Uhalu gusagusaladite Kuchu kuch hota hai

ఊహలు గుసగుసలాడితే...కుఛ్ కుఛ్ హోతాహై!?

- సూరేపల్లి విజయ

నోట్లో రెండు కర్చీఫ్ లు కుక్కుకొని,ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సుబ్బారావు.

“ ఒరే...ప్రెండ్ వి కదానని కర్చీఫ్ అడిగితే,మొహం తుడుచుకోవడానికి కాబోలు...అని యిచ్చా. దాన్నలా నోట్లో కుక్కుకోవడానికి ఏం బావులేదురా ...కుక్కుకున్నవాడివి కుక్కిన పేనులా వుర్కోకుండా, అటెండర్ కర్చీఫ్ కూడా అరువడుక్కొని మరీ నోట్లో కుక్కుకోవాలా?

అయినా రెండు కర్చీఫ్ లు కుక్కుకొని అంతగా ఏడుపు ఆపుకోవాల్సిన ఖర్మ నీకేమిట్రా...నా ఖర్మ కాకపొతే " అంటూ తన తలను క్యాంటిన్ గోడకేసి కొట్టుకోవాలా ? ఎదురుగా వున్న చెట్టుకేసి కొట్టుకోవాలా ? అనే ఆలోచనలో కొట్టుకుపోతూ అడిగాడు అప్పారావు.

సుబ్బారావు కోపంగా అప్పారావు వంక చూసి తన నోట్లో కుక్కుకొన్న రెండు కర్చీఫ్ లు బయటకు పీకి,అందులో ఓ కర్చీఫ్ ని అప్పారావు వైపు విసిరేసాడు.

" తీస్కోరా మిత్రద్రోహి...ప్రెండ్ వి కదానని కర్చీఫ్ అడిగితే,వెధవ కర్చీఫ్ కి కక్కుర్తి పడతావా అంతేలేరా... చిన్నప్పుడు నేను గోటీ కాయలిచ్చిన సీన్ మర్చిపోయావ్రా.కాలేజీ రోజుల్లో నేను ప్రేమించిన పంకజాక్షి నీ కోసం త్యాగం చేసిన విషయమూ మరచి పోయావ్ రా " నిష్టూరమాడాడు ఫేసులో రకరకాల ఎక్స్ ప్రెషన్స్ పెడుతూ.

“ అదేమిట్రా...పుసిక్కిన అంత చేటున అలా అనేసావ్... నువ్వు పంకజాక్షిని త్యాగం చేసావు.బాగానే ఉండి. ఆ తర్వాత పంకజాక్షిని కట్టుకొని యిప్పటి వరకు నా సుఖాలన్నీ త్యాగం చేసుకోవాల్సి వచ్చిందిరా...ఆ పంకజాక్షి పెళ్లామై నన్నుఫ్రయ్ చేసుకుంటోంది తెలుసా" ఉక్రోషంగా అన్నాడు అప్పారావు. వెంటనే సుబ్బారావు నాలిక్కర్చుకొని

"సారీరా...ఏదో ఎమోషన్ లో టెంప్టేషనై అన్నాను "అంటూ మళ్ళీ తన చేతిలో వున్నా కర్చీఫ్ ని నోట్లో కుక్కుకోబోతుండగా,అప్పారావు అడ్డుకొని 'చంపేస్తాన్రోయ్ ఆ అసలు విషయం చెప్పకుండా తెలుగు టీవి డైలీ సీరియల్స్ లో నాన్చినట్టు నాన్చి...నాన్చి...డైలాగులు చెప్పావంటే "అన్నాడు ఏడ్పు గొంతుతో.

అసలు విషయానికి వస్తే అప్పారావు,సుబ్బారావు మంచి ప్రెండ్స్...పొద్దున్నే అప్పారావు యింటికి వెళ్లి నిద్రలోనె లేపుకొని బయటకు తీసుకువచ్చి విషయం చెప్పుకుండా కర్చీఫ్ నోట్లో కుక్కుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు సుబ్బారావు. అది భరించలేని అప్పారావుకు మెంటలొచ్చి జుట్టు పీక్కున్నాడు. సుబ్బారావు కాస్త స్థిమితపడి...నోట్లో నుంచి కర్చీఫ్ తీసి ఆకాశం వంక చూస్తూ...

” ఒరే...అప్పా "ఐ పిలిచాడు ఎపెక్షనేట్ టోన్ తో. “ అబ్బ...ఎంత సమ్మగా పిలిచావ్రా సుబ్బిగా...మా ఆవిడ కూడా యింత ముద్దుగా ఎప్పుడూ పిలిచెరుగదు " అన్నాడు తన్మయత్వంగా సుబ్బారావు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అప్పారావు.

“ ఛ... ఛ... చూసే వాళ్ళు మనల్ని మిసండర్ స్టాండ్ చేస్కుంటారు.అసలు విషయం చెప్పి గుండె బరువు దించుకోవాలని నా దగ్గరికి వచ్చావు "

“ నీ గుండెలో బరువా...అదేమిట్రా...నీ గుండెలో మా చెల్లాయే కాక,యింకవరైనా స్టే చేసారా ? లేకపోతే నీ గుండె బరువేమిట్రా "

“ కుళ్ళు జోకులేసావంటే కుళ్లబొడిచి హుస్సేన్ సాగర్ లో ముంచి చంపుతా...నా బ్రతుకు మాడిపోయిన మటన్ ఫ్రయి అయిపొయింది అన్నాడు కాస్త విచారంగా.

“కొంపదీసి కాలేజీ రోజుల్లో నువ్వు లైలా వెంటపడ్డ సంగతి మీ ఆవిడకు తెలిసిందా ? ” అడిగాడు అప్పారావు.

“ అదేమి కాదురా...నీకు తెలుసుగా...నేను అదో టైప్ మనిషినని...అనవసర వేస్టేజ్ నాకిష్టముండదని.అందుకని....”

“ ...అందుకని...”

“ పెళ్లయినప్పట్నించీ మీ చెల్లాయితో కొన్ని విషయాల్లో చాలా లౌక్యంగానే వుంటున్నాను.అదేమిటో నేను చెప్తుంటే నువ్వు విజువలైజ్ చేస్కో " అన్నాడు సుబ్బారావు. అప్పారావు ఓ సారి ఆకాశం వంక చూసాడు.

******

“ హేవండీ " గోముగా పిలిచింది మిసెస్ సుబ్బారావు.

“ హేమిటి డియర్ మూడొచ్చిందా ? ” అడిగాడు చిలిపిగా భార్య వంక చూస్తూ.

“ డొక్క చీరేస్తానంతే చీరల షాపు ముందు తింగరి వేషాలేమిటి? నాకేం మూడ్ రాలేదు.ఆ ఇటాలియన్ క్రేవ్ సిల్క్ చీరను చూస్తే ముద్దొచ్చింది " అంది ఎదురుగా చీరల షాపు ముందు వున్న మెరూన్ కలర్ శారీ చూపిస్తూ .

ఇలాంటి విషయాల్లో సుబ్బారావు బాగా ఎండిపండిపోయాడు తనదైన స్టయిల్లో.

“ ఒక్కసారి కళ్ళు మూసుకో డియర్ " అన్నాడు.

కళ్ళు మూసుకుంది మిసెస్ సుబ్బారావు.

“ నువ్విప్పుడు మెరూన్ కలర్ శారీ కట్టుకున్నావు. నాతోపాటు రోడ్డు మీద నడుస్తుంటే, అందరి కళ్ళు నీ మీదే వున్నాయి. ఈ చీరలో నువ్వు సాక్షిశివానంద్ చెల్లెల్లా అంజలాఝవేరి కజిన్ లా వున్నావు.వావ్ ఎంత బావుంది " సుబ్బారావు పొగుడుతూనే వున్నాడు.

మిసెస్ సుబ్బారావు.విజువలైజేషన్ లో నుంచి బయటకు వచ్చి భర్త వంక విచిత్రంగా చూసింది.

“ చూసావా... ఆ చీరలో నువ్వెలా వున్నావో విజువలైజ్ చేసుకున్నావా ? ” అడిగాడు కళ్ళు మిటకరించి.

“ బ్రహ్మాండంగా వుందండీ కళ్ళకు కట్టినట్లు కనిపించింది " అంది మిసెస్ సుబ్బారావు మురిసిపోతూ.

“ వెరీగుడ్ అయితే పద " అన్నాడు.

“ అదేమిటండీ చీర కొనరా ? ” అడిగింది అయోమయంగా.

“ యూ చిలిపి.ఆ చీరకొనడమేమిటి? విజువలైజ్ చేసుకొని ఎంచక్కా థ్రిల్ ఫీలయ్యావు కదా మళ్ళీ ఆ చీర కట్టుకోవాలని అనిపిస్తే మళ్ళీ విజువలైజ్ చేసుకో, దట్సాల్ " అన్నాడు. మిసెస్ సుబ్బారావుకు మండింది.

*****

మరో సీన్ లో పండక్కి మొగుడ్ని తెల్లరాళ్ళ నెక్లెస్ అడిగింది మిసెస్ సుబ్బారావు. “ ఒక్క క్షణం కళ్ళు మూసుకో " చంకలు గుద్దుకుంటూ అన్నాడు సుబ్బారావు.

మరోసారి అమాయకంగా కళ్ళు మూసుకుంది మిసెస్ సుబ్బారావు.

“ ఎంతందంగా వున్నావు తెల్లరాళ్ళ నెక్లెస్ లో.ఆ నెక్లెస్ నీ మెడలో ధగ ధగ మెరుస్తూ వుంది కదు సరిగ్గా యిలాంటి నెక్లెస్ నీక్కావాలి కదూ " అన్నాడు కళ్ళు మూసుకునే.

“ ఇప్పుడు కళ్ళు తెరువు.నీకు నెక్లెస్ పెట్టుకోవాలని అనిపించినప్పుడల్లా యిలా కళ్ళు మూసుకుని నెక్లెస్ పెట్టుకుంటే నువ్వెంత అందంగా వుంటావో వూహించుకో ఎంత థ్రిల్ ఉంటుందో అంతేకాదు నిజం నెక్లెస్ అయితే ఒక్కటే వెరైటీ కానీ కళ్ళు మూసుకుని వూహించుకుంటే రకరకాల నెక్లెస్ లు వూహించుకోవచ్చు " కళ్ళలో మెరుపులు సృష్టిస్తూ చెప్పాడు సుబ్బారావు తన పెళ్ళాంతో.

*****

అలా అతని భార్య ఏమడిగినా వూహించేస్కోని థ్రిల్ ఫీలవ్వాలని దాని వల్ల డబ్బు ఆదా అవుతుందని, బోల్డు థ్రిల్లు ఫ్రీగా దొరుకుతుందని అతి తెలివిగా భార్యను కన్విన్స్ చేయడం మెదలుపెట్టాడు సుబ్బారావు. బట్టలు ఉతికి చేతులు నొప్పెడుతున్నాయి.వాషింగ్ మెషిన్ కొనమంటే, వాషింగ్ మిషన్ కొన్నట్టు, ఆ వాషింగ్ మిషన్ లో బట్టలు వుతికినట్టు వూహించుకొని తృప్తిపడమని అనేశాడు. చివరికి మూరెడు మల్లెపూలు కొనమన్నా...

మల్లెపూలు మూరల కొద్ది తలలో పెట్టుకున్నట్టు వూహించుకొని థ్రిల్ ఫీలవమని చెప్పేవాడు.

*****

“ ఆదిరా జరిగింది...అలా నేను ఏదో మేనేజ్ చేస్తున్నానని సంతోష పడ్డాను. కానీ ఈ మధ్య వారం రోజుల నుంచీ నా బ్రతుకు బస్టాండ్ అయిపొయింది " చెప్పాడు సుబ్బారావు.

“ ఏమైందేమిటి ? ” గొప్ప సంతోషంగా అడిగాడు అప్పారావు విజువలైజేషన్ సీను లోకి వెళ్తూ...

*****

“ పెళ్ళామ్స్...మైడియర్ పెళ్ళామ్స్ " హుషారుగా పిలిచాడు సుబ్బారావు.

“ హేమిటండీ యింత హుషారుగా వున్నారు. మీ బాస్ ను గజ్జికుక్క కానీ కరిచిందా ? ” అడిగింది మిసెస్ సుబ్బారావు.

“ అదేం కాదు గానీ... యివ్వాళ పేకాటలో వందొచ్చింది "

“ హు...యిప్పటివరకు ఓ పదివేలు తగలేసి వుంటారు.అందులో వందొచ్చిందా ? మా ఆయనే " అంది మెటికలు విరుస్తూ మిసెస్ సుబ్బారావు.

“ అబ్బా....పోయినదాని గురించెందుగ్గానీ...వేడి వేడిగా ఓ టీ కొట్టించు " అన్నాడు. వన్ మినిట్ లో గ్లాసు తెచ్చి అక్కడ పెట్టింది మిసెస్ సుబ్బారావు.

“ అదేంటి...యిన్ స్టెంట్ తీయా ? ” అంటూ టీ గ్లాసు అందుకొని బిత్తరపోయాడు. పాలు, టీ పొడి,పంచదార వుంది.

“ టీ చేయలేదా ? ” అడిగాడు ఆశ్చర్యంగా సుబ్బారావు.

“ ఒక్కసారి కళ్ళు మూసుకోండి " అంది కళ్ళు టపటపలాడిస్తూ మిసెస్ సుబ్బారావు.

“ ఎందుకు ? ” అని అడుగుతూనే కళ్ళు మూసుకున్నాడు.

“ ఇప్పుడు నేను టీ గిన్నెను పొయ్యి మీద పెట్టానని అనుకోండి. టీ పొడి వేసాననుకోండి. టీ మరిగించి పాలు పోసి, పంచదార వేసి టీ తయారుచేసి మీకు యిచ్చానని అనుకోండి " అంది కిల కిల నవ్వుతూ.

“ అనుకుంటే...” అసహనంగా అడిగాడు కళ్ళు మూసుకొని వున్న సుబ్బారావు.

“ అనుకుంటే ఏమిటి ? టీ యిచ్చా...యిక తాగండి "

“ పాలు,టీ పొడి పంచదార వేసినా మరగని ' టీ ' ని ఎలా తాగి చచ్చేది " అన్నాడు నెత్తీనోరూ కొట్టుకుంటూ సుబ్బారావు.

“ అబ్బ...హబ్బబ్బ...మీరు మరీ చిలిపి.అలా వూహించేస్కోని చూడండి...ఎంత థ్రిల్లో...పైగా గ్యాస్ ఆదా " అంది.

సుబ్బారావుకు మండింది.

*****

మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ ముందు కూచున్నాడు.ఉదయం నుంచీ కనీసం టీ కూడా లేదాయే. ఆకలి దంచేస్తోంది. పెళ్ళాన్ని కేకేసి పిలిచాడు. చేతులూపుకుంటూ వచ్చింది మిసెస్ సుబ్బారావు.

“ ఆకలి దంచేస్తోంది...అన్నం వడ్డించు " అన్నాడు.

“ అన్నమా...హ్హహ్హహ్హ....హబ్బ... హబ్బబ్బ...నాకు సిగ్గేస్తోంది బాబు " అంది రెండు చేతుల్లో మొహం దాచుకుని.

“ నీ సిగ్గు టీవి ఛానెల్స్ వాకు ఎత్తుకెళ్ళ ! ఇప్పుడు నేనేమన్నానని అంత సిగ్గు " వళ్ళు మండి అడిగాడు సుబ్బారావు.

“ చిలిపి " అంటూ మొగుడి బుగ్గగిల్లి " ఓ సారి కళ్ళు మూసుకొండి " అంది.

“ నేను మూసుకోనంతే " సీన్ అర్థమై బుంగమూతి పెట్టి అన్నాడు సుబ్బారావు.

“ ప్లీజ్ మూసుకొండి " అంటూ తనే బలవంతంగా మొగుడి కళ్ళు మూస్తూ...

“ ఇప్పుడు మీ ఎదురుగా చికెన్ సూప్, పలావ్, వేడి వేడి బిర్యానీ, సాంబార్... మీగడ పెరుగు...ఇవన్నీ మీరు ఆబగా అసహ్యంగా తింటున్నారు " అంది.

“ నేను తినడమేమిటే నా బొంద " అన్నాడు కళ్ళు తెరిచి.

“ అబ్బ...వూహించుకోండి. ఈ పూటకు బియ్యం ఆదా, గ్యాస్ ఆదా, ఖర్చు ఆదా....” అంతే వెనక్కి విరుచుకు పడ్డాడు సుబ్బారావు.

*****

“ ఆదిరా జరిగింది...యిలా నేను చేసిన వెధవ ఐడియా నాకే బెడిసి కొట్టింది.ఇది చాలా దూరం సాగింది...అంటూ సిగ్గుతో మెలికలు తిరిగిపోయి...కావలసినంత వూహించేస్కోని అటు తిరిగి పడుకోమంటోంది. బెడ్డుకు, పుడ్డుకు...నా బ్రతుకు దూరమై, కనాకష్టమైంది " బావురుమన్నాడు, బావురు కప్పలా నోరు తెరిచి సుబ్బారావు.

అప్పారావు జాలిగా ఓ సారి సుబ్బారావు వైపు చూసి...

' ఇప్పటికైనా నీ కక్కుర్తి ఐడియాలు.... ఆ ప్లాన్స్ తగలెట్టు... కాళ్ళ బేరమొక్కటే మార్గం... పెళ్ళాన్ని అండర్ ఎస్టిమేట్ వేసిన వాడెవడూ హేపిగా వుండడు " అంటూ అప్పారావోపదేశం చేసాడు.

కట్ చేస్తే...

ఆ రాత్రి సుబ్బారావు దాసుడి తప్పులు దండంతో సరి, అని కాళ్ళ బేరానికి వచ్చాడు. ఛస్తే... ఇలాంటి చచ్చుట్రిక్స్ ఇక ప్రయోగించనని చెప్పాడు.

******

తెల్లారేక సుబ్బారావు ఆఫీసుకు వెళ్ళాక మిసెస్ సుబ్బారావు అప్పారావుకు ఫోను చేసి

" థాంక్యూ అప్పారావు అన్నయ్యా...నువ్వు యిచ్చిన ఐడియా పన్జేసింది.ఆయన మారిపోయాడని చెప్పింది."