TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
పేరడి పుల్లారావు - 3
యన్.నాగమణి
పన్నెండు మంది పిల్లల కోసం,వాళ్ళ బాగోగుల గురించి...నేను,నా పులుసు అదే నా భార్య.. నేను ప్రేమగా పులుసు అని పిలుచుకుంటాను.
మేమిద్దరం కొట్టుకుని తిట్టుకుని ఎడముఖం పెడముఖం పెట్టుకునే వాళ్ళం.
నేను బతిమాలితే తప్పా నాతో మాట్లాడనని బెట్టు చేస్తూ నా పులుసు...కోపంతో గబగబా విమానంగా కంటే వేగంగా గాలిలో నడుచుకుంటూ మా ఊరి చివర ఉన్నచెరువు దగ్గరికి చేరుకుని...దాని గట్టు మీద కూర్చునేది.
నన్ను నా పులుసు బతిమాలితేనే తప్పా నేను మాట్లాడనని మరింతగా బెట్టు చేస్తూ... ఆవేశంగా హెలీకాప్టర్ మించిన వేగంతో నడుచుకుంటూ చెరువు దగ్గరికి చేరుకుని,గట్టు మీద కూర్చున్న నా పులుసుని పట్టించుకోకుండా,ఆ గట్టు మీదున్న చెట్టెక్కి,ఆ చెట్టు చిటారు కొమ్మన కూర్చునే వాణ్ణి.
నేను నా పులుసుని చూడొద్దని, నా పులుసుకు నేను కనబడోద్దని...వేలాడుతున్న కొమ్మలని నా ముఖానికి అడ్డుగా పెట్టుకుని వాణ్ణి. రెండు నిమిషాలు కుడా గడవక ముందే, నేను నెమ్మదిగా నా పులుసు నన్ను చూస్తుందా లేదా అన్న సందేహంతో, ముఖం మీది నుండి కొమ్మలను జరిపి చూసేవాణ్ణి.
విచిత్రం ఏమిటంటే...నా పులుసు కూడా...నేను చూస్తున్నానో లేదో అని నన్ను చూస్తుండేది.అలా ఒకరిని ఒకరం చూసుకోగానే...జరిగింది గుర్తుకు వచ్చి...చేస్తున్నబెట్టుని నిలబెట్టుకోవడానికి ఒకరిని ఒకరం చూసుకుని మూతులను మూడు వంకలు తిప్పుకునేవాళ్ళం.
ఆ చెరువు గట్టుని ,ఆ గట్టు మీద ఉన్న చెట్టుని,నేను నా పులుసు ఎప్పటికి మరిచిపోలేము. ఎందుకంటే ఆ చెరువు, ఆ గట్టు, ఆ చెట్టు...ఈ మూడు లేకపోతే...నేను, నా పులుసు,మా ఆనంద జీవితం, మా పన్నెండు మంది పిల్లలు...ఎవరు ఉండేవాళ్ళం కాదు.
నా పులుసు గట్టుమీద కూర్చుంటే...నేను చెట్టు మీద ఎందుకు కూర్చున్నానో మీకు తెలుసా ?.తెలిస్తే ఓకే.తెలియకపోతే నేను చెప్పింది విని తెలుసుకోండి.ఆడదే గట్టు మీద కూర్చోగ లేనిది,నేను...మగవాణ్ణి...అందులో మొగుణ్ణి.ఒక మెట్టు పైనే ఉండాలని...నా భార్యకు అందకుండా,చిక్కకుండా,దొరక్కుండా...ఆ చెట్టు మీద కూర్చునే వాణ్ణి.
అలా గంట గడిచిన తరువాత...మేమిద్దరం ఇంటి దగ్గర లేమని తెలుసుకుని, నేను మళ్ళీ నా పులుసుని ఏమో అని ఉంటానని నాకు మామకాని మేనమామ నత్తి నర్సయ్య...పొడవాటి వెదురు కర్ర పట్టుకుని...పళ్ళను కొరుకుతూ...నన్ను తిట్టుకుంటూ...పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ సీన్ లోకి ఎంటర్ అయ్యి...చెరువు గట్టున వున్న మా దగ్గరికి వచ్చేవాడు.
ఇంకేముంది ?
నా పులుసు...తన అయ్యని చూసిన సంతోషంలో...ఉన్నవి లేనివి అన్ని కలిపి నా మీద పీకలదాకా కోపం వచ్చేలా చెప్పి పెళ పెళ ఏడ్చేది.
నా పులుసు ఏడిస్తే ఏడిచింది కాని, మనం మన పేరడీ పాట పాడుకుని...సరదాగా నవ్వుకుందాం.
ఈనాటి మన పేరడీ పాట "బడి పంతులు " సినిమాలోని 'బూచాడమ్మా బూచాడు ' అనే పాటకి.
బూచాడమ్మా బూచాడు
బుల్లిపెట్టేలో ఉన్నాడు.
కళ్ళకెపుడు కనబడడూ
కళ్ళు బైర్లు కమ్మిస్తాడు. !!బూచాడమ్మా !!
నెలకోసారి బిల్లంటాడు
నెత్తిమీదేమో బరువేస్తాడు
ఎక్కడ ఉన్నా ఎవ్వరినైనా
వదలకుండ ఏడ్పిస్తాడు. !!బూచాడమ్మా !!
సెళ్ళూ బిల్లూ,ల్యాండ్ లైనంటూ
ఛార్జీల మోత మ్రోగిస్తాడూ
కేటగీరీ ఏదైనా గానీ జేబుకు
చిల్లులు పెట్టేస్తాడు. !!బూచాడమ్మా !!
టాటా -హచ్-ఎయిర్ టెల్ -మొబీ టెల్
బియ్యేస్సేన్నెల్ -వియ్యేస్సేన్నల్
ప్రీపెయిడ్ -పోస్ట్ పెయిడ్ ఎస్టీడీ రేట్లు
చవకంటారు ఎల్లలు మాకిక లేవంటారు
ఒకే మాటపై నిలబడతారూ
ఒకే రకంగా దోచేస్తారూ. !!బూచాడమ్మా !!
బాగుంది కదా.మరొక పేరడితో మళ్ళీ కలుస్తాను.అప్పటి వరకు ఈ పేరడి పుల్లారావుని మరిచిపోరు కదా.! మీ పేరడి పుల్లారావు అలియాస్ ఫేమస్ పుల్లారావు అలియాస్ పిచ్చి పుల్లారావు.
|