Parody pullarao

" పేరడి పుల్లారావు "

ఎన్.నాగమణి

అందరికీ నమస్కారం.

నాపేరు... పి.పి. అంటే పిచ్చి పుల్లారావు అనుకునేరు.కాదు కాదు.ఫేమస్ పుల్లారావు. నేనంటే ఇష్టపడనివాళ్ళు పిచ్చి పుల్లారావని,ఇష్టపడేవాళ్ళు ఫేమస్ పుల్లారావని పిలుస్తుంటారు.

ఆ పిచ్చి ఈ ఫేమస్ అనేవి మా ఇంటి పేర్లు కాదు. అలాగని నాకు నేనుగా తగిలించుకున్న తోకలు కూడా కాదు.

నాకు సినిమా పాటలంటే చెప్పలేనంత అభిమానం.ఒక విధంగా చెప్పాలంటే పిచ్చి. నేను రాసిన పాటలని విని కొందరు " వీడు తొందర్లోనే బాగా ఫేమస్ అవుతాడు. అప్పుడు మనం వీడిని ఫేమస్ పుల్లారావు అని పిలవచ్చు" అంటూ మెచ్చుకుంటూ ఫేమస్ పుల్లారావని పిలిచేవాళ్ళు.

మరికొందరు " వీడు తొందర్లోనే పిచ్చివాడు అవుతాడు.అప్పుడు మనం వీడిని పిచ్చి పుల్లారావని పిలవచ్చు " అంటూ తిట్టుకుంటూ పిచ్చి పుల్లారావని పిలిచేవాళ్ళు.

పిచ్చి పుల్లారావు కంటే ఫేమస్ పుల్లారావుని అయితే బాగుంటుందని, నేను కూడా సినిమాలకి పాటలు రాసి, రేడియాలల్లో, టీవిలల్లో, పేపర్లో...ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, కనబడాలని, నా గొంతు వినిపించాలని ఎంతో ఆశతో ఇంకా ఇంకా తెల్లని పేపర్లని నల్లగా మారుస్తూ...చెప్పలేని పాటలు రాశాను.

వాటిని తీసుకుని సినిమావాళ్ళ ఆఫీసుల చుట్టూ,నిర్మాతల చుట్టూ, సంగీత దర్శకుల చుట్టూ, పత్రిక ఆఫీసుల చుట్టూ తిరిగాను.

కొందరు ముఖం చూసి " నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.పో..పో..పోవయ్యా..." అని గెంటేశారు.

మరికొందరు " అలాగా...సరే.అవకాశం వున్నప్పుడు మేమే కబురు పెడుతాం.అప్పటి వరకు మీరు మమ్ముల ఇబ్బంది పెట్టకుండా హాయిగా విశ్రాంతి తీసుకోండి " అని మర్యాదగా చెప్పారు.

ఇంకొందరు నేను రాసిన వాటిని తీసుకుని చూసి వాటిని చదివి ముఖం అదోలా పెట్టుకుని “ ఇంత గొప్పగా,ఇంత బాగా రాసే పాటలు మాకొద్దు సార్.మేము అర్ధమయ్యే పదాలతో నివసొంపుగా వుండే ట్యూన్లతో పాటలని రాయించుకుంటూ...హిట్ కొట్టాలని చిన్న చిన్న సినిమాలు తీస్తున్నాం. వాటితో అవసరం లేకుండా పెద్ద అట్టర్ ప్లాప్ కావాలని,భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నప్పుడు మేమే మీ దగ్గరికి వచ్చి మీకు కావలసినంత యిచ్చి వాటిని కొనుకుంటాం సార్ " అని నన్ను సముదాయించారు.

సినిమా అవకాశం వస్తుందనే ఆశతో కొన్నిరోజులు సంతోషంగా గడిచిపోయాయి. మరి కొన్ని రోజులు దుఃఖంగా గడిచిపోయాయి.ఇంకొన్నిరోజులు భారంగా గడిచిపోయాయి.

నా ఆశ నిరాశ అయింది. నేను రాసుకున్న పాటలు, వాళ్లకు నచ్చలేదని నాకు అర్ధమయ్యేనాటికి నా జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు చోటుచేసుకున్నాయి.

నేను రాసిన పాటలు వాళ్లకు నచ్చలేడనే ఒకే ఒక కారణం చేత, వాళ్ళు రాస్తున్న పాటలు , తీస్తున్న సినిమాలు, కడుతున్న ట్యూన్లు...నాకు నచ్చలేదని కసిగా వాళ్ళ ముఖాల మీద చెప్పాలనిపించి...మళ్ళీ సినిమావాళ్ళ ఆఫీసుల చుట్టూ,నిర్మాతల చుట్టూ, సంగీత దర్శకుల చుట్టూ, పత్రిక ఆఫీసుల చుట్టూ తిరిగాను.

ఎవరు నా మాటని వినేవాళ్ళు కాదు.అసలు పట్టించుకునే వాళ్ళు. దాంతో కసిగా వీళ్ళకి అపోజిట్ గా ఏదైనా చేయాలని...సినిమా పాటలని , స్టోరిల్ని చదివి వాటికి పేరడి రాయడం మొదలు పెట్టాను.

అప్పటి నుండి నా పేరు పేరడి పుల్లారావు గా మారింది.

మీ కోసం ఒక తమాషా పేరడి.

ఈ పాట ఒరిజినల్ " రోజా " చిత్రంలోని "చిన్ని చిన్ని ఆశ " అనే పాట.

చిన్ని చిన్న దోశ

సన్నగా పోశా

ఉల్లిపాయ కోశా

అందులో వేశా

పైన వెన్నరాశా

తినమని కూశా

రావేలా ఈశా

ఓ వేంకటేశా... || చిన్ని చిన్న దోశ ||

కూరతో బాటు చెట్ని ఉండాలి

సాంబారు తోటి కలిపికొట్టాలి.

తినడానికంతా క్యూలు కట్టాలి

తిన్నవారంతా జేలు కొట్టాలి

స్వాదిష్ట సామ్రాట్ బిరుదనివ్వాలి || చిన్ని చిన్న దోశ ||

బాగుండి కదా ! మరొక పేరడితో మళ్ళీ కలుస్తాను...

మీ పేరడి పుల్లారావు