Gopala Bala Ninne Kora

గోపాల బాలా నిన్నే కోర...!

- నిశాపతి

ఉన్నట్టుండి గోపాలానికి విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. డోకొచ్చినట్లు కూడా అనిపించింది.ముకుందంతో సాయంకాలం అలా సరదాగా నడుస్తుండగా జరిగింది.

అప్పుడప్పుడే చీకట్లు అలముకుంటున్నాయి.

ఎదురుగా ఏదో 'డాక్టర్'అని బోర్డు కనిపిస్తే వెంటనే గోపాలాన్ని తీసుకుని లోపలికి వెళ్లాడు ముకుందం.

కాలింగ్ బెల్ మోగించాడు.కొద్ది సేపట్లో తలుపు తెరుచుకుంది.'డాక్టర్' ప్రత్యక్షమయ్యాడు.

“మా వాడికి చాలా కడుపు నొప్పిగా వుందండీ !గిల గిలలాడి పోతున్నాడు.కొంచెం పరీక్ష చెయ్యండి"అన్నాడు ముకుందం.

డాక్టర్ అతన్ని ఎగాదిగా చూసి "ఈ సాయంత్రం మీరేదైనా కవి సమ్మేళనానికి వెళ్ళారా !” అన్నాడు.

“అబ్బే !లేదండీ !” అన్నాడు గోపాలం.

“మరి,పోనీ...ఏదైనా కవిత మీ కడుపులో వుండిపోయి,బైటికి రాలేక గిరికీలు కొడుతుందేమో! ఓ కాయితం,కలం యిస్తాను.వెంటనే రాసేయండి.కడుపు ఖాళీ అయి నొప్పి కడుపు నొప్పి తగ్గిపోతుంది."

ముకుందానికి ఒళ్ళు మండింది.

“వాడు కడుపు నొప్పితో అల్లాడి పోతుంటే మీరు కనితలూ,కాకరకాయలూ అంటారేంటండీ ?త్వరగా పరీక్ష చేసి ఏదయినా మందివ్వండి "అన్నాడు.

డాక్టర్ అదేం వినిపించుకోకుండా, “ఆగండి !కవిత అంటే కవితే కానక్కర లేదు.హైకూ.మినీ కవిత,చిన్నకథ,స్కెచ్,గల్పిక....ఏదైనా సరే....”

“ఇదెక్కడి గోలండీ బాబు...!కడుపు నొప్పికి మందు యిమ్మని మీ దగ్గరికొస్తే యిలా బాదేస్తున్నారు ?!” అన్నాడు ముకుందం.

“మందా?! మందులు నాకేం తెలుసు?” అన్నాడు డాక్టర్ బిక్కు మొకం వేసుకుని.మందు అన్నమాట మొదటి సారిగా వింటున్నట్లు.

“మరి, డాక్టర్ అని బోర్దేందుకు పెట్టుకున్నారు?”అన్నాడు ముకుందం కోపంగా.

“అదా!ఇప్పుడర్థమైంది.ఇది కప్పల్నీ,బొద్దింకల్నీకోసి సపాయించిన డాక్టర్ పట్టా కాదండోయ్!కష్టపడి సంపాదించింది "అన్నాడు డాక్టర్.

“ఏం కష్ట పడ్డారు "?అన్నాడు ముకుందం అయోమయంగా.

“నాలుగేళ్ళు నానా కష్టపడి 'తెలుగు కథానికా సంకలనాల్లో విషయ సూచికలు'అనే అంశం మీద పరిశోధన చేసి సంపాదించిన డాక్టరేటు యిది తెలుసా ?”అన్నాడు డాక్టర్ కొంచెం గర్వంగా. గోపాలానికి తన కడుపు నొప్పి కూడా మరిపించెంత 'షాక్' కలిగింది. “విషయ సూచికల మీద రిసేర్చా?”అన్నాడు ఆశ్చర్యంగా.

“అవును.అదేం చిన్న విషయం అనుకుంటున్నారా ?”

“ఏం పరిశోధన చేశారు?”

“అలా అడగండి! ఇప్పటికి వరకు తెలుగులో 14,186 కథా సంకలనాలు వెలువడ్డాయి. అందులో రకరకాల విషయ సూచికలున్నాయి...”

“ అంత ఖచ్చితంగా కథా సంకలనాల సంఖ్య ఎలా సేకరించగలిగేరు ?”

డాక్టర్ గొంతు తగ్గించి "పోనీ,నేను చెప్పిన సంఖ్య తప్పయితే మీరు సరైన సంఖ్య చెప్పండి" అన్నాడు.

“నేనా !నాకేం తెలుసు?నేనేం సాహితీ పరుణ్ణి కాదే !బాబోయ్ కడుపునొప్పి...”అన్నాడు గోపాలం.

“కొంచెం ఆగండి! కాబట్టి ఇప్పటి వరకూ తెలుగులో ఎన్ని కథా సంకలనాలు వెలువడ్డ సంగతీ మీకు తెలీనట్లేగదా!మీకే కాదు,ఎవరికీ తెలీదు.కాబట్టి నేను రాసింది తప్పని ఎవరూ ఋజువు చెయ్యలేరు.”

“తెలిసింది, మహానుభావా! తెలిసింది.మీ విజయ రహస్యం ఏమిటో బోధపడింది.ఇక మమ్ముల్ని వదిలెయ్యండి.మేం డాక్టర్ దగ్గరికెళ్ళాలి "అన్నాడు ముకుందం.

“ఉండండి !మీకు మరీ ఖంగారు!ఈ మాత్రానికే డాక్టర్ ఎందుకు ?మా బామ్మని కేకేస్తాను. ఆవిడ ఏదో చిట్కా వైద్యం చేస్తుంది. నొప్పి తగ్గిపోతుంది.” అంటూ "బామ్మా"! అని కేకేసి "నా పరిశోధన వివరాలు పూర్తిగా వినలేదు మీరు.ఇహ వినండి!అడిగారుగా !” అని మళ్ళీ ఎత్తుకున్నాడు డాక్టర్.

“....ఈ 14,186సంకలనాల్లో విషయ సూచికల్లో 'ఫాంట్ 'అంటే అక్షరం సైజు...”

“ఫాంట్ అంటే తెలుసుకొండి.నేను కంప్యుటర్ ఇంజనీర్ని " అన్నాడు గోపాలం.

డాక్టర్ ఆపకుండా,....” అక్షరం సైజు వివరాలతో నా పరిశోధన గ్రంధంలో రెండు అధ్యాయాలు నింపాను.”

“అలాగా !” అన్నాడు గోపాలం.

నిజంగానే వాళ్ళ బామ్మా ఏదైనా చిట్కా వైద్యం చేస్తే డబ్బులు మిగులుతాయిగదా అనే ఆశతో, ఆసక్తి నటిస్తూ "...మూడో ఆధ్యాయంలో అకారాది క్రమంలో మొత్తం అన్ని సంకలనాల్లోనూ ఒక్కో అక్షరం కింద ఎన్ని కథలున్నాయో యిచ్చాను.నాలుగో అధ్యాయంలో....” అంతా వింటోన్న ముకుందం ఇక ఉండబట్టలేక అడ్డు పడుతూ,

”ఇదా పరిశోధన అంటే...సాహిత్యంలో శైలిలో వచ్చిన మార్పులూ,శిల్ప పరిమాణం యివేమీ చర్చించలేదా ?” అన్నాడు.

“ఎందుకు లేదు.?నా మూడొందల పేజీల గ్రంధంలో చివరి రెండు పేరాలూ అదేగా ?అయినా విషయ సూచికల్లో శైలీ, శిల్పం ఏమిటి తమరిబొంద !” అని విసుకున్నాడు డాక్టర్.

“మరి నఖక్షతాలూ,దంతక్షతాలూ అవీ విషయ సూచికలేగా ! వాటి గురించి కూడా కవర్ చేస్తే యింకాస్త పెద్ద గ్రంధం అయ్యేందిగా ?!” అన్నాడు ముకుందం ఒళ్ళుమండి.

డాక్టర్ కాసేపు ఆలోచించి, “ డబుల్ మీనింగా ?” అన్నాడు.

“కాదు.సింగిల్ మీనింగే "అన్నాడు ముకుందం.

“ఓర్నీ అసాధ్యంగులా !తెలుగు చదువుకున్న నాకే రాని వెధవాలోచనలన్నీ నీకెలా వస్తున్నాయయ్యా ! చదివిందేమో కంప్యూటరింజినీరింగు!” అన్నాడు డాక్టరు.

“ దీనికి సాహిత్యం చదవక్కర్లేదు సార్, సినిమాలు చూస్తే చాలు.అయినా కంప్యుటర్ ఇంజనీర్ని నేను కాదు.మావాడు" అన్నాడు ముకుందం.

“ ఎవరో ఒహర్లేగాని,ఇంతకీ ఎలా వుంది నా పరిశోధన ? ” అన్నాడు డాక్టరు.

“పి.హెచ్.డీ.సపాదించడం యింత సులభం అనుకోలేదు సార్! ఇంకా ఏదన్నా కొత్త విషయం కనుక్కుని ప్రతిపాదించాలేమో అనుకున్నా " అన్నాడు ముకుందం.

డాక్టర్ ఏదో చెప్పబోతుండగా వాళ్ళ బామ్మ బైటికి వచ్చింది.

“ ఇక్కడ కడుపునొప్పి ఎవరికీ బాబూ ?” అని అడిగింది.

“నాకు "అన్నాడు గోపాలం కడుపునొప్పి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని.

బామ్మగారు కాస్త వామూ,వుప్పూ నల్చి పెట్టి,తాగడానికి వేణ్ణీళ్ళు కూడా యిచ్చింది. గోపాలం వాము మింగుతుండగా... “మీ ఇంటి పేరేమిటి నాయనా ?” అంది.

గోపాలం చెప్పాడు.ఏదో ఊరి పేరు అది.అదేమీ పౌరుషనామం కాదు.ముసలావిడ మొహంలో ఏ మాత్రం సంతృప్తి గోచరించలేదు.ఆవిడ ఎ లక్ష్యం ఆశించి ఆ ప్రశ్న వేసిందో అది నెరవేరలేదు.

“మీ నాన్నగారి పేరేమిటి బాబూ ?” అని మరో ప్రశ్న సంధించింది 'ఆయన పేరులోనన్నా చివర్న ఏదైనా కులవాచకం వుండక పోతుందా'అని. గోపాలం చెప్పాడు.

చాలా సాదా సీదా పేరు అది.ఎవరైనా పెట్టుకోవచ్చు. ముసలమ్మ గారు చాలా నిరాశపడ్డారు. కానీ ఆవిడకి ఓటమిని అంగీకరించడం యిష్టం లేదు.కుర్రాడి మొహం,మాట తీరూ చూస్తే తమ కులంలాగే వుంది. ఇంతకీ సంగతేవిటంటే - ఆవిడ మనవరాలు -కూతురి కూతురు- తల్లి లేని పిల్ల.ముసలావిడ గారి సంరక్షణలోనే వుంది.ఆ పిల్లకి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆమె పైన వుంది.అదీ !

గోపాలం కడుపు నొప్పి కాస్త తగ్గింది. ముకుందం అతన్ని చూసి "ఒరేయ్...!ఇక వెళ్దామా?”అన్నాడు.

అప్పుడప్పుడు ముకుందానికి గోపాలాన్ని అతని కులవాచకంతో పిలవడం సరదా! వాళ్ళది చాలా మంచి స్నేహం. బామ్మగారి మొహం చాటంతయింది. వెంటనే గోపాలంకేసితిరిగి,

”కాస్త వుండు నాయనా !కడుపు నొప్పి పూర్తిగా తగ్గానీ.సరే గాని నీకు పెళ్ళయిందా బాబూ "అంటూ డైరక్టుగా రంగంలోకి దూకింది. “లేదండీ !” అన్నాడు గోపాలం.

ఇక ముసలమ్మ గారు విజృంభించేసింది.ఎక్కడ లేని సత్తువా తెచ్చుకుని మిగతా వివరాలన్నీ సేకరించి పారేసింది. కుర్రవాడు అన్ని విధాల తన మనవరాలికి తగ్గవాడే!

“వాళ్ళ నాన్నగారి అడ్రసు తీసుకోరా,నాగన్నా !మన 'మిత్రవింద'ని యీ కుర్రాడికి అడుగుదాం "అని మనవడికి పురమాయించింది.హఠాత్తుగా ఇది మగవాళ్ళ పని అని గుర్తొచ్చి.అబ్బే !నాగన్న అన్నది డాక్టర్ అసలు పేరు కాదు.కేవలం విశేషణం.అంతే !

'మిత్రవింద 'అన్న పేరు వినగానే గోపాలం ఎడం కన్ను అదిరింది.దాంతో పాటే కొద్ది రోజుల క్రితం అదిరిన తన కుడి గూబ గూడా గుర్తొచ్చింది.ఆ అమ్మాయి పేరు కూడా ఏదో యిట్లాగే పాత పుస్తకాల్లో పేరే ! ఇంతలో బైట ఆడపిల్లల హీల్స్ చప్పుడు వినబడింది. కొద్ది నిమిషాల్లో మిత్రవింద గబగబా వచ్చి తలెత్తి చూడకుండానే యింట్లోకి వెళ్ళింది.కాని గోపాలం ఆమెను చూశాడు.సందేహం లేదు!ఈ అమ్మాయీ ఆ అమ్మాయే!

“ఇదే బాబూ మా మనవరాలు "అంది బామ్మగారు.మిత్రవింద లోపలికి వెళ్ళిపోయాక, ఇక ఆమెకి వినబడదు అన్న నిర్ధారణకి వచ్చి.

గోపాలం ఒక్కసారిగా 'ఎలర్ట్ 'అయిపోయాడు.

“అన్నట్లు బామ్మగారు !మీకో విషయం చెప్పాలి.”అన్నాడు.

“ఒకటేం ఖర్మ,ఎన్ని కావలిస్తే అన్ని చెబుదువుగాని,ముందీ విషయం చెప్పు.మా మనవరాలు నీకు నచ్చిందా ?' అంది.

“అమ్మాయికేం,లక్షణంగా వుంది.కాని నాకు...నాకు....”తడబడ్డాడు గోపాలం.

“ఊఁ..!నీకు " గోపాలానికి హఠాత్తుగా బుర్రలో ట్యూబ్ లైటు వెలిగింది.

“నాకు కుజదోషం వుంది బామ్మగారూ !” అనేశాడు.

బామ్మగారు విశాలంగా నవ్వుతూ...”ఆఁ...! కుజదోషానికేముంది నాయనా!వింధ్య పర్వతాలకి దక్షిణాన వున్నా వేషానికి కుజదోషం వర్తించదని పెద్దలెప్పుడో చెప్పేశారు.మనమే అజ్ఞానం కొద్దీ దాన్ని పాటిస్తున్నాం.అయినా ఆ గొడవలన్నీ నీకెందుకు? మేమూ మేమూ... పెద్దవాళ్ళం చూసుకుంటాం గదా! పిల్ల నచ్చిందన్నావు చాలు.ఇక నీ పని అయిపొయింది. మిగతావి మాకొదిలేయ్ "అని ముద్దుగా కసిరింది. గోపాలానికి తన మీద తనకే జాలేసింది.

“అవును,నిజంగానే ఇక నా పని అయిపొయింది.”అనుకున్నాడు.

తనకి యీ పాడు కడుపునొప్పి రానేలా?వచ్చేనుబో,యీ త్రాష్టుడి యింటికి తాను రానేల?ఆయేనుబో, యీ బామ్మగారి కంట పడనేల ?... నిజానికి మిత్రవింద లాంటి అందగత్తె భార్యగా లభించడం ఏ మదవాడైనా అదృష్టంగా బావించ వలసిన విషయమే! కాని...కాని...ఇవాళ కాకపొతే,రేపైనా ఆ అమ్మాయి తనని గుర్తు పడుతుంది.

పట్టి "నువ్వా !” అని క్లోజప్ లో తనతో అని, వాళ్ళ అమ్మమ్మవైపు తిరిగి,మిడ్ షాట్ లో "అమ్మమ్మా !వీడో జులాయి వెధవ.అమ్మాయిల్ని అల్లరిపెట్టె రకం!వీడికిచ్చి నా గొంతుక కొస్తావా ?”అని అనడం ఖాయం. గోపాలం ఆలోచించీ,ఆలోచించీ చివరికి గుండె రాయి చేసుకున్నాడు.!కానీ ఏదయితే అది అవనీ !అయినా తనకేమిటి,మగ మహారాజు! ఇంత పిరికిపడడం అవమానకరం.వాట్ విల్ బీ విల్ బీ'...అని పాడుకుంటూ ధైర్యం తెచ్చుకున్నాడు.

కట్ చేస్తే

పెళ్లి చూపుల్లో మిత్రవింద ఏ పేచీ పెట్టకుండా పెళ్ళికి ఒప్పుకోవడం గోపాలానికి మెగా ఆశ్చర్యం కలిగించింది. పెళ్ళయ్యాక గోపాలం ఆమెని అడిగాడు.

“నిజం చెప్పు !ఆరోజు కాలేజిలో నిజానికి నేను నిన్ను అల్లరేమీ చెయ్యలేదు.మౌనంగా ఫాలో అయ్యాను.అయినా రెచ్చిపోయి నన్నుచెప్పుచ్చుకు కొట్టావు.ఇప్పుడేమో మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నావ్.హేమిటిదంతా ?!హ్హు హ్హు హ్హు హ్హు...నేను నవ్వాను, దగ్గలేదు.చెప్పు !ఏమిటిదంతా ?”

మిత్రవింద కాస్త సిగ్గు పడుతూ "మీరంటే నాకు మొదటి నుంచీ యిష్టమేనండీ! అసలు మీరు మా కాలేజీ చుట్టూ తచ్చాడుతుండగా చూసిన మొదటి రోజే మిమ్ముల్ని ప్రేమించానండీ !పెళ్లి చేసుకోవాలని గూడా అప్పుడే నిర్ణయం చేసుకున్నాను "అంది.

“మరి "అన్నాడు గోపాలం అయోమయంగా.

“మిమ్ముల్ని పెళ్లి చేసుకోవాలనే ఆ రోజు అలా కొట్టానండీ !”

“ఏవిటీ,పెళ్లి చేసుకోవాలనే కొట్టావా ?తెలుగు సినిమాలో కక్కుర్తి కామెడీ కోసం వేసే డైలాగ్ లా నీ డైలాగ్ రిపీట్ చేయడం లేదు.నిజంగా అర్థం కాకే అడుగుతున్నాను.చెప్పు! పెళ్లి చేసుకోవాలని కొట్టడం ఏవిటి ?”

“ఓ ! మీకు అసలు సంగతి చెప్పలేదూ కదూ !మిమ్ముల్ని నేను కోపంతో కొట్టలేదండీ "

“తెలుసు !కోపంతో కాదు,చెప్పుతో కొట్టావ్ " అన్నాడు గోపాలం.

“అబ్బ!చిలిపి !నిజంగా చెబుతున్నాను.మిమ్ముల్ని కొట్టింది మీ మీద కోపంతో కాదు.నా తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం.అంతే !”అంది మిత్రవింద భారంగా నిట్టూరుస్తూ.

“కాస్త అర్ధం అయ్యేలా ఆనవ భాషలో చెప్పవా,ప్లీజ్ " అని బతిమాలుకున్నాడు గోపాలం.

అయితే వినండి.ఒకటో ఎపిసోడ్....”

“ఆగు.టైటిల్ సాంగ్ వద్దు.డైరక్టుగా సీన్ లోకి వచ్చేయ్ "

“ఓకే !మా అమ్మని మా నాన్న కష్టాలు పెట్టేవాడు.అప్పుడప్పుడు తాగొచ్చి కొట్టేవాడు సినిమాల్లోలా !పూర్ అమ్మ ఏమీ చేయలేక ఏడ్చేది.ఏనాటికైనా యీ దేశంలో ఆడది మగాణ్ణి చెప్పుచ్చుకొని కొట్టేరోజు రావాలని కలలు కనేది.పాపం,ఆవిడ తన కలలు తీరకుండానే వెళ్ళిపోయింది.ఆవిడ ఆత్మశాంతి కోసం...”

“నన్ను కొట్టావా ? ఇది భలే వుందే "

“అబ్బ! మీకేదీ అర్థం కాదు.అన్నీ విడమరిచి చెప్పాలి.నేను మిమ్ముల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించేసుకున్నాను.మన పెళ్లి ఖాయంగా జరుగుతుందని తెలుసు.మరి తీరా పెళ్ళయ్యాక మీరు తాగి యింటికొచ్చి నన్ను కొడతారో,కొట్టారో? అప్పుడు నా తల్లి కోర్కె తీరే దారేది ?ఆమె ఆత్మకి శాంతి కలిగేదేట్లా ?అందుకని ఎడ్వాన్సుగా....” అంది మిత్రవింద గోముగా.

“మీ అమ్మగారి ఆత్మ పూర్తిగా శాంతించినట్లేనంటావా ? మధ్య మధ్య మళ్ళీ అశాంతికి గురవదు గదా "అన్నాడు గోపాలం భయం భయంగా.

“మీరెప్పుడైనా తాగి వచ్చినప్పుడు నేను కొట్టకపోతే ఆ చాన్సుంది " అంది మిత్రవింద నర్మగర్భంగా.

“నేను తాగోస్తే తంతానని భలే ఇన్ డైరక్టుగా చెప్పావ్....మొత్తానికి గట్టిదానివే...”అన్నాడు గోపాలం తేలికబడ్డ హృదయంతో నవ్వుతూ...!