Rampandu-buddhimantudu

రాంపండు - బుద్ధిమంతుడూ

పల్లిగూడెంలో రాంపండుని చూసి అనంత్ ఉలిక్కిపడ్డాడు.

” ఒరేయ్,ఇక్కడికి ఎప్పుడొచ్చావ్ రా ? నీ జీవితంలోంచి నువ్వు ఎప్పటికీ ఫేడవుట్ కావా ?” అని సూటిగా అడిగేశాడు కూడా.

”గత మూడు నెలలుగా నీ కబురూ, కాకరకాయా తెలియకుండా హాయిగా ఉన్నాను. ఎక్కడో ప్రెవేట్లు చెప్పుకుంటూ బుద్ధిగా ఉన్నావనుకుంటే ఇక్కడే తేలేవేమిటి ? ”అన్నాడు.

రాంపండుకి కోపం వచ్చింది.”

బుద్ధిగా ప్రెవేట్లు చెప్పుకుంటున్నాను కాబట్టే ఇక్కడ తేలేను.” అని దబాయించాడు.

“ ఇక్కడి కెందుకు వచ్చానంటే ఇది మా అత్తయ్యగారి ఊరు కాబట్టి వచ్చాను.మా చిన్నత్తయ్య -ఉష -అదే మేమంతా ఉషారత్తయ్య అంటాం ఆవిడే, తను ఫోను చేసింది వెంటనే రమ్మనమని.అచలపతి వాళ్ళ కజిన్ పెళ్ళికనివెళ్లాడు.ఒంటరిగా అక్కడ ఉండటం మెందుకని అత్తయ్య రమ్మనమంది కదాని ఇందాకనే రెక్కలు కట్టుకుని వాలేను.తీరా చూస్తే అచలపతిని వెంట బెట్టుకు రాలేదేమిట్రా అని మొహం ముడుచుకుంది.లోకం తీరు చూడు.అత్తయ్యలను అస్సలు నమ్మకూడదు.”

“ ఓహో రంగనాథం గారి మిసెస్ ఉష అంటే మీ ఉషారత్తయ్యేనా? మేం ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే గెస్టులుగా ఉంటున్నాం "

“గెస్టులుగానా ? అంటే మా అత్తయ్య ఫ్రెండు పేరిందేవి గారు నీకు తెలుసా ?”

“ వాళ్ళ అబ్బాయికేగా నేనిప్పుడు ట్యూషన్ చెబుతున్నది.ఇక్కడికి ఏభై మైళ్ళ దూరంలో వాళ్ళ ఊరు. స్కూళ్ళకు సెలవులే కదా. పిల్లాణ్ణి తీసుకుని రా అని ఉష గారు అంటే పేరిందేవి గారు, భర్తా పిల్లాడితో బాటూ నన్నూ రమ్మన్నారు, తోడు పెళ్లి కొడుకులా ...” అని రాంపండు ఏది చెప్పబోతుండగానె అనంత్ ఉలిక్కిపడ్డాడు.

“ ఆగాగు. పేరెందేవి గారి కొడుకు.... అంటే బంటీ గాడు.ఇంతప్పన్నించి నాకు తెలుసు. పిల్లాడి వేషంలో ఉన్న బ్రహ్మరాక్షసుడు.బాబోయ్, వాడికి ట్యూషన్ మేష్టరువా నువ్వు.ఎలా బతుకుతున్నావ్ రా ? వాడీపాటికీ నిన్ను నమిలి తినేసి వుండాలే !” జవాబుగా రాంపండు విషాదంగా నవ్వేడు.

“హు..పెద్దలు సంపాదించి పెట్టినది హాయిగా టిని కూచునే వాడివి నీకేం ఎన్నైనా చెబుతావ్. నాకు మాత్రం పొట్ట గడవద్దూ...” అన్న అర్థం ఆ నవ్వులో గోచరించి అనంత్ టాపిక్ మార్చబోయాడు.

“ బజారుకెళ్ళాలిరా. పోయి వచ్చేటప్పటికి లేటవుతుంది.రాత్రి డిన్నర్ టైములో కలుద్దాం లే. నువ్వేక్కడుంటున్నావ్ ? గెస్ట్ హౌస్ లోనా ? నేను మూడో అంతస్తులో రైట్ సైడ్ రూమ్ లో ఉంటున్నాను.వీలు చూసుకుని రా.ఇవాళ వద్దులే.ఇవాళేగా వచ్చాను.అత్తయ్య ఏదో ముఖ్యమైన విషయం చెబుతానంది.” అని వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ***** ఉషారత్తయ్య ముఖ్యమైన విషయం చెప్పబోయే ముందు అనంతానికి నాలుగు అక్షింతలు మళ్ళీ వేసింది, అచలపతిని తీసుకురానందుకు. ఆ తర్వాత పిచ్చాపాటీ మాట్లాడుతున్నట్టు మాట్లాడి అసలు సంగతి దగ్గరకు వద్దామనుకుంది.ఈ లోపునే అనంత్ తొందరపడి ఓ ప్రశ్న అడిగేశాడు.

“ ఇవన్నీ సరే గానీ వల్లభరావు గారు ఎప్పణ్నించి తిష్ఠ వేశాడిక్కడ ?” అని అనంత్ అడగ్గానే ఉషారత్తయ్య " ఆయనతోనే కదరా చిక్కు మొదలయ్యింది "అంటూ నెత్తి కొట్టుకుంది.

“ అయ్యో,ఆయనేం చేశాడు ?పాపం ఇ మూల ప్రశాంతంగా కూచుని తన పనేదో తాను చూసుకునే ముసలాయన "

“....అదిగో ఆ ప్రశాంతంగా కూచోవాలనుకోవడమే ముప్పు తెచ్చి పెట్టింది.” అంటూ అత్తయ్య చెప్పుకొచ్చింది.

వల్లభరావు గారు ఫ్యామిలీ ప్రెండు.ఎనభై యేళ్ళు పైబడ్డాయి.పురాణాల మీద ఏవో పుస్తకాలు రాస్తుంటాడు.ఉషారత్తయ్యా ఇంట్లో ఉంటూ ఆధ్యాత్మిక రామాయణం గురించి ఓ పుస్తకం రాద్దామన్న సదుద్దేశ్యంతో వచ్చాడు.అంటే అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం వెళ్లివిరుస్తోందని కాదు.ఉషారత్తయ్య ఇంట్లో మెయిన్ అట్రాక్షన్ - వాళ్ళ వంటవాడు భీవరావు చేతి నలభీమపాకం, ఏ వయస్సు వారికైనా నోరూరించగలిగే వంటకాలు చేయగల అతని నేర్పు. అదే ఎట్రాక్షన్ పేరిందేవిని కూడా పల్లిగూడెం లాక్కొచ్చింది.

ఆవిడతో బాటు బంటీ కూడా వచ్చిపడ్డాడు. పన్నెండేళ్ళ బంటీ అల్లరి గురించి దశాబ్దాలుగా కథలు విన్న వల్లభవరావు ఉలిక్కిపడ్డాడు. ఇప్పటికే ఇంట్లో ఉషారత్తయ్య కొడుకు చంటి,అదే వయసువాడు, ఉన్నాడు. ఇక ఇద్దరూ తోడయ్యే సరికి అహిరావణ, మహిరావణుల్లా అల్లరి చేసి తన బతుకు దుర్భరం చేసేస్తారని భయం వేసిందాయనకు.రాయబోయే పుస్తకం మాట రాముడేరుగు, భీమారావు వంట టిని హాయిగా మధ్యాహ్నం ఓ కునుకు తీసే భాగ్యం కూడా కరువవుతుందనిపించింది. అందువల్ల తన తెలివితేటలుపయోగించి, ఓ ఐడియా వేశాడు.ఓ రోజు కుర్రాల్లిద్దర్ని పిలిచాడు.

“మీలో ఎవరు బుద్ధిమంతులో తేల్చుకోవడానికి ఓ పోటీ పెడుతున్నాను.మంచి పనులు చేస్తే మార్కులు వేస్తాను.తుంటరి పనులు చేస్తే మైనస్ మార్కులు! తెలిసిందా ! అలా నేను వెళ్ళే టైముకి ఎవరికీ ఎక్కువ మార్కులు వస్తే వాళ్లకు వెయ్యి రూపాయలు ఇస్తాను. సరేనా ?”అని ఆశ పెట్టాడు.

ఇక అక్కణ్ణుంచి కుర్రాళ్లిద్దరూ తెగబుద్ధిగా ఉండడం మొదలు పెట్టారు. కథ వింటున్న అనంత్ తన సంతోషం బాహాటంగా ప్రకటించాడు

.” అమ్మయ్య! ఇంగ్లీష్ వాళ్ళ హయాంలో పని చేసిన వల్లభరావు గారి తెలివి తేటలు అమోఘం. అనకూడదు గానీ అత్తయ్యా,భీమారావు వంటకాల మీద ఆశతో నువ్వు పిలవగానే వచ్చేశాను కానీ,మన చంటిగాడి అల్లరి తలచుకుంటే మాత్రం భయం వేసింది.”

“ మా చంటిగాడు గౌతమబుద్ధుడని నేను చెప్పటం లేదు.ఉయ్యాల రోజుల నుండీ వాడు నా ప్రాణం తీయని రోజు లేదు.కానీ బంటీ గాడి సంగతి కూడా నీకు తెలుసు కదా, అల్లరిలోవాణ్ణి మించిన వాడు మన వాళ్ళలో ఎవడూ లేడు కదా....”

“...ముమ్మాటికీ లేడు.వాడితో పోలిస్తే చంటిగాడు పరమసాధువు,గంగిపోవు .”

“ ఔనా, మరి చంటిగాడు మీద పందెం కాయడంలో తప్పేమిటి చెప్పు...” అనంతం ఉలిక్కిపడ్డాడు.

“ పందెమా ? ఏ విషయంలో ? ఎవరితో ? ఎంత...?” ఉషారత్తయ్య కొంత మొహం వేలాడేసుకునే చెప్పింది.

" అసలేం జరిగిందంటే...వల్లభరావు ఇలా పోటీ పెట్టిన విషయం వినగానే పేరిందేవికి హుషారు పుట్టింది.'ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో పందెం వేద్దామా ?'అంది.' ఈ పాటిదానికి పందెం ఎందుకు, మీ బంటీ గాడికి అల్లరిలో సాటి వచ్చేదెవరు ? మా చంటిగాడికే ఆ వెయ్యి రూపాయలూనూ'అనేశాను.'మీ అబ్బాయిమీద నీకంత నమ్మకం ఉంటే మా వాడి మీద నాకు డబుల్ నమ్మకం ఉంది.మా వాడే ప్రెయిజ్ కొట్టేస్తాడు చూడు.లేకపోతే మా పనిమనిషి సావాలమ్మను నీ దగ్గర వదిలేసి వెళతాను.'అంది.దాంతో నేనూ ఊరుకోకుండా పందానికి సై అన్నాను " అనంత్ అడ్డువచ్చాడు

.” పనిమనిషికి అంత గిరాకీనా ? ఏదో రాజ్యం ఒడ్డినట్టు పనిమనిషిని పణంగా పెడతారా "?.

“ పనిమనిషి విలువ నీకేం తెలుసు.కుర్రకాకివి.ఏ ఇంటావిడనైనా అడుగు,మొగుడు పారిపోయినా ఫర్వాలేదు గానీ మంచి పనిమనిషి పారిపోతే మాత్రం మళ్ళీ దొరకదని చెబుతుంది.నేను పందానికి సరేననగానే 'అయితే నువ్వు ఓడిపోతే మీ భీమరావును ఇచ్చేయాలి 'అంది.ఆ ఊపులో సరేననేశాను.

“ ఎంత పని చేశావ్ అత్తయ్యా...భీమారావు వెళ్ళిపోయాక ఈ మేడలేందుకు,మిద్దేలేందుకు?నేనైతే అసలు పల్లిగూడెమే రావడం మానేస్తాను "

“ ఒరే నువ్వు వచ్చినా రాకపోయినా నాకేం ఫర్వాలేదు గానీ ఖర్మకాలి నేను భీమరావుని ఓడిపోతే ఊర్నించి వచ్చాల మీ మామయ్య నా పని బడతారు.ఇంట్లోంచి పొమ్మంటారు. అప్పుడు వచ్చి నీ దగ్గరే ఉండాలో ఏమో...ఇటూ చూస్తే బంటీగాడు అల్లరి మానేసి చెడ మంచి పనులు చేసేస్తున్నాడు.ఈ వారమో,పై వారమో వాడి రెండు భుజాల నుండీ దేవదూతలకు మల్లె రెక్కలు మొలుస్తాయేమోనని డౌటుగా ఉంది ".

“...నువ్వు అంత దూరం ఆలోచించనక్కరలేదత్తయ్యా...నాకు బంటీగాడి సంగతి బాగా తెలుసు.వాడి విశ్వరూపం ఒక్కసారి చూపిస్తే చాలు వల్లభరావు దడిసిపోతాడు.మన చంటిగాడిని కాస్త శృతిమించనీయకుండా చూసుకుంటే చాలు"

“ ఏ మాట కామాట చెప్పుకోవాలి.ఓ రెండు నెలలుగా వాడు పాపం అదోలా ఉంటున్నాడు. అల్లరీ అదీ మానేశాడు.ఒంట్లో బాగోలేదేమోనని డౌటొచ్చి టెస్టులు చేయించాను.కోతిపనులు చేయాలన్నఇంట్రస్టే పోయినట్టుంది.కానీ జనాలు వాణ్ని చెదగొడదామని చూస్తుంటే ఎంతకాలం అలా వుంటాడో తెలియదు.”

“ చెడగొడదామని ఎవరు చూస్తారత్తయ్యా ?”అనంత్ ఆశ్చర్యపోయాడు.

ఉషారత్తయ్యా నుదురు కొట్టుకుంది.

" అదే కదరా సమస్య! ఇక్కడ పెద్దకుట్ర జరుగుతోంది. పేరిందేవి,మొగుడు కలిసి చంటిగాణ్ణి రెచ్చగొడుతున్నారు.ఎలాగైనా వాడికి మైనస్ మార్కులు వేయించాలని వాళ్ళ తాపత్రయం.వాళ్ళకుయుక్తులు ఎదుర్కోవాలంటే అచలపతి ఉండి తీరాలి.నువ్వేమో అతను లేకుండా దిగడ్డావ్ ...”

“ఆవేశపడకు.సంగతి సరిగ్గా చెప్పు " అత్తయ్య కోపం తన మీద మళ్లకుండా అనంత్ జాగ్రత్తపడుతూ టాపిక్ మార్చబోయాడు.

“అవునురా...వాళ్లకి సహాయంగా బంటూగాడి కొత్త ట్యూషన్ టీచర్ ఉన్నాడు.దుర్మార్గుడు.నా ఇంట్లో పడి తింటూ, మా అబ్బాయికి వెధవ బుద్ధులు నేర్పుతున్నాడు.వల్లభరావు గది గవాక్షం ఎక్కి అక్కణ్నుంచి 'బోయ్ 'అనమని చంటికి నేర్పి పెడుతున్నాడు.”

“ రాంపండు గాడు అంతకు తెగించాడా?ఇంతకీ మనవాడు ఏమన్నాడు ? బోయ్ అన్నాడా ?మరోటి అన్నాడా ?”. ఉషారత్తయ్యలో తల్లి గర్వం మేల్కొంది.

“ఛ, ఛ...వాడు బొయ్ అనలేదు.కుయ్ అనలేదు.అతన్ని అదోలా చూసి వదిలేశాడు.కానీ నేను మాత్రం వదిలిపెడతానా ?దెబ్బకుదెబ్బ !బంటూగాడి చేత ఎలాగైనా అల్లరి చేయించి భీమారావు ఈ గడప దాటకుండా చూస్తాను.” మంగమ్మశపథం చేసింది ఉషారత్తయ్య.

“ అత్తయ్యా,ఈ పోరాటంలో నీకు తోడుగా నీ మేనల్లుడు అనంత్ ఉన్నాడు.గెలుపు మనదే !అచలపతి లేకపోయినా ఫర్వాలేదు. ముందుగా నేను పోటీ రూల్సు తెలుసుకోవాలి.ఇప్పుడు పోటీదారులు వల్లభరావుని బాధపడితేనే మైనస్ మార్కులా ?నా బోటి వాణ్ని ఏడిపిస్తే...? అత్తయ్య కళ్ళు మెరిసాయి

.” ఒరేయ్,నీకేదో ఐడియా వస్తున్నట్టుందిరోయ్,ఆ రూల్సేమిటో ఆయన్నే అడిగి కనుక్కో.దాన్ని బట్టి స్ట్రేటజీ వర్కవుట్ చేద్దాం ". అంది.

*****

ఇంకాస్సేపటికి అనంత్ వల్లభరావు గదిలో ఉన్నాడు.కుశల ప్రశ్నలయ్యాక,అనంత్ వల్లభరావును రూల్సు గురించి అడిగాడు.

“నీ దాకా వచ్చిందీ...?” అంటూ వల్లభరావు చెప్పుకొచ్చాడు.

” రోజూ పొద్దున్నే ఇద్దరికీ ఇరవయ్యేసి మార్కులు ఇస్తానన్నమాట.పొద్దున్నే నా బెడ్ రూమ్ దగ్గర గట్టిగా అరిచారనుకో,మూడు మార్కులు కట్.విజిల్ వేసుకుంటూ తిరిగితే రెండు.రొజూ రాత్రి పడుక్కునే టైముకు లెక్కేసి చూస్తానన్నమాట.ఈ సిస్టమ్ వల్ల డబ్బుపోతే పోయింది కానీ ప్రాణానికి హాయిగా ఉంది.కుర్రాల్లిద్దరికీ ఒక్క మైనస్ మార్కు కూడా పడలేదు.”

“ మీరెంత సేపూ మీ గురించే ఆలోచిస్తున్నారు.సపోజింగ్ నా బోటివాడి మీద ఈ కుర్రాళ్ళలో ఎవరైనా ఓ కప్ప పట్టుకొచ్చి పడేశారనుకోండి,లేదా నా పరుపు మీద నీళ్ళు పోసి తడిపేశారనుకోండి.అప్పుడేం చేస్తారు.”? వల్లభరావుకి తలలో బల్బు వెలిగినట్టయింది.

“ఇది నేను ఊహించలేదు.నిజమే,అలాటి పరిస్థితుల్లో తప్పకుండా శిక్షాంచాల్సిందే !అప్పుడు పది మార్కులు తీసేస్తారు."

“కప్ప బతికున్న కప్ప మనిషి మీద పడేస్తే కేవలం పదిమార్కులేనా?"

“ పోనీ పదిహేను.పదిహేను మార్కులు కట్.”

“ ఇరవై అయితే చక్కగా రౌండ్ ఫిగరనుకుంటాను "

“నిజమే.ప్రాక్టికల్ జోక్స్ అంటే నాకు మహా అసహ్యం.ఇరవై మార్కులు తీసేయాల్సిందే !మీకు గానీ,వేరెవరికీ గానీ అటువంటి అనుభవం ఎదురయితే తప్పకుండా నా దృష్టికి తీసుకోస్తావు కదూ !”

“ పరిగెట్టుకుంటూ వచ్చి చెబుతా "అన్నాడు అనంత్ హుషారుగా.

*****

అక్కణ్నుంచి అనంత్ సరాసరి వెళ్ళింది బంటూ దగ్గరికే.అదృష్టవశాత్తు రాంపండు దగ్గర్లో లేడు.

“ ఏరా బంటూ,రోజురోజుకీ మరీ ఊరిపోతున్నావ్,ఊరపందిలా. కాస్త తిండి తగ్గించరా బాబూ " అన్నాడు రెచ్చగొట్టే సెషన్ ప్రారంభిస్తూ.

ఈ పాటి దానికి బంటూగాడు బండబూతులు వినిపించేవాడు.రోజు బాగుండకపోతే ఓ కంకర్రాయి విసిరేవాడు.కానీ అది గతం.ఇప్పుడు మాత్రం ఒక స్వాములార్లా చిన్న చిరునవ్వు చిందించాడు.

“ ఈ మధ్య బాగా ఒళ్ళు చేశాను అంకుల్.ఎక్సర్ సైజు చేస్తే మంచిదనుకుంటాను.కూచో అంకుల్.ఆగా అలిసిపోయి వచ్చినట్టున్నారు.మంచినీళ్ళు తెమ్మంటారా ?” దెబ్బకి అనంత్ మంచినీళ్ళు అడక్కుండానే మూర్చపోయాడు.

లేచి తనకు తెలిసిన ట్రిక్కులన్నీ ఉపయోగించి ఆ కుర్రాణ్ణి కవ్వించాడు.కానీ బంటూ తన స్వాములారి అవతారం చాలించలేదు.ఇక లాభం లేదనుకుని అనంత్ చంటి దగ్గరికి వెళ్లాడు.వాడు అనంత్ ను చూసి మర్యాదలేమీ చేయలేదు.కానీ తన మామూలు కోతివేషాలు కూడా వేయలేదు.ఓ పత్రిక ముఖచిత్రం మీద వేసిన గజాలా బొమ్మను చూస్తూ కూచున్నాడు.గజాలా మాతృభాష ఏమిటనీ,అది నేర్చుకోవడానికి ఎంతకాలం పడుతుందనీ మాత్రం అడిగి ఊరుకున్నాడు.

రాంపండు ఎంత రెచ్చగొట్టినా ఇలాటి కాండిడేట్ మైనస్ మార్కులు తెచ్చుకునే ప్రమాదం ఎంతమాత్రం లేదన్న తృప్తితో అనంత్ లేచి వచ్చేశాడు.అదే ముక్క రాంపండుకి చెప్పాడు.అతను చాలా బాధపడ్డాడు.

“ ఈ పందెంలో గెలిపిస్తే నా జీతం రెట్టింపు చేస్తానందిరా పేరిందేవి గారు.నాకు డబ్బు చాలా అవసరం.అవతల రేసుల సీజను స్టార్టయిపోతోంది "అని ఇదయిపోయాడు.

రెండు రోజుల తర్వాత వల్లభరావు అనంత్ ని పిలిపించాడు.

“ ఈ బుద్ధిమంతుల పోటీ గురించి నువ్వు చాలా ఇంట్రస్టు తీసుకుంటున్నావని నీకో విషయం చెబుదామని పిలిచాను.నువ్వు అవాళ అన్న తర్వాత ఆలోచించాను.నాకే కాదు వేరెవరికీ ఉపకారం చేసినా మార్కులు వేయాలనీ,అపకారం చేస్తే తీసేయాలనీ నిర్ణయించుకున్నాను. ఇవాళ పొద్దున్నే ఓ గమ్మత్తు జరిగింది.బంటూ లేడూ,పొద్దున్నే రైల్వే స్టేషన్ నుండి నడిచివస్తూ కనబడ్డాడు.

ఎందుకు వెళ్ళావన్నాను.నిన్న సాయంత్రం నువ్వేదో పత్రిక కోసం వెతుకుతున్నావనీ,అది రైల్వే స్టాల్ లో మాత్రమే దొరుకుతుందని అన్నావుట.నీకా పత్రిక అంటే చాలా ఇష్టమని,తెచ్చి ఇస్తే సంతోషిస్తావనీ రాంపండు సలహా ఇచ్చాడట.ఆ మాట పట్టుకుని...నీకోసం...మూడు మైళ్ళు దూరాన ఉన్న స్టేషన్ కి పొద్దున్నే సైకిల్ పంచరయిందని కాలి నడకన వెళ్లి వచ్చాడంటే, వాటే వండ్రపుల్ బాయ్ హీ ఈజ్ !అందుకే పదిహేను బోనస్ మార్కులు ఇచ్చాను.ఇతరుల పట్ల ప్రవర్తించిన తీరుని కూడా లెక్కలోకి తీసుకోవాలన్న ఐడియా ఇచ్చినందుకు నీ థ్యాంక్స్ !” అనంత్ గొంతు పోడారిపోయింది.

“పదిహేను మార్కులా ?” అని దాదాపు అరిచాడు. వల్లభరావు మరోలా అర్థం చేసుకున్నాడు

“ ఓ, నీకు రౌండింగ్ ఆఫ్ సెంట్ మెంటోకటి కదూ, ఓకే !ఇరవై మార్కులు. "

*****

విషయం విని అత్తయ్య మండిపడింది.నీ బోడి ఐడియా వల్లనే నేను పందెం ఓడిపోయే స్థితికి వచ్చానంది.తక్షణం,ఎక్కడున్నా సరే.అచలపతిని రప్పించమంది. లేకపోతే భీమారావు వంటకాలు పెట్టనంది. మర్నాటికల్లా అచలపతి సిద్ధం.విషయం వినగానే ఓ ఐడియా చెప్పాడు.

“ సర్,మీ బంధువర్గంలో ఓ ఉంగరాల దుబ్బు జుట్టు అబ్బాయి...పదేళ్ళ కుర్రాడు...అతని పేరు అబ్బీసో ఏదో ఉండాలి.అతన్ని ఇక్కడకు రప్పించగలరా?” " మధ్యలో వాడెందుకయ్యా ? ”

“ సర్, అలాటి జుట్టు ఉన్న కుర్రాడు అందునా తన కంటే వయసులో రెండేళ్లు తక్కువ ఉన్నవాడు కళ్ళ ఎదురుగా ఉంటే రెసిస్ట్ చేసుకోవడం చాలా కష్టం.గుప్పిట్లో ఆ జుట్టు పట్టుకుని తలకాయ అటూ ఇటూ ఊపుతూ పోట్లాడాలని ఎవడికైనా ముఖ్యంగా బంటూ లాటి పన్నెండేళ్ళ కుర్రాడికి తప్పకుండా అనిపిస్తుంది.మైనస్ మార్కులు పడక తప్పవు.”

“ అచలపతీ,నీ ఐడియా బాగానె ఉంది కానీనువ్వో మాట మర్చిపోతున్నావ్.ఇక్కడ పన్నెండేళ్ళ అల్లరి కుర్రాడు బంటూ ఒకడే కాదు.చంటి కూడా ఉన్నాడు.అదే టెంప్టేషన్ చంటికి కూడా కలిగితే ?”

“ సరే,చంటితో ఆ ప్రమాదం లేదు.అతను ప్రస్తుతం ప్రేమలో ఉన్నాడు.లోకంలో ఎవరినీ పట్టించుకునే స్థితిలో లేడు.అబ్బీసు మరి గుప్పెడు జుట్టు పెంచుకుని వచ్చినా వేలయినా వేయడు.తన ఊహాలోకంలోనే విహరిస్తూ వుంటాడు. అనంత్ ఉలిక్కిపడ్డాడు.

“ప్రేమలో పడ్డాడా? ఎవరితో...?”

“సినిమా నటి గజాలాతో సర్ " అనంత్ పెల్లున నవ్వాడు.

“చంపేవ్ కదయ్యా !పన్నెండేళ్ళ కుర్రాడికి ప్రేమేట్రామిట్రా అని నేను హడిలిపోతూ ఉంటే....?”

“సర్...ఆ ఎడోలసెంట్ వయసులో అటువంటి ఇంఫాట్యుయేషన్ చాలా బలంగా ఉంటుంది. దాన్నిమీరు కొట్టిపారేయడానికి వీల్లేదు.” అబ్బీసు వాళ్ళమ్మతో మాట్లాడి తక్షణం రప్పించడానికి అత్తయ్య ఒప్పుకుంది.

మర్నాటికల్లా వాడు వచ్చేశాడు కూడా.ఆ కుర్రాడిని చూస్తూనే బంటూ చేతులు దురదపెట్టినట్టు రుద్దుకోవడం అనంత్ దృష్టిని దాటిపోలేదు.అంతే కాదు.డేగ కళ్ళేసుకుని అబ్బీసు జుట్టు కేసి చూడడం కూడా! కానీ బంటూ నిబ్బరించుకున్నాడు.వాళ్ళిద్దరూ ఏదో ఒక రోజున ఇసకలో పడి కుమ్ముకుంటారని ఎదురుచూస్తుండగానే వల్లభరావు మళ్ళీ పిలిచాడు.

ఆ రోజు అబ్బీసు కాల్లో ముల్లు గుచ్చుకుంటే బంటూ గాడు బాలరూప బ్రహ్మరాక్షసుడయిన బంటూ గాడు, వాణ్ణి భుజాన ఉప్పు మూటలా వేసుకొని కిలో మీటరు దూరం నడుచుకుని వచ్చాడట. అదీ మండుటెండలో- అందుకు మురిసిపోయిన వల్లభరావు ఇంకో ఇరవయి మార్కులు బోనస్ గా కలిపేడు.ఇవతల చంటిని చూస్తే గజాలా తపస్సులోంచి బయటకు వచ్చే సూచనలు కనబడటం లేదు.మైనస్ మార్కులు లేవు గానీ బోనస్ మార్కులూ లేవు.

లంచ్ టైములో "నీకు పందెం ఓడిపోక తప్పని పరిస్థితి వచ్చిందిరా అనంతూ.పాపం బంటూ నేను చెప్పిన మాటవిని,బోల్డు బోల్డు మంచిపనులు చేస్తున్నాడూ సుమా !”అన్నాడు రాంపండు విలన్ లా నవ్వుతూ.

రూముకి వస్తూనే అనంత్ హడావుడిగా ఆచలపతిని పిలిచాడు.

“త్వరగా బట్టలు సద్దేయ్.మనం గుడారం లేపెద్దాం.వెధవ వెయ్యి రూపాయల గురించి కక్కుర్తిపడి ఈ నాటీ కుర్రకారు ఇంతలా దిగజారి పోతుందని నేనెప్పుడూ అనుకోలేదు.మరీ ఇంత బుద్దిమంతుడితనమా ? ఛ...ఛ...” అచలపతి అడ్డు వచ్చాడు.

“సర్,డబ్బు గురించే ఈ కుర్రాళ్ళు ఇలా మారిపోయారని అనుకోవడం చాలా అసమంజసంగా ఉంది.” అంటూ. “కాకపొతే ఇంకేమిటయ్యా,అల్లరి చేయడం కూడా మర్చిపోయిన ఈ యూజ్ లెస్ కుర్రాళ్ళ గోల మనకొద్దు.ఈ బోనస్ మార్కుల ఐడియా వల్లభరావుకి కలిగించినందుకు అత్తయ్య నన్ను క్షమించదు.భీమారావు వంటకీ.అత్తయ్యకీ ఋణం తీరిపోయింది మనమేమి చేస్తాం ?పద ... పద " అచలపతి ఖంగారు పడలేదు.

“సర్,పరిస్థితి గంభీరంగా ఉందన్నమాట నిజమే కానీ,నాకు చీకట్లో ఒ ఆశారేఖ కనబడుతోంది. నిన్న బంటూ కాగితాలు తనిఖీ చేశాను.ఎక్కడ చూసినా ఆర్తీ ఆర్తీ అని రాసి ఉంది.కొన్ని ప్రేమలేఖలు సగం సగం రాసి కనబడ్డాయి.ఆ ఆర్తీ క్లాసుమేటు అయివుండదని, సినీ నటి ఆర్తీ అగర్వాలే అయివుంటుందనీ నాకో చిన్న అనుమానం.అతని కళ్ళల్లో మెరుపులు కనిపెట్టాను.రేపే ఒ ప్రయత్నం చేసి చూస్తాను " అన్నాడు.

మర్నాడు మధ్యాహ్నం లాన్ లో పడక్కుర్చీలో పడుక్కుని వల్లభరావు భోజనానంతరం తీసే కునుకు తీస్తూ ఉండగా గాలిలోంచి ఓ చావుకేక వినబడింది.అనంత్,అచలపతీ,ఉషారత్తయ్య లతో బాటు నిద్రలోంచి మేలుకున్న వల్లభరావు కూడా ఉలిక్కిపడ్డాడు.

ఆ చావుకేక వినబడిన కొన్ని సెకన్లలోనే కాబోయే మృతుడు అబ్బీసు,కాబోయే హంతకుడు బంటూ కూడా దృశ్యం లోకి వచ్చారు.అబ్బీసు శరవేగంగా పరిగెడుతున్నాడు.అతనితో ఇంచుమించు సమానవేగంతో చేతులో పేడనీళ్ళ బకెట్టు ఉన్నా కూడా బంటూ పరిగెట్టుకు వచ్చాడు.విసిరితే అందే దూరంలోకి వచ్చేసరికి,అబ్బీసుకి ఏం తోచిందో ఏమో,గయుడు అర్జునుణ్ణి శరణు చొచ్చినట్టు వల్లభరావు పడక్కుర్చీ కింద నక్కాడు.

అప్పటికే బంటూ బకెట్ లోంచి పేడనీళ్ళు వర్షించాయి.వాటిలో అబ్బీసు తడిసింది తక్కువే. ఎక్కువ నానింది వల్లభరావే.!

*****

ఆ సాయంత్రం రాంపండు తిట్ల వర్షం,అత్తయ్య ప్రశంసా వాక్యాల జల్లులో తడిశాక అనంత్ అచలపతిని పిలిచాడు.

“ఆచలపతీ,బంటూగాడికి అబ్బీసు మీద అంత కోపం ఎందుకు వచ్చిందో కనుకున్నావా ?”

“కనుక్కోవలసిన అవసరం లేదు సర్.నేను అనుకున్నదే జరిగింది.అంటే బంటూ చేతికి పేడనీళ్ళ బకెట్టే అందుబాటులో ఉంటుందని అనుకోలేదనుకోండి.కానీ కనీసం ఎ ఇటికరాయైనా ఉండకపోతుందాని ఆశించాను"

“మై గాడ్ !దీనిలో నీ హస్తం ఉందా ?అంతా దానంతట అదే జరిగిందనుకున్నానే !ఇంతకీ అబ్బీసుగాన్ని ఎలా రెచ్చగొట్టావ్ ? ”

“ ఇందులో నేను పెద్దగా చేసిందేమీ లేదు సర్. పొద్దున్నే అబ్బీసును సినిమాల గురించి కదలేశాను.దూరదర్శన్ సినిమాలు ఎక్కువ చూస్తాట్ట.మాటల్లో చెప్పాడు.

“ఈనాడు వచ్చే తారలందరూ కన్నాంబ ముందు దిష్టి తీయడానికి కూడా పనికి రారని అన్నాడు.బంటూది కూడా అదే అభిప్రాయం.వెళ్లి చెప్పిరా.సాటి కన్నాంబ అభిమానిని మోసుకొచ్చినందుకు సంతోషిస్తాడు అని చెప్పాను.కుర్రాళ్ళ మధ్య మాటా మాటా పెరిగి ఉంటుంది.

అబ్బీసు ఆర్తీ ముక్కు గురించో,మూతి గురించో ఏదో అని వుంటాడు.బంటూ నిజరూపంలో సాక్షాత్కరించాడు ".

“ పాపం రాంపండు.పులి తన చారలను ఎప్పటికీ మార్చుకోలేదని తెలియక ఆశలు పెట్టుకున్నాడు " అంటూ నిట్టూర్చాడు అనంత్.

-ఎమ్బీయస్ ప్రసాద్

(పి.జి.ఉడ్ హవుస్ రాసిన 'ది లవ్ దట్ ప్యూరిపైస్ ' కథ ఆధారంగా )