ్చినా

కాలమే మారినా రుచి చచ్చిపోయినా

మనుజులై దనుజులై మట్టిచవి చూచినా

ఆ...ఆ...ఆ...

చెదరనీ కదలనీ శిల్పమ్మువోలె

నీవు నా హృదయ మందు

నిత్యమై సత్యమై

నిలిచివుందువు ఇడ్లీళా !!

నిజము నా జూబిలీ !!

బాగుంది కదా.మరొక పేరడితో మళ్ళీ కలుస్తాను.అప్పటి వరకు ఈ పేరడి పుల్లారావుని మరిచిపోరు కదా.!

మీ పేరడి పుల్లారావు అలియాస్ ఫేమస్ పుల్లారావు అలియాస్ పిచ్చి పుల్లారావు.