Kattulto Kadura-Kantichuputo champesta

కత్తుల్తో కాదురా - కంటి చూపుతో చంపేస్తా !

-మల్లాది వెంకటకృష్ణమూర్తి

పెదకోడూరు నించి నెహ్రు జూ పార్క్ కి తొలిసారిగా వచ్చాడు రాజు.గొరిల్లా ఎన్ క్లోజర్ ముందు నిలబడి చూస్తుంటే,అది కూడా తననే పరిశీనలగా చూస్తోందని గ్రహించాడు.

రాజు తన చేతిని గొరిల్లా చూసేలా ఊపాడు.అదీ బదులుగా అలాగే వూపింది.తన పొట్ట మీద కుడిచేత్తో కొట్టుకున్నాడు. అదీ ఆ ఏక్షన్ ని రిపీట్ చేసింది. పైకి కిందికి దూకాడు.గొరిల్లా కూడా అచ్చం అలాగే దుమికింది.చేతిలో తాడు లేకపోయినా తాడాట ఆడుతున్నట్టుగా అభినయించాడు.అదీ అలాగే అభినయించింది.ఒంటి కాలి మీద కుంటాడు.గుండ్రంగా ప్రదక్షిణం చేసాడు.ఆ ప్రదక్షిణం చేస్తూ జుత్తు పీక్కున్నాడు.ఒంగొని లేచాడు.అతని చర్యలన్నిటినీ ఆ గొరిల్లా కూడా వెంటనే అనుకరించింది.

అకస్మాత్తుగా గాలి దుమారం చెలరేగి ఓ నలక రాజు కంట్లో పడింది. రాజు తన కుడి కంటిని రుద్దుకున్నాడు.కంట్లోంచి నలక తీసే ఆ ప్రయత్నంలో అనుకోకుండా అతను కటకటాల దగ్గరికి నడిచాడు.

అప్పటికే ఆ గొరిల్లా తన ఛాతీని బాదుకుంటూ,కటకటాల మీద కొడుతూ, చిందులు తొక్కుతోంది.

రాజు తన దగ్గరికి రాగానే అది కటకటాల్లోంచి అతన్ని పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టింది. రాజుకి సృహ వచ్చేసరికి జూ డాక్టర్ అతని మీదకి వంగి చూస్తున్నాడు.ఏమైందని అడిగితే జరిగింది వివరించాడు రాజు.

“ ఓ !గొరిల్లా భాషలో కుడి కన్ను నలుముకోవడం అంటే అమ్మ,ఆలి బూతులు తిట్టినట్లు. అందుకని దానికి కోపం వచ్చి వుంటుంది.” చెప్పాడు జూ అధికారి.

ఇంటికి వెళ్ళిన రాజు ఆ గొరిల్లా మీద ఎలాగైనా కసి తీర్చుకోవాలనుకున్నాడు.రాత్రంతా ఆ కోపంతో సరిగ్గా నిద్రపట్టలేదు.కూర్చుని ఎలా దానిమీద పగ తీర్చుకోవాలో ఆలోచించి పథకం వేసాడు. మర్నాడు రాజు జూ కెళుతూ, రెండు పదునైన కత్తులు,పార్టీల్లో పిల్లలు పెట్టుకునే టోపీలు రెండు, రెండు బూరలు కొన్నాడు.జూకి వెళ్లి ఎవరూ లేకుండా చూసి ఓ కత్తి,టోపీ,బూర కటకటాల్లోంచి గొరిల్లా దగ్గరికి విసిరేసాడు.అది ఇతని వంకే చూడసాగింది.

మనుష్యుల చర్యలకి ఆ గొరిల్లా అనుకరిస్తుందని తెల్సిన రాజు పార్టీ టోపీ తీసి నెత్తిన వుంచుకున్నాడు. అదీ తన దగ్గరున్న వాటిలో టోపీని చూసి తీసి నెత్తిన వుంచుకుంది. తర్వాత పార్టీ బూర తీసి నోట్లో వుంచుకుని గట్టిగా ఊదాడు.అదీ బూరని తీసుకుంది.అలాగే చేసింది. బూర ఊదుతూ గుండ్రంగా తిరిగాడు రాజు.గొరిల్లా కూడా అదే పని చేసింది.

రాజు తర్వాత తన కత్తిని తీసుకుని దాన్ని తలమీద గుండ్రంగా తిప్పాడు.ఇతని చర్యలని జాగ్రత్తగా గమనిస్తున్న గొరిల్లా కూడా కత్తిని అందుకుని నెత్తిన వుంచుకుని చుట్టూ తిరిగింది. చేతిని చాపి కత్తిని పైకి, కిందకి ఝుళిపించాడు రాజు.గొరిల్లా ఏ మాత్రం ఆలోచించకుండా అతని చర్యని ఇమిటేట్ చేసింది.

రాజు గట్టిగా వూపిరి పీల్చుకుని వదిలి కత్తితో పొత్తి కడుపులో పొడుచుకున్నాడు.ఇంటి దగ్గర అక్కడ ఓ ఇనుప రేకు ఉంచి పైన బట్ట కట్టుకోవడంతో కత్తి లోపలికి దిగలేదు.గొరిల్లా అతను చేసిన పనిని తిగిరి చేయకపోవడంతో మరోసారి కత్తితో పొత్తి కడుపు మీద పొడుచుకున్నాడు రాజు.

గొరిల్లా తన చేతిలోని కత్తివంక ఓసారి,రాజువంక ఓసారి చూసి కత్తిని పారేసి కుడికన్నుని నలుపుకుంది.