Preminche Hrudayam

ప్రేమించే హృదయం

-బ్నిం

పెళ్ళికి ముందు ప్రేమ భలే థ్రిల్.

ప్రేమించిన పిల్ల ఏ ఆటంకాలూ లేకుండా వైఫ్ అయిపోతే...అదో సర్ ప్రైజ్ లైఫ్ కి! కానీ వొచ్చిన చిక్కల్లా...మగాడు లైనేసేటప్పుడు గడగడా ప్రేమపాఠాలు అప్పగించడానికీ 'అరువుతెచ్చుకున్న'ఆదర్శాలు ఆమె ముందు వల్లించడానికీ...గొంతూ,భాషా,వెరసి నోరూ హోల్ మొత్తంగా ఖర్చు చేసుకుంటాడు.

తీరా పెళ్ళయి ఇల్లాలిగా ఇంట్లో అడుగుపెట్టిన సదరు గర్ల్ ప్రెండ్...అప్పుడు సిగ్గుల మొగ్గలా...మగ్ధమోహనంగా...మూగబాసల్తో పొడువు చేసుకున్న గొంతు,భాషా,వెరసినోరూ... శత సహస్ర స్వరాల్తో...నాదాల్తో...రాగాల్తో...

మహాద్భుత గర్జిత ఘోషతో వినియోగానికి తెచ్చి విజృంభింస్తుంది. చిల్లర మల్లరగా మిగిలిన మగగొంతు తాలుగు లోలోపలి సణుగుడూ గొణుగుడూ కూడా...ఆవిడగారి గళవాహిని దూరంగా సుదూరంగా నెట్టేస్తుంది.

అప్పుడు మొదలవుతుందండీ...సంసారాధ్యాయం !

“సినిమాకెళ్దాం సరూ ప్లీజ్...పోనీ పార్కుకీ వస్తావా? అచ్ఛా అయితే జస్ట్ బసేరాలో ఐస్ క్రీమ్ తిందామా ?? ” అంటూ మనం అప్పుడిచ్చిన వరాలు అమ్మానాన్నల భయాల వల్ల వాయిదా వేసిన అమ్మాయి.

పెళ్ళికాస్తా అయ్యాక...అడిగితే,మొదటి వారంలోనే జేబులు అడుగంటుతాయి.ఒకవేళ ఆ కోరికల లిస్టు అడగలేదనుకున్నా ప్రమాదమే! తమరు పరిచయమైన కొన్ని రోజులకే

' సినిమాకెళ్దాం...హోటల్ కెళ్దాం' అని దండకాలు చదివారుగా...అదో పెద్ద తప్పు కదండీ...దాంతో ఆవిడగారు, దిల్ కీ దిమాక్ కీ పని చెప్పి...రాంగ్ థాట్స్ లోకి వెళ్ళిపోతుంది.

మీకు పరిచయమయిన అందర్నీ ఇలా సినిమాకి షికార్లకీ తిప్పారా అని డౌట్లో పడిపోతుంది. ఇంక ఆ విషబీజం ఆవిడ హృదయ నందనవనంలో పిచ్చి మొక్కగా పెరిగిపోవచ్చు.అది బోల్డు వెర్రితలలేసి మహావృక్షంగా ఎదిగిపోవచ్చు. అందుకని,పెళ్ళాడదామని అనుకున్న పిల్ల దగ్గర ప్రియుడు ఓవర్ ఏక్టివ్ గా డాంబికాలు చెప్పి ప్రేయసిని పెళ్ళాంగా మార్చకూడదు.

ఆడపిల్ల అంతరంగం అర్థం చేసుకోవటం అంత 'ఇది'కాదు. మనం స్టయిలిష్ గా సిగరెట్ తాగటం లైక్ చేసి,పళ్ళికిలించి,మనసు దోచిన అమ్మాయే... మూడు మూళ్ళూ వేయించుకోగానే సిగరెట్ మానేయమని ఉపదేశం మొదలెడుతుంది... దటీజ్ లేడి!!

ఇంకో పాయింట్...పెళ్ళాంగా వచ్చిన అలనాటి ప్రేయసి అసలు బుద్ధిమంతురాలు అయినా... హీరోగారు ఏమ్మాయో...మంత్రమో వేశాడోగానీ ' లవ్ 'లో పడిపోయింది. తనలాంటి గట్టి పిల్లకూడా ' బెట్టు ' వదిలి లవ్ లో పడ్డప్పుడు.మిగిలిన స్త్రీ జాతంతా ఇంకా 'ఈజీ ' గా ఈయనగారి బుట్టలో పడిపోరని గ్యారంటీ ఏంటి ?

ఇదో భయం,భయంకన్నా...మించి అనుమానం...సహజంగా వుంటుంది ఆవిడకి!అంచేత అనుక్షణం మగాడి హృదయాన్ని స్టెతస్కోపు పెట్టి వింటూంటుంది వైఫ్. మీరు నాకు ముందు ఎవర్నైనా ప్రేమించారా అనే ' పిచ్చి' ప్రశ్న మనకి వెన్నెల్లో ఖచ్చితంగా వస్తుంది భార్య నుంచి.

మన మోహన రంగులు మారిన...మసక చీకట్లో ఆవిడకి ఏం కనిపిస్తుందిలే అనుకోవద్దు.భర్త హృదయస్పందన చెవి ఆన్చివింటున్న వేళే...తీయటి గొంతుతో ఆ ఘాటుప్రశ్న వేస్తుంది.

దానికి సరైన జవాబు నోరిప్పి చెప్పకుండా నిద్దర నటించడం ఉత్తమ పురుష లక్షణం.

అంతకు ముందు ప్రిపేరయిన జవాబుంటే గడగడా వప్పగించేయటం మధ్యమ పురుష లక్షణం .

నిజం చెప్పి ఇరుకునపడ్డం అధమాధమ పురుష లక్షణం.

ఇక్కడ సదరు హస్బెండ్ రెస్పాన్స్ ని బట్టి చంద్రుడు " సిగ్గుతో " మబ్బుల చాటుకి వెళ్దామా... వద్దా...అనేది డిసైడ్ చేసుకుంటాడు.

అసలు ప్రేమించే హృదయం అనేది అఘోరిస్తేనే కదండీ...సత్యవతిని కొన్నాళ్ళూ, హైమవతిని కొన్నాళ్ళూ, నీరజనో కాకపొతే శారదనో ప్రేమించటం...ఆ సంగతి తెల్సుండీ భార్య ఇలా మీరు... ఎవరినైనా...హింతకుముందు ప్రేమించారా ? అని అడగటం అమాయకత్వం.( అదే అమ్మాయితత్వం ).

తన అదృష్టం బావుండీ...వాళ్ళపేర్లలా తన పేరూ పాత పడి పోకుండా పాతుకుపోయినందుకు ఆనందిచాలిగానీ...ఇలాటి ప్రశ్నల్తో మగని మనస్సు "గతాల దిగంతాలకి " విసిరేసేయటం ఆదర్శ గృహిణి లక్షణం కాదు.

హాయిగా ఉండటానికి మార్గమూ కాదు. నేను దైర్యం చేసి నా శ్రీమతితో పెళ్ళికి ముందే..

" చూడు సరస్వతీ...నాది ప్రేమించే హృదయం. నువ్వు ఫలానా ఇన్నో నెంబరువి ! నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను చివరి నెంబరు చేస్తాను. పోనీ మరో నాలుగు నెంబర్లు దాటాక చూద్దాం అంటే నీ యిష్టం.అప్పుడే కలుస్తాను " అన్నాను.

ఆమె నవ్వింది . ఆమె అంగీకారం అర్థమై ఆనక అర్థాంగి అయింది.ఆ క్షణం నుంచీ నా ' ప్రేమించే హృదయం ' తాలూకు వేకేన్సీ బోర్డు మళ్ళీ వాడలేదు ఒట్టు. పోతనగారు చెప్పినట్లు " కన్నుదోయికి 'ఐశ్వర్యారాయ'డ్డం బైన మాతృభావము చేసి మరలు వాడ " అన్నంత ' గుడ్ బాయ్ ' అయిపోయాను.