Dayyam Chirunama

' దెయ్యం చిరునామా...'

-కవిశేఖర పానుగంటి లక్ష్మీనరసింహారావు

కొంత కాలం క్రితం దేశమంతా తిరుగు ఒక ఊరు వెళ్లాను.అక్కడ మారీచశాస్త్రి అనే భూతవైద్యుణ్ణి కలిశాను.అప్పుడు నా వయసు పదహారు.నా వైఖరిని బట్టి నా వంటి దేశదిమ్మరి తనకు శిష్యుడుగా ఉండదగ్గ వ్యక్తీ అనుకున్నారు.

“కొన్నాళ్ళు నా వద్దనే ఉండరాదా ?” అన్నాడు.

“సరే "అన్నాను.

మర్నాడే భూత వైద్యశాల తెరిచాం.రెండు బట్టలతో నూలుదారాల ముళ్ళు, మూడు పళ్ళికలతో తాటాకుల ముక్కలు,రెండు మూకుళ్ళతో బూడిద,మూతలేని దేవదారు పెట్టెలో కొన్ని రాగిరేకులు,రెండు ముంతలలో పసుపు, వెదురుగొట్టంలో ఎర్రని అక్షింతలు -ఇవీ మా వైద్యశాలలో మందులు.తాటాకు,నూలుదారం అంటే వాటి మీద పేషంట్లకు గౌరవం ఉండదని గురువుగారు కొన్ని వింత పేరులు కల్పంచాడు.

వైద్యశాలలో సర్జరీ విభాగం కూడా ఉండాలి కాబట్టి రెండు చీపురు కట్టలు,వేపబెత్తాల కట్ట, దూలగొండి ఆకు, నూగుతో కలిపిన విభూతి,రెండు జతల ఇనుపగోళ్ళు,గట్టి బిరడాలు గల సీసాలు(భూతాన్ని వాటిల్లోకి ఆకర్షించి మూట పెట్టేయడానికి),ఒక పట్టుకారు,వీటికి కూడా గంభీరంగా అనిపించే పేర్లు పెట్టడం జరిగింది.చీపురుకట్ట పేరు కాంతా కరవాలం.వేపబెత్తం పేరు బాలబుద్దిఉద్దీపని.దూలగొండిబూడిదేకే ఉగ్రనారసింహం.ఇవపగోళ్ళకు కాళికాదంష్ట్రాలు. సీసాకైతే మరీ పెద్ద పేరు క్షోణీకుక్షినిక్షేపకము.(అంటే భూమి కడుపులో దాచేది అని తెలుగర్థం ).పటుకారుకి వీరాంజనేయం.

డాక్టర్ల క్లినిక్ లో శరీరభాగాలకు సంబంధించిన మ్యాప్ లు అవీ ఉండటం రివాజు కాబట్టి మేం కూడా నాలుగుగోడల మీద అమ్మవారి విగ్రహాలు వేయించాం.బాల ఒకపక్క.బగళ ఇంకోపక్క.మహిషాసురమర్దని, మలయాళభగవతి (వేరే రాష్ట్రపు దేవతలైతే మరింత మోజు అన్నారు గురువుగారు) ఎదురెదురు గోడలు అలంకరించారు.ఇవి కాకుండా గురువుగారి గురువుగారైన గుంటుపల్లి గురులింగదేవర విగ్రహాం ఓ మూల పెట్టాం.

తర్వాత నేలను కూడా విడిచిపెట్టలేదు.

వేర్వేరు భూతాలకు వేయవలసిన వేర్వేరు ముగ్గులు బొమ్మలు అక్కడక్కడ సుద్దతో వ్రాయించాం.ఇవికాక తాళపత్రగ్రంథం ఒకటి అద్దాల పెట్టెలో ఆలంకారంగా పెట్టాం.దాంట్లో ఏముందో నాకు తెలీదు.మా గురువుగారికి తెలుసునో తెలియదో నాకు తెలియదు.

మా గురువుగారు నడివయస్సు వాడు.పిప్పళ్లబస్తా.పాషాణ ప్రతిమ.నల్లని గరుసుగడ్డం. పత్తికాయల వంటి కనుగుడ్లు.తుట్ట పెదాలు.భయంకర స్వరూపం.ఒక్క భార్యను కట్టుకుని లొడితెడు సంసారంలో గుడుగుడు గుంచం ఆడటం ఇష్టం లేక బ్రహ్మచారియై లోకం మీద విరుచుకుపడ్డాడు.

భూత భేతాళ పిశాచాలతో తను చేసిన బాహీబాహీ కుస్తీ పోటీల గురించి ఒళ్ళు గగుర్పొడిచేట్లు వర్ణింపగలడు.

ఒకసారి ఒక రజక స్త్రీ పిశాచ నిర్మూలనానికి దాని ఇంటికి పోయి ప్రత్యెక శ్రద్దతో పనిచేస్తుండగా ఆ పిశాచం దాని భర్త రూపం ధరించి వెనుకపాటున వచ్చి ఎర్రగా కాలిన ఇస్త్రీ పెట్టెను వీపుపై అంటించడం వల్ల ఆ మచ్చ ఇప్పటికీ మొండిచేట అంత మిగిలింది.

ఆ రోజు మా క్లినిక్ లో కూచుని ఉండగా పనిపాటలు చేసుకునే ఒక స్త్రీ వచ్చి "నా సవతి నన్ను పీక్కు తింటోంది.జుట్టు పీకుతోంది.ఇలాగైతే నాకు నెత్తి మీద వెంట్రుకలు నిలుస్తాయని నమ్మకం లేదు.”అంది.

మా గురువు ఆమె చేతినందుకున్నాడు. “శాస్త్రీ చూశావా...భూతనాడి తర్జనపై ఎంత విసరుతోందో "అంటూ కాస్సేపు అలానే ఉంచుకుని,తర్వాత ఆమె చేతిని నా చేతిలో పెట్టాడు.కాస్సేపు పట్టుకున్నాను కానీ నాకేమీ తెలియలేదు.

నేను చేయి వదిలేసిన తర్వాత మా గురువుగారు ఆ అమ్మాయిని ఎగాదిగా పరీక్షించి "శాస్త్రీ ,ఈమెకు కార్పానక లతాబంధం,శాంకరాంగరాగలేపనం కావాలనుకుంటాను.”అన్నాడు.

అంతంత పెద్ద మాటలను ఎన్నడూ వినని ఆమె బెంబేలు పడి,”ఏదో ఒక గట్టిపని చేస్తేగానీ ఇల్లు నిలిచే సాధనం లేదండి "అంటూ కన్నీరు పెట్టుకుంది.

గురువుగారి మాటల కర్థం తెలియని వాడిని కాబట్టి ఓ ముళ్ళ నూలుపోగు,బూడిదే ఇచ్చి ఆమెను పంపించాను. ఆమె అటు వెళ్ళగానే,ఇటు ఒక వ్యాపారస్తుని తల్లి వచ్చింది.మనవరాలిని వెంటబెట్టుకుని వచ్చి తన గాథ చెప్పింది.

“ఈ అమ్మాయిని మేనత్త కొడుకుకి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాం.కానీ అతను చనిపోయాడు.ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేశాం.కానీ సంసారం చేయడానికి వీల్లేకుండా ఉంది. చచ్చిపోయిన మేనత్త కొడుకు దయ్యమై దీనిని పట్టుకున్నాడు.మొగుడి వద్ద పడుకోనివ్వడు. దెయ్యం సోకి ఇది చేసే హడావుడికి భర్త హడలిపోయి దగ్గరికే రావటం లేదు.మీరేదైనా చేసి ఆ దెయ్యాన్ని వదలగోట్టాలి "అంది.

గురువుగారు ఆ అమ్మాయి చేయి పట్టుకోగానే ఆమె వాలుచూపులతో అతనికేసి చూసి కాస్త ఇకిలించింది.నేను తెల్లబోయి చూస్తుండగా గురువుగారు 'ఈ ఇకలింపు పిశాచలక్షణం సుమా 'అని నన్ను ఊరుకోబెట్టారు.తర్వాత ఆ ముసలామె కేసి చూసి "ఈ భూతం హాత్తు హూత్తు లతో పోదు.ఈమెను కొంతకాలం పాటు భర్త దగ్గరకు పంపకండి.ప్రతీ రాత్రి ఏడు గంటలకు ఇక్కడకు తీసుకురండి.ముగ్గులో కూచోబెట్టి తాడన పీడనాలు ఆచరించి,జుట్టు పట్టుకుని ఒక జాముసేపు రాపాడిస్తే గానీ ఈ వికారం పోదు.”అన్నాడు.

ఆ మాటలు వినగానే ఆ అమ్మాయి కిసుక్కున నవ్వింది. 'వెకిలి దెయ్యం 'లే అని గురువుగారు నన్ను ఊరుకోబెట్టారు.మళ్ళీ ముసలావిడ కేసి తిరిగి "ప్రస్తుతానికి గ్రంథప్రత శకలం ఒకటి,హేమ రజం కొంత ఇస్తాను.రేపు మళ్ళీ రండి" అన్నారు.

గురువు గారి మాటలకు అర్థాలు తెలిసిన వాణ్ణి కాబట్టి ఓ తాటాకు ముక్క,కాస్త పసుపు పొట్లం కట్టి ఇచ్చాను.పసుపు మొహానికి రాసుకొమని,తాటాకు కొప్పులో పెట్టుకోమని చెప్పాను.

ఆ తర్వాత ఒక పండితుడి భార్య పదహారు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లను వెంట బెట్టుకుని వచ్చింది.

“ఇది నా చెల్లెలు.ఇంకా వ్యక్తురాలు కాలేదు.భర్త రెండవ పెళ్లివాడు.”అని ఏదో చెబుతుండగానే మా గురువుగారు ఆ పిల్లను లాక్కొని ఒల్లో కూచోబెట్టుకున్నాడు.అది చూస్తేనే నాకు ఒళ్ళు చచ్చినట్టయింది.ఆ పిల్ల ఒళ్లోంచి లేచిపోవడానికి ప్రయత్నించినా గురువుగారు వదల్లేదు.ఫట్ ఫట్ అని ఏదో ఒక మంత్రం చదివి హడావుడి చేసి కాస్సేపయ్యాకనే వదిలిపెట్టాడు.

“గ్రంథశకలత్రయం ఇయ్యి "అనడంతో మూడు తాటాకులు ఇచ్చాను. “ఇవెందుకు ?వీటినేం చేయాలి ? నా సమస్యకు ఇదేం పనిచేస్తుంది.?”అని కాస్త తెలివిగా అడిగింది ఆ పిల్ల. గురువుగారికి భయం వేసింది. “వీటిని పొత్తికడుపుకు కట్టుకుని పడుక్కో.మళ్ళీ రానక్కరలేదు"అంటూ ఆమెను తరిమేసాడు. ఆ సాయంత్రం ఒక దొరగారు వచ్చాడు.

“మా వీధిలో ఒక బాలెంతరాలు చనిపోయింది.దుష్ట నక్షత్రం లో పోవడం వల్ల ఆ ఇల్లు కూడా వదిలిపెట్టారు.ఇప్పుడామె బ్రహ్మరాక్షసి అయింది.మొన్న మా పనివాడు ఆ ఇంటి వేపు వెళితే ఆ బ్రహ్మరాక్షసి వాడి వీపుమీద చరిచింది.దెబ్బకి వాడు పనిమానేసి పారిపోయాడు.అప్పటి నుండి నాకు పనివాడు లేకుండా పోయాడు.మీరేదైనా చేసి ఆ ఇంట్లోంచి భూతాన్ని పోగొట్టాలి" అని బతిమాలాడు.

“పోనీ నన్ను వెళ్లి చూడమంటారా "అని అడిగేను నేను. దొరగారికి కోపం వచ్చింది. “అంత సులభంగా అయిపోయేదయితే మాకాపాటి ధైర్యం లేదనుకుంటున్నావా...గురువుగారయితే ఆయన సంగతి వేరు "అన్నాడు కోపంగా.

“అబ్బే మీరు మా శిష్యుడిని తక్కువ అంచనా వేయవద్దు.భూత విద్యారహస్యాలలో నేను బాగా ట్రయి నింగు ఇచ్చాను.(అంతా అబద్దం.ఆయన దగ్గర నేను చేరి రెండు రోజులు కూడా కాలేదు )ఇతని చేట నేను ఆ పిశాచానికి ఓ లెటర్ పంపించి దాని పద్దతేమితో తెలుసుకుంటాను.అంతగా అవసరమైతే నేనే వస్తాను.ముందుగా నేనే వెళ్లడం మర్యాద కాదు. దొరలకు తెలియని మర్యాదలేమున్నాయి "అంటూ ఆయన్ని కూడా ఉబ్బేయడంతో ఆయన "సరే మీ శిష్యుణ్నే పంపండి "అంటూ ఊరుకున్నాడు.

ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు ఆ వీధికి బయలుదేరాను.ఎవరూ లేరు.

చీకటి.శ్మశానంలో నడుస్తున్నట్టుంది.

ఆ దొరగారు చెప్పిన ఇల్లు దగ్గరకు చేరేసరికి రివ్వు,రివ్వుమనే విసురుతో... రంయి రంయి మనే ధ్వనితో ఎదురుగా దెయ్యం వచ్చి దబాలున గుండెమీద కొట్టింది.

కెవ్వుమని కేక వేసాను కానీ దెబ్బ తగలడంతోనే రెండు చేతులతో గట్టిగా నా గుండెలకు ఆ దెయ్యాన్ని అదిమిపట్టుకున్నాను.చేతుల కింద భూతం పీకుతున్నా,వెర్రిపట్టు పట్టి పరుగు, పరుగున గురువుగారింటికి వచ్చి ఆయన్ని నిద్రలేపి చెప్పడంతో ఆయన అదిరిపడ్డాడు. సీసాలో పెడదామంటూ సీసా రెడీ చేసి చేతుల పట్టు వదిలి చూస్తే ఏముంది ?ఒక పెద్ద గబ్బిలం.తుర్రున ఎగిరి,మళయాళ భగవతి విగ్రహం మీద వాలింది. మేమిద్దరం తెల్లబోయి చూశాం.భగవతి గబ్బిలాన్ని ఏమీ చేయదేమిటాని.పైగా ఈ గబ్బిలం ఎక్కడ నుండి వచ్చిందాని.

“నిన్ను కొట్టినప్పుడు అది బ్రహ్మరాక్షసి స్వరూపంతోనే ఉంది.కానీ కామరూపిణి కాబట్టి నువ్వు పట్టుకోగానే రుషిపక్షి (గబ్బిలానికి కూడా పేరు మార్చాడు మా గురువు )అయిపొయింది.కానీ మామూలు జనానికి ఇదంతా అర్థం కాదు.ఎవరికీ చెప్పక "అన్నారు గురువుగారు.

మా గురువుగారి వద్ద పనిచేయడం వలన నాకు తెలిసివచ్చినదేమిటంటే ఇలాంటి దయ్యాలు లేవు.మన బుద్ధులే దయ్యాలు.ఇవి దైవభక్తిచే,విద్యచే పోవలసినవే కానీ మంత్రించిన మినుప గింజలచేత,చీపురుకట్టల చేత,పాత చెప్పుల చేత వదలవు.

దుర్మార్గులైన మనుష్యుల కంటె మించిన పిశాచాలు లేవు.

” అని జంఘాలశాస్త్రి అనగానే వాణీదాసుడు లేచి తన అభిపాయాన్ని చెప్పాడు. “శరీరం లేని జంతువులు,శక్తులు ఉండవచ్చు.అంతమాత్రం చేత అవిలేవని చెప్పలేము.దయ్యాలు లేవని చెప్పలేం కానీ అవి నమకే అపకారమూ చేయలేవని మాత్రం చెప్పగలం.ఉపకారం చేయాలన్నా,అపకారం చేయాలన్నా ఆ అధికారం భగవంతుడికే ఉంది కానీ ఇటువంటి వాటికి ఉండదు.దయ్యాలు మనల్ని బాధించేవి కావు.అంతమాత్రం చేత అవి లేవని చెప్పలేం.ఉంటే ఉండవచ్చు.

దాంతో జంఘాలశాస్త్రి రుసరుసలాడుతూ లేచాడు. “దయ్యాలు లేవని నేను ఖచ్చితంగా చెప్పగలను.అవి ఉన్నాయని అనుకునే కేసులలో మేధా సంబంధమైనదో,జన్యుసంబంధమైనదో ఏదో ఒకరోగం ఉంటుంది.అవి లేని చోట్ల మోసం ఉంటుంది.నేను మా గురువుగారిని విడిచిపెట్టడానికి కారణమైన ఒక సంఘటన చెబితే మీకు బాగా అర్థమవుతుంది. ఓ సారి ఆ ఊళ్ళోనే పడమటి వీధిలో ఒక బాలవితంతువుకు కామినీ పిశాచం ఆవేశించిందని మా గురువుగారిని పిలిపించారు.ఆమె చేసిన వేషాలు చూసి తీరాలి.మూడు మేజువాణులంత కలకలం.పాటలు,అభినయం,అంతలోనే మొగ్గలు.గంతులు.చావుకేకలు.

“ఈ కామినీపిశాచం క్రితం జన్మలో వేశ్య తెలుసా ?”అన్నారు గురువుగారు.

అంతలోనే ఆ పిల్ల "ఓం నారాయణాయ విద్మహే "అని స్వరయుక్తంగా పలకడంతో మా గురువుగారు ఖంగుతిని తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి "వేశ్య జన్మకు ముందు వైదిక బ్రాహ్మణుడి జన్మ అయివుండాలి "అన్నాడు.

మళ్ళా ఏమనుకున్నాడో ఏమో "ఎప్పుడైనా బ్రాహ్మడు దానిని ఉంచుకుని మోహం వదలక ఆ దెయ్యానికి దెయ్యం పట్టాడేమో "అన్నాడు.

ఈ వాఖ్యానాలన్నీ విని ఒళ్ళు మండిందేమో ఆ పిల్లో,పిల్లనుపట్టిన దెయ్యమో ఎగిరి నన్నో తన్నుతన్నింది.నాకు కళ్ళవెంబడి నీళ్ళు వచ్చాయి.నువ్వేం బాధపడొద్దు.ఇదేముంది...ఆ మధ్య నేను వీరాంజనేయం (అంటే పటుకారు)పట్టుకుని ఒక భూతం మీదకు వెళ్లగా అదే నా చేతిలోంచి దాన్ని లాక్కుని నా పన్ను ఊడలాగింది.దీన్ని ఎలా వశపరుచుకోవాలో నాకు తెలుసు.ఉగ్రనరసింహం (దూలగుండ పొడి )ఒంటి నిండా పూసేస్తే మనజోలికి రాకుండా ఉంటుంది.అంటూ గురువుగారు హాం హోం అంటూ మీదకెళ్ళాబోయాడు.

అంతలో ఆ అమ్మాయి గొంతు మార్చి "ఖబర్ దార్,చలేజాన్,నైతో మార్ డాల్తా "అంటూ అరిచి పందిరిమంచం స్తంభం ఊడదీసి మీదికి వచ్చింది.గురువుగారు మరింత గందరగోళం పడ్డారు. “చూశావా ? తురకదయ్యం కూడా పట్టింది.మనసులోకి ఒక దయ్యానికి దారిస్తే అన్ని రకాల దయ్యాలు వచ్చి చేరతాయి.ఇలాటప్పుడు ఏం చేయాలంటే ఆ దయ్యాలకు వాటిలో వాటికి కలహం పెట్టాలి.

అప్పుడప్పుడు ఒకదానితో మరొకటి కొట్టుకుని చివరికి అన్నీ పారిపోతాయి. వాళ్లకు ఎలా గొడవలు పెట్టాలా అని ఇంటికి వెళ్లి ఆలోచిద్దాం రా "అన్నారు.కానీ నా ఆలోచన మరోలా ఉంది. అప్పుడామె బంధువులు ఎవరూ దగ్గర లేదు.వచ్చిన వాళ్ళందరినీ కరవడం,రక్కడంతో ఆమెంటే భయపడి,ఇంటికి కాస్త దూరంగా ఒక గదిలో ఆమెను పెట్టేసి విడిగా ఉంచారు. భోజనం కూడా పనివాళ్ళచేత పంపుతున్నారు.

“వాళ్ళవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మనిద్దరం కలిసి నాలుగు తందాం "అన్నాను నేను.ఆమె చేతిలో దెబ్బతిన్న కోపం నాకింకా పోలేదు మరి " కానీ గురువుగారికి ఆవిడంటే భయమో,ఏమో 'పోదాం పద 'అన్నారు.దారిలో ఆ అమ్మాయి తండ్రి కనబడితే "రాత్రికి జంఘాలశాస్త్రి చేత తీర్థం పంపుతాను "అని చెప్పాడు. గురువుగారి ఆదేశం కదా,ఆ రాత్రి తీర్థం తీసుకుని వెళ్లాను.చుట్టుపట్ల ఎవరూ లేరు.తలుపు ఓరగా వేసి వుంది.నిద్రపోతోందేమో,లేపుదామా వద్దా అనుకుంటూ తలుపు కన్నంలోంచి చూసాను.

మా మీద నమ్మకం పోయిందేమో మరి మరో భూత వైద్యుడిని పిలిచినట్టున్నారు. అతను ఆమె ముంగురులు చేత్తో పట్టుకున్నాడు.పక్కన బల్లమీద భూతాన్ని దింపడానికి సీసా రెడీగా పెట్టుకున్నాడు. మంత్రాలు జపిస్తున్నాడులాగుంది,ఆమె అల్లరి చేయకుండా బుద్దిగా కూచుంది. వీడెవడో మా గురువుకంటె గట్టివాడులా ఉన్నాడు.

ఇతని శిష్యరికం చేస్తే ,మంచిదేమో అనుకుంటుండగానే ఆ సీసా మూత తీసి ఆమె బుగ్గలకు రాసాడు.అత్తరు వాసన గదంతా పాకింది.దీనికి వాడు పెట్టిన పేరేమిటాని ఆలోచిస్తుండగానే మంత్రాలు జపిస్తున్న మూతిని పొడుగుచేసి ఇంగ్లీష్ సినిమాలోగా ఒక శృంగార చేష్ట చేశాడు.ఆమెకు కోపం వస్తుందేమోనని నేను అనుకుంటూండగానే కిల కిల నవ్వుతూ విరుచుకుపడింది.వాడి పని అయిపోయిందిరా అనుకుంటూ నేను పరుగెత్తుకుని వచ్చేశా.

గురువుగారికి అన్నీ వివరంగా చెబితే ఆయన గుచ్చిగుచ్చి చాలా అడిగేరు.ఆమె శరీరంలోని భూతం బయటకు వచ్చి ఉండవచ్చని తీర్మానించారు.'వాడికి జందెం ఉందా ?తురకగడ్డముందా ?'అని ఎన్నో ప్రశ్నలు అడిగేరు.నేను సరిగా చెప్పలేకపోయినందుకు విసుక్కున్నారు.మర్నాడు వాళ్ళింటి దాసి వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకుని నిలబడగానే ఆయన బాధపడ్డాడు.

“చూశావా...నా మంత్రం ఫెయిలయిన మొదటి కేసు ఇదే.నువ్వు చెప్పినప్పుడే అనుకున్నాను.ఆ మూడు దయ్యాలు కలిసి ఆమెను చంపుకు టిని వుంటాయని, తెల్లవారేసరికి నా అనుమానం నిజమయింది "అన్నాడు.

ఆ ముసల్ది కంగారు పడింది.

“అమ్మాయిగారు చచ్చిపోలేదండి.మా అబ్బాయి కూడా ఆ ఇంట్లోనే పనివాడిగా పనిచేస్తున్నాడు.వాణ్ని లేపుకుని ఇంట్లోంచి పారిపోయిందండి.ఇక నన్ను చూసేవాళ్లేవరని నేను ఏడుస్తున్నానండి.”అంది.

అదీ జరిగిన సంగతి.ఆ బాలవితంతువుణు పట్టిన దెయ్యమేమిటో నకు అర్థమయ్యాక నేను తక్షణం మా గురువుగార్ని వదిలి పెట్టి ఇల్లు చేరుకున్నాను.