Rampandu - Shunaka Danamu

 రాంపండు - శునక దానమూ

    అనంత్ కు అత్తయ్యలంటే ఏ నాడూ ప్రేమ లేదు. మాంకాళి అత్తయ్య అంటే మరీ లేదు. ఆవిడ కూడా మేనల్లుడి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం ఎన్నడూ చేయలేదనడానికి తాజా ఉదాహరణ - తన ఆల్సేషియన్ డాగ్ జాకీని అతని సంరక్షణలో వదలడమే. అప్పటికీ అనంత్ చెప్పిచూశాడు. - “కుక్కలకి కొత్తా - పాతా ఉంటాయి. నేనంటే దానికి కాస్త పరిచయముండేది కానీ మా ఇంటికి వచ్చే వాళ్ళతో తల ఊపే పరిచయం కూడా లేదు. మీదపడి రక్కి వదిలి పెట్టవచ్చు. నీతో పాటు దాన్ని తీర్థ యాత్రలకు వెంటబెట్టుకు వెళ్ళు. వచ్చే జన్మలోనైనా మనిషి జన్మ వస్తుందేమో.” అని.

అత్తయ్య వినలేదు. తన జాకీకి కొత్తా పాతా లేదంది. నిజంగానే అనంత్ కి, దానికి చాలా వాటిల్లో సర్దుబాటు కుదిరింది - పొద్దున్నే లేవడం విషయంలో తప్ప, అది తెల్లవారు ఝామున ( అనంత్ దృష్టిలో) పది గంటలకే లేచి, తలుపు గీరి, గీరి అనంత్ ను నిద్రలేపి, అతని మంచం మీదకు ఉరికి, మొహం అంతా నాకి, అతని ఒళ్లో నిద్రపోయేది.

మళ్లీ నిద్రపోయేకాడికి పది గంటలకు నిద్రాభంగం చేయడమెందుకని అనంత్ ఫిర్యాదు. కానీ వినే వాళ్లెవరు ? తీర్థ యాత్రల నుండి తిరిగి వచ్చి మాంకాళి అత్తయ్య ఎప్పుడు తీసుకుపోతుందాని రోజులు లెక్క పెట్టుకుంటూండగానే రాంపండు రంగ ప్రవేశం చేసాడు.

సుమనోహరి పై అనంత్ కు మోజు తీరిపోయినా రాంపండుకి తీరనట్టే ఉంది. ఐసుదిండు ఐడియా వల్ల నష్టపోయింది అనంత్ కానీ రాంపండు కాదుగా ! ఎంత తుంటరి బుద్ధులున్నా, సుమనోహరి , గొప్ప కవయిత్రి అని, ఆమె కవితా పుస్తకానికి అంతర్జాతీయ ఖ్యాతి రావలసిందేనని - అదీ తన ద్వారా - అతని ప్రగాఢ నమ్మిక . అందుకే పబ్లిషరు పరంధామ్ ని విందుకు పిలిచాడు. రాంపండు విందుకు పిలిచాడు అంటే ఆ భారం అనంత్ దేనని వాళ్లని తెలిసున్న వాళ్ళందరికీ తెలుసు. ముఖ్యంగా ఆచలపతికి. అందుకని రాంపండు రాగానే వెనక్కాలే వచ్చి నిలబడ్డాడు. రాంపండు వస్తూనే అనంత్ ను అభినందించాడు.

ఒరేయ్, నీ మంచి మర్యాదలకు జోహార్, ఇలా అడపాదడపా అందరినీ పిలిచి భోజనం పెట్టడం - ఓహో! వచ్చే కాలంలో స్కూలు పిల్లలు శిబిదధీచి పాఠంతో బాటు నీ గురించి పాఠం కూడా చదువుకుంటారనుకో.. ముఖ్యంగా గెస్ క్వశ్చన్ లో ఒకటి నీ పాఠంలో తప్పకుండా ఉండి తీరుతుంది "

అనంత్ విషాదంగా ఓ నవ్వు నవ్వి 'ఇంతకీ ఈసారి నేను ఎవర్ని ఆహ్వానించబోతున్నాను " అని అడిగాడు.

పబ్లిషరు పరంధామ్ ని"

ఆయనతో నీకేం పనిట?”

ఆయన నీ ఫ్రెండు మరియు క్లాసుమేటు రాంపండు ముచ్చట తీర్చబోతున్నాడు"

రాంపండు ముచ్చట ఏమిటట?”

సుమనోహరిని ప్రేమించడం "

ఈ పాటికే అనంత్ సహనం కోల్పోయాడు. ఇది వరకు ఇలాగే ప్రేమ పేరు చెప్పి రాంపండు 'తింటా' అనే అమ్మాయి ముఠాను తోలుకొచ్చాడు. వాళ్ళు తిన్నంత తిని, తిట్టినంత తిట్టి పోయారు.

 

ఒరేయ్, డొంక తిరుగుడు మాన్తావా ? ఆచలపతికి సెలవిచ్చి పంపేయమన్నావా ?” అని అడిగాడు కోపంగా.

ఇందులో తిరుగుడేం లేదురా. సుమనోహరి రాసిన కవిత్వం పుస్తక రూపంలో అచ్చేయడానికి ఆయనకు నచ్చ చెప్పాలి. ఆ పుస్తకం బయట వెలువడి , అమ్ముడుపోతే పరంధామునికి పైసా, రాంపండుకి ప్యార్, సుమనోహరికి పేరు దక్కుతాయ్ ".

సరే, ఏడు అచలపతీ, వీడికేదో లంచ్ కావాలట. ఏర్పాట్లు చూడు " అని పేపరు చూడసాగేడు అనంత్.

కానీ రాంపండు చెప్పినవన్నీ వింటూంటే పేపరు మీద దృష్టి నిలవలేదు. “ఒరేయ్ రాంపండూ, మీ పరంధామానికి ఏదైనా అజీర్తా? పిచ్చా? చిన్న పిల్లాళ్లా ఐటమ్సన్నీ చెప్తావేంట్రా?” అని అడిగాడు ఆశ్చర్యంగా.

ఓహ్, నీకు చెప్పలేదు కదా, పరంధామానికి తోడుగా పదేళ్ల వాళ్ల అబ్బాయి టింకూ వస్తున్నాడు. వాడి మాట అంటే ఆయనకు మహా గురిలే. ఏవరేజీ రీడరుకి వాడికంటే ఎక్కువ స్టాండర్డ్ ఉండదని ఆయన నమ్మకం. వాడు తలకాయ ఊపితేనే ఆయన చెక్కు చింపేది. లేకపోతే మన పరీక్ష ఫెయిల్ ".

అనంత్ బుర్రలో సినిమా హాల్లో ఇంటర్వెల్ లోలా టపటప లైట్లు వెలిగాయి. 'టింకూ అంటే లావుగా, బంతిలా పడుతూ అరుస్తూ, అల్లరి చేస్తుండేవాడేనా ? తండ్రి అంటే ఆ బక్క పలచటి..... చూశాను మహాప్రభో చూశాను. ఓ సారి ఎక్కడో తగిలేరు. ఆ కుర్రాడికున్నంత వాగుడు భువిలో ఎవరికీ ఉండదు. నోటికి ఎంత మాట పడితే అంత అనేస్తాడు.”

“...ఏం నిన్నేమైనా అన్నాడా?" రాంపండు ఉత్సుకతతో అడిగాడు.

అనంత్ సమాధానం ఇవ్వకుండా ఊరుకునేంతటలో అచలపతి టపీమని అందించాడు.

 

సర్ బ్రెయిన్ ను ఉడత పిల్ల బ్రెయిన్ తో పోల్చాడు సర్" అని

రాంపండుకు జిజ్ఞాస పెరిగింది. “దానికంటే ఎక్కువంటాడా ?తక్కువంటాడా?”

అచలపతి జాగ్రత్తగా సమాధానమిచ్చాడు. “ఉడతకే ఎక్కువ మార్కులు పడ్డాయి".

అనంత్ ఓర్పు నశించింది. “ఒరేయ్ అవన్నీ అనవసరం. వాడి నోటికీ హద్దూ పద్దూ లేదు. రేపొచ్చి నా మొహం కుళ్లిన చేప మొహంలా ఉందనవచ్చు.” అనబోతుండగానే అచలపతి ధైర్యం చెప్పబోయేడు-

డైనింగు హాల్లో లైటింగు తగ్గిస్తే పోలిక గుర్తు పట్టలేక పోవచ్చు సర్".

నేనొప్పుకోను, బాటరీ లైటు వేసి చూసైనా పోలికలు పట్టగల సమర్థుడు వాడు. నేను రిస్కు తీసుకోను. వాళ్లు భోజనానికి వచ్చే వేళకి నేను ఇంట్లో ఉండను. నువ్వేమనుకున్నా సరే ఇంట్లోంచి పారిపోతాను. నువ్వే ఏదో ఒకటి సర్ది చెప్పుకో.”

రాంపండు అడ్డు పడ్డాడు. - మీ ఇంట్లో లంచ్ ఏర్పాటు చేసి నువ్వే వెళ్ళిపోతే అసహ్యంగా ఉంటుంది. ఆయనకు కోపం వస్తుందేమో".

నేనిక్కడే ఉండి ఆ కుర్రాడేదైనా వాగితే వాణ్ణి ఒక్క టెంకిజెల్ల పుచ్చుకుంటే కోపంతో బాటు తాపం కూడా వస్తుంది. అది చూసుకో..”

అదీ కరెక్టే గానీ. నువ్వు కవిత్వం వింటూ సరైన చోట్ల ఆహా, ఓహో అనో పరంధామ్ ని ఇంప్రెస్ చేస్తానని సుమనోహరికి చెప్పానే !”

నేను వావాకారాలు చేస్తానో లేదో కానీ ఆ కుర్రాడి చేత మాత్రం హాహాకారాలు చేయిస్తాను. దెబ్బకి సుమనోహరి పుస్తకం అచ్చు కాదు. నీ ప్రేమకు టాటా ".

ఒరే మరీ అంత ఫాస్టుగా రీలు తిప్పేయకురా. కావలిస్తే వెళ్లిపో, నీకు పిచ్చనో, వెర్రనో అమావాస్య పున్నమనో ఏదో చెప్పుకుంటా. నలుగురు మనుష్యులను చూస్తే ఉక్కిరి బిక్కిరయిపోతావని చెప్పుకుంటా ".

అలాగే అనంత్ లంచ్ టైముకి వెళ్ళిపోయాడు. వెళ్తుండగానే పరంధామ్ అతని కొడుకు టాక్సీ దిగడం ఆ కొడుకు అనంత్ ను పలకరించడం, అనంత్ మొహం తిప్పుకు వెళ్ళిపోవడం జరిగింది. హోటల్లో భోజనం చేసి తిరిగొచ్చిన తర్వాత విచారిస్తే తన ఐక్యూ లెవెల్స్ గురించి ఆ కుర్ర కుంక ఏదో అన్నట్టుగా తెలిసింది .

అచలపతి ఆపై ఇకనేమీ చెప్పలేనన్నాడు.

 

ఇంతలోనే రాంపండుకి ఫోన్. “చాలా థాంక్స్ రా అనంతూ, అంతా బ్రహ్మాండంగా జరిగింది. కుర్రకుంక గాడికి

 

పీకలమెయ్యా తిండి కూరేశాడు అచలపతి. దాంతో వాడు గుమ్మయి పోయి నేను సుమనోహరి కవిత్వం పాడి

వినిపించినప్పుడల్లా ఆహా, ఓహో అనడం మొదలెట్టాడు ".

అయితే సుమనోహరి పుస్తకం అచ్చు కావడం, నీ ప్రేమ ఫలించడం ఖాయం అన్నమాట. కంగ్రాట్స్!”

థాంక్స్. కానీ చిన్న విషయం ఒకటుందిరా. నన్ను ఓ ఇంటివాడిగా చూడటానికి నువ్వు ఎ త్యాగానికైనా రెడీ అని ఓ సారి అన్నావు గుర్తుందా ?”

అనంత్ మెదడులో అనుమానం పిశాచంలా మేల్కొంది. “అన్నానేమో. అలాటి అవకతవక వాగుడు చాలా వాగుతాను. ఇంతకీ దాని సంగతి ఇప్పుడెందుకు ?”

విషయం ఏమిటంటే ఆ టింకుగాడు మీ ఇంట్లో జాకీని చూసి ముచ్చట పడ్డాడు. కాదంటే వాడు చిన్నబుచ్చుకోవడం , ఏతావాతా నీ ప్రతిజ్ఞ ఫలించకపోవడం జరుగుతుందని భయపడి..”

భయపడి?”

“...ఆ కుక్కను వాడికి నీ తరఫున బహుమతిగా ఇచ్చేశాను. ఆ కుర్రాడు, వాడి మోహంలో సంతోషం చూసి ఆ పెద్దాడు ఎంత సంతోషించాడో చెప్ప..”

ఓరి చవటా, అది నా కుక్క కాదు. మా అత్తయ్యది. అందునా మాంకాళి అత్తయ్యది. వెళ్లి పట్టుకొచ్చేయ్"

రాంపండుకీ కొన్ని సిద్దాంతాలున్నాయి. “ఓ సారి ఇచ్చినది మళ్లీ వెనక్కి తీసుకోవడం మర్యాద కాదు" అంటూ ఫోన్ పెట్టేశాడు.

అనంత్ ఆచలపతిని పిలిచాడు. మంతనాలు సాగించాడు. ఈ చిక్కుల్లోంచి బయటపడటం ఎలా? అన్నాడు ఆలోచించి, ఆలోచించి అచలపతి ఒక ఐడియా చెప్పాడు.

సర్, భోజనం టైములో మాటల బట్టి పరంధామం గారు, వారి అబ్బాయి మాట్నీకెళ్లి ఉండాలి. పవన్ కళ్యాణ్ సినిమా చూపిస్తే గానీ రాత్రి భోజనం చేయనని ఆ కుర్రాడు ఖరాఖండీగా చెప్పడం మేం విన్నాం సర్. వాళ్లు మేట్నీ నుండి తిరిగొచ్చేందుకు ముందే రాంపండు గారిని హోటల్ రూమ్ కి వచ్చి వెయిట్ చేయమని పరంధామం గారు అనగా విన్నాను సర్ ".

ఎగ్రిమెంటు రాసుకోవడానికి అయి వుంటుందిలే, అయినా దీనికీ, నా కుక్కకీ సంబంధం ఏమిటీ?”

అదే చెప్పబోతున్నాను సర్. ప్రస్తుతం మన జాకీ వాళ్ల హోటల్ రూమ్ లో ఒక్కత్తే ఉంది. రాంపండు గారు ఐదున్నరకు వచ్చి రిసెప్షన్ లో తాళం చెవి తీసుకుని ఆ గదిలో ప్రవేశించి పరంధామం గారి గురించి ఆరు గంటల దాకా వెయిట్ చేస్తుండాలి . రాపండు గారి పధ్ధతి మనకు బాగా తెలుసు. ఆయన అంతసేపు ఓపిగ్గా కూచోలేరు. కాలుగాలిన పిల్లిలా రూములోంచి వరండాలోకి , వరండాలోంచి రూములోకి తిరుగుతూ, వెళ్లి లిఫ్ట్ కి ఎదురుగా నిలబడుతూ..”

అనంత్ ఎగిరి గంతేశాడు. “ఇహ చెప్పకు. నాకు తెలిసి పోయింది. నేను మెట్ల దారిలోంచి ఆ టైములో అక్కడకు వెళ్లి , వాడు అలా వెళ్లగా చూసి కుక్కను వెంట బెట్టుకు వచ్చేయాలి. అంతేనా?”

కరక్టుగా చెప్పారు. జాకీ కూడా మారు మాటాడకుండా, అదే, మారు మొరక్కుండా మీ వెంట వచ్చేస్తుంది ".

సరిగ్గా అచలపతి చెప్పినట్టే జరిగింది. సాయంత్రం ఆరు గంటలకల్లా అనంత్ జాకీతో సహా ఇంటికి తిరిగి వచ్చి అచలపతి చేతికి దాన్ని అప్పగించి "వెళ్లి ఓ గదిలో కట్టేసిరా " అని ఆజ్ఞాపించాడు.

ఆ తరవాత అతను తెచ్చిన కాఫీ తాగుతూ, హాయిగా వెనక్కి వాలి 'ఆచలపతీ, నీ బుర్ర అమోఘమోయ్, నెపోలియన్ నీ దగ్గర కరస్పాండెన్స్ కోర్సు తీసుకుని ఉంటే యుద్ధంలో ఓడిపోయేవాడు కాదు. ఇదిగో ఆ టేబుల్ మీద ఓ వంద రూపాయల నోటుంది . నీకేమైనా పనికొస్తుందంటావా?” అని అడిగాడు.

 

థాంక్ యూ సర్" అని అచలపతి ఆ వందా తీసుకుంటూండగానే అనంత్ హఠాత్తుగా ఉలిక్కిపడ్డాడు.”అవునూ ఈ పబ్లిషరు గాడు తిరిగివచ్చాక కుక్క మాయమయిన సంగతి గుర్తిస్తాడు కదూ. ఆ సమయానికి రాంపండు

అక్కడుండటంతో జాకీ అంతర్థానానికీ, వాడికీ లింకుందని అనుమానిస్తాడు. రాంపండు మీద కోపం, సుమనోహరి పుస్తకం వేయననడం , ఆమెకు రాంపండు పై అలక, ఎంగేజ్ మెంట్ బ్రేక్, పశ్చాత్తాప హృదయంతో సుమనోహరి నన్ను పెళ్లి చేసుకుంటాననడం , అమ్మ బాబోయ్ ! అటు తిరిగి, ఇటు తిరిగి ఇది నా మెడకు చుట్టుకొనేట్టుందే ! ఇదేమిటీ ఆచలపతీ, ఇలా చేశావ్? నెపోలియన్ కి కరస్పాండెన్స్ కోర్సు పంపక. అడిగినా కుదరదని చెప్పేయ్..” ఆచలపతీ సమాధానం చెప్పేటంతలో డోరు బెల్లు మోగింది.

ఎవరు? నెపోలియనా? కరస్పాండెన్స్ కోర్సు ఇవ్వనన్నావని డైరెక్టుగా ట్యూషన్ కి వచ్చేశాడా ? ఖంగారులో అనంత్ ఏదేదో వాగేస్తున్నాడు.

ఆచలపతి వెళ్లి కిటికీలోంచి చూసి వచ్చి "పరంధామం గారండి... కోపంగా ఉన్నట్లు కనబడుతోంది " అన్నాడు అతిశాంతంగా.

అనంత్ సోఫాలోంచి ఎగిరి వెనక్కి దూకాడు. ఆచలపతి తలుపు తీయగానే పరంధామ్ దూసుకువచ్చాడు. “ఎక్కడయ్యా? ఈ అనంత్ పెద్దమనిషి?” అని అరిచాడు.

ఎక్కడంటే ఏం చెప్పగలం సర్? ఎక్కడైనా ఉండవచ్చు" అన్నాడు ఆచలపతి వేదాంత ధోరణిలో.

వాడు నా హోటల్ రూంకొచ్చి మా అబ్బాయి కుక్క ఎత్తుకుపోయాడు..”

మా అబ్బాయి కుక్కట !” అనంత్ పళ్లు నూరుకున్నాడు సోఫా వెనకనుండి.

ఆయనేం చేస్తుంటారో పాపం ఆయనకే తెలియదండి " అని నిట్టూర్చాడు అచలపతి.

పరంధామ్ దూకుడు ఆగింది. “అంటే మనిషి అదోరకమా?” అని అడిగాడు సందేహిస్తూ.

అదే రకం" అచలపతి సందేహం నివృత్తి చేశాడు.

అంటే... అమావాస్యకు , పున్నమికీ..”

ఆ పట్టింపులు లేవు. తిథి ఏదైనా తీరు ఒక్కటే"

పరంధామ్ బెదిరాడు. “మరి ఎప్పుడు రెచ్చిపోతాడంటావ్ "

అలా చెప్పడం కష్టం సర్. కాస్త పుష్టిగా ఉన్న మనుషులంటే ఆయనకు కాస్త చికాకు"

అంటే లావనా?”

అనుకోవచ్చండి ".

నేను లావే !” అన్నాడు పరంధామ్ తనను తానూ చూసుకుంటూ "అంటే నన్ను చూసి మీద పడతాడంటావా?”

అచలపతి సన్నగా దగ్గాడు. “సుగుణం ఏమిటంటే అనంత్ గారికి అయన వీక్నెస్ ఆయనకు తెలుసండి. అందుకే మిమ్మల్ని భోజనానికి పిలిచినప్పుడు తనను తానూ కంట్రోలు చేసుకోలేమోనన్న భయంతో బయటకు వెళ్లిపోయారు. మీరేమైనా అనుకుంటారేమో నని సందేహిస్తూనే..”

అనుకున్నాను. వింతగా ఉందనుకున్నాను . మా టింకూ కూడా వింతగా ఉందనుకున్నాడు గొప్ప బ్రెయిన్ లే మా వాడిది. ఇంతకీ ఈ పెద్ద మనిషెక్కడ ?”

సోఫా వెనకాల చూస్తే కనబడవచ్చండి "

అదేమిటీ? సోఫా మీద కూచుంటారు కానీ సోఫా వెనకాల కూచోవడమేమిటీ ?”

చెప్పాను కదండీ, ఆయన తరహాయే వేరని"

పరంధామ్ వణికేడు. “కాస్త గేటుదాకా సాయం వస్తావా?” అన్నాడు.

పరంధామ్ వెళ్ళాక ఒళ్ళు విరుచుకుంటూ అనంత్ బయటకు వచ్చాడు.

ఆచలపతి కనబడగానే అడిగాడు "అసలు ఆ బొండాం గాడికి కుక్క నా దగ్గర ఉన్నట్టు అనుమానం ఎలా వచ్చిందయ్యా?” అని.

మీరు కుక్కతో సహా హోటల్ రూం లోంచి బయటకు వస్తున్నట్లు చూశానని రాంపండు గారు ఆయనకు చెప్పారు సర్".

రాంపండు చూశాడా?”

లేదు సర్. అలా చెప్పమని నేనే ఆయనకు ఫోన్ చేసి చెప్పా, అలా అయితే ఆయన మీద అనుమానం రాదని నా అంచనా, లేకపోతే మీరిందాక ఊహించినట్టే జరుగుతుందని నాకూ అనిపించింది.”

వండ్రఫుల్. తీసుకో ఇంకో వంద. అదేమిటీ? నీ చేతిలో ఆ వంద ఎవరిచ్చారు?”

పరంధామ్ గారు కుక్కను తిరిగి ఇచ్చినందుకు సంతోషించి..”

..” అంటూ కొయ్యబారిపోయాడు అనంత్. ఏ క్షణాన్నైనా అత్తయ్య వచ్చేఈ సమయంలో..”

ఖంగారు పడకండి సర్. నేను తిరిగివచ్చింది జాకీని కాదు. మీరు హోటల్ కి వెళ్లిన టైములోనే నేను బజారు కెళ్లి ఇంకో ఆల్సేషియన్ డాగ్ కొని తెచ్చా. పరంధామం గారికి తేడాలు ఏం తెలుస్తాయి. కనక ? పైగా జాకీని చూసిందే ఇవాళ. ఇంకా మచ్చిక కూడా కాలేదు..”

వండ్రఫుల్లెస్ట్. అందుకో ఇంకో వంద"

థాంక్ యూ సర్" అన్నాడు ఆచలపతి తలవంచి.

-ఎమ్బీయస్ ప్రసాద్

(పిజి ఉడ్ హవుస్ రాసిన 'ఎపిసోడ్ ఆఫ్ డా గ్ మెకిన్ తోష్ ' కథ ఆధారంగా