Taataadhitai Tadigibatom - 15

తాతా ధిత్తై తరిగిణతోం 15

జీడిగుంట రామచంద్రమూర్తి

రోడ్డుమీద ఎవరైనా తమను చూస్తే బాగుండదని బెదిరిపోతూనే, ఓసారి అటూ ఇటూ

చూసి కారు ఎక్కేసాడు శ్రీరామ్.

అశ్విని చాలా 'జాలీ'గా డ్రైవ్ చేస్తోంది... కొన్ని క్షణాల తర్వాత 'విజిల్' తో పాటకూడా అందుకుంది....అయినా శ్రీరామ్ లో చలనం లేదు. గంభీరంగా మారిపోయాడు.

అప్పుడు అశ్విని అడిగింది. 'సినిమాలకీ' జీవితానికి ఎంత డిఫరెన్సుందో చూశావా?' 'అంటే? కోపంగా చూశాడు.' "సినిమాల్లో అయితే హీరో కారు 'డ్రైవ్' చేస్తూ బెట్టు చేసే అమ్మాయిని తనవైపు మరల్చుకోవాలని తాపత్రయపడతాడు...పాటలు పాడతాడు అల్లరి చేస్తాడు.

కానీ మన విషయంలో అది రివర్సయిందన్నమాట. అయినా అదేమిటో, నువ్ పెడమొహం పెడుతున్న కొద్దీ నీమీద 'మొహం' పెట్రేగిపోతోంది!" చెప్పింది అశ్విని.

శ్రీరామ్ బదులు చెప్పలేదు. కారు వేగంగా వెళుతోంది.

"ఎక్కడికి తీసుకుపోతున్నావ్?" కొంత దూరం వెళ్ళాక సీరియస్ గా అడిగాడు.

"ఆదిలాబాద్ అడవుల్లోకి కాదులే. పాల సముద్రంలోకి" కూల్ గా చెప్పింది.

"పాల సముద్రం ఏమిటి?"

"చూస్తావ్ గా"

"కాదు..ముందు అదేమిటో చెప్పాలి" కోపంగానే స్టీరింగ్ పట్టుకున్నాడు.

"మా బిల్డింగ్' పేరు పాలసముద్రం నిన్నిప్పుడు మా ఇంటికి తీసుకెళ్తున్నాను."

"మీ ఇంటికి నేనెందుకూ? కారాపు. దిగిపోతాను."

"ష్యూర్. నా ప్రయత్నం కూడా నువ్ దిగిపోవాలనే. ప్రేమతో అతని చేతిమీద తనచేయి

వేసి చిలిపిగా నవ్వింది. శ్రీరామ్ నిస్సహాయంగా చూశాడు. మరో అయిదు నిమిషాల్లో

కారు అశ్విని మేడముందు ఆగింది.

కాంపౌండు గోడమీద పాలరాతి ఫలకం మీద ''పాలసముద్రం'' అనే అక్షరాలు చెక్కి వున్నాయి. కారు హారన్ మోగించింది అశ్విని...గూర్ఖా వచ్చి తలుపులు తెరిచాడు. కారు పోర్టికో లో ఆపింది.

''కమాన్ మా 'డాడీ' కి నిన్ను పరిచయం చేస్తాను'' కారు దిగి శ్రీరామ్ చేయిపట్టుకుని పక్కనే వున్న గార్డెన్ లోకి నడిచింది.

''హాయ్ బేబీ నీ కోసమే చుస్తున్నానమ్మా."

అశ్విని పరుగెత్తుకుంటూ వెళ్లి "థ్యాంక్యూ డాడీ'' అంటూ తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గమీద సుతారంగా ముద్దుపెట్టుకుంది.

వాళ్ళవైపు అలాగే కొన్ని క్షణాలు విస్మయంగా చూసిన శ్రీరామ్ కళ్ళముందు మరో దృశ్యం ఊహామాత్రంగా కదిలింది. ఆ దృశ్యంలో విశాలమైన తమ ఇంటి హాల్లో ఉయ్యాల బల్ల మీద కూర్చున్న వీరభద్రం ఉప్మా తింటున్నాడు. సైకిలు రిక్షాలోంచి దిగిన శ్రీరామ్ చేత్తో సూట్ కేసు పట్టుకుని లోపలకు వచ్చాడు...అతన్ని వీరభద్రం పలకరించాడు.

"ఇదేనా అఘోరించటం? పరీక్షలు బాగా రాసి తగలడితివా?" అయినా శ్రీరామ్ బెదిరిపోలేదు.

చేతిలోవున్న సూట్ కేసు పక్కనపెట్టి, గబగబా తండ్రి దగ్గరకు వెళ్ళి "హాయ్ డాడీ'' అంటూ ఆయన మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గమీద సుతారంగా ముద్దుపెట్టుకున్నాడు.

మరుక్షణంలో అతని చెంప చెళ్ళు మనిపించి, దూరంగా తోసేశాడు వీరభద్రం. తాగి తాగి పైత్యము ప్రకోపించినదా ఏం? అయినా కాలేజీనందు చదివినంత మాత్రాన కారుకూతలు కూయనవసరం లేదు.

మరోసారి 'హాయ్ డాడీ' లూ, 'ఓయ్ మమ్మీ'లూ తమ నోటివెంట వచ్చినచో అట్లకాడ కాల్చి నాలుక మీద వాతలు పెట్టేస్తాను.

పోయి నోరు శుద్ధి చేసుకునిరా'' అన్నాడు కళ్ళెర్ర చేస్తూ...

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)