Prativadu panditudena

ప్రతివాడు పండితుడేనా !

-కన్నోజు లక్ష్మీకాంతం

“ఉత్తరం కన్నా దక్షిణం ఎత్తుగా లేనట్టుందిగదండీ !తూర్పున యింకాస్త ఖాళీ వదిలేస్తే బావుండేది.ఈ నల్లా గుండును అటు వైపు ఈశాన్యం దిక్కుకు మార్చే ప్రయత్నం చేయోద్డా !” రిటైర్మెంటు రోజు మిత్రుల్ని యింటికి పిలిచి డిన్నర్ ఏర్పాటు చేస్తే తిని,తాగింతర్వాత తీరుబడిగా వాస్తు చెప్పాడు శంకరయ్య.

ఈ మధ్య శంకరయ్యకు వాస్తు పిచ్చి ఎక్కువై ఇల్లు పీకి పందిరేసుకున్నప్పటినుండే,తను వెళ్ళిన ప్రతి యింటిని తనకు తోచినట్టు నిశితంగా చూసి,తెలిసి తెలియని వాస్తు చెప్పడం మొదలుపెట్టి ఆ యింటి వాళ్లకు పిచ్చిలేపుతున్నాడు.

క్యాలెండర్ల వెనక ప్రచురించే ప్రచురించే వాస్తు సూత్రాలు చదువుతూ,అందరికీ ఉచిత సలహాలివ్వడం మొదలుపెట్టి ఆ తర్వాత ఊదరగొట్టీ కొట్టి వాళ్ళను జుట్టు పీక్కునేలా చేస్తున్నాడు.

దిక్కులు కూడా సరిగా తెలియని, దిక్కుమాలిన ప్రతి వెధవా...దిక్కుల గురించి చెప్పుకుంటు పొతే విన్నావో...దిక్కులేని వాడవవుతావనే కవిత చదివినప్పటి నుండీ వాస్తు చెప్పేవాళ్ళా మీద నమ్మకం పోయినా, శంకరయ్య వూదిన శంఖం చంద్రమౌళి చెవుల్లో యింకా మోగుతూనే వుంది. తను పట్టించుకోవడం లేదుగానీ...యీ యింటికి ఓనరంతర్వాత ఆర్ధిక పరమైన యిబ్బందులు చాలానే వుంటున్నాయి.

ఇప్పుడు శంకరయ్య చెప్పిన వాస్తు మార్పులు చేపిస్తే కొంత నయమవుతుందన్న మిత్రుల సలహాతో,భార్యామణి వద్దన్నా వినకుండా పని మొదలుపెట్టించాడు.గానీ అది ఓ పట్టానా తెమలడం లెదు.పాత గోడలు కాబట్టి పని పెరిగిపోతోంది.మెటీరియల్ తో పాటు మేస్త్రీ చార్జీలు కలిసి తడిసిమోపుడైంది.

రిటైర్మెంట్ డబ్బుల చెక్ పూర్తిగా అందనేలేదు.శంకరయ్య దగ్గరే మిత్తికి తెచ్చి పని జరుపుతున్నా ఎందుకో పని సాగుతున్నట్టునిపించలేదు.నల్లా గుండును పూడ్చేసి ఈశాన్యం వైపు లైన్ కలవడానికి నానా యాతన పడాల్సి వచ్చింది.

తూర్పు వైపు ఖాతి స్థలం పెంచడానికంటూ గోడలు తీసేసరికి మున్సిపల్ వాడొచ్చి పర్మిషన్ అంటూ సతాయించి, మామూలు తీసుకుని వెళ్లేసరికి తల ప్రాణం కాలిబొటనవేలి దగ్గరికొచ్చింది.

సంక్రాంతికి తప్పకుండా మావూరెళ్ళాలంటూ తన దగ్గర పనిచేసే పిల్లల్ని తీసుకుని ఏలూరు వెళ్ళిన మేస్త్రి పదిహేను రోజులైనా యింకా రాలేదు. గోడలు లేని యింట్లో సామాను జాగ్రత్త చేయడం చాలా కష్టమై పోవడంతో లేని తలనొప్పి పెట్టుకున్నట్టయి పిచ్చివాడిలా మారిపోయాడు చంద్రమౌళి.ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలేమాలోచిస్తున్నాడో గూడా అర్థంకాక అనవసరంగా పిల్లలమీదా,భార్య మీద ప్రతిదానికీ విసుక్కుంటున్నాడు.

'ఈ వాస్తు జోలికి పోవద్దండీ...అంటే విన్లేదుగా' అని అన్నందుకు భార్యని కొట్టినంత పంజేశాడో రోజునా! వాస్తన్నా,జాతకాలాన్నా ఏ మాత్రం యింట్రస్టు చూపని మౌళి...యిలాఇంట్రెస్ట్ కు డబ్బులు తెస్తూ యింటి పని చేయిస్తున్నాడంటే ఎంతకూ అర్థంగాలేదు మిత్రులకు. ఏజ్ రివిజన్ కాకముందే రిటైరన చంద్రమౌళికి ఆఫీసు నుండి డబ్బులు చాలా తక్కువవే వచ్చాయి.అవి రాకముందు ఎన్నో ప్లాన్ లు వేసుకున్నాడు.ఏదో చేయాలనుకున్నాడు.కానీ అన్నీ వాస్తు రిపేరింగ్ లో ఖర్చయిపోయినా ఎక్కడిగొంగళి అక్కడే వున్నట్టునిపిస్తోంది.

"ఇంక రిపేరు చేయడం వేస్ట్ "అన్నాడు రాములు.

"ఇలాగే ఎవరికైనా అమ్మేసి వేరేచోటు చిన్నది కొనుక్కొ !” అన్నాడు రామక్రిష్ణ.

“అయిందేదో అయింది.అవసరానికి వచ్చేంత వరకు పని పూర్తీ చేయించు "అన్నాడు నరేంద్ర.

“శంకరయ్య నీకేం తెలుసనని వాడు చెప్పినట్టు చేశావు "అంటూ సోమిరెడ్డి అన్నప్పుడు నిజమేననిపించింది.

తెలిసి తెలియని వాస్తు పరిజ్ఞానంతో భయాన్ని కల్గించి, వాళ్ళకే వడ్డీకి డబ్బులిచ్చి పని చేయించుకోమని చెప్పడం శంకరయ్యకు వ్యాపారమైంది.

తనిల్లు పూర్తిగానట్టే,మిగతా వాళ్ళు కూడా మొండి గోడల యిళ్ళల్లో వుండడం శాడిస్టు శంకరయ్యకు బాగానే అనిపిస్తున్నా యిప్పుడందరికీ అతడు కనిపిస్తేనే కంపరమేస్తోంది. ఇప్పుడు చంద్రమౌళి ఇంటి పరిస్థితి అర్థంకాని ప్రాజేక్టులా అయోమయ స్థితిలో పడిపోయింది.